వానవిల్లు (వచన కవిత)
నీలాల మేఘాలు నింగిపై నిండి విడిశాయి
మేఘాల రాగాలు మెండుగా సాగాయి!
చల్లనై గాలు లెల్లెడల చక్కగా వీచాయి -
ఉరుముల దరువున ఊగె శంపాలతలు,
చిటపట చినుకులు వేశాయి చిందులు -
మట్టి వాసనలతో మత్తెక్కె మారుతము,
తన్మయమై తలలూపాయి తరువులు!
తనివితీరగ కురిసి తరలాయి మేఘాలు.
అరుణకిరణాలు చిరుజల్లు అవనికల మాటున
ఆడె ఆనందాన హాయిని దోబూచులాటలు!
సూర్యదేవుని గుర్రాల పోలిక ఏడురంగులతో
అవని అంచులు కలుపుతూ అంబరాన
సొగసుగా అవతరించింది అల్లదిగొ కనుము
వంపు సొంపులతోడ వయ్యారి వానవిల్లు!