Menu Close
Galpika_title

సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని గల్పికలు గంగిశెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.

గల్పికావని - శుక్రవారధుని 15 – భవిష్యవాణి -- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

క్రూ అంతా ఎవరి ఎక్విప్ మెంట్ వాళ్ళు సరిచూసుకున్నారు. అందరూ ఓకే అనగానే డ్రైవర్ బండి స్టార్ట్ చేశాడు. ఆ బండి భవిష్యవాణి రికార్డింగ్ కోసం వెళుతోంది.

వెనక్కాల సీట్లో కూర్చున్నాడు దాము. ఉన్నట్టుండి అతనికి ఫోనొచ్చింది. అవతలివైపునించి ఎవరిదో వినసొంపైన అపరిచిత ఆడగొంతు హిందీలో వినిపించింది. ఎంతటివాడినైనా మాటల్తో కట్టిపడెయ్యగల మాధుర్యం ఆ గొంతులో ధ్వనిస్తూ మైమరపింపజేస్తోంది. బ్యాంకింగ్ సర్వీసెస్ వినియోగించుకోవడంలొ సమస్యల గురించి ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి ఫోన్ చేస్తున్నానని చెప్పింది. ఆ తరవాత అతని డెబిట్ కార్డ్ గురించి అడిగింది. డెబిట్ కార్డుని కూడా క్రెడిట్ కార్డులాగా మీ అంత ప్లాన్డ్ గా ఉపయోగించే కస్టమర్స్ చాలా తక్కువని అతని బ్యాంకింగ్ నైపుణ్యాన్ని పొగిడింది. దాంతో మనవాడు ఐసులా నైసైపోయాడు. ఆ తరవాత అతని నెంబర్  తీసుకుంది. ఆ నెంబర్ కి వెయ్యి బోనస్ పాయింట్లు వచ్చాయనీ వాటిని క్యాష్ చేసుకుంటే పాతికవేలదాకా బ్యాంకులో క్రెడిటయ్యే అవకాశం ఉందనీ ఎగ్జాక్ట్ ఎమౌంట్ ఎంతో వెరిఫై చేసి మరో రెండు నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి కట్ చేసింది.

ఫోన్ కట్టయినా ఆమె గొంతులోని మాధుర్యం మాత్రం దాము చెవుల్లో ఇంకా గుసగుసలాడుతూనే ఉంది. అందుకే ఆమె ఫోన్ కోసం ఎదురు చూస్తూంటే రెండు నిమిషాలూ రెండు యుగాల్లా గడిచాయి. అంతలోనే ఫోన్ రింగైంది. ఆ అమ్మాయే. ఆ గొంతు హిందీలో మాట్లాడుతూనే ఉంది. మొత్తం ఇరవై ఏడువేల మూడొందల యాభైరూపాయల ఎమౌంట్ వచ్చిందనీ, జీఎస్టీ పోను మిగిలిన పాతికవేల నూట పదహార్లూ ఎక్కౌంట్లో క్రెడిటవుతుందనీ. దాన్ని క్రెడిట్ చెయ్యడానికి తనొక నెంబర్ పంపుతున్నాననీ వెంటనే ఆ నెంబర్ చెప్పమనీ అడిగింది. ఆమె అన్నట్టే ఏదో నెంబరొచ్చింది. ఆమెకి మాటిచ్చినట్టే ఆ నెంబర్ ఆ అమ్మాయికి చెప్పడం... మరుక్షణంలోనే బ్యాంకునించీ మెసేజ్ రావడం... అందులో పాతికవేల నూట పదహార్లు కనపడ్డం... దాము ఆనందం తట్టుకోలేక ముందుసీట్లో కూర్చున్న సుబ్బుకి చూపించడం... అతను తనకా పాతికవేల బోనస్ పాయింట్స్ రానందుకు తెగ బాధపడ్డం.., వీళ్ళ ఆనందం చూసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్ కుమార్ విషయం కనుక్కోవడం... సెల్లో చూడ్డం.., అందులో పాతికవేల నూట పదహార్లు అనగా వచ్చిన జీతం వచ్చినట్లే మటాషైన విషయం తెలుసుకోవడం.., అటునించటే సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంటివ్వడం... తరవాత పాతికవేలమాట మర్చిపోయి లొకేషన్ కి వెళ్ళడం వరసగా జరిగిపోయాయి.

గురువుగారొచ్చి భవిష్యవాణి వినిపించడానికి కూర్చోగానే ఆయనదగ్గరకి వెళ్ళాడు రామ్ కుమార్. దాముకి జరిగిన మోసం గురించి ఆయనకి వివరంగా చెప్పాడు. ఈ విషయాన్ని భవిష్యవాణిలో చెప్పి తమ చానెల్ వీక్షకుల్లో చైతన్యం నింపవలసిందిగా కోరాడు.

గురువుగారు వెంటనే స్పందించారు. ఇటువంటి మోసాలు జరక్కుండా ఎవరికివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దామూతో సహా క్రూ అందరికీ సలహా ఇచ్చారు. అంతే కాదు, వెంటనే తమ ఎక్కౌంటెంట్ కీ, ఆడిటర్ కీ, భార్యామణికీ, కూతురికీ, కొడుకులకీ వరసగా ఫోన్లు చేసి దాముకి జరిగిన మోసం గురించి చెప్పి తన ఎక్కౌంట్ నెంబర్ ఎవరికీ ఇవ్వద్దనీ ఒకవేళ ఎవరైనా ఇస్తే ఎంత ఎమౌంట్ మోసం జరిగిందో అంత మొత్తాన్నీ వాళ్ళ ముక్కుపిండి వసూలు చేస్తాననీ నవ్వుతూనే బెదిరిస్తూ తగిన జాగ్రత్తలు చెప్పారు. ఆ తరవాత రాశులవారీగా భవిష్యవాణిని వినిపించారు. కానీ అందులో ఎక్కడా జరిగిన మోసానికి సంబంధించిన వివరాలు రాలేదు. దాంతో చివర్లో అయినా జాగ్రత్తలు చెబుతాడేమోనని ఎదురు చూశాడు రామ్ కుమార్. కానీ గురువుగారు షూటింగ్ ముగించారు. ఎవరెంత మొత్తుకున్నా ఆన్ లైన్ మోసాల ఊసెత్తలేదు. దాంతో ఆయనింక భవిష్యవాణిలో దాని గురించి చెప్పరని రామ్ కుమార్ కి అర్థమైపోయింది. అయినా చివరి ప్రయత్నంగా దాము గురించి కూడా వీక్షకులకో సలహా చెప్పమని కోరాడు.

గురువుగారు చిద్విలాసంగా నవ్వుతూ అన్నారు,"పొద్దుపొద్దున్నే ప్రజలకి భవిష్యత్తుపట్ల ఆసక్తినీ ఆశల్నీ రేకెత్తించే నాలుగు మంచిమాటలు చెప్పాలిగానీ నష్టాలూ మోసాలూ కుట్రలగిరించి చెప్పి బెదరగొట్టకూడదు రామ్ కుమార్, అయినా మనీ మేనేజ్ మెంట్ గురించి మా బావమరిది మీ ఛానెల్ కి ఏదో స్పెషల్ కాన్సెప్టిచ్చాట్ట కదా? దాన్ని ఓకే చేసి అందులో చెప్పించుకోండి ఈ అవేర్ నెస్ చిట్కాలన్నీ"

శాకుంతలం -- స్వాతి శ్రీపాద

శకుంతలకు అన్నం సయించటం లేదు, కంటికి కునుకూ పట్టడం లేదు. కారణం ‘అబ్బే ఏమీ లేదు’ అన్నా ఆవిడకు తెలుసు ఏ మూలో ఉన్న దాని ఉనికి. అక్కడికీ ఆవిడకు పట్టు పరిశ్రమ అనేది బాగానే తెలుసు. ఎవరు ఏకాస్త పనికి వస్తారనిపించినా అస్సలు వదలదు గాక వదలదు చీటికీ మాటీకీ చెట్టెక్కే భేతాళుడిని భుజాన వేసుకునే విక్రమార్కుడిలా.

"రామ సీత గొప్ప మనిషి ఎంత చక్కని కవిత్వం రాస్తుంది. ఎవరున్నారమ్మా మన ఆడ పీనుగుల్లో అంత కవిత్వం రాసే వాళ్ళు" అన్న నోటి తోనే,

"వెధవ పీనుగ ఏం రాస్తుంది? దాని బొంద ఒక్క ముక్కా అర్ధం అయి చావదు. ఆ రోజుల్లో నేను రాసిన ప్రతి కవితా ఎంత గొప్పగా ఉండేవి.
రాస్తూనే ఉంటాను మళ్ళీ మళ్ళీ 
రాస్తూనే ఉంటాను మళ్ళీ మళ్ళీ - అని రాసిన మాటలు ఏళ్ళ కేళ్ళు మారుమోగి పోయేవి." అంటూ స్వోత్కర్ష మొదలు పెడితే ఆగేది కాదు.

ఆ ప్రవాహంలో ఎంతటి వాళ్ళూ గడ్డిపోచ ఆధారం దొరక్కుండా కొట్టుకు పోయేవాళ్ళు.

అలాటి శకుంతలకు ఆకలి దప్పులు లేవు. నిన్న గాక మొన్న ఆ పేరిందేవికి పెడన వాళ్ళు పాపాయమ్మ అవార్డు ఇవ్వగానే  ఎక్కడెక్కడి కూపీలూ లాగి ఎవరితో చెప్పించాలో వాళ్ళతో చెప్పించి ఏడాది తిరిగేసరికి ఆ అవార్డు కొట్టేసింది.

అల్లాగే క్రితం మాటు పక్క రాష్ట్రం వాళ్ళు ’అబ్బే నాకు ఓపిక లేదు నేను రాలేను’ అని అంటున్నా గొప్ప నవలా శిరోమణీ, తొంభై దాటిన సువర్ణా రాణి  పేరిటే అనౌన్స్ చేసి, సదరు మినిస్టర్ గారు మందీ మార్బలం తో ఆవిడ ఇంటికి వెళ్ళిఇచ్చినా ఆర్నెల్లు తిరిగేలోగా ఆయనకు యాభై ఆరేళ్ళకే షష్టి పూర్తి జరిపించి పట్టు బట్టలతో మొగుడూ పెళ్ళాలను సత్కరించి తన గుప్పిట బంధించి రాబోయే ఉగాదికి తన సత్కారం ఖరారు చేసుకుంది.

అడ్డు వస్తుందేమో అనిపించిన హంస గీతను తన సంస్థ కు కార్యదర్శిని చేసి,
"మేం యువతను ఆదరిస్తాం పైకి తెస్తాం" అంటూ ముందరికాళ్ళకు బంధం వేసి,
"ఈ మధ్యే రాస్తున్నది" అంటూ పదేళ్ళుగా రాసే ఆమెను పరిచయం చేస్తుంది. 
అలాటిది, వినయంగా ఏం చెప్పినా తల ఊపే హంసలేఖ ఇంతపని చేస్తుందా? 
తనంతట తను ఒక సంస్థ స్థాపిస్తుందా పోటీగా ...

అందుకే ఆవిడ ఆకలి దప్పులకు దూరం అయింది.

ఏం చెయ్యాలో తోచక కరకరా మిగిలిన గోళ్ళు అరిగి పోయిన పళ్ళతో కొరికేసి చిగుళ్ళు నొప్పుట్టాక బుర్ర వెలిగింది.

"దాన్ని మానసికంగా దెబ్బతియ్యాలి, ఏదో మొగుడు వదిలేసి ఒక్కత్తీ ఉందని ఆలోచిస్తుంటే లాభం లేదు తలెత్తుకోకుండా చెయ్యాలి" అని ఆలోచనకు పదును పెడుతుంటే డోర్ బెల్ మోగింది.

తలుపు తీస్తే ఎదురుగా హంసగీత ఆ పక్కన పెళ్ళి బట్టల్లో దానితో్ పాటు ఆవిడ ఒక్కగా నొక్క సుపుత్రుడు సుందరం.

కుప్పకూలిన ఆవిడకు ఏం అర్ధం కాలేదు.

ప్రబుద్ధాశ్రమం -- రాజేశ్వరి దివాకర్ల

ఆ రోజు ప్రార్థనకు తరువాత, అందరూ ధ్యానం, యోగాభ్యాసనం ముగించారు. గురువుగారు లేచి వెళ్తూ, తనతో పాటు వస్తున్న శిష్యులిద్దరిలో వీరాజీ తో ఇవాళ ఆశ్రమం వాకిలికి మావిడాకుల తోరణం కట్టండి అన్నారు. జాగ్రత్త.  పూత రాలిపోకుండా చూడండి, అని హెచ్చరించారు. అక్కడ ఉదయం ఫలహారం బాధ్యతను స్వీకరించిన జానకమ్మ, అరుంధతి ఇద్దరూ మొలకలొచ్చిన పెసలను పోపునవేసి పైన కొబ్బరితురుము, కొత్తిమీర ను చల్లి, అందంగా కుట్టిన అరిటాకు డొప్పల్లో వడ్డించారు. నాలుగైదు రకాల పళ్ళను కడిగి తినడానికి సిద్ధంగా అమర్చారు.

గురువు గారిని ఉపహారానికి గాను పిలుచుకొని వచ్చాడు సుబ్బారావు. సమయ నియమానుసారం ఆశ్రమంలో ఉన్న ఆడా మగా పదిమందీ అక్కడకు వచ్చి తమ భాగాన్ని స్వీకరించారు. అందరూ అక్కడకు చేరిన ఆ సమయంలో గురువుగారిలా అన్నారు. "చూడండీ, ఈరోజు మీ, మీ, కుటుంబంలోని ఆత్మీయులందరూ సాయంత్రం ఇక్కడకు వస్తున్నారు కదా, వాళ్ళకు ఉపచారాదులలో ఎటువంటి లోపం రాకూడదు. శాంతమ్మగారూ వంటలన్నీ ఎంతో రుచికరంగా వుండాలి, మీ వాళ్ళ అభిరుచులన్నీ మీకు తెలుసును కదా, మీరు తతిమా సభ్యులతో సంప్రదించండి. వంట బాధ్యతను మరి ఇద్దరితో కలసి పంచుకోండి. వెంకట్రామయ్య, సుందరేశం గార్లు మీకు సహాయకులుగా ఉంటారు. నాగరాజు, వీరాజీ గార్లు మీరు నిర్ణయించిన కాయ గూరలను మన తోటలోంచి తెచ్చి ఇస్తారు. ఇవాళ మన కుటుంబ సభ్యుల కలయిక ఎంతో అపురూపంగా ఉండాలి, అన్నారు. శాంతమ్మ గురువు గారూ మీరు ఆదేశించారు చాలు మేం ఆప్రకారమే ఆచరిస్తాం అంది. గురువు గారు ఇక తమ సాహిత్య వ్యాసంగానికి కదిలారు.

గురువు గారు తమ ప్రవచనాలను అనేక సంవత్సరాలుగా వినిపిస్తున్నా ప్రశాంతమైన ఈ ప్రదేశంలో ఆశ్రమాన్ని నెల్కొల్పి, దాదాపు సంవత్సరకాలం అవుతోంది. వారు ఎటువంటి ప్రచారమూ చేసుకోక పోయినా వారి విద్యార్హతలూ, వేదార్థ జ్ఞానాదులను వారి ఉపన్యాసాలద్వారా, రచనల ద్వారా తెలుసుకొన్న, శాంతమ్మ, నాగరాజు, ముందుగా స్వ ఇచ్ఛ తో గురువుగారి వద్దకు వచ్చారు. అది వృద్ధాశ్రమం కాదు, ప్రబుద్ధాశ్రమం. గురువు గారు వచ్చిన వాళ్ళందరికీ అవకాశం కలిగించరు. సేవాతత్పరత శ్రద్ధాసక్తులున్నవారికి మాత్రమే చోటు నిస్తారు. ఈనాటికి ఇక్కడున్న పదిమందీ కుటుంబీకుల నిరసనకు లోనైన వాళ్ళు కాదు. అందరూ తమ తమ ఉద్యోగ బాధ్యతలనుండి విశ్రమించిన వాళ్ళు. ఆర్థిక స్తోమతకలిగిన వాళ్ళు. తమ పిల్లల సంసారంలో తాము అడ్డుగా ఉండకూడదనీ, అటు ఒంటరిగా ఉండడం కష్టమనీ తెలుసుకొని, తమ సమ వయస్కులతో కలసి ప్రశాంతంగా లోక హిత మార్గాన గురువు గారి ఆశ్రయంలో ఉండదలచిన వాళ్ళు.

శాంతమ్మ సరోజమ్మతో ఇలా అంది. ఈరోజు తీపి వంటకం మైసూరు పాకం చేద్దాము. మావాడికి అది ఎంతో ఇష్టం అంది. తప్పక చేద్దాం. మా కోడలు, పిల్లలు కూడా వస్తారు కాబట్టి తను వచ్చేటప్పుడు పిజ్జాలను తెస్తానంది, అంది సరోజ. ఆమె పూర్వ బాంకు (bank)ఉద్యోగిని. అలాగా, మంచిది, పిల్లలు ఇష్టపడతారు అంది శాంతమ్మ. ఇక వంటకు ఉపక్రమిద్దామని తోటనుండి తెచ్చిన కూరల్లో కొన్నింటిని ఎన్నుకొని వాటిని తరుగుతున్న సుందరేశం గారితో శాంతమ్మ మెల్లగా ఇలా అంది. సుందరేశం గారూ, మీరు గురువుగారి పూర్వాశ్రమం నుండీ మిత్రులు కదా. ఈ రోజు సాయంత్రానికి మనం అనుకున్నది జరుగుతుంది కదా, అంది, సుందరేశం అన్నీ అనుకున్నట్లే జరుగుతాయి, అన్నాడు చిరుహాసంతో.

ఆ సాయంత్రానికి ఆశ్రమం కళకళలాడుతూ తయారయింది. వంటలన్నీ ఘుమ ఘుమ లాడుతున్నాయి. ఆవరణ అంతా పరిశుభ్రమయింది. అక్కడున్న సదస్యుల కుటుంబీకులందరూ తమ వాళ్ళ దగ్గరకు ఎంతో ఉత్సాహంగా విచ్చేశారు. అందులో శాంతమ్మ కొడుకు "అమ్మా ఉగాది పండుగ కు ఇంటికి రామ్మా” అని అడుగుతుంటే, అలాగే లేరా, కాని ఇక్కడ వీళ్ళందరినీ వదిలి ఎలారాగలను చెప్పు, అంది. అంతగా ఒదిగిపోయావామ్మా ఇక్కడ? అడిగాడు కొడుకు. అవున్రా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉందిరా, అంది. సరే ..నువ్వు ఆనందంగా ఉండడమే నాక్కావాలమ్మా,అన్నాడు కొడుకు ...

ఆవరణలో అందరినీ ఉద్దేశించి గురువుగారు ప్రసంగిస్తున్నారు. మన అందరిదీ ఇప్పుడు ఒకే కుటుంబం. మనమందరం ఆత్మీయులం. మనది ప్రేమకులం. మనమంతా మ్రేమికులం. ఈ రోజు ప్రేమికుల రోజు. యువకులారా మీరందరూ మీ తల్లిదండ్రులు, పెద్దలఎడ నిత్యమూ ప్రేమానురాగాలను కలిగి ఉండండి, అని చెప్తుండగా సభలోంచి ఒక యువతి లేచి వచ్చి ఆయన పాదాలపై వాలింది. శాంతమ్మ సుందరేశం లు ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో తాము సాధించామన్న తృప్తి మెరిసింది. గురువుగారు అనుకోని పరిణామానికి కొంత బిత్తర పోయినా, సరస్వతీ నువ్వా! అన్నారు. నన్ను క్షమించండి, మీ తమ్ముళ్ళను చెల్లెలినీ ఎంతో ప్రేమగా చూసి ఎల్లప్పుడూ వాళ్ళ బాగుని గురించే ఆలోచించే మిమ్మల్ని నన్ను అశ్రద్ధ చేస్తున్నారనే కోపంతో విడిచి వెళ్ళిపోయాను. చెల్లెలూ, తమ్ముళ్ళూ స్థిరపడ్డాక మీరు సాహిత్య పరమైన, శాస్త్రాధ్యయన ఆకాంక్షతో కాలం గడుపుతూ, ఈ ఆశ్రమాన్ని నెలకొల్పి, అనుభవజ్ఞుల సహవాసంతో జీవిస్తున్నారని తెలిసింది. నేను నమ్మిన నా వాళ్ళందరూఉద్యోగస్థురాలనైన నా డబ్బునే ఆశించారు. వయసు మళ్ళిన నన్ను నిర్లక్ష్యం చేశారు. సుందరేశం ద్వారా ఎప్పటికప్పుడు మీ విషయం తెలుసుకున్నాను. ఈరోజు నన్ను క్షమించి ఇక్కడ చోటిమ్మని అడగడానికి వచ్చాను, అంది. అటు తరువాత ...,

ఆమె లేచి సభలో అందరినీ ఉద్దేశించి, నేను గతంలో గురువుగారు నాకు మాత్రమే స్వంతం కావాలనుకున్న స్వార్థ ప్రియురాలిని. ఇప్పుడు వారి సఖ్యతను కోరుకొనే స్నేహ ప్రేమికురాలిని అంది. గురువు గారు నిర్లిప్తంగా ఉన్నా ఆయన ముఖంలో కోల్పోయిన ప్రేమ పునీతమై లభించిన చిన్మయ ముద్ర నిలిచింది.

అమ్మభాష -- అత్తలూరి విజయలక్ష్మి

ఇవాళ ఎలాగైనా వాడిని పట్టుకుని అడగాలి ఆరోసారి అనుకుంది శాంతమ్మ.

ఆవిడ అప్పటికి చాలా రోజుల నుంచి కొడుకుతో తన మనసులో విషయం చెప్పాలని ప్రయత్నిస్తోంది.

అధికార పార్టీకి యువనాయకుడు అయిన శశాంక అసలు ఇంట్లో ఉండే సమయమే తక్కువ. అందులోనూ ఇంట్లో వాళ్లతో కూర్చుని కాసేపు కష్టసుఖాలు మాట్లాడడం ఇంకా తక్కువ. అతనికి రాజకీయాలంటే పిచ్చి. అది తప్ప ఈ ప్రపంచంలో మాట్లాడడానికి ఇంకా కొన్ని విషయాలు ఉంటాయని కూడా అతనికి తెలీదేమో అనిపిస్తుంది.

శాంతమ్మ ప్రతిరోజూ కొడుకుతో కాసేపు మాట్లాడడానికి కళ్ళు మూసుకుపోతున్నా బలవంతంగా నిద్ర ఆపుకుంటూ రాత్రి పదకొండు వరకూ ఎదురుచూస్తూనే ఉంటుంది. కానీ ఆ సమయంలో ఎప్పుడూ రాలేదు కొడుకు ఇంటికి. ఇంక ఆవిడకి, నిద్రాదేవతకీ జరిగే ఘర్షణలో నిద్రాదేవతే విజయం సాధిస్తుంది.

ఎప్పటి నించో ఆవిడకి కాశీ వెళ్లాలని అందులోనూ కొడుకు, కోడలు, మనవరాలు, మనవడితో వెళ్లాలని కోరిక. ఇప్పటికే డెబ్భై తొమ్మిదేళ్ళు వచ్చాయి.. ఏ క్షణాన ఆ దేవుడు పిలుస్తాడో.. పిల్లలు పెద్దవాళ్ళు అయాక వాళ్ళతో ఎక్కడికి వెళ్ళలేదు. కూతురు అమెరికాలో ఉంటుంది ... రెండేళ్ళకో, మూడేళ్ళ కో ఒకసారి వస్తుంది.. వచ్చిన దగ్గరనుంచీ షాపింగ్, ఫ్రెండ్స్ ని కలుసుకోడం తప్ప తల్లితో కాసేపు గడపాలి అన్న ఆలోచన ఉన్నట్టు అనిపించదు. కొడుకు దగ్గరే ఉన్నా అప్పుడప్పుడు కనిపిస్తాడు.. ఎపుడన్నా పలకరిస్తాడు. అది కూడా అమ్మా కాఫీ ఇస్తావా.. అమ్మా నేను వెళ్తున్నాను, అని రెండే పలుకులు.

ఆవిడకి సుమారు పదేళ్ళ నుంచీ ఇలాంటి యాంత్రిక జీవితంతో విసుగెత్తింది. కోడలు హారిక బ్యాంకు ఆఫీసర్, ఆవిడ కూడా బిజీగానే ఉంటుంది.. కాకపొతే కాస్తో, కూస్తో మాట్లాడేది ఆమెనే. మనవడు, మనవరాలు అయితే హోం వర్క్ లు, లేకుంటే ఐ పాడ్ లు వీడియోలు.. వీటితో ఎప్పుడూ ఎవరి గదిలో వాళ్ళుంటారు. ఈ రకమైన వెలితితో బాధపడుతున్న శాంతమ్మకి కొన్ని రోజులు అందరితో కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలి.. ముఖ్యంగా కాశీ, రామేశ్వరం వెళ్ళాలి అని కోరిక.

ఆ కోరిక కోడలితో చెప్పింది.. “మీరు కావాలంటే ఎవరో ఒకరితో పంపిస్తాను ... మీ అబ్బాయితో పెట్టుకుంటే అది అయ్యే పని కాదు అత్తయ్యా” అంది కోడలు.

“నువ్వన్నా ఒకమాట వాడి చెవిలో వేయి తల్లి” అంది బతిమాలుతూ శాంతమ్మ.

పెద్దగా నవ్వేసి అంది కోడలు... “నా పక్కన పడుకుని కూడా ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటారు..ఇంక ఏం మాట్లాడనత్తయ్యా .. మీరే ట్రై చేయండి... పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ చేసేటప్పుడో, ఎప్పుడో వీలు చూసుకుని చెప్పండి.”

అతను ఇంట్లో అన్నం తినడం అనేది మొదటినుంచీ చాలా తక్కువ... ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ కూడా బయటే. రక రకాల ఎలక్షన్స్ అనీ, మీటింగ్ లనీ రాత్రి పన్నెండు దాటాక ఇంటికి వచ్చి, ఉదయం ఏడూ, ఏడున్నరకే హడావిడిగా స్నానం చేసి పరిగెత్తే కొడుకుతో ఏం మాట్లాడగలదు!

ఇవాళ ఎనిమిది దాటినా ఇంట్లోనే ఉన్నాడు. అదికూడా చక్కగా తయారై  హాల్లో సోఫాలో సావకాశంగా కూర్చున్నాడు. ఇదే మంచి సమయం మాట్లాడాలి. ఆవిడ వంట మనిషిని జరగమని తన చేత్తో చిక్కటి కాఫీ కలిపి కప్పులో పోసి తీసుకుని కొడుకు కూర్చున్న దగ్గరకు వెళ్ళింది. ఫోన్ లో ఏదో మెసేజ్ టైపు చేస్తున్న శశాంక కొంచెం తలెత్తి చూసి ఆవిడ చేతిలో ఉన్న కాఫీ కప్పు అందుకున్నాడు ఓ కాఫీనా అంటూ.

కనీసం మొహం వైపు కూడా చూడకుండా కాఫీ అమ్మ ఇచ్చిందో, భార్య ఇచ్చిందో కూడా గమనించకుండా అలా మామూలుగా కప్పు అందుకున్న కొడుకుమీద ఆవిడకి చాలా కోపం వచ్చింది. తమాయించుకుంటూ “శశీ నీతో మాట్లాడాలిరా” అంది ఎదురుగా సోఫాలో కూర్చుని.. ఫోన్ రింగ్ అయింది.. కాఫీ సిప్ చేసి, ఒక్క నిమిషం అని ఆవిడకి సైగ చేసి ఫోన్ కి ఆన్సర్ చేసాడు.

“హలో ... ఎవరూ... ఎస్ నేను శశాంకనే మాట్లాడుతున్నా. ఏంటి? అచ్చా అవునా.. ఎప్పుడు ఇవాళనా..  మీటింగా... ఎక్కడా.. నేను హానరబుల్ గెస్టా. చీఫ్ గెస్ట్ ఎవరు? ఓ, ఓకే ఓకే ... నో ప్రాబ్లెమ్ ... ఇవాళ పార్టీ మీటింగ్ ఏమీ లేదు.. చూడండి మినిస్టర్ గారు వస్తున్నారు... ప్రోటోకాల్ మంచిగా ఉండేట్టు చూసుకోండి.. అరేంజ్ మెంట్స్ గ్రాండ్ గా ఉండాల .. స్పీచ్ తయారు చేయించు ... ఇద్దరికీ ... మినిస్టర్ కి, నాకూ కూడా.. ఏం మీటింగ్ అన్నావు ...మాతృభాష దినమా.. ఏం దినాలో.. అన్నిటికీ దినాలే.. దాని గురించి నాకేం తెలియదు. ఎవరితో నైనా స్పీచ్ తయరు చేయించి ఇవ్వు ... చదివేస్తా.. మంచిది.. ఓకే టేక్ కేర్ ...”

ఫోన్ పెట్టేసి మళ్ళి ఏదో మెసేజ్ చూసుకోసాగాడు.

శశీ... పిలిచింది శాంతమ్మ.

మళ్ళీ ఫోన్ మోగింది. ఒక్క నిమిషం అంటూ ఆవిడకి  సైగ చేసి ఫోన్ మాట్లాడడం మొదలు పెట్టాడు.

“సార్... ఎక్కడ సార్... పార్లమెంట్ ఎలక్షన్స్ కాన్వాసింగా... చేద్దాం సార్.. తప్పకుండా సార్ .. సార్ ఈవినింగ్ ఒక మీటింగ్ ఉంది ... మాతృభాష దినమట ... దాని గురించి మీరు మాట్లాడాలి సార్ .. అవును సార్.. లేదు స్పీచ్ రెడీ చేయమని చెప్పాను సార్ .. చేస్తారు సార్ ... ఓకే సార్ ... ఇప్పుడా సార్ వస్తాను సార్..” ఫోన్ కట్ చేసి గబుక్కున సోఫాలోంచి లేచాడు..

అప్పుడే అటు వచ్చిన హారిక  “బ్రేక్ ఫాస్ట్ సిద్ధంగా ఉంది తినేసి వెళ్ళచ్చుగా” అంది.

“ఇప్పుడు టైం లేదు వెళ్ళాలి. మినిస్టర్ గారింట్లో తింటాలే” అన్నాడు బాయ్ తెచ్చిన షూస్ తొడుక్కుంటూ.

“మీ అమ్మగారు మీతో ఏదో మాట్లాడాలంటున్నారు విని వెళ్ళచ్చుకదా” అంది ఆమె.

“అబ్బా ఇప్పుడు టైం లేదు అన్నా కదా.. అమ్మా తరవాత మాట్లాడతాలే..” అంటూ బయటకి వెళ్ళిపోయాడు.

కారు స్టార్ట్ అయిన శబ్దం విని నిట్టూరుస్తూ “పోనీలే ... ఇవాళ వాడు మాతృభాష గురించి మీటింగ్ లో మాట్లాడాలిట బిజీగా  ఉన్నాడు” అంది ఆ మాతృమూర్తి.

Posted in October 2019, కథానికలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!