ఎక్కడ చూసిన ఆందోళన సెగలు
ఎక్కడ చూసిన ఆవేదన గుబులు
ఎక్కడ చూసిన అధికార వగలు
అన్నీ చివరకు రుద్రవన పొగలు
నీ ఆటకు నీవెసాటీ భళా సదాశివా...
ఎక్కడ చూసిన మోసాలు
ఎక్కడ చూసిన నేరాలు
ఎక్కడ చూసిన ఘోరాలు
అన్నీ చివరకు బూదై నీ ఒంటిపాలు
నీ ఆటకు నీవెసాటీ భళా సదాశివా...
జలాలకై జగడాలు
భూములకై కొట్లాటలు
పదవులకై పోట్లాటలు
ఇవన్నీ నువ్వు ఆడే ఆటలు...
నీ ఆటకు నీవెసాటీ భళా సదాశివా...
ఆహా... సూర్యుడు
ఎంత అదృష్టవంతుడు
తన కిరణాలతో...
ప్రకృతి పువ్వులతో
ఏకాంబేశ్వరుడికి అభిషేకం చేస్తున్నాడు
ఎవరితో ఏమైనా చేయించగలవు శంకరా...
నీ ఆటకు నీవెసాటీ భళా సదాశివా...
జ్ఞానికి అంతటా ఉన్నావు
విజ్ఞానికి తెలుసుకోవాలన్నా కుతూహలంలో ఉన్నావు
అమాయకుడికి ఎక్కడో ఉన్నావు
అజ్ఞానికి నువ్వే లేవు
మనిషి ఒకటే మనసు వేరు
భూమి నీ ఆట స్థలం కదరా...
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
కష్టమిస్తావో
నష్టమిస్తావో
సుఖమిస్తావో
దుఃఖమిస్తావో నీ ఇష్టమయ్యా
ఏది ఇచ్చిన నీ ప్రసాదమే
నీ దారిలో నడిచే నన్ను మాత్రం
దారి తప్పించకయ్యా
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
ఓ కోకిలను పంపావు
జనారణ్య చెవులలో తేనె పాటను పోశావు
ఆ కోకిలనే తీసుకెళ్ళావు
జనారణ్య మనసులో ఆవేదన రాశినిపోశావు
ఎప్పుడు దేనిని పంపుతవో...?
ఎప్పుడు దేనిని తీసుకెళ్ళుతవో...?
ఎప్పుడు దేనిని పోస్తవో...?
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
లాలనలో అమ్మవి
పాలనలో నాన్నవి
ఆత్మ నెరిగిన వాడికి బిడ్డవి
ప్రపంచాన్ని పోషించే బంధువువి
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
నువ్వేమి శివుడవయ్యా
ఎంత పిలిచిన ఉలకవు పలకవు
నీ కన్నా మేమే నయమయ్యా
నీ శంకు చప్పుడు చెవులపడగానే
ఉలకక పలకక
ఏడు కట్ల మంచమెక్కి నిన్ను చేరుతాము...
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
పొద్దున్న పుట్టిన సూర్యున్ని మాపటికి పండిస్తవు
మాపట్లో పుట్టిన చుక్కల్ని పొద్దున్నే పండిస్తవు
పొద్దు గిద్దు లేక తిరిగే... మనిషినే
వందేళ్ళు ఆడుకుంటవు
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...