Menu Close
అత్తలూరి విజయలక్ష్మి
దూరం (ధారావాహిక)
అత్తలూరి విజయలక్ష్మి

అనుకున్నట్టే మర్నాడు ఆంజనేయులుని తీసుకుని బయటకు వెళ్లి టాబ్ కొంది అక్కడి నుంచి పార్క్ కి తీసుకుని వెళ్లి “వాక్ చేయి తాతయ్యా.. నేను కూడా కాసేపు వాక్ చేస్తాను” అంది.  చేతిలో హ్యాండ్ స్టిక్ తో నెమ్మదిగా నడుస్తున్న తన వయసు వాళ్ళను చూస్తూ ఆయన కూడా నడక మొదలుపెట్టాడు. స్మరణ బ్రిస్క్ వాక్ చేస్తూ పార్క్ మరో చివరకు వెళ్ళింది . తిరిగి వచ్చేటప్పుడు చెప్పాడు...

“ఇవాళ నీ శిక్షణ మొదలుపెడతావా..!”

“ఓ... డిన్నర్ అవగానే చేద్దాము..”

“అలాగే... కానీ అమ్మకి, నాన్నకి ఇప్పుడే చెప్పకు.. నేను పర్ఫెక్ట్ అయాక చెప్పు.. సరేనా.. వాళ్ళు పడుకున్నాక నేర్చుకుంటాను” అన్నాడు.

నవ్వింది స్మరణ... “సిగ్గుపడకు తాతయ్యా.. ఈ వయసులో నీకు ఈ ఆలోచన రావడమే గ్రేట్..ఇందులో తప్పేమీ లేదు..”

ఆయనకీ అదే అనిపించింది. “అవును తప్పేమీ లేదు.. కానీ... ఏదో జంకు... మొహమాటం... నిజానికి వృద్ధాప్యం శాపం కాదు.. వృద్ధులంటే పాతబడిన వస్తువు కాదు... గతానికి, వర్తమానానికి వారధులు.. వృద్ధులంటే అనుభవాల వృక్షాలు... ఆ నీడలో సేదతీరుతూ, ఆ ఫలాలను అనుభవిస్తూ, కొత్త చిగురు వేయించే వాళ్ళు యువత.. నిట్టూర్చాడు.

ఇంటికి రాగానే డిన్నర్ అయిపోయాక వంటగది సర్దుకుని, మావగారికి మంచినీళ్ళ బాటిల్, గ్లాసు గదిలో పెట్టింది సంధ్య. “మావయ్యా... కూజా పెట్టలేదు.. మీరు నిద్రమత్తులో పడేసుకుంటారు. ఇదిగో బాటిల్ పెట్టాను.. ఏమన్నా కావాలంటే లేపండి.. మొహమాట పడకండి.. మీరు ఇబ్బంది పడకండి..” చెప్పింది.

“అలాగే తల్లి.. నువ్వు పడుకో” అన్నాడు. సంధ్య స్మరణకి, ఆయనకీ గుడ్ నైట్ చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది.

స్మరణ పక్కకు వెళ్లి కూర్చున్నాడు. కంప్యూటర్ శిక్షణ మొదలైంది. ముందు బాగా బిడియంగా అనిపించింది.. కానీ, గూగుల్ గురించి, ఫేస్ బుక్ గురించి స్మరణ చెప్పిన విషయాలు గుండెల్లో అలజడి రేపుతుంటే ఎలాగైనా కంప్యూటర్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకాలం ఓ విషాద వీచికలా గుండెని స్పృశించి వెళ్ళే ఆశలు కొత్త చిగుళ్ళు వేయసాగాయి.. అణగారిన ఎన్నో కోరికలు కెరటాల్లా.. ఉధృతంగా లేచి ఆ చివుళ్ళ మీద నీళ్ళు చిలకరించి వెళ్తున్నాయి.

నిజంగా స్మరణ చెప్పినట్టు కంప్యూటర్ కి అంత శక్తి ఉంటె తను కోల్పోయిన జీవితంలోని అతి ముఖ్యమైన వ్యక్తిని ఒక్కసారి, ఒక్కసారి ఈ చివరి రోజుల్లో కలుసుకునే అదృష్టం కలిగిస్తుందా? స్మరణ కి ఆ పేరు చెప్పి వెతకమని చెప్పచ్చు.. కానీ, ఎదిగిన మనవరాలికి ఒకనాటి నా ప్రేయసిని వెతికి పెట్టు అని ఎలా అడగడం! ఎంత అవమానం! నవ్వుతుందేమో! నీకు ప్రేమకథ ఉందా తాతయ్యా! ఈ వయసులో నీకు గర్ల్ ఫ్రెండ్ ఏంటి? అని ఎగతాళి చేస్తే.. అవును ఎగతాళి.. యవ్వనం జారిపోయాక ప్రేమ ఎగతాళే అవుతుంది. వృద్ధులు కూడా యవ్వనం అనే నది దాటి వచ్చారని చాలా మంది అనుకోరు...ఆయన వయసు, అభిమానం ఆ విషయంలో మనవరాలి సాయం అడగడానికి అడ్డుపడ్డాయి. కాలక్షేపానికి కాలక్షేపం అవుతుంది.. కొత్త విద్య నేర్చుకున్నట్టు ఉంటుంది.. తన మాలతిని వెతుక్కుని ఇన్నేళ్ళ తరవాత ఈ ఫేస్ బుక్ ద్వారా కలుసుకోవడంలో ఉండే మధురమైన అనుభూతిని పొందడం ఎంత గొప్పగా ఉంటుంది!

గతంలో లేత వయసులో విరబూసిన ప్రేమ పారిజాతాలు మనసులో ఇంకా పరిమళిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిమళాలను ఆస్వాదించే అవకాశం ఈ కంప్యూటర్ కల్పిస్తుందన్న నమ్మకం, ఆస ఆయన్ని కర్తవ్యోన్ముఖిడిని చేసినట్టు కొత్తగా ఉత్తేజితం అయిన మనసుతో, కొత్త, కొత్తగా పుంజుకున్న శక్తితో, మనవరాలి శిక్షణలో రెట్టించిన ఉత్సాహంతో పగలూ, రాత్రి సాధన చేయడం మొదలుపెట్టాడు.

ముందు బేసిక్స్ తో మొదలుపెట్టింది. మౌస్ అంటే ఏమిటి? ఆపరేషన్ సిస్టం ఏమిటి? మౌస్ ఎలా పట్టుకోవాలి.. ఎలా ఆపరేట్ చేయాలి? డెస్క్ టాప్ అంటే ఏమిటి? లాప్ టాప్ కి డెస్క్ టాప్ కి తేడా ఏంటి? ఎం ఎస్ వర్డ్ అంటే ఏంటి? డేటా అంటే ఏంటి? ఫైనల్ గా ఇంటర్నెట్, అందులో గూగుల్ సెర్చ్ ఎలా చేయాలి? దొరికిన ఇన్ఫర్మేషన్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి? ఎలా సేవ్ చేసుకోవాలి? ఫేస్ బుక్ దాని ఉపయోగాలు, నష్టాలు.. సరిగ్గా పదిరోజుల్లో ఆయనకీ కంప్యూటర్ పట్ల అంతులేని ప్రేమ, ఆసక్తి కలిగాయి.

పగలు అందరూ బయటకు వెళ్ళాక స్మరణ రూమ్ లో కూర్చుని ఆమె కంప్యూటర్ ఆపరేట్ చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్నెట్ ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుని అందులో లీనమై పోయాడు.

అయితే, ఆ ఉత్సాహం ముందు కోల్పోయినదేదో పొందాలన్న ఆరాటం ముందు ఆయనకీ తన చిన్నతనంలోని కాలమాన పరిస్థితులు, ఆనాటి మాధ్యమాల తీరుతెన్నులు, తను కోల్పోయిన అనురాగమూర్తి సాంఘిక, వ్యక్తిగత, ఆర్ధిక పరిస్థితులు ఏమి గుర్తు రాలేదు.. ఈ ఆధునిక, సాంకేతిక విద్య ద్వారా జీవిత సంధ్యా సమయంలో ఏదో పొందాలనే తపనతో ఎంతో ఏకాగ్రతతో, ఆశతో పట్టుదలతో అందులో లోతులు చూడడానికి కృషి చేస్తున్నాడు.

గూగుల్... గూగుల్... గూగుల్.... ఓపెన్ అవగానే గనులు తవ్వి, నిధులు బయటకు తీసిన ఆర్కియాలజిస్ట్ లా అనిపించింది. వణుకుతున్న వేళ్ళతో సెర్చ్ బాక్స్ లో మా ల తి ... అని టైపు చేసాడు.

మాలతి గైనకాలజిస్ట్, మాలతి డ్యాన్సర్, మాలతి సోషల్ వర్కర్, మాలతి ఆథర్, మాలతి ఎంటర్ ప్రేన్యూర్, మాలతి పి. హెచ్. డి, ఎం.బి.ఎ .... మాలతి....

కాదు ... ఇవేవి కాదు.. మాలతి ఒక సామాన్యురాలు... ఒక ప్రేమ మూర్తి, ఒక మధురభాషిణి, ఒక సేవకురాలు, ఒక స్నేహితురాలు, ఒక ముగ్ధ, ఆ మాలతి కావాలి.. వీళ్ళంతా నాకు అవసరం లేదు.. నా మాలతి, నా ప్రాణానికి ప్రాణం అయిన మాలతి, అమాయకంగా చూసే బెదురు కళ్ళ మాలతి, అందమైన నడుం ఉన్న మాలతి, పల్లె పదాలు మధురంగా పాడే మాలతి కావాలి.. గోదారి నది మీంచి  చల్లగా, హాయిగా తేలి వచ్చే పిల్లగాలి  మాలతి...ఎక్కడుంది మాలతి?

“నీ స్నేహితులు ఎక్కడి వాళ్ళో, ఆ ఊరు పేరుతొ కూడా సెర్చ్ చేసుకోవచ్చు..” స్మరణ మాటలు చెవుల్లో అమృతం పోస్తున్నట్టు వినిపించాయి.

అవును అలా చేయచ్చు... మాలతి పేరుతొ ఈ ప్రపంచంలో చాలా మంది ఉండి ఉంటారు.. కానీ నర్సాపురం మాలతి మాత్రం ఒక్కతే ..కీ  బోర్డ్ మీద వణుకుతున్న ఆయన చేతి వెళ్ళ మీద నుంచి కొన్ని అక్షరాలు తొణికాయి... నర్సాపురం..

నర్సాపురం అని టైపు చేసాడు. ఊరు కదిలి కళ్ళ ముందుకు వచ్చినట్టు అనిపించింది. ఆయన చదువుకున్న కాలేజీ, బస్ డిపో, రైల్వే స్టేషన్ అన్నీ అద్దం మీద రాలుతున్న మువ్వల్లా మృదువైన శబ్దం చేస్తూ ఆయన కళ్ళ ముందు కదిలాయి. ఆ ఊరితో ఆయనకీ ఉన్న అనుబంధం, మమత ఉప్పొంగి ఉరికే గోదారే అయాయి.. ఒకటొకటే జ్ఞాపకం స్మృతుల ఖజానా నుంచి వెన్నెల చుక్కల్లా  జారిపడసాగాయి. ఎంబెర్మెనార్ దేవాలయం, అంతర్వేది తీర్థం, స్నేహితులతో కలిసి సరదాగా గోదావరి దాటి మూడు మైళ్ళ దూరంలో ఉన్న సముద్రం దగ్గరకి చేపలు పట్టడానికి వెళ్ళిన నాటి చాపల్యం .. అలలు, అలలుగా, తెరలు, తెరలుగా గుర్తొస్తుంటే ఒళ్ళంతా తెలియని మధురమైన ప్రకంపనలతో నిండిపోయింది.

అనుభూతులు లేని దాంపత్యం, గమ్యం లేని ప్రయాణం, లక్ష్యం లేని జీవితం ఎందుకు? అందమైన దాంపత్యం అంటే జీవితాంతం ప్రేమలో పడడం... అసలు ప్రేమే లేకపోతే! ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకోలేకపోయినా, పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమించడానికే ప్రయత్నించాడు. కానీ హక్కులు, అధికారాలు తప్ప, ప్రేమానురాగాల నిర్వచనం తెలియని ఆవిడని ప్రేమించలేక మనసుని శిలగా మార్చుకున్నాడు. యవ్వనంలోని ఆశలు, అనుభూతులు మూడుముళ్ల బంధంతో దహించుకుపోగా, ఒక్కో అనుభూతినీ ఒక్కో సమిధలా అగ్నికి ఆహుతి చేస్తూ, ఏడడుగుల్లో డబ్భై ఏళ్ల జీవితాన్ని అనుభూతి రహితంగా, రసహీనంగా గడిపాడు. ఏ మాత్రం ప్రేమానురాగాలు లేని వైవాహిక జీవితంలో యాంత్రికంగా ముగ్గురు పిల్లలకు తండ్రి అయి, ఇప్పటిదాకా కేవలం నడిచే రోబోలా బతికిన ఆంజనేయ ప్రసాద్ మనసులో భస్మమై పోయిన ఆశలు, అనుభూతులు రేణువుల్లా గాలిలో తేలుతూ ఆయన ముందు ఓ ఆకారంగా రూపు దిద్దుకున్నాయి. హృదయపేటికలో నిక్షిప్తం చేసిన అనేక స్మృతులు వేయిరేకుల కమలంలా ఒక్కో రేకే విప్పుకుంటుంటే ఆక్షణంలో కంప్యూటర్ ఆయన కంటికి అమృత కలశం అందిస్తున్న దేవకన్యలా కనిపించింది.

మాలతి... మాలతి ఆయన పెదవులు పదే, పదే ఉచ్చరించాయి. ఆయన గుండెల్లో నర్సాపురం నగారా మోగింది.

ఆయన చేతిలో మౌస్ నాట్యం చేస్తున్నట్టు కదలసాగింది. నర్సాపూర్ చరిత్ర, భౌగోళిక స్థితి, అక్కడి విద్యాలయం, కొత్తగా వెలసిన విశ్వవిద్యాలయం... నా నర్సాపురం ఎవరు ఆవిష్కరించారిందులో అనుకున్నాడు. కచ్చితంగా మాలతిని కూడా ఇందులో చేర్చి ఉండాలే.. గూగుల్....గూగుల్...మాలతిని చూపించవూ! “నీకేం కావాలన్నా గూగుల్ ని అడిగితే  చూపిస్తుంది తాతయ్యా!” స్మరణ స్వరం మావిడి చెట్టుమీద ఆగి, ఆగి కూస్తున్న కోయిల గొంతులా వినిపిస్తోంటే... ఆయన మరింత ఆత్రంగా వెతకసాగాడు.. సెర్చ్.. సెర్చ్.. అన్వేషించు... అన్వేషించు... కనిపిస్తుంది... అదిగో గోదావరి కెరటాల మీద వాలిన ఇంద్రచాపం మాలతేగా.. పచ్చిక మీద వాలిన తెల్లని కొంగల వెనుక పరుగులు పెడుతున్నది మాలతేగా... అవును.. మాలతే!

మనవరాలు నేర్పించిన ఆధునిక, సాంకేతిక విద్య ద్వారా యాభై ఏళ్ల క్రితం దూరం అయిన ప్రియసఖి కోసం ఆయన శక్తినంతా కూడదీసుకుని అన్వేషణ ప్రారంభించాడు. అయిపొయింది.. జీవితం అయిపొయింది.. జీవనది చివరి ఒడ్డున నిలబడ్డాడు.. ఏ క్షణం అయినా ఆ నదిలో మునిగిపోవచ్చు... మునిగే ముందు ఒక్కసారి.. ఒక్కసారి మాలతిని చూడగలిగితే! అవును చూడగలిగితే! లేసు అల్లుతున్న మాలతి లేత చేతివేళ్లు కీ బోర్డు మీద దరువు వేస్తున్నట్టు అనిపించసాగింది.

“మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను కూడా దొరసానినవుతాను కదూ బాబుగారూ!”

అమాయకమైన స్వరం చెవుల్లో ప్రతిధ్వనించసాగింది. యాభై ఏళ్ల నుంచీ అది ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయిన తన అశక్తతకి ఇన్నేళ్ళ నించీ మౌనంగా దుఃఖిస్తూనే ఉన్నాడాయన. ఇప్పుడా దుఃఖం పైకి ఎగసిపడడానికి తహ, తహలాడుతోంది. కానీ గొంతుపెగలడం లేదు.. కళ్ళు మాత్రం కన్నీటి చెలమలయాయి.

“మాలతి అనే పేరు కేవలం తెల్ల కాగితం మీద సరదాకి గీసుకున్న బొమ్మ అనుకున్నాను... నా గుండె మీద పచ్చబొట్టు అవుతుందని ఊహించలేదు మాలతీ! అదేమి చిత్రమో నిన్ను వదిలి వెళ్ళేటప్పుడు తప్పు చేస్తున్నానేమో అని సిగ్గుపడ్డానే కానీ, తప్పించుకున్నానని తరువాత అర్థమైంది.. అర్థమయేసరికి లంగరు లేని నావ అయింది నా బతుకు.. సుఖం, ఆనందం అనే రెండు పదాలకి నిర్వచనం తెలుసుకోకుండానే జీవితం ముగిసిపోవడం కన్నా విషాదం ఏముంది?” నిట్టూర్చాడు.

కంప్యూటర్ ముందు నుంచి లేచి తన గదిలోకి వెళ్ళాడు. తలుపు దగ్గరగా లాగి మంచం మీద వాలిన ఆయన కనురెప్పల మీద  కాలచక్రం నడుస్తూ వెనక్కి వెళ్ళింది.

****సశేషం****

Posted in January 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!