తేనెలొలుకు
(ఆలాపన కవితా సంపుటి)
8. వింత మనసు
పక్షులు పాడలేదని
గాలి వూసులు చెప్పలేదని
పుడమికి రంగుల వసంతాన్నిచ్చి లాలించావు
ప్రభో! నీ దెంత నిర్మలమైన మనసు
పగలు సెగలుతో అల్లాడిందని
క్రొత్త సంతోషమిచ్చినట్లు
రాత్రి అనే మేలి ముసుగు మాయగ కప్పావు
ప్రభో! నీ దెంత గొప్ప మనసు
మనసుకు గాయమయిందని
గత స్మృతులు బాధిస్తాయని
మనసుకు మరపు అనే వరానిచ్చావు
ప్రభో! నీ దెంత మంచి మనసు
మనిషి నిను ధిక్కరించాడని
విజ్ఞానంతో విర్ర వీగాడని
ప్రకృతి భీభత్సాల హెచ్చరించావు
ప్రభో! నీ దెంత వింత మనసు