Menu Close
manusmrithi page title
మొదటి అధ్యాయము (ఆ)

‘మనుస్మృతి’ (1-34) లో చెప్పిన దాని ప్రకారం మనువు తాను తపస్సు చేసి సృష్టించిన పది మంది ప్రజాపతులనే మహర్షులు అన్నాడు. ‘మహర్షి’ అనే పదం అప్పుడు కేవలం మనువు సృష్టించిన పదిమంది ద్రష్టలు (Saints or Seers) లేక ప్రజాపతుల (Patriarchs) కు మాత్రమే వర్తించినా, అనంతరకాలంలో ఆ పదం సామాన్యార్థంలో ‘ఒక గొప్ప ఋషి’ అని స్థిరపడింది. మనువు చెప్పిన ఈ సృష్టిక్రమ సిద్ధాంతాన్ని మనం ఇప్పుడు విమర్శనాత్మకంగా పరిశీలిద్దాం.

బ్రహ్మ ఈ భూలోకం యొక్క వృద్ధిని కోరి తన ముఖము, బాహువు, ఊరువులు, పాదముల నుంచి వరుసగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను సృష్టించాడని (1-31) లో పేర్కొనబడింది. ఆ తరువాత బ్రహ్మ తనకు తానే తన దేహాన్ని రెండుగా విభజించుకుని ఒక భాగం పురుషునిగానూ, మరొక భాగం స్త్రీగానూ రూపొందగా, ఆ స్త్రీ పురుషుల కలయిక కారణంగా విరాట్ పురుషుడు ఆవిర్భవించాడని (1-32) లోనూ, ఆ విరాట్ పురుషుడు తపస్సు చేసిన కారణంగా సకలలోక సృష్టికర్తయైన తాను సృష్టించబడినట్లు (1-33) లోనూ మనువు పేర్కొన్నాడు. ఆ తరువాత ప్రజలను సృష్టించగోరి తాను ముందుగా పదిమంది ప్రజాపతులను సృష్టించానని (1-34) లోనూ, వారే మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతసుడు, వసిష్ఠుడు, భృగువు, నారదుడు అనీ (1-35) లోనూ మనువు పేర్కొన్నాడు. ఆ పదిమంది ప్రజాపతులు తమవలె గొప్ప తేజస్సు కలిగిన మరి ఏడుగురు మనువులను, దేవతలను, దేవతల నివాస స్థలాలను, అమిత తేజస్సు కలిగిన మహర్షులను సృష్టించారని (1-36) లో పేర్కొన్నాడు.

ఆ తరువాత ఆ ప్రజాపతులే కుబేరుడు మొదలైన యక్షులనూ, రావణాది రాక్షసులనూ, పిశాచులనూ, సంగీత కళలో నిష్ణాతులైన గంధర్వులనూ, దేవతల నాట్యగత్తెలైన అప్సరసలనూ, అసురులనూ, నాగులనూ, సర్పములనూ, పక్షులనూ, పితృదేవతలనూ పృథగ్గణములుగా (వేర్వేరు గణములుగా) సృష్టించారని (1-37) లో పేర్కొనబడింది.

ఇక్కడ రాక్షసులకూ, యక్షులకూ, అసురులకూ మధ్య తేడా గమనార్హం. బ్రహ్మ మానసపుత్రుడని భావిస్తున్న పులస్త్యుని కుమారుడైన విశ్రవసుడికి, సుమాలి కుమార్తె అయినట్టి కైకసి కి పుట్టినవారు రావణుడు మొదలైన రాక్షసులు. రాక్షసులు తమ తండ్రి విశ్రవసుడి నోటి వాక్యం ప్రకారం ప్రదోషకాలం (సాయం సంధ్యాకాలం) లో జన్మించి, రాత్రులు సంచరించే  రజనీచరులయ్యారట. రాక్షసులు దేవతలకు శత్రువులు. అదే విశ్రవసుడికి కైకసి సవతి అయినట్టి ఇలబిల కు పుట్టినవారు కుబేరుడు మొదలైన యక్షులు. వీరు రాక్షసులకు దాయాదులు కనుకనే రావణుడు తన విజృంభణ సందర్భంగా ముందుగా కుబేరుడి రాజధాని అలకాపురి మీదకు దండెత్తి కుబేరుని సంపదనూ, అతడి పుష్పక విమానాన్నీ దోచుకుంటాడు.

‘భగవద్గీత’ లోని ‘విభూతియోగము’ లో అన్నింటిలోనూ శ్రేష్ఠమైనవి తానేనని పేర్కొంటూ శ్రీకృష్ణుడు తాను ‘యక్షులు, రాక్షసుల గణంలో శ్రేష్ఠుడయినట్టి ధనపతి కుబేరుడి’ నని (‘విత్తేశో యక్షరక్షసామ్’ 10- 23) అంటాడు. చారిత్రకంగా చూస్తే దేవతలు అనే ఒక తెల్లని మేనిచాయ కలిగిన జాతి ప్రజలకు నాట్యవినోదం పంచినవారు యక్షులు. యక్ష శబ్దమే ‘జక్ష’, ‘జక్కు’ గా రూపాంతరం చెందింది. యక్షగానం అనే కళారూపానికి ఆద్యులు వీరే. ఈ కళాప్రదర్శనలో జక్కుల పురంధ్రి తన నాట్యగానాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. యక్షులు తమ (నాట్యగాన ప్రదర్శనలతో తమవద్ద పోగుబడిన?) అపారమైన నిధులను కాపాడుకొనలేని బలహీనులైనందున వారు వాటిని రహస్య సంకేత స్థలాలలో దాచిపెట్టేవారట. శారీరకంగా బలహీనులైనప్పటికీ యక్షుల వద్ద మంత్రశక్తులుంటాయని మన ప్రాచీనులు నమ్మారు. దుర్గమమైన ప్రదేశాలలో యక్షులు దాచిన నిధులు అందరివీననీ, సాహసవంతులకు మాత్రమే అవి దక్కుతాయనీ నానుడి. బౌద్ధ సాహిత్యంలో కువేర( కుబేర), కువేరక (కుబేరక), యక్ష, యక్షిల ప్రస్తావనలున్నాయి. జక్కుల (యక్షుల) మూలస్థానం ఐరోపాలోని జకోస్లావేకియా అని కొందరి విశ్వాసం. జకోస్లావేకియా రాజధాని ప్రాగ్ (Prague) ని స్థానికులు ‘ప్రాహా’ అంటారు. ‘ప్రాహః’ అనే సంస్కృత పదానికి అర్థం ‘నాట్య కళలో శిక్షణ’ అని.  మరో విషయం కూడా గమనార్హం. మిగిలిన యురోపియన్ల వలె యక్షులు కూడా ఒకప్పుడు పింగళాక్షులే( బంగారు వన్నె కనుగుడ్లు కలవారే) నట. భారతదేశానికి వచ్చాక ఇక్కడ నివసించిన కారణంగా వారిలో పలువురి కనుగుడ్లు క్రమంగా నల్లగా మారాయట. ఒకప్పటి బౌద్దులైన యక్షులు అనంతరకాలంలో శైవం స్వీకరించారు. అష్టదిక్పాలకులలో ఈశాన్య దిక్కుకు అధిపతి శివుడు కాగా, ఉత్తర దిక్పాలకుడు కుబేరుడు. శివుడు కుబేరుడికి సన్నిహిత మిత్రునిగా పేరొందాడు. కుబేరుడికి శివసఖుడనీ, శివుడికి ధనపతి మిత్రుడనీ, కుబేర సఖుడనీ కూడా పేర్లున్నాయి. బహుశా భారతదేశానికి ఉత్తరదిశగా నేటి సైబీరియా ప్రాంతంలో ఉన్న అలకోలు సరస్సు (ఒజెరో అలకోలు - Ozero Alakolu) సమీపంలోనే కుబేరుడి ఒకప్పటి రాజధాని అలకాపురి ఉండి ఉండవచ్చు. ‘అసురుడు’ అంటే సామాన్యార్థంలో రాక్షసుడు, రజనీచరుడు (రాత్రి వేళల్లో సంచరించేవాడు), రాక్షస శ్రేష్ఠుడు (బలి చక్రవర్తి), రాహువు అని స్థిరపడింది. అయితే అసురుడు అంటే సూర్యుడు, వరుణుడు, దేవతా శ్రేష్ఠుడు అనే అర్థాలూ ఉన్నాయి.

ఇంకా విద్యుత్(మెరుపులను), అశని (పిడుగులను), మేఘములను, రోహితము (అస్పష్టమైన లేక నిటారుగా ఉన్న ఇంద్రధనుస్సు) లను, సాధారణమైన వలయాకారపు ఇంద్ర ధనుస్సులను, మండుతూ ఆకాశాన్నుంచి రాలిపడే ఉల్క(meteor) లను, నిర్ఘాతములను (పెద్ద శబ్దంతో కూడిన విధ్వంసకరమైన సుడిగాలులను - ‘వాయునా నిహతో వాయుర్గగనాచ్ఛ పతత్యధః | ప్రచండ ఘోర నిర్ఘోషో నిర్ఘాత ఇతి కథ్యతే ||’), కేతువు (Comets - తోకచుక్క) లను, స్వయం ప్రకాశములై, ఉచ్ఛములు, అవచములు అయినట్టి (రోదసిలో సమున్నత మరియు నిమ్న స్థానాలలో వెలుగొందే) వివిధ నక్షత్రాలు ఇతర ఖగోళాల (Stars and other Heavenly Bodies) ను, వ్యోమములో అవి సృష్టించే పలు వింత కాంతుల (Heavenly Lights) ను మరీచి మొదలైన పదిమంది ప్రజాపతులు సృష్టించారు (1-38). కిన్నరులను (గుర్రపు తలతో నరుని శరీరంతోనూ, మనుష్య ముఖంతో గుర్రపు శరీరంతోనూ ఉండే దేవతలను), వానరులను, మత్స్యములను, వివిధ జాతుల పక్షులను,  పశువులను, మృగములను, మనుష్యులను, వ్యాళములను (క్రూర సర్పములను), ఉభయతోదతములను (రెండు వరుసల దంతములు కలిగినవాటిని) మరీచ్యాదులు సృష్టించారట (1-39) (ఉభయతోదత అంటే రెండు దౌడలు, రెండు వరుసల పళ్ళు కలిగిన జీవులు.)

మనుస్మృతిలో వేరుగా ప్రస్తావించనప్పటికీ ఇలా గుర్రపు తల మనుష్య శరీరం కలిగినవారిని కిన్నరులు అనీ, నరుని తల గుర్రం శరీరం కలిగి ఉండే వారిని కింపురుషులు అనీ అంటారు. కింపురుషులు గ్రీకు ఐతిహాసిక గాథలలో ప్రస్తావించబడిన కెంటార్ లేక సెంటార్ (Centaur) ల వంటివారు. సెంటార్ లు మనిషి తల, చేతులు కలిగి నడుము వరకు అంతా మానవుడి లాగే ఉండి, గుర్రం శరీరం కలిగి ఉంటారని వర్ణించబడింది.

క్రిములను, కీటకాలను, పతంగములను (పతంగము అంటే పక్షి అనే అర్థంతో పాటు, రాత్రి వేళల్లో సంచరించే ‘వడ్ల చిలుక’ అనబడే పెద్ద సీతాకోక చిలుక -Moth- అనే అర్థమూ ఉంది), యూకములను (పేలను), మక్షికములను (ఈగలను, తేనెటీగలను), మత్కుణములను (నల్లులను), దంశ మశకాలను (కుట్టే దోమలు మొదలైన కీటకాలను) - వీటన్నిటికీ  అనువైన స్థావరాలైన వృక్షాలు, పర్వతాలు, గుహలతో సహా  వేర్వేరుగా ఈ మరీచి మొదలైన ప్రజాపతులే సృష్టించారట. (1-40)

‘మహర్షులైన ప్రజాపతులు తపస్సుచేసి నా ఆదేశంతో ఆ యా భూతములు, జీవుల కర్మానుసారం మనకిప్పుడు కనిపించే ఈ స్థావర జంగమ (చరాచర) జగత్తునంతా సృష్టించారు. ఈ సంసారంలో ఏ భూతములకు ఏ యే కర్మలు పూర్వాచార్యులచే చెప్పబడ్డవో ఆ యా కర్మములను, ఆ యా జన్మలలోని క్రమ యోగాన్ని నేను మీకిప్పుడు తెలుపుతాను,’ అన్నాడు మనువు. (1- 41,42)

మొదటి అధ్యాయంలోని 43 వ శ్లోకం నుంచి 60 వ శ్లోకం వరకు మనువు వివరించిన విషయాలు, ఆ తరువాత భృగు మహర్షి వివరించిన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పటివరకు ‘మనుస్మృతి’ అధ్యయనం ద్వారా మనం తెలుసుకున్న విషయాలను, వాటి గురించి మనకు ఏర్పడిన అనుమానాలను అంశాలవారీగా హేతుదృష్టితో ఒకసారి పునఃపరిశీలన చేద్దాం. ఆ క్రమంలో ఇక్కడ వివరించిన విషయాలు ఏ మేరకు శాస్త్రీయమైనవో కూడా పరిశీలిద్దాం.

మొదటి అధ్యాయం 39 వ శ్లోకంలో మరీచి మొదలైన పదిమంది ప్రజాపతులు మనుష్యులను సృష్టించినట్లు మనువు పేర్కొన్నాడు. అంతకుముందు 31 వ శ్లోకంలో లోక వివృద్ధిని కోరి బ్రహ్మ తన ముఖము, బాహువులు, ఊరువులు, పాదములనుండి వరుసగా బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను సృష్టించినట్లు పేర్కొన్నాడు మనువు.

మనుష్యులను సృష్టించినది మరీచి మొదలైన పదిమంది ప్రజాపతులైతే ఆ సృష్టికి ముందే బ్రహ్మ తన శరీరాంగాల నుంచి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను ఎలా సృష్టించాడనేది ఎవరికైనా తలెత్తే సందేహం. మనుష్యులలోని నాలుగు వర్ణాల వారైన వీరిని ప్రజాపతులు చేసిన మనుష్య సృష్టి కంటే ముందే బ్రహ్మ తన శరీరాంగాలనుంచి సృష్టించాడనడం అర్థరహితంగా కనిపిస్తున్నది. ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కూడా మనుష్యులలో అంతర్భాగమే కదా? మనుష్యులలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల వారు కాక ఇంకెవరైనా వేరే వారున్నారా? మరి అలాంటప్పుడు ఈ నాలుగు వర్ణాలవారినీ, ఆ తరువాత విరాట్టునూ బ్రహ్మ సృష్టించగా, ఆ విరాట్ తపస్సుచేసి తననూ, తాను తపస్సుచేసి మరీచి మొదలైన పదిమంది ప్రజాపతులను సృష్టిస్తే వారు మనుష్యులను సృష్టించారని మనువు చెప్పడం పరస్పర విరుద్ధంగా లేదూ? సంబంధిత పరస్పర విరుద్దాంశాలతో కూడిన శ్లోకాలను, వాటి తాత్పర్యాలను పోల్చి చూసుకునేందుకు ఈ దిగువన ఇచ్చాను.

“లోకానాం తు వివృద్ధ్యర్థం ముఖబాహూరుపాదతః |
బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం శూద్రం చ నిరవర్తయత్ ||” ( 1-31)

“భూలోక విస్తారము కోరినవాడై, బ్రహ్మ తన ముఖము, బాహువులు, ఊరువులు, పాదములు - వీని నుండి వరుసగా బ్రాహ్మణులనూ, క్షత్రియులనూ, వైశ్యులనూ, శూద్రులనూ సృజించెను.” (కీ. శే. సరస్వతి వేంకట సుబ్బరామ శాస్త్రి గారి అనువాదం - పేజీ 14, మనుస్మృతి - 1928 నాటి వావిళ్ళవారి ప్రతికి పునర్ముద్రణ, బాలసరస్వతి బుక్ డిపో ప్రచురణ.)
“But for the sake of the prosperity of the worlds, he caused the Brahmana, the Kshatriya, the Vaisya, and the Sudra to proceed from his mouth, his arms, his thighs, and his feet.” (Translation of Sloka I-31 by G.Buhler - page 13 of The Laws of Manu, Sacred Books of the East Vol. 25.- Motilal Banarsidass Publishers Private Limited, Delhi)

“కిన్నరాన్వానరాన్మత్స్యాన్ వివిధాంశ్చ విహంగమాన్ |
పశూన్మృగాన్మనుష్యాంశ్చ వ్యాళాంశ్చోభయతోదతః ||” (1-39 )

“కిన్నరులను, వానరులను, మత్స్యములను, పెక్కు తెగల పక్షులను, పశువులను, మృగములను, పైపండ్లు క్రింది పండ్లు గల మనుష్యులను, క్రూర మృగములను  మరీచ్యాదులు సృజించిరి.” - (1928 నాటి వావిళ్ళ వారి ప్రతికి పునర్ముద్రణ పేజీ 16)

“(Horse - faced) Kinnaras, Monkeys, Fishes, Birds of many kinds, Cattle, Deer, Men and Carnivorous Beasts with two rows of teeth.” అని G.Buhler అనువాదం 15 వ పేజీలో ఉంది.

ఇలా మరీచి మొదలైన పదిమంది ప్రజాపతులు మనుష్యులను సృష్టించక (1-39 ) పూర్వమే బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్యులనే నాలుగు వర్ణాల వారినీ బ్రహ్మ సృష్టించాడని ( 1-31) మనువు చెప్పడం కారణంగా పైన తెలిపిన నాలుగు వర్ణాల ప్రజలు మనుష్యులలో భాగమా? కాదా? బ్రహ్మ తన శరీరాంగాల నుంచి సృష్టించిన నాలుగు వర్ణాల ప్రజలందరికీ కూడా రెండు దౌడలు 32 పళ్ళు ఉండగా ‘ఉభయతోదతః’ ( రెండు వరుసల పళ్ళు కలిగిన) అంటూ పశువులు, మృగాలు, క్రూర సర్పాలతో కలిపి పేర్కొన్న ఈ మనుష్యులెవరై ఉంటారనే ప్రశ్న నాది. కొందరు మనుస్మృతిలో పొరపాట్లుండడమేమిటంటూ 1-39 శ్లోకంలో ప్రస్తావించిన  రెండు వరుసల పళ్ళు కలిగిన మనుష్యులు పంచములై ఉంటారని ఊహచేసే అవకాశం ఉంది. కానీ అప్పటికసలు పంచములు అనే పదమే ఆవిర్భవించలేదు. అయినా బ్రహ్మ సృష్టించిన చతుర్వర్ణాల ప్రజలందరికీ కూడా రెండు వరుసల పళ్ళు ఉన్నప్పుడు ఇంకా మరీచ్యాదులు సృష్టించిన రెండు వరుసల పళ్ళున్న ఈ మనుష్యులెవరు? వారి లక్షణాలు, ప్రత్యేకతలు ఏమిటి? అనే ప్రశ్న వచ్చి తీరుతుంది. కనుక ఈ అంశాన్ని నేను ‘మనుస్మృతి’ మూలంలో ఉన్న ఒక గందరగోళంగానే భావిస్తున్నాను.

మనుస్మృతిలో సృష్టి క్రమం వివరించిన తీరు ఆనాటి  పరిమిత  శాస్త్రీయ అవగాహనకు తగిన విధంగానే  ఉంది. మెరుపులు, పిడుగులు, రోహితములు (నిటారుగా ఉండే ఇంద్రధనుస్సులు), వలయాకారపు ఇంద్రధనుస్సులు వంటివన్నీ వాతావరణ స్థితిగతులనుబట్టి అప్పటికప్పుడు ఏర్పడతాయి. అవి ఎవరూ ముందుగా సృష్టించినవి కావు. అలాగే అవి శాశ్వతంగానూ ఉండవు. ఎప్పుడు అనుకూల పరిస్థితులుంటే అప్పుడు అవి ఏర్పడతాయి. ఉదాహరణకు వాతావరణంలోని నీటి బిందువులలోనుంచి తెల్లని సూర్య కాంతి కిరణాలు ప్రయాణించినపుడు ఆ నీటి కణాలు పట్టకం (Prizm) లా కాంతిని విశ్లేషించే కారణంగా తెల్లని సూర్య కాంతిలోని వివిధ తరంగ దైర్ఘ్యాలు(Wave Lengths) కలిగిన ఏడు రంగుల కాంతితో కూడిన ఇంద్రధనుస్సు ఆకాశంలో సూర్యునికి వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది.

కిన్నర (కిం - నర; నరుడా ఏమి?) అంటే మానవ శరీరం, అశ్వముఖం కలిగిన ఊహాజనితమైన వ్యక్తి. కిన్నర పేరుగల ఒక వాద్య పరికరం (lute) తో కిన్నరలు సంగీత  ప్రియులకు వీనుల విందు చేసేవారట. కిన్నర గణానికి యక్షరాజైన కుబేరుడే అధిపతి. అందుకే కుబేరుడికి ‘కిన్నరేశుడు’ అనే పేరుంది. కింపురుష (పురుషుడా ఏమి?) గుర్రం శరీరం మనుష్యుడి తల కలిగిన మరో ఊహాజనిత వ్యక్తి. ఈ గణానికి కూడా కుబేరుడే అధిపతి అయిన కారణంగా కుబేరుడికి ‘కింపురుషేశ్వర’ అనే మరో పేరు ఏర్పడింది. గ్రీకు పౌరాణిక గాథలలోనూ ఇలాగే వివిధ జంతువుల శరీరభాగాల అసహజ సమ్మేళనం కారణంగా ఏర్పడిన సెంటార్ (Centaur), శాటిర్(Satyr), కిమేరా(Chimera) వంటి ఊహాత్మక పాత్రలుంటాయి. శాస్త్రీయ దృష్టితో చూస్తే ఈ కిన్నర, కింపురుషులు గుర్రపు బొమ్మ తలలు, కొమ్ముల శిరోవేష్ఠనములు వంటివి ధరించి, కుబేరుడి యక్షగాన బృందాలలో నాటి ప్రజలకు సంగీత, నాట్య వినోదాలు పంచిన సంగీతోపజీవులైన ఆటవిక జాతులవారై ఉండే అవకాశముంది. హిమాచల ప్రదేశ్ రాష్ట్రంలో నేటికీ కిన్నార్ (Kinnaur) పేరుతో ఒక రాష్ట్రం ఉంది. ఇప్పటికీ అక్కడి ఒక ఆదిమజాతి ప్రజలను కిన్నరలు అనే అంటారు.

ప్రకృతిలో ఒక జీవి పునరుత్పత్తి (Reproduction) అనే జీవ ప్రక్రియ ద్వారా మరో జీవికి జన్మనిస్తుంది. అత్యంత ప్రాయికమైన ఏక కణ జీవుల మొదలు అత్యంత అభివృద్ధిచెందిన మానవుని వరకు సకల జీవజాలంలో పునరుత్పత్తి ప్రక్రియ ద్వారానే నూతన జీవావిర్భావం జరుగుతున్నది. అయితే ఈ పునరుత్పత్తి ప్రక్రియలో లైంగిక (sexual) మరియు అలైంగిక (asexual) పునరుత్పత్తి అనే రెండు తరహాలున్నాయి. ఏక కణ జీవులైన అమీబా వంటి జీవులలో కణవిభజన ద్వారా పునరుత్పత్తి ప్రక్రియ జరిగి, ఒక జీవకణం రెండుగా విడిపోయి కొత్త జీవి ఏర్పడుతుంది. ఈ తరహా పునరుత్పత్తిని అలైంగిక పునరుత్పత్తి అంటారు. ప్రత్యేకించి జననాంగాలు ఏర్పడని బాక్టీరియా, వైరస్ లు, హైడ్రా(Hydra), ఈస్ట్ (Yeast) వంటి ప్రాయికమైన జీవజాలంలో మొలకెత్తు (బడ్డింగ్, Budding) అనే అలైంగిక ప్రక్రియ ద్వారా పునరుత్పత్తి జరుగుతుంది. చాలా వృక్షాలు లైంగిక ప్రక్రియద్వారా మాత్రమే కాక అలైంగిక పద్ధతులలోనూ పునరుత్పత్తికి అలవాటు పడ్డాయి. చీమలన్నీ లైంగిక ప్రక్రియ ద్వారా గుడ్లు పెట్టి తద్వారా పునరుత్పత్తి చేసుకుంటుంటే మైకోసెప్యురస్ స్మితీ ( Mycocepurus smithii) అనే శాస్త్రీయనామం కలిగిన ఒక తరహా దక్షిణ అమెరికన్ చీమ మాత్రం అలైంగికంగానే సంతానాభివృద్ధి చేసుకుంటుంది. ప్రత్యేక జననాంగాలు అభివృద్ధిచెందిన జంతువులలో, ప్రత్యేకించి అత్యంత అభివృద్ధిచెందిన జీవజాతి అయినట్టి మానవజాతి (Homo sapiens) లో అలైంగిక పునరుత్పత్తి ఉండదు. మానవులలో అత్యంత అభివృద్ధిచెందిన స్త్రీ, పురుష లైంగిక అవయవాలున్నాయి. స్త్రీ అండం, పురుష వీర్యకణం కలిసి ఫలదీకరణం జరిగి పిండం  (Zygote) ఏర్పడి, అది స్త్రీ గర్భంలో 9 నెలల పాటు కణవిభజన ప్రక్రియద్వారా పెరిగి, శిశువు శరీర నిర్మాణం పూర్తి అయ్యాక కాన్పులో తల్లి గర్భం నుంచి బయటపడుతుంది. ఫలదీకరణం జరిగాక పిండం పెరుగుదలకు పట్టే సమయం (Gestation period) ఒక్కో జీవజాతిలో ఒక్కో రకంగా ఉంటుంది. ఇది నిర్ధారణ అయినట్టి శాస్త్రీయ సత్యం.

మానవ లైంగిక పునరుత్పత్తి ప్రక్రియను పక్కనబెట్టి ఇక్కడ (1- 31) శ్లోకంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలవారు వరుసగా బ్రహ్మ ముఖము (నోరు), బాహువులు, తొడలు, పాదముల నుంచి పుట్టుకొచ్చినట్లు చెప్పబడింది. ఇది పూర్తిగా అసహజం. అశాస్త్రీయం. దేవతలైతే ఎలా పుట్టారని చెప్పినా, అసలు వారు చావు, పుట్టుకలు లేనివారని చెప్పినా కూడా పరవాలేదు కాని ఇలా బ్రహ్మ శరీరభాగాల నుంచి పుట్టినవారు నాలుగు వర్ణాలకు చెందిన మానవులని చెపుతున్నారు కాబట్టి కనీసం వారి పుట్టుక మానవ జాతి పుట్టుకకు విరుద్ధంగా ఉండకూడదు కదా? బ్రహ్మగా పేర్కొనబడిన వ్యక్తి కూడా ప్రత్యేకమైన నోరు, చేతులు, తొడలు, పాదాలు కలిగిన ఒక అభివృద్ధిచెందిన జీవి అయిన కారణంగా ఈ శ్లోకంలో పేర్కొన్నట్లు ఆయన తన నోటి నుంచి ఒకరిని, బాహువుల నుంచి ఒకరిని, తొడల నుంచి  ఒకరిని, పాదాలనుంచి మరొకరిని ఇలా అలైంగిక పునరుత్పత్తి (Asexual Reproduction) ప్రక్రియ ద్వారా పుట్టించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే బ్రహ్మ తప్పనిసరిగా ఒక అభివృద్ధిచెందిన లైంగిక వ్యవస్థను కలిగివుండే అవకాశముంది. ఇదే బ్రహ్మ తరువాత శ్లోకం (1- 32) లో విరాట్ పురుషుడిని సృష్టించే నిమిత్తం తన శరీరాన్ని తానే రెండుగా విభజించుకుని, ఒక భాగం పురుషునిగానూ, మరొక భాగం స్త్రీ గానూ ఏర్పడి, ఆ రెంటి కలయిక కారణంగా విరాట్ పురుషుడు పుట్టుకొచ్చాడని చెప్పడం చూస్తే మానవ పునరుత్పత్తికి స్త్రీ, పురుష జననాంగాల అవసరం ఉందనే అవగాహన అప్పట్లో మనువుకి కూడా ఉన్నట్లే కదా? (ఇలా ఒకే జీవి శరీరంలో స్త్రీ, పురుష జననాంగాలు రెండూ ఉంటే అలాంటి జీవులను శాస్త్రీయంగా Hermaphrodites అంటారు). మరి నాలుగు వర్ణాల మానవుల పుట్టుక ఇలా అసహజమైన, అశాస్త్రీయమైన పద్ధతిలో జరిగినట్లు ఎందుకు పేర్కొన్నాడు మనువు?- అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఒకవేళ అప్పుడు బ్రహ్మ శరీరభాగాల నుంచి అసహజంగా పుట్టుకొచ్చిన వారంతా అసలు మానవులే కాదంటారా? అప్పుడసలు చిక్కేలేదు. మానవులు కాని వారి కోసం రూపొందించిన ఈ ధర్మసూత్రాలు మానవులకెలా వర్తిస్తాయి? జననం లేక జాతి రీత్యానే ఒకరిని ఎక్కువగానూ, మరొకరిని తక్కువగానూ చిత్రిస్తూ, ఒకరికి అవకాశాలు, మరొకరికి అవమానాలు మిగిల్చిన ఈ ధర్మశాస్త్రాలను మానవసమాజం అసలెందుకు అంగీకరించాలి? అనేది కూడా ప్రశ్నించాల్సిన విషయమే అవుతుంది. మరి స్త్రీ, పురుష సంయోగం కారణంగా మాత్రమే మానవులలో పునరుత్పత్తి జరుగుతుందనే ఎరుక కలిగివుండి కూడా మనువు నాలుగు వర్ణాలవారు ఇలా బ్రహ్మ శరీరంలోని వివిధ అంగాల నుంచి అసహజమైన రీతిలో పుట్టుకొచ్చారని ఎందుకు రాసినట్లు? దానికో కారణం ఉంది.

మనువు ఈ ధర్మశాస్త్రాన్ని రూపొందించడం వెనుక సమాజంలో పని విభజన, ప్రజలకొక శాశ్వతమైన నైతిక, ధార్మిక నియమావళిని రూపొందించడం అనే లక్ష్యాలతో పాటు బ్రహ్మ ముఖం నుంచి పుట్టుకొచ్చిన బ్రాహ్మణులు పుట్టుకరీత్యానే మిగిలిన మూడు వర్ణాల కంటే అధికులనీ. క్షత్రియులు మిగిలిన రెండు వర్ణాల ప్రజల కంటే, వైశ్యులు శూద్రులకంటే పుట్టుక రీత్యానే అధికులనే విషయాన్ని, ఎవరూ ప్రశ్నించలేని విధంగా, తిరుగులేని విధంగా స్థాపన  చేయదలచి ఇలా బ్రహ్మ వివిధ శరీర భాగాలనుంచి ఈ నాలుగు వర్ణాలవారు పుట్టుకొచ్చినట్లు సిద్ధాంతీకరించడం జరిగింది. ఈ నాలుగు వర్ణాల వారు లైంగిక ప్రక్రియ ద్వారా కనుక బ్రహ్మకు జన్మిస్తే వారంతా జాతి (పుట్టుక) విషయంలో సమానులే అవుతారు. ఈ నాలుగు వర్ణాల ప్రజల మధ్య తారతమ్యం, స్థాయీ భేదం కల్పించాలంటే బ్రహ్మయొక్క ఉత్తమాంగం అయినట్టి ముఖము నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి వైశ్యులు, చివరిగా అధమాంగములైనట్టి పాదాల నుంచి శూద్రులు పుట్టుకొచ్చినట్లు సిద్ధాంతీకరించడం తప్పనిసరి.

నిర్జీవ పదార్థం నుంచి ఒకానొక అనుకూల దశలో జీవ పదార్థమైన ప్రోటోప్లాజం ( Protoplasm) ఏర్పడి, ముందుగా ఏక కణజీవులు, అవి క్రమ పరిణామం చెంది బహుకణ జీవులుగానూ రూపొందాయనీ, వివిధ వృక్ష, జంతు జాతులు ఇలా ఒక క్రమ పరిణామంలో ముందుకు సాగుతూ ఆ క్రమంలో మారుతున్న పరిస్థితులకు  తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యమున్న జాతులు మాత్రమే జీవిస్తూ (Survival of the Fittest),  మిగిలినవన్నీ అంతరించిపోతున్నాయని శాస్త్రజ్ఞులు నిర్ధారణ చేశారు. కాబట్టి ఈ జీవ జాతులన్నీ ఒక్కసారిగా ఎవరిచేతనో సృష్టించబడినవి కావనీ, పరిణామ క్రమంలో అవన్నీ ఒకదాని నుంచి మరొకటిగా ఏర్పడ్డాయనీ శాస్త్రీయంగా రుజువైంది. సంప్రదాయవాదులు విశ్వసించే దైవ సిద్ధాంతానికి ఒక సృష్టి, సృష్టికర్త అవసరం కనుక వారు ఈ పరిణామ సిద్ధాంతానికి శాస్త్రీయంగా ఎన్ని ఆధారాలున్నా దీనిని విశ్వసించరు.

శాస్త్రీయ దృష్టితో పరిశీలిస్తే ఈ మొదటి అధ్యాయంలో చెప్పబడిన సృష్టిక్రమ సిద్ధాంతం పూర్తిగా అశాస్త్రీయమైనదని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటికున్న పరిమితమైన శాస్త్రీయ అవగాహన మేరకు మనువు ఈ సృష్టి క్రమ సిద్ధాంతాన్ని రూపొందించాడు.

ఈ అంశం మీద మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తరువాయి భాగంలో ముచ్చటించుకుందాం.

***సశేషం***

Posted in October 2019, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!