Menu Close
Atanu Aame

అభిరామ్- కవి పరిచయాన్ని మన విద్యార్ధి గారి మాటలలో చూద్దాం.

కవి అనేవాడు ఏ విషయాన్నయినా తన కవితా దృష్టితో చూసి, ఊహించి వ్రాయగలడనేది ప్రతీతి. కానీ, ఉహాత్మక కవిత్వానికీ, జీవించే కవిత్వానికీ వ్యత్యాసం చాలానే ఉంటుంది. ఒక జీవన విధానంలో కాలం కలిపించే ఒడిదుడుకులు ఉండవచ్చు, అయినవారి చివాట్ల మేలుకొల్పులతో కూడిన తలవాపులు ఉండవచ్చు, కానివారి నయవంచనతో కూడిన మానసిక గాయాలు ఉండవచ్చు. శ్రమ జీవనంలో వుండే శారీరక గాయాలూ కావచ్చు. వీటన్నటిని కంఠంలో గరళం లాగా బంధించి, చక్కని సమ కాలీనా కవిత్వం అందించటంలో ఒక పారలౌకిక మాధుర్యం ఉంటుంది జీవించే కవికి.

అటువంటివి కవి అభిరామ్ లేక సదాశివ. అభిరాముడుకి ఇప్పుడు వయసు 21 ఉంటుంది. ఇతను పుట్టింది, పెరిగింది ఆదోని దగ్గరి పర్వాతాపురం. తల్లిదండ్రులు మీనాక్షి, నాగప్పలు. దివ్యాంగుడు, దివ్యమనస్కుడూ అయిన ఒక తమ్ముడు. వ్యవసాయ కూలీ కుటుంబం. చదువుల గోల ఇంకా తాకని రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయ కూలీగా బాల్యం గడిచింది. మరి అభిరాముడికి చదువు మీద ఎందుకో శ్రద్ధ. పదవ తరగతి పాసయిన తరువాత, ఆ బడి ఉపాధ్యాయురాలు వరలక్ష్మి గారు ఓపెన్ యూనివర్సిటీలో ఇంటరు కట్టిస్తే, అదికూడా గట్టెక్కాడు. ఆ తరువాత అతని విధ్యాభ్యాసం అంతా తలపాగాలో సెల్ ఫోన్ చెవుకు దగ్గరగా కట్టుకుని, కూలి పనులు చేస్తూ విన్న ప్రవచనాలే.  ప్రస్తుతం ఇతని ఉద్యోగం వారానికి ఆరు రోజులు ఆదోనిలో భవన నిర్మాణ కూలీ. ఏడవ రోజు తమకున్న కొంచెం రాయలసీమ భూమిలో వ్యవసాయం పనులు.

అయితే ఇతనికి తోడున్నాము అనే వారిలో చాలా మంది అమ్మలూ, అక్కలూ, అయ్యలూ ఉన్నారు. వారినెవరినీ అభిరాముడు ముఖాముఖిగా కలసిన సందర్భాలు లేవేమో. వారి అనునయ ప్రోత్సాహాలతో ఎంతో కొంత పెరుగుతున్న కవితోత్సాహం.

"అక్షరం నా ఆస్తి
పదం నా పదవి
వాక్యం నా వేకువ
కవిత్వం నా జీవితం"
అంటాడు అభిరామ్.

భక్తితో ఆత్మనివేదన చేసే కవిత్వం మొదలు నేటి సమాజ క్రియలను సునిశితంగా విమర్శించే కవితా వెల్లువలే కాకుండా తన జీవితంలోని సన్నివేశాలే ఆ కుర్రాడిని కవిత్వం వైపు మళ్ళిస్తున్నాయి. అందులో ఒక కవితాంశం "అతనూ-ఆమె". ఇది నేటి సమాజంలోని మహిళ గురించిన ఆవేదన. ఒకింత స్త్రీ పురుష బాంధావ్యాల గురించి, దాంపత్యం గురించి స్పందన.

అభిరాముడి కవిత్వంలో ఎక్కడా స్వోత్కర్ష కనబడదు, అనవసర పాండిత్య ప్రదర్శన ఉండదు, తెంగ్లిషు ప్రయోగాలూ ఉండవు. స్వచ్చమైన తెలుగుతో మనసును తడిపే తొలకరి. తడసిన మట్టి సువాసనలతో కూడిన నాటు పూల పరిమళాలు. ఈ యువ కవులనూ, నవ కవులనూ మనం వేదికలు ఎక్కించకపోయినా, మొదటి వరుసలో పెట్టి, వారి బాణినీ, వాణీనీ అందరికీ వినిపించవలసిందే. సిరిమల్లె సంపాదకులు మధు గారు అభిరాముడి "అతను-ఆమె" కవితలను అందరికీ అందిస్తున్నారు. అందరూ చదివి ఆ అభిరాముడి కవితా పరిమళాలని ఆస్వాదించగలరు.

౧. మూడు ముళ్ళు పడకముందు
ఆమె చేతులు ప్రతి పండక్కి పండేవి
ఇప్పుడు ఆమె చేతులు
ప్రతినిత్యం కాయలే కాస్తున్నాయి
అతని జీవితాన్ని పండించాలని
౨. ఎంత మంది ఓదార్చినా
ఆమె కళ్ళల్లో ప్రవాహ ఉదృతి ఆగడం లేదు
అతను ఒంటొత్తి దీపం పెట్టుకుని పడుకున్నాడు మరి..
౩. పగలంతా
పని చేస్తూ పరిమళించే
నిండుకుండే ఆమె
చీకటైతే మాత్రం
పగిలిన కుండై విలపిస్తుంది
సాయంత్రమైతే అతను *సారాయి* పట్టుకుంటాడు మరి..
౪, ఆమె నా హక్కని
ఉక్కు సంకల్పంతో
కన్న మనసులను అరటితొక్కలా తీసి
అతన్ని కట్టుకుని ఆరడుగులేసి
మూడు మూరల మల్లెపూల ముచ్చట తీర్చుకుందిదానికి ప్రతిఫలమేమో
అతను అదృశ్యమై
మరో పుత్తడిబొమ్మ మెడలో
ఇత్తడి మంగళసూత్రమై దర్శనమిచ్చాడు
౫. మూడు ముళ్ళ బంధానికి
అతను వాక్యమై అల్లుకోవడంతో
ఆమె పదమై పరిమళించడంతో
దాంపత్య ఆవరణలో పిల్లలు అక్షరాలై
ఆడుకుంటున్నారు
౬, అతను ఆమె
ప్యానుకు ఊపిర్లను వేలాడదీశారు
పాపం తమ గారాలపట్టి
పరువు పరుపును పోగొట్టి
ప్రణయ వంతెనపైన పరిగెత్తిపోయింది మరీ..
అతను ఆమె చేసింది
ముమ్మాటికి తప్పే
లోకులనే లోకువ మనసు కలిగిన కాకుల కావ్..కావ్ లు వినకుండాపోయారు
పాపం ఆ కాకులు ఎంత బాధపడుతున్నాయో ఇప్పుడు.

... సశేషం ....

Posted in October 2019, కథలు

5 Comments

  1. అనుపమ

    చాలా బాగా చెప్పావమ్మా.కృతజ్ఞతలు.మీకు మంచి భవిష్యతుంది అమ్మ.

  2. అనుపమ

    అభిరామ్, చాలా చాలా బాగా రాసావు.కృతఙతలు.నీకు మంచి భవిషత్తున్నది అమ్మ.

  3. మారుతి గొల్లపెల్లి

    అభిగారి కవితలు చాలా బాగుంటాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *