Menu Close
గ్రంథ గంధ పరిమళాలు
చాటు (మరుగు) వీడిన
చాటుపద్య, గద్య మణి మంజరులు

గత సంచికలో వ్రాసిన కొన్ని విషయాలకు మరికొంచెం విశ్లేషణ ఇవ్వాలని అనిపించి ఈ క్రింది నోట్ వ్రాస్తున్నాను.

Note: చాటువులను గూర్చి చెప్పే ఈ వ్యాసంలో మహాకవి భట్టుమూర్తిని స్మరించడంలోని ఉద్దేశ్యం, ‘సిరిమల్లె’ లో నాకున్న కొద్ది స్థలంలో సందర్భానుసారంగా మహాకవులను, వారి రచనలను, పాఠకోత్తములకు పరిచయం చేయాలన్న తపన మాత్రమే ఈ కొత్త ప్రక్రియకు దారి తీసింది. అంతేకాక రామకృష్ణుని తరహా కవుల ప్రవర్తన సభ్య సమాజంలో హాస్యాన్ని కాకుండా వారు చెప్పే ఇటువంటి చాటువులు, కవిత్వం ఆయా కవులను అపహాస్యం పాలు చేస్తాయని నా అభిప్రాయం. ఒక స్త్రీ తో మాట్లాడవలసిన మాటలా! ఆ చాటువులో ఉన్నది. అలాగే వసుచరిత్రకారుడు, పరమ రామ భక్తుడు. ఆయన పట్ల అలాంటి అభిప్రాయాలు సరియైనవా అని పాఠకులు క్షణకాలం ఆలోచించాలి.

దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు కూడా కొన్ని చాటువులను సంకలనం చేశారు. దానిపేరు “చాటుపద్యరత్నాకరం”. ఇందులో ప్రథమ ప్రకరణంలో రామకృష్ణుని గూర్చి 17వ పేజీలో “పండిత కవి పరాభవం” అనే శీర్షిక పరిశీలించినప్పుడు ఒక విషయం చర్చించవలెననిపిస్తుంది.

ఒక మహా పండితుడు సీసపద్యం నాలుగు పాదాలు చివర తేటగీతి, రెండుచోట్ల ఒకే రకంగా ఉండే పద్యాన్ని సభలో చదివాడు.

“రాజనందన రాజ రాజాత్మజులు సాటి
తలప్రనల్లయ వేమా ధరణీ పతికి
--
--
భావ భవ భోగ సత్కళా భావములను”

అని నాలుగు చరణాలు ఒక్కటిగానే ఉన్న పద్యమిది (ఇది శ్రీనాథుని పద్యమని పూజ్యులు దీపాల పిచ్చయ్య శాస్త్రి తెల్పారు).

ఈ పద్యానికి అర్థం చెప్పమంటే పెద్దన వంటి మహాకవి, ఆశువుగా అనర్గళంగా చెప్పగలిగిన పండితుడు – ఆ పద్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు రామకృష్ణుడు “మేక తోకకు ...తోక – అంటూ అర్థం లేని ఒక పద్యాన్ని చెప్పగానే ఆ పండితుడు అది కొంటెతనపు పద్యమని తెలిసినా మారుమాటాడకుండా సభనుండి జారుకొన్నట్లు ఈ చాటువును గూర్చి దీపాల వారు తెల్పారు.

మనం ఆలోచించాల్సింది – ‘రామకృష్ణుని పద్యం అర్థంరహిత రచన’ అని ఆ పండితుడు ఎందుకు చెప్పలేక పోయాడు? ఒక మహాకవిని ఎదుర్కొనే పధ్ధతి అదేనా? రామకృష్ణుని చర్య సమయస్ఫూర్తి అని ఎలా రాజు, ఇతర కవులు సమర్ధించారు. ఇలా చేయడం వాళ్ళ ఆ మహాపండితుని అవమానించినట్లే గదా! పెద్దనవంటి మహా కవులు ఆ పద్యానికి అర్థం చెప్పలేక పోయారా? ఇలా హాస్యం, కొంటెతనం అనే పేర్లతో రాయల సభలో ఇతర కవులను చిన్న చూపు చూడటం ఎంతవరకు సమంజసం.

ఇలాంటి ప్రశ్నలు ఉదయించినా రాళ్ళపల్లి వారు చెప్పినట్లు “సంస్కృతమైన చిత్తవృత్తి గల మేధావులు ఆనాడుగాని ఈనాడుగాని చిరునవ్వుతో స్వీకరిస్తున్నారా? ఎందుకంటే అతడు కాళీ వరప్రసాదుడు గా పేరుమోసిన వికటకవి గదా! ఇవన్నీ ప్రశ్నలే.

మా నాన్న ఒక పండితుని మాటలను గూర్చి చెబుతుండే వారు. “ఆత్మస్తుతి, పరనింద, ఫలాపేక్ష లేని నేను ఇక్కడ ఉండగా ఆ వెధవుకు ఎందుకిచ్చావురా దక్షిణా తాంబూలం” అన్నాడట ఒక పండితుడు. రామకృష్ణకవి వంటి వారు ఎంత గొప్పవారైనా హాస్యానికైనా పరులను అవమానించడం కొంటెతనం అనే పేరుతో సరియైన పోటీగా నిలబడక పోవడం దానిని ఆనాటి పెద్దలు సమర్ధించడం శుభలక్షణం కాదు. రాళ్ళపల్లి వారు చక్కగా లెక్కకట్టి చెప్పినందుకు వారికి పండితలోకం ఋణపడివుంది.

చివరగా, వసుచరిత్ర లోని ఒక అద్భుతమైన పద్యం ‘ఒక్క లైను రెండర్థాలు'

“సకలాగమాంత వాసనలు గాంచి
విముక్త కాన్చేనంబాగు మాధుకర కులంబు”
రెండర్థాలు: ౧. ప్రకృతి లోని పక్షులు మొదలైన వాటి పరంగా
౨. ఋషులు మొదలైన వారి పరంగా
౧. పక్షులు: సకల+గమ+అంత = అన్ని చెట్ల యొక్క చివరలో ఉన్న పూల వాసనలు (తేనె) తీసుకొని
విముక్త కాంచనము = విడువబడిన కాంచన పుష్పాలు గల
మాధుకర కులంబు = మధువు సంపాదించే తుమ్మెదలు
౨. ఋషులు: సకల + ఆగమ = అన్ని వేదాల యొక్క
అంత = వేదాంతమును అందలి తత్వాన్ని తెలిసి
విముక్త కాంచనంబగు = విడువబడిన ధన ధాన్యాదులు, స్వర్ణము మొదలైన వస్తువులు గలవారై (ఆస్తులు, బంగారు మొదలైనవి లేనివారై )
మాధుకర కులంబు = మదూకర వృత్తితో ఇంటింటికి వెళ్లి ‘భవతీ భిక్షాందేహి’ అని అడిగి భుజించే కులం ఈ ఋషి కులం.

ఇలా – “సకల+అగమ =చెట్లు, సకల + ఆగమ = వేదములు” సంధిగత శ్లేష సంస్కృతాంధ్ర శ్లేషలు ఇలా ఈ శ్లేషాలంకారంతో ఆడుకొని అవలీలగా మహా శ్లేష కావ్యాన్ని రచించిన రామరాజ భూషణుని స్మరించడానికి మహా పండితోత్తములకే అసాధ్యమైన కార్యం. చంద్రునికో నూలుపోగు అన్నట్లు నేను ఆ మహాకవిని స్మరించుకోవడానికి అవకాశం కల్పించిన డా.మధు, శ్రీమతి ఉమా దంపతులకు నా ఆశీస్సులు.

**** సమాప్తం ****

Posted in October 2019, సమీక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *