Menu Close
అందమైన మనసు
శ్రీ శేష కళ్యాణి గుండమరాజు-- శ్రీ శేష కళ్యాణి గుండమరాజు

“ఇంకెంతసేపు అద్దంలో చూసుకుంటావ్? కాలేజీ కి టైం అవుతోంది. త్వరగా తయారు కా…”, అని గత పావుగంటగా అద్దం ముందు నిలబడి పదే పదే జుట్టు సరి చేసుకుంటున్న తన పందొమ్మిదేళ్ళ కూతురు రాధతో అంది మీనాక్షి.

“అలాగే అమ్మా..”, అంటూ కళ్లకున్న కాటుకను సరిచేసుకుంటున్న రాధను చూసి, “నీ అందానికేం తక్కువే? నిన్న జరిగిన వరలక్ష్మీ వ్రతం పేరంటంలో వచ్చిన ముతైదువలందరూ నీ అందాన్ని పొగిడితేనూ? నీకు ఎక్కడ దిష్టి తగులుతుందోనని నేనూ, మీనాక్షీ చాలా కంగారు పడ్డాం”, అంది పత్తి ఒలుచుకుంటున్న రాధ బామ్మ - ఎనభైయేళ్ల  సుభద్రమ్మ.

అక్కడే కూర్చుని ఏదో వార్తాపత్రిక చదువుతున్న ఉమాపతి, “అమ్మా.. అసలే నా కూతురు బంగారం. పైగా నిన్న పేరంటానికెళ్ళేటప్పుడు నీకున్న నగలన్నీ రాధకు పెట్టావ్. అందంగా కనిపించదూ మరి?”, అన్నాడు సుభద్రమ్మతో.

తన బామ్మ సుభద్రమ్మ, తండ్రి ఉమాపతి అన్న మాటలు విని ముసిముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోయింది రాధ. అంతలో రాధ స్నేహితురాలు సుజాత రావడంతో తన పుస్తకాలు తీసుకుని కాలేజీకి వెళ్ళిపోయింది.

*** *** ***

ఉమాపతి, మీనాక్షీలకు లేక లేక కలిగిన సంతానం రాధ. అందుకే తననెంతో అల్లారు ముద్దుగా పెంచారు. రాధ చిన్నప్పుడు పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా చూస్తూ ఉంటే ఇంట్లోవాళ్ళూ, ఇంటికొచ్చినవాళ్ళు - అందరూ ఎంతో గారాం చేసి, “ఎంత ముద్దుగా ఉన్నావో”, అని బుగ్గలు గిల్లేవాళ్ళు. అలా ఓసారి ఉమాపతి దూరపు బంధువొకాయన రాధ బుగ్గ గిల్లుతూ "అందమైన పాప" అన్నాడు.

అంతే! రాధకు అప్పటినుండీ తను అందరిలోకీ అందంగా కనపడాలన్న తాపత్రయం మొదలయ్యి అది వయసుతో పాటూ పెరుగుతూ వచ్చింది. ఎవరైనా తన అందం తగ్గిందని అంటారేమోనన్న భయంతో సమయం దొరికితే ఏవేవో క్రీములు రాసుకుంటూ అద్దం ముందు ఎక్కువగా గడుపుతూ ఉండేది రాధ. అయితే, రాధ తన అందానికి మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని అనిపించినప్పుడల్లా రాధ తల్లి మీనాక్షి నీతిని బోధిస్తూ అందం గురించి అంత ఆలోచించడం మంచి పద్ధతి కాదని రాధకు చెప్తూ ఉండేది.

రాధ ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరంలో ఉంది. రాధ మేనమామ రవి అమెరికాలో ఉంటూ అక్కడ రాధ పోస్టుగ్రాడ్యుయేషన్ చెయ్యడానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నాడు.

*** *** ***

ఒక రోజు అద్దంలో చూసుకుంటున్న రాధ కెవ్వున అరిచింది.

ఆ అరుపుకు ఇంట్లో వారంతా పరిగెత్తుకుంటూ రాధ వద్దకు వచ్చి, “ఏమైందమ్మా..?", అని అడిగారు.

రాధ తన బుగ్గపైనున్న చిన్న మొటిమను చూపిస్తూ, “నాకెప్పుడూ మొటిమలు రాలేదు కదా? ఇప్పుడెందుకొచ్చిందీ? ఇది పోతుందా లేక ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందా?”, అని కంగారుగా అడిగింది.

అప్పుడు సుభద్రమ్మ, “మొటిమ గురించి అంత కంగారు పడక్కరలేదే రాధా. కొద్ది రోజులాగితే అదే పోతుంది. అయినా అందం గురించి నువ్వెంత ఎక్కువ ఆలోచిస్తే అది అంత దూరం అవుతుంది”, అంది.

సుభద్రమ్మ సమాధానం విని, “అయినా బామ్మా! పళ్ళు ఊడిపోయి, జుట్టు నెరిసిపోయి, చర్మమంతా ముడతలు పడిపోయిన నీకు అందం గురించి ఏం తెలుస్తుందీ? ఎప్పుడూ ఇంట్లో ఉండి జపం చేసుకునే నిన్ను ఎవ్వరూ చూడరు. నన్నైతే కాలేజీ లో బోలెడు మంది చూస్తారు. నేనందంగా కనబడితేనేగా నన్నందరూ మెచ్చుకుంటారూ?", అని కాస్త కటువుగా అంది రాధ.

దాంతో సుభద్రమ్మ కొంచెం బాధ పడి మౌనంగా తన గదిలోకి వెళ్లిపోయింది.

అక్కడే ఉండి రాధ మాటలు విన్న మీనాక్షి రాధను మందలిస్తూ, “చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఏమిటా మాటలు రాధా? అయినా నీకెన్నోసార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను విను. అందం శాశ్వతం కాదు. దానికి అంత ప్రాధాన్యం ఇవ్వడం సరైన పని కాదు. నీకన్నా పెద్దవారిని నిందించడం చాలా తప్పు. అసలు నిజమైన అందం చదువుతోనూ, జ్ఞానంతోనూ, అన్నిటికీ మించి మంచి గుణం తోనూ వస్తుంది గుర్తుంచుకో” అని అంది.

రాధ మాత్రం ఎప్పటిలానే తల్లి మాటలు పెద్దగా పట్టించుకోకుండా సుజాత వద్ద మొటిమలకు వాడే మందు ఉందేమో కనుక్కుని వస్తానని చెప్పి హడావుడిగా సుజాత ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది. సమయం వచ్చినప్పుడు ఆ భగవంతుడే అందం పై రాధకున్న అభిప్రాయం మారుస్తాడని అనుకుంది మీనాక్షి.

*** *** ***

కాలేజీ చదువు పూర్తయ్యి పరీక్షలు కూడా అయిపోవడంతో రాధ స్నేహితులందరూ కలిసి వారి ఊరికి కొద్ది దూరంలోఉన్న కొండమీది అడవులలో విహార యాత్రకు వెళ్లి, అక్కడి ప్రకృతి సౌందర్యాలను చూస్తూ రెండురోజులు ఆనందంగా అక్కడే గడపాలని అనుకుని, రాధను కూడా వారితోపాటూ రమ్మని అడిగారు.

రాధ ఇంట్లో విషయం చెప్పగానే, “ఆడపిల్లవు. ఇప్పటిదాకా ఎక్కడికీ నిన్ను ఒంటరిగా పంపలేదు. ఇప్పుడిది అవసరమా?”, అని అడ్డు చెప్పబోయాడు ఉమాపతి.

కానీ సుభద్రమ్మ మాత్రం, “వెళ్లనివ్వరా..రేపు అమెరికా వెళ్లాలన్నా ఒక్కత్తే అన్ని గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలి కదా. కాస్త స్నేహితులతో గడిపి లోక జ్ఞానం సంపాదించుకోవడం మంచిదే”, అంది.

“జాగ్రత్తగా మాత్రం ఉండాలి రాధా. నీకేమన్నా అయితే మేమెవ్వరమూ తట్టుకోలేము”, అంది మీనాక్షి.

సరేనని స్నేహితులతో కలిసి విహార యాత్రకు బయలుదేరింది రాధ. రాధకు కూడా అదే మొదటి అనుభవం కావడంతో మనసులో కాస్త భయంగా ఉన్నప్పటికీ తనకు తోడుగా సుజాత ఉండటంతో పగలంతా కొండనెక్కుతూ చాలా సరదాగా గడిపింది. వారంతా అడవి చేరుకునే సమయానికి చీకటి పడే వేళ అయ్యింది. ఆ రాత్రికి అక్కడే కాస్త చదునైన ప్రదేశంలో గుడారాలు వేసుకుని పడుకుందామని అనుకున్నారంతా.

కానీ అంతలో ఎక్కడో నక్క కూత వినబడేసరికి, “ఇక్కడ పడుకోవడం నా వల్ల కాదు. మా ఇంటికెళ్ళిపోతా”, అంది రాధ.

“సరే. నీ ఇష్టం. జాగ్రత్తగా వెళ్ళు. కానీ ఒక్కదానివే వెళ్ళటం అంత మంచిది కాదేమో. ఇంకాసేపట్లో బాగా చీకటి పడితే ఏవైనా క్రూరమృగాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది”, అని సుజాత అనగానే అందరూ బిగ్గరగా నవ్వారు.

ఏంచెయ్యాలో తెలియక రాధ ఒక పక్కగా కూర్చుంది. అడవి కావడం వల్లో ఏమో చాలా త్వరగా చీకటి పడిపోయింది. అందరూ గుడారాలు ఏర్పాటు చేసుకోవడంలోనూ, రాత్రికి వెంట తెచ్చుకున్న పరుపులు, దుప్పట్లు, తినుబండారాలు సద్దుకోవడం లోనూ నిమగ్నమైపోయారు.

రాధ మనసు మాత్రం ఇంటిపైనే ఉండటంతో ఏదో ఆలోచిస్తూ వారందరికీ కాస్త దూరంగా కూర్చుంది. అంతలో రాధ కూర్చున్న ప్రదేశానికి చాలా దగ్గర్లో ఆకులు కదిలినట్లు అలికిడి కావడంతో ‘అమ్మో! ఏమొచ్చిందో ఏంటో?’ అనుకుంటూ కంగారుగా లేచి తన పక్కనున్న చెట్ల వెనక్కి తొంగి చూసేందుకు అటువైపు రెండడుగులు వేసింది రాధ. కానీ, ఆ చీకట్లో రాధ కాలు అనుకోకుండా ఒక నున్నటి రాయి మీద పడటంతో ఏంజరిగిందో గ్రహించేలోపు కాలు జారి పక్కనున్న లోయలో పడి స్పృహ కోల్పోయింది రాధ.

ఆ ప్రాంతమంతా కటిక చీకటిగా ఉండటంవల్లనో లేక ఎవరి హడావుడిలో వారు ఉండటంవల్లనో, రాధ అలా పడిపోవడం రాధతో పాటూ వచ్చిన వారెవ్వరూ గమనించలేదు. చాలా సేపు రాధ కనబడక పోయే సరికి నిజంగా ఇంటికెళ్లిపోయిందేమో అని అనుకుంది సుజాత.

*** *** ***

మర్నాడు తెల్లవారుతూనే రాధకు స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చుట్టూ కలియ చూసిన రాధకు, తను ఒక గుడిసెలో ఉన్నానన్న విషయం అర్ధమయ్యింది.

తన పక్కనే కూర్చుని ఉన్న ఒక ముసలవ్వ రాధను చూసి బోసి నవ్వులు నవ్వుతూ, “ఒసేయ్ లచ్చీ...పాప లేచిందే.. రా”, అని కేక వేసింది.

గుడిసె బయట పనిచేసుకుంటున్న లచ్చి పని మధ్యలో వదిలేసి లోపలికొచ్చి, “హమ్మయ్య..లేచావా పాపా? ఎట్టా ఉందమ్మా నీకూ? రాత్రి అడవిలో మొక్కల మధ్యలో తెలివి లేకుండా పడుంటే మా బాబు చెప్పాడు. పట్టుకొచ్చి ఇదిగో ఈ అవ్వకు తెలిసిన పసరు వైద్యం చేశాం. మా ఊర్లో ఆసుపత్రి ఉండుంటే డాక్టర్ బాబు దగ్గరకే పట్టుకెళ్ళేవాళ్ళం”, అంది.

పాచి పట్టిన ఎతైన పళ్లతో, చమటపట్టిన శరీరంతో చాలా సన్నగా ఉన్న లచ్చిని చూసి అసహ్యించుకున్న రాధ తన పైనున్న చిరుగుల దుప్పటి చూసి 'ఛీ' అంటూ గబుక్కున లేవబోయింది. కానీ తన కాలికి దెబ్బలు తగిలి ఉండటంతో మంచం పైనుండీ లేవలేకపోయింది రాధ.

“చూస్తే గొప్పింటి బిడ్డలా కనబడ్డావమ్మా.అందుకే మాకు మంచం లేకున్నా మాకు ఎరిగిన వాళ్ళింటి నుండీ ఈ నులక మంచం తెచ్చి దానిపైన పడుకోబెట్టా. నువ్వు మొహం కడుక్కునేందుకు నే సాయంచేస్తాగా”, అంటూ ఎంతో జాగ్రత్తగా రెండు చేతులతో రాధను పట్టుకుని గుడిసె బయటకు తీసుకు వచ్చింది లచ్చి.

జరిగిందంతా అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తూ మొహం కడుక్కుని గుడిసెలోకి వచ్చిన రాధతో, “ఇదిగోనమ్మా.. ఎప్పుడనంగా తిన్నావో. నీ కోసం లచ్చి పొద్దున్నే కొట్టుకు పోయి పప్పు పట్టుకొస్తే నేను వండి పెట్టాను. తినమ్మా”, అంటూ పక్కనే ఉన్న మట్టి పాత్ర మూత తీసి పప్పన్నం ఇచ్చింది అవ్వ.

ఆ అన్నం వంక తినాలా వద్దా అన్నట్లు రాధ చూస్తూ ఉంటే, “డబ్బులు లేని మేము ఖరీదైన పప్పు ఎలా కొన్నామా అని చూస్తున్నావా పాపా? మా బాబు రాము తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వాడి బడి ఇక్కడికి నాలుగు కిలోమీటర్లు దూరం. ప్రతిరోజూ పొద్దున్నే లేచి నడుచుకుంటూ పోయొస్తాడు. వచ్చాక అడవికి పోయి ఎండు పుల్లలు ఏరి చీకటి పడే వేళకు తీసుకొస్తాడు. ఆ అలుపుతో చదవడం కష్టంగా ఉన్నా అలాగే చదివి పడుకుంటాడు. నేను ఇంటి వెనక పెంచుతున్న కూరగాయ మొక్కలే మా జీవనాధారం. రాముకి, వచ్చే సంక్రాంతికి సైకిల్ కొని పెట్టాలని నా ఆశ. అందుకోసం నాకొచ్చే దాంట్లోంచి గత కొంత కాలంగా ప్రతి నెలా కొద్ది కొద్దిగా డబ్బు దాస్తున్నాను. ఆ డబ్బుతోనే ఇవన్నీ పట్టుకొచ్చానమ్మా”, అంది లచ్చి చిరునవ్వుతో.

లచ్చి గొప్ప మనసు చూసి ఆశ్చర్యపోయిన రాధ, ‘ముక్కూ మొహం తెలియని నన్ను రక్షించడమే కాక ఇంత పేదవారు కేవలం నా ఆకలి తీర్చడం కోసం వారి కష్టార్జితాన్ని ఖర్చు పెట్టడం ఎంతటి త్యాగం! అసలు నేను వారి స్థానంలో ఉండుంటే ఇతరుల గురించి ఇంత ఆలోచించేదాన్ని కాదేమో!’, అని అనుకుంది.

“నాకోసం ఇంత కష్ట పడ్డారా? మరి రాము కి సైకిల్ ఎలా కొంటారూ?", అని లచ్చిని అడిగింది రాధ.

“ఏదో! నా పిచ్చి కానీ నేనెంత కాలం పొదుపు చేసినా అంత డబ్బు పోగెయ్యలేను కదా! ఇప్పటిదాకా దాచిన డబ్బు ఏదైనా మంచి పనికి వాడదామనుకున్నానమ్మా. పొద్దున్న లేవగానే ఎందుకో మా గంజి నీకు నచ్చదని అనిపించింది. అందుకే ఆ డబ్బుతో పప్పు, ఖరీదైన బియ్యం, ఇవిగో ఈ అరటి పళ్ళూ కొని తీసుకొచ్చానమ్మా. నువ్వు మా ఇంట్లో ఇష్టంగా తిని దానివల్ల నీ కడుపునిండితే ఆ తృప్తి చాలమ్మా నాకు. తిను”, అని నవ్వుతూ  చెప్పింది లచ్చి.

నిష్కల్మషంగా లచ్చి అన్న ఆ మాటలు రాధను ఆలోచనలో పడేశాయి.

‘ఇంత మంచి మనసు, అంతకన్నా మంచి గుణం ఉన్న వారి రూపం గురించి తప్పుగా అనుకోవడం నా అవివేకం. ఇంతకాలం బాహ్యంగా కనపడే అందమే అందం అని భ్రమ పడ్డాను. అది ఎంత తప్పో కదా! అమ్మ చెప్పినట్టు మనిషిలో ఉండే మానవత్వం, మంచితనాల వల్ల వచ్చేదే అసలైన అందమని వీళ్ళను చూస్తే అర్ధమవుతోంది. స్పృహలో లేని నన్ను జాగ్రత్తగా తీసుకుని వచ్చి రాత్రంతా సేవలు చేసి, నా సుఖం కోసం తపించిన వారినా నేను చీదరించుకున్నది?’, అని తన తప్పు గ్రహించిన రాధకు కనువిప్పు కలిగి అలా ప్రవర్తించినందుకు చాలా సిగ్గనిపించింది.

వెంటనే తన తప్పు సరిదిద్దుకోవాలని అనుకుని రాధ, “మీరు నాకు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతకీ ఇది ఏ ఊరు?”, అని అడిగింది లచ్చిని.

“ఇది గుహ్యకొన. మారుమూల కుగ్రామమమ్మా. కొండ కింద ఉండటంవల్ల దీని గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఏదో మా గ్రామంలో ఉన్న పొలంలో పండించేవాటితో రోజులు గడుపుతుంటారందరూ”, చెప్పింది లచ్చి.

మరోసారి లచ్చికి, అవ్వకు, రాముకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి రాము సహాయంతో ఎలాగో మధ్యాహ్నానికి ఇల్లు చేరుకుంది రాధ. జరిగినదంతా తెలుసుకుని ఇంట్లో వారంతా రాధను ఆ భగవంతుడే రక్షించాడని అనుకున్నారు. రోజులు గడిచే కొద్దీ అందం విషయంలో రాధలో వచ్చిన మార్పును గమనించి సంతోషించింది మీనాక్షి.

*** *** ***

డిగ్రీలో రాధ మంచి మార్కులు సంపాదించడంతో, అనుకున్న ప్రకారం పై చదువుల కోసం రాధను అమెరికాలో ఉంటున్న రవి వద్దకు పంపించారు ఉమాపతి దంపతులు. అమెరికా చేరిన రాధ చక్కగా చదువుకుంటూనే రవి కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నో కొత్త ప్రదేశాలు చూసింది. స్వదేశం విడిచి ఎన్ని నెలలు గడిచిపోయినా తనకు జరిగిన ప్రమాదం గురించికానీ లచ్చి చేసిన సహాయం గురించి కానీ, ఆమె చూపిన ఆప్యాయతను గురించి కానీ మరిచిపోలేదు రాధ. తనకు సమయం వచ్చినప్పుడు లచ్చికి సంతోషం కలిగించే పని ఏదైనా చేసి తన కృతజ్ఞత మరింత తెలుపుకోవాలని రాధ ఎప్పుడూ అనుకుంటూ ఉండేది.

ఒక రోజు రవి అమెరికాలో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తెలుగు వారంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడి దాని ద్వారా వారు ఇండియా లో చేస్తున్న అనేక కార్యక్రమాలను గురించి వివరంగా చెప్పాడు. అది విన్న రాధకు ఆ సంఘం ద్వారా లచ్చి కి సహాయం చెయ్యొచ్చన్న ఆలోచన వచ్చింది.

లచ్చి విషయం రవికి రాధ చెప్పగానే, "ఓ! అటువంటి గ్రామాలను అభివృద్ధి చెయ్యడంలో మా సంఘం ఎప్పుడూ ముందుంటుంది. ఆ గ్రామానికి ఏదో ఒక విధంగా మా సంఘం ద్వారా సహాయమందేలా నేను చూస్తాను", అన్నాడు రవి.

ఆ వారాంతంలో జరిగిన సమావేశంలో రవి గుహ్యకొన గ్రామం గురించి తెలుగు వారి సంఘంలో ఉన్న సభ్యులందరికీ చెప్పి ఆ గ్రామస్తులందరికీ సహాయపడే కార్యక్రమం చేపట్టాలని కోరాడు. విషయం విన్న సంఘం సభ్యులు వెంటనే స్పందించి గుహ్యకొన గ్రామంలోని విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు పంచి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమంలో రాధ కూడా పాల్గొని స్వయంగా తానే దగ్గరుండి రాముకి ఒక సైకిల్ ఆ సంఘం తరఫున ఇప్పించింది. కొత్త సైకిల్ ఎక్కిన రాము మొహం ఆనందంతో వెలిగిపోయింది.

అది చూసిన లచ్చి పట్టలేని సంతోషంతో, ఆనందభాష్పాలు నిండిన కళ్ళతో, రాధ చేతులు పట్టుకుని, “నీకేమిచ్చినా మా ఋణం తీరదమ్మా. రాము కి నేను కొనిపెట్టలేని సైకిల్ ఇచ్చి నా చిరకాలపు కోరికను తీర్చావు. వాడు బడికెళ్లిన ప్రతి సారీ నిన్ను తప్పకుండా తలుచుకుంటాడు”, అంటూ ఏడ్చేసింది.

లచ్చి ప్రేమతో చేసిన ఆ స్పర్శ, భావోద్వేగంతో అన్న ఆ మాటలు రాధ మనసును కదిలించాయి. అవసరంలో ఉన్న వారికి సహాయపడటంలో ఉన్న ఆనందం మొట్టమొదటిసారి అనుభవంలోకి వచ్చింది రాధకు . తనకింత మంచి అవకాశాన్నిచ్చి మరువలేని అనుభవాన్ని కలిగించిన తెలుగు సంఘం వారికి కృతజ్ఞతలు తెలిపిన రాధ ఇక తన చదువు పూర్తి కాగానే స్వదేశానికి తిరిగి వచ్చి ఆ గ్రామ అభివృద్ధికి సహాయపడాలని ఆ క్షణమే నిర్ణయించుకుంది.

*** *** ***

అమెరికా వెళ్లి చదువు పూర్తి చేసి తన నిర్ణయం ఇంట్లో చెప్పింది రాధ. రాధ చదివిన చదువు మొక్కలకు సంబంధించినది కావడంతో వ్యవసాయానికి అది ఉపయోగపడటమే కాక తమ ఒక్కగానొక్క కూతురు తమ వద్దే ఉండవచ్చన్న ఉద్దేశంతో వెంటనే ఒప్పుకున్నారు రాధ తల్లిదండ్రులు. రాధ గుహ్యకొన గురించి పూర్తిగా తెలుసుకుని అక్కడి పెద్దలతో మాట్లాడి మెల్లిగా ఆ గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించింది. అయితే వ్యవసాయం విషయంలో మాత్రం తానే స్వయంగా ఆ గ్రామస్తులతో పొలంలోకి దిగి వారికి సూచనలు ఇస్తూ ఉండేది. ఒకరోజు పొలంలో పని చేస్తూ ఉండగా ఒక వ్యక్తి చేతికి గాయమయ్యింది.

“అరెరే.. చాలా రక్తం పోతోందే. నా కార్ ఇక్కడే ఉంది. ఈ గ్రామంలో డాక్టర్ లేరుగా. మా ఇంటి దగ్గరి డాక్టర్ వద్దకు తీసుకెడదాం”, అంది రాధ.

“ఎందుకమ్మా..? మన గ్రామంలోనే మనోహర్ అని ఒక డాక్టర్ బాబు వచ్చాడు. వారానికి రెండు రోజులిక్కడే ఉండి అందరికీ ఉచితంగా వైద్యం చేస్తున్నాడు. ఆయన లేనప్పుడు ఆయన వద్ద పనిచేస్తున్న నర్సు ఇక్కడే ఉండి ఫోన్లో డాక్టర్ తో మాట్లాడి మందులు కనుక్కుని మాకిస్తూ ఉంటుంది. అక్కడికి తీసుకెడదాం”, అంది లచ్చి.

"ఔనా? నాకీ విషయం తెలియదే! సరే. అతనిని వెంటనే జాగ్రత్తగా ఆ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లండి", అంది రాధ.

రోజంతా పొలంలో పనులు చేసి చేసి అలిసిపోయి ఇక ఇంటికెడదామని రాధ అనుకుంటూ ఉండగా, “హలో. నా పేరు మనోహర్. నేను డాక్టర్ ను. ఈ  గ్రామంలో కొద్ది నెలల క్రితం నా క్లినిక్ పెట్టాను. మీ మంచితనం గురించి చాలా మంది నా దగ్గర చెప్పారు. నేను లండన్ లో మెడిసిన్ చదివి సొంతూరుకు దగ్గరగా ఉన్న గుహ్యకొనలో పేద వారికి ఉచితంగా వైద్య సేవలు చెయ్యాలని మన దేశానికొచ్చేశా”, అంటూ రాధను ఒక యువకుడు పలకరించాడు.

తొలి పరిచయంలోనే రాధకు మనోహర్ మనసు చాలా నచ్చింది.

రెండు రోజుల తరువాత ఎండలో పొలం పనులు చేస్తున్న రాధ వద్దకు మనోహర్ వచ్చి, “మీరు చాలా అందంగా ఉన్నారు. నన్ను పెళ్లి చేసుకుంటారా?”, అని అడిగాడు.

"ఏమిటీ? నేను అందంగా ఉన్నానా? ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయ్యింది. చూడండి..నా చేతులకీ, బట్టలకీ, కాళ్ళకీ ఎంత బురద అంటి ఉందో?", అంది రాధ.

"మీరు నా కంటికి మాత్రం నిజంగానే చాలా అందంగా కనబడుతున్నారు", అన్నాడు మనోహర్.

ఒక్కప్పుడు అందానికి మితిమీరిన ప్రాధాన్యత ఇచ్చిన రోజులలో రాధను అందంగా ఉన్నావని పెద్దగా ఎవ్వరూ పొగడలేదు. ఇప్పుడు అందం గురించి ఆలోచించడం  పూర్తిగా  మానేశాక మనోహర్ ఆ మాట అనేసరికి రాధకు ఆశ్చర్యం కలిగింది. మాటలలో ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చడంతో రాధ, మనోహర్ లు తమ సంగతి ఇంట్లోని పెద్దవారికి చెప్పి వారి అంగీకారంతో పెళ్లి చేసుకుని ఒకటవ్వడానికి నిర్ణయించుకున్నారు. పెళ్లి గుహ్యకొన గ్రామంలో చాలా ఘనంగా జరిగింది.

పెళ్లికొచ్చిన అతిధులందరూ “అందమైన జంట” అని రాధ, మనోహర్ లను దీవించారు.

ఆ తరువాత రాధ, మనోహర్ లు తమ జీవితాంతం పేద వారికి సేవలందిస్తూ, వెనక బడిన గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, అందమైన మనసున్న జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు.

*** *** ***

Posted in October 2019, కథలు

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *