Menu Close

Science Page title

అసలు ఆల్కహాలు, నకిలీ ఆల్కహాలు

అమెరికాలో విచిత్రమైన చట్టాలు చాలా ఉన్నాయి. మనుష్యులు తాగే ఆల్కహాలు “సహజసిద్దమైన శాకాలు, పళ్లు, ధాన్యాలు, వగైరాలతోనే కాని కృత్రిమంగా రసాయన ‘మంత్రతంత్రాలు’ ఉపయోగించి సృష్టించినది కాకూడదు” అనే చట్టం ఒకటి ఉంది. సాధారణంగా మనం తాగే ఆల్కహాలు (కల్లు, సారా, విస్కీ, బ్రాందీ, జిన్ను, వాద్కా, వగైరాలన్నీ) చెట్ల నుండి లభించే పదార్ధాల ద్వారా చేస్తారు. అంటే తాటి నీరా, ద్రాక్ష, చెరకు, బియ్యం, బార్లీ, మొదలైనవి ముడి పదార్థాలుగా వాడతారు. వీటన్నిటిలోను మనకి మత్తెక్కించే అసలు పదార్థం పేరు ఆల్కహాలు. “ఒక సూర్యుండు సమస్థ జీవులకు తానొకొక్కడై తోచు పోలిక” అన్నట్లు ఈ ఒక్క ఆల్కహాలూ రకరకాల పేర్లతో, రకరకాల రంగులతో, రకరకాల ఆకారాలు ఉన్న సీసాలలో మనకి తారస పడుతూ ఉంటుంది. శాస్త్ర పరంగా ఆల్కహాళ్లల్లో అనేక రకాలు ఉన్నాయి కాబట్టి  నిర్దిష్టతకి ఇక్కడ మనకి కావలసిన ఆల్కహాలు పేరు ఎతల్ ఆల్కహాలు. సౌలభ్యానికి ‘ఆల్కహాలు’ అని టూకీగా అనేద్దాం.

ఒక ఆల్కహాలు బణువులో (molecule) ఎన్ని కర్బనపు అణువులు (atoms) ఉన్నాయో, ఎన్ని ఉదజని అణువులు ఉన్నాయో, ఎన్ని ఆమ్లజని అణువులు ఉన్నాయో మనకి తెలుసు. అంతే కాదు. ఈ అణువులు ఏ అమరికలో ఉన్నాయో తెలుసు. కనుక ప్రయోగశాలలో ఆయా అణువులని చేరదీసి మనకి కావలసిన విధంగా అమర్చితే చెట్ల అవసరం లేకుండా, కృత్రిమంగా ఆల్కహాలుని సృష్టించవచ్చు. ఆ స్థోమత మనకి ఉంది. ఈ రోజుల్లో ఇదేమీ బ్రహ్మ విద్య కాదు. పట్టుని పోలిన పదార్థం నైలాను ని సృష్టించేము కదా.  పట్టు చీరల కంటె నైలాను చీరలు చవక కూడా. అలాగే ఆల్కహాలుని పోలిన ఆల్కహాలుని ప్రయోగశాలలో సృష్టించవచ్చు. మూడొంతులు అసలు సరుకు కంటే చవగ్గా అమ్మవచ్చు.

ఆల్కహాలుని ఇలా సృష్టించదలుచుకుంటే మనకి కావలసిన ముడి పదార్థం ముడి చమురు లేదా క్రూడ్ ఆయిల్. భూమి లోపల నుండి బయటకి తీసిన ముడి చమురుని అంశిక స్వేదనం (fractional distillation) చేసి కిరసనాయిలు, గేసలీను (పెట్రోలు), వగైరాలు తీసినట్లే ఆల్కహాలుని కూడ తయారు చెయ్య వచ్చు. ఈ పద్ధతిలో చేసిన ఆల్కహాలుని నకిలీ ఆల్కహాలు అని పిలుద్దాం. దినుసులని పులియబెట్టి చేసిన అసలు ఆల్కహాలుకీ, ఈ నకిలీ సరుకుకి రసాయనంగా కాని, రుచిలో కాని, వాసనలో గాని ఏమాత్రం తేడా ఉండదు. రెండింటిలో ఏది తాగినా ప్రాణానికేమీ అపాయం ఉండదు. రెండూ ఒకే మాదిరి “కిక్కు” ఇస్తాయి. అటువంటప్పుడు అమెరికాలో ప్రవేశపెట్టిన చట్టానికి కారణం?

అమెరికాలో ప్రవేశపెట్టిన ఈ చట్టం వల్ల రెండు లాబీ వర్గాలకి లాభం ఉంది. “బజారులో ఆల్కహాలు సరఫరా తక్కువగా ఉంటే ధర పెరిగి అందరికీ అందుబాటులో ఉండదు కనుక ప్రజలు తాగుడు తగ్గిస్తారు” అన్న ఆశావాదుల లాబీ ఒకటి. ఖనిజపు చమురుకి సంబంధించిన  వ్యాపార వర్గాల నుండి ఆల్కహాలు పోటీకి రాకపోతే “అసలు ఆల్కహాలు” అమ్మే వ్యాపారులకి లాభదాయికం అని ఆశించే వర్గం మరొకటి.  అందుకని ప్రభుత్వం ఈ చట్టం తీసుకు వచ్చినప్పుడు ఇరు పక్షాలవారూ సంతోషించేరు. లేదా, ఇరు పక్షాల ప్రోద్బలం వల్లనే ప్రభుత్వం ఈ చట్టం అమలులోకి తీసుకురాగలిగింది అని మనం అనుకోవచ్చు!

ఈ చట్టం అమలులో పెట్టటం ఎలా? “అసలు” ఆల్కహాలుకీ “నకిలీ” ఆల్కహాలుకీ తేడా లేకపోతే నకిలీ ఆల్కహాలుని తయారు చేసేవాళ్లని పట్టుకుని శిక్షించటం ఎలా? పోలీసులు శాస్త్రవేత్తలని సంప్రదించేరు. ఈ తేడాని పసిగట్టటానికి ఒకటే కీలక సూత్రం ఉంది. అసలు ఆల్కహాలులో అతి కొద్ది మోతాదులో వికీర్ణ ఉత్తేజితం (radioactivity) ఉంటుంది. ఇదెలాగంటే, అసలు ఆల్కహాలు ముడి పదార్థం మొక్కలు కనుక అసలు ఆల్కహాలులో ఉన్న కర్బనం మొక్కలనుండి సంక్రమిస్తుంది. మొక్కలలోకి కర్బనం వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువు నుండి సంక్రమిస్తుంది. వాతావరణంలో ఉన్న బొగ్గుపులుసు వాయువులో ఉండే కర్బనంలో అతి స్వల్ప మోతాదులో వికీర్ణ ఉత్తేజితమైన కర్బనం-14 (radioactive Carbon-14) ఉంటుంది. ఈ కర్బనం-14 ఉనికిని ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు పట్టుకోగలరు.

నేల లోంచి తీసిన రాతి చమురు (పెట్రోలియం) కూడ మొక్కల నుండి వచ్చినదే. కాని ఈ మొక్కలు ఎప్పుడో 100 మిలియను సంవత్సరాల కిందటి రోజుల్లో భూమి మీద బతికినవి. ఇవి చచ్చి, భూగర్భంలో పాతుకుపోయిన కొత్త రోజుల్లో ఇవి కూడ వికీర్ణ ఉత్తేజితాన్ని ప్రదర్శించే ఉంటాయి. కాని కర్బనం-14 అర్ధాయుస్షు 5,700 సంవత్సరాలు కనుక వాటి శక్తి ప్రతి 5,700 సంవత్సరాలకి సగం తగ్గుతూ 50 దశలలో, అనగా 300,000 సంవత్సరాలు గతించేసరికి, లేశం కూడ ఉండకుండా నశించిపోయి ఉంటాయి. అందుచేత రాతి చమురు (crude oil) కి రేడియో ఏక్టివిటీ ఉండదు.

కల్తీ వ్యాపారం చేసే వాడి “శతకోటి దరిద్రాలకి” అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. వాడు నల్ల బాజారులో కర్బనం-14 కొని నకిలీ ఆల్కహాలులో కలపొచ్చు. కాని బజారులో కర్బనం-14 కొనుక్కోవటం అంత సులభం కాదు. మోసం చెయ్యడానికి మరొక ఉపాయం ఏమిటంటే అసలు ఆల్కహాలుని కొద్దిగా నకిలీ ఆల్కహాలులో కలపొచ్చు. అప్పుడు అసలు ఆల్కహాలు యొక్క రేడియో ఏక్టివిటీ  కొంచెం నకిలీ సరుకుకి అంటుకుని అసలు దానిలాగే కనిపిస్తుంది.

ఈ రకం “అవిడియాలు” కావాలంటే మా ఊరు వర్తకులని అడగండి, చెబుతారు. పప్పులోనూ, బియ్యంలోనూ కలపటానికి వీలయిన సైజులో రాళ్లు మా ఊరు దగ్గర ఉన్న పెంటకోట రేవు నుండే ఎగుమతి అయ్యేవని చెబుతారు. ఈ నిజాయతీకి నిదర్శనంగా పెంటకోట సముద్రపుటొడ్డున శిధిలమయిన దీపస్తంభం ఒకటి ఉండేది – నా చిన్న తనంలో!

Posted in October 2019, Science

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *