Menu Close
Deepavali-2019
సీ.
సత్యభామాదేవి శరము సారింపఁగా
............నరకాంత మయ్యెను నాఁడు; దివిజ
నరకాంతలు మునుల్ చెఱవీడి మురిసిరి
............యంబరం బంటఁగా సంబరాలు
ఆనాఁటి యానంద మతిసుందరంబుగా
............భూనభోభాగాలు భువనములకు
శబ్దకాంతిచ్ఛటాసందేశములు టపా
............సులు దీపశిఖలునుఁ బలువిధముల
తే.గీ.
చిచ్చుబుడ్లు మతాబులు రెచ్చిపోవు
జువ్వలునుఁ జక్రములుఁ బంప, సవ్వడులకు
చెవు లొకించుక మూసుక చిందులేయు
చిన్నపెద్దల పండువు చెప్పఁ దరమె? 1
కం.
ఛాయాచిత్రము లందున
గేయాలకు నూపి రొసఁగి కృతకృత్యులుగా
ఆయా దర్శకు లెందఱొ
మాయని గౌరవము నొంది మను పండు విదే 2
తే.గీ.
జాగరూకత విడనాడి సంచరింప
కొన్ని యగచాటు లెదురైన నిన్ని వేల
యేండ్లు గతియించినను సుంత యేని తఱఁగ
నట్టి యుత్సాహభరితమౌ నద్భుత మిది 3
కం.
విత్తము తక్కువ యైనన్
చిత్తము వెనుదీయ దెపుడు; చేయుదు రెలమిన్
క్రొత్తగు కొనుగోళ్లనుఁ బై
మొత్తము మఱియొకట మాని, మురియఁగ బిడ్డల్ 4
కం.
పిల్లలుఁ బెద్దలు సమముగ
నుల్లాసముతోడఁ జేయు నుత్సవ మిదియై
కళ్ళారనుఁ జెవులారను
మళ్ళీ కలిగించు నెన్నొ మధురస్మృతులన్ 5

దీప మన బ్రహ్మ; యజ్ఞానతిమిరహరము
వెలుగు బాటను బయనంబు కలుగఁ జేయు
ఇంట బయటను వెలుగుల పంట పండు
పండువకు సాటి రా దెట్టి పండువైన 6

Posted in October 2019, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *