Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

రాజు తలిస్తే దెబ్బలకు కొదువా? బ్రహ్మ తలిస్తే ఆయుష్షుకు కొరవా?

అణకువ

విద్యాపురి ఆస్థానపండితుడు విద్యానాధుడు. ఆయన ప్రతి ఏడాదీ వేసవి కాలంలో ప్రభువు ఆఙ్ఞమేరకు రాజ్యమంతా పర్యటించి విద్యాభ్యాసం చేయను అవకాశం లేని నిరుపేద బాలురను ఎంపిక చేసుకుని వారిని తన విద్యాలయంలో చేర్చుకుని శిక్షణ నివ్వడం జరుగుతుంటుంది.

బాలురకు తగిన వయస్సు లో విద్య అందకపోతే వారు ఆకలి తీర్చుకునేందుకై పెడదారిపట్టి సమాజానికి కీడు చేస్తారని మహారాజు ఈ విధానాన్ని అనుసరించేవాడు.

ఆ విధానంలోనే ఒక వేసవిలో విద్యానాధుడు మారు వేషంలో రాజ్యపర్యటనకు బయల్దేరాడు. పల్లె ప్రాంతాల్లో తిరుగుతుండగా, ఒక రోజున ఒక అడవిదార్లో ఆయనకు విపరీతమైన దాహం వేసింది. తెచ్చుకున్న మట్టి కుజాలో నీరు ఐపోయింది.

ఆయన ఒక చెట్టుక్రింద కూర్చుని ఎవరైనా వచ్చి సాయం చేస్తారేమోనని చూస్తుండగా ఆ దారిన ఒక పదేళ్ళ బాలుడు భుజమ్మీది కర్రకు ఒక వైపున ఒక మూట, రెండో వైపున ఒక నీళ్ళకూజా కట్టుకుని కాలిదారిమీద నడిచి పోతుండటం చూస్తాడు.

"ఓ బాలుడా! ఇలారా!" అని పిలుస్తాడు విద్యానాధుడు.

ఆబాలుడు ఆనిర్జన ప్రాంతంలో ఎవరో కేకే యడం విని, దూరం నుంచి చూసి, ఆ చెట్టుక్రిందకు వస్తాడు.

"అయ్యా! మీరేనా నన్ను పిలిచింది" అని అడుగుతాడు, వినయంగా. దానికి విద్యానాధుడు "ఔను కుమారా! నాకు చాలా దాహంగా ఉంది, నీరు త్రాగకపోతే ప్రాణం పోయేలా ఉంది. కాస్త నీరిచ్చి నాప్రాణం కాస్తావా?" అని అడుగుతాడు.

దానికాబాలుడు తన భుజమ్మీది కర్ర దించి ఒక వైపుకట్టి ఉంచిన మట్టి కూజాలోంచి నీరు ఒక మట్టి పిడతలో పోసి ఆయనకిస్తాడు.

అవి త్రాగి విద్యానాధుడు ప్రాణం లేచి రాగా “కుమారా! నీవెవరు? ఎక్కడికి ఈ అడవిదార్లో వంటరిగా వెళుతున్నావు?" అని ప్రశ్నిస్తాడు.

"అయ్యా! నాపేరు అప్పన్న, మా అయ్యా అమ్మా ఈ అడవిలో ఎండిన కట్టెలు కొట్టుకు రాను వెళ్ళారు. నేను మద్దినేళకు వారికి బువ్వ, తాగేనీరూ పట్టుకెళతాను రోజూ. ఆల్లకాడికే ఎళతన్నానయ్యా! తమరె వురయ్యా! ఈ మద్దినేళ ఈ అడవిలో ఇట్టా కూకున్నారూ? ఆకలేస్తాఉందాయ్యా! ఈ జొన్న సంకటెట్టనా! తిందురా!" అని అడుగుతాడు.

దానికి విద్యానాధుడు "అప్పన్నా! నాకు ఆకలేస్తున్నమాట నిజమే, ఐతే మీ అయ్యా అమ్మలకు ఎత్తుకెళ్ళే అన్నం నాకు పెడితే వాళ్ళమాటేంటీ?" అంటాడు.

దానికి అప్పన్న"అయ్యా! మాకు రోజూ కూడెత్తావత్తాదయ్యా! ఉన్ననాడు తింటాం లేన్నాడు నీల్లతో పొట్ట నింపుకుంటాం. గత జనమలో ఎవ్వరికీ బువ్వెట్టకపోటానే ఇప్పుడు మా పొట్టల కింతన్నం పుట్టడం లేదని మా అమ్మా అయ్యా అంటుంటారు. అందుకోసం ఎవరైనా ఆకలితో ఉంటే ఇంత కూడెట్టమని మా అయ్యా అమ్మా సెప్పారయ్యా! ఒక్క నాడు మాకు కూల్లేక పోతే ఏమయ్యా! ఆకలిపొట్ట మాకలోటే. తినండి" అంటూ తన మూటలో ఉన్న మట్టి మూకుళ్ళో ఇంత జొన్న సంకటీ, ఎర్ర కారం ఒక ఎండు పుల్లతో వంచి పెట్టి ఇచ్చాడు, మరి కాసిని నీళ్ళు కూడా అందించాడు అప్పన్న.

విద్యానాధుడు తినేలోగా చుట్టూ ఉన్న చెట్లక్రింద వెతుకుతూ వెళ్ళి కాసిని నేరేడు పండ్లు ,రేగుపండ్లూ ఏరుకొచ్చి, కడిగి, "అయ్యా ఎర్రకారానికి నోరుమండుద్ది, ఈ పండ్లు తినండయ్యా!"అంటూ అందించాడు.

అతడి వినయానికీ, సేవాభావానికీ విధ్యానాధునికి ముచ్చటేసింది.

'వీడొక్కడు చాలు ప్రజాసేవ చేయను' అనుకుని అతడి తల్లిదండ్రులతో మాట్లాడి వప్పించి, వారికి మహారాజుతో సంప్రదించి తగిన జీవనోపాధి కల్పిస్తానని చెప్పి, అప్పన్నను తన శిష్యునిగా తనవెంట విద్యా బుధ్ధులు నేర్పను తీసుకెళ్ళాడు విద్యానాధుడు.

చూసారా బాలలూ! -ఆకలైనవారికింత అన్నం పెట్టి, పెద్దల పట్ల విన యంగా ఉంటే ఎంతో మేలు చేకూరుతుందని తెలిసిందికదా!

Posted in October 2019, బాల్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!