Menu Close
వాయువు
అయ్యగారి పద్మావతీ శ్యామల
కం.
ప్రాణాధారము వాయువు
ప్రాణాయామంబె మనకు బాధల దీర్చున్
ప్రాణము పోయును మాతయె
ప్రాణముగా సాకి బిడ్డపాలన సేయున్
కం.
వాయుతనూజుడు నిత్యము
సాయంబుగ నిలిచి భక్తజనులను బ్రోచున్
కాయమున నిలిచి గాలియె
చేయగ రక్తమును శుద్ధి చేకురు శుభముల్
కం.
చెట్టులు చేమలు మనిషికి
పెట్టు గదా ప్రాణభిక్ష వేగమె గాలిన్
పట్టుగ నాక్సిజను నిలిపి
కట్టు గదా రక్ష రేకు కావగ మనలన్
కం.
తెరచాప పడవలెన్నియొ
కెరటములకు లొంగకుండ కేరింతలతో
వరమగు గాలిని నడుచును
కర మానందమున మత్స్యకారులె వరలన్
కం.
బలమున కొండల దొలుచును
నలు దిక్కుల నల్పపీడనము సృష్టించున్
కలిగించు భీతి జలధిని
అలలే పైకెగయ గాలి యలజడి రేపున్
కం.
గాలికి మిత్రుం డగ్ని స
కాలమ్మున వంటకములె ఘనముగ నమరన్
లాలింతురు బిడ్డల వలె
పాలింతురు భోజనములు వరమే యనగన్
కం.
ఆరోగ్యదాత రోగని
వారణ సేయంగ బ్రాణవాయువు నిచ్చున్
కారుణ్యము తోడ నిలిచి
పేరిమితో బలము కూర్చు పెక్కు విధాలన్
కం.
మొక్కల పెంపకమందున
వెక్కసముగ గాలితెరలు వీవగ విత్తుల్
చక్కగ నాటును వేరొక
ప్రక్కన నభివృద్ధి జెంది ఫలముల నిచ్చున్
కం.
నాదస్వరమును, వేణువు
లూదంగను గాలి, జనుల నూయల లూపున్
సాదరమున స్వరగతులే
మోదంబున నాట్యమాడి మురియగ జేయున్
కం.
గాలియె వాహకుడగుచును
వేలుగ శబ్దముల దెచ్చు వీనుల దాకన్
తేలగ జనములు స్వరఝరి
మేలగు మధురిమల నొలుకు మేనులె మఱవన్
కం.
పచ్చని పొలముల గాలియె
అచ్చెరువుగ బలుకరించి హాయిగ వీవన్
హెచ్చిన యుత్సాహముతో
చెచ్చెఱ నలరించు చేలు చిత్తము లెగయన్
Posted in September 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!