Menu Close

Science Page title

ఇది జీవశాస్త్రపు శతాబ్దం!

1

ఇరవయ్యో శతాబ్దం భౌతిక శాస్త్రానికి స్వర్ణయుగం అయితే ఇరవయ్యొకటవ శతాబ్దం జీవశాస్త్రానికి స్వర్ణయుగం కాబోతూంది. ఈ ప్రవచనం నిజం అవునో కాదో నిర్ధారించి చెప్పలేను కాని, ఒకటి మాత్రం నిర్ద్వందంగా నిజం – భౌతిక శాస్త్రపు పరిధి కంటె జీవశాస్త్రపు పరిధి బాగా పెద్దది. ఏ లెక్క ప్రకారం అంటారా? (అమెరికా) ప్రభుత్వం జీవశాస్త్రం మీద పెట్టే ఖర్చు చూసినా, జీవశాస్త్రపు పరిధిలో ఉన్న పనివారి సంఖ్య చూసినా, జీవశాస్త్రంలో మనం చేసే పరిశోధనల వల్ల మనకి వచ్చే లాభాలని లెక్క వేసుకొన్నా – ఇలా ఏ దృక్కోణంలో చూసినా - జీవశాస్త్రం ఇరవయ్యొకటవ శతాబ్దాన్ని ఏలెస్తుందనడంలో సందేహం లేదు. నిజానికి జీవశాస్త్రపు లోతుల్లో ఉన్న రహస్యాలని పరిశోధించి వెలికి తీసుకు రావడం వల్ల కలిగే తాకిడి మన ఆర్ధిక వ్యవస్థనీ, నైతిక దృక్పథాన్నీ, ఆఖరికి మన మనుగడనీ విపరీతంగా ప్రభావితం చేస్తుందనటంలో సందేహం లేదు. నా మాట మీద నమ్మకం లేక పోతె కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో పాఠకులే గమనించగలరు!

ఈ నిజాలన్నిటిని ఆకళింపు చేసుకొని జీర్ణించుకోవటం మొదలెట్టగానే ఒక చిన్న ప్రశ్న ఎదురవుతుంది. భౌతిక శాస్త్రపు పునాదులపై నిర్మించిన సాంకేతిక భవనం పై విజయ కేతనాన్ని ఎగరేసి కంప్యూటర్ల నుండి కెమేరాల వరకూ, విద్యుత్ పరికరాల నుండి విమానాల వరకూ ఎన్నో సదుపాయాలనీ, సౌకర్యాలనీ మనం అనుభవిస్తూన్నట్లే జీవశాస్త్రపు పునాదులపై నిర్మించబడుతూన్న సాంకేతిక సౌధం వల్ల సమకూరే సాధన సదుపాయాలు భవిష్యత్తులో ఏవేమిటి మనం అనుభవించగలం? నన్నడిగితే గత అర్ధ శతాబ్దంలో కంప్యూటర్లని మచ్చిక చేసుకొని అదుపులో పెట్టటం వల్ల సమకూరిన లాభాల కంటె జీవసాంకేతికం (biotechnology) ని మచ్చిక చేసుకోవటం వల్ల సమకూరే లాభాలు అత్యధికం, అనేకం. చరిత్ర పుటలని ఒక సారి పునర్విమర్శిస్తే కాని ఈ వాక్యం యొక్క అంతరార్ధం అవగాహన కాదు.

సా. శ. 1940 దశకంలో మహా మేధావి ఫాన్ నోయిమన్ (von Neumann) కంప్యూటర్ల మీద పరిశోధన మొదలు పెట్టేరు. సాఫ్ట్^వేర్ అనే మాట ఆయన కపోల కల్పితం కాకపోయినా, ప్రోగ్రాముని రాసి, దానిని కంప్యూటరు లోనే దాచి, దాని సహాయంతో కంప్యూటరుని నడిపించాలనే ఊహ ఆయన బుర్రలో పుట్టినదే. ఒక క్రమణిక (program) ని రాసి దాని ద్వారా ఒకే కలనయంత్రం చేత రకరకాల పనులు చేయించవచ్చని ఆయన ఉటంకించేరు. ఇంత మేధావి అయి కూడా అర్ధ శతాబ్దం తిరక్కుండా అరచేతిలో పట్టే కంప్యూటర్లు వస్తాయనిన్నీ, పిల్లలు ఆటలు ఆడుకొనే కంప్యూటర్లు వస్తాయనిన్నీ, ఇంటింటా సొంత కంప్యూటర్లు వెలుస్తాయనిన్నీ ఆయన కలలో కూడ ఊహించ లేదు. ఆయన దృష్టిలో కంప్యూటర్లు అంటే ఒక పెద్ద భవనాన్ని ఆక్రమించే అంత భారీ యంత్రాలే. ‘అమెరికా అవసరాలకి ఎన్ని కంప్యూటర్లు కావలిసుంటుంది?’ అని ఒక పాత్రికేయుడు అడిగితే, ఆయన ఒక నిమిషం ఆలోచించి 18 కంప్యూటర్లు సరిపోతాయని అంచనా వేసేరుట!

గంతలు కట్టిన కళ్ళతో భవిష్యత్తులోకి చూసిన ఫాన్ నోయిమన్ కి కంప్యూటర్లు ప్రభుత్వపు అధీనంలో ఉండే భారీ యంత్రాలులా ఎలా కనిపించేయో, అదే విధంగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూన్న ఈ జీవసాంకేతికం యొక్క భవిష్యత్తు గంతలు కట్టుకున్న మన కళ్ళకి ‘ఇదేదో బహుళజాతి కంపెనీల అధీనంలో ఉండే మహా పరిశ్రమ’ లా కనిపిస్తోంది. ఈస్టిండియా కంపెనీతో కలిగిన అనుభవం వల్ల ఈ బహుళజాతి కంపెనీలంటే మనకి అపనమ్మకమూ, భయమూను. క్రిమికీటకాదులని చంపే గుణాన్ని కలిగించే జన్యు పదార్ధాన్ని “మోన్^సాంటో” (Monsanto) అనే కంపెనీ మొక్కలలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించడమే ఈ సందర్భంలో ఈ భయానికి ప్రేరణ కారణం. జాన్ ఫాన్ నోయిమన్ నీ, ఆయన అనునాయులనీ కూడ ఇలాగే జనాలు అనుమానించేరు. కంప్యూటర్లు గుమస్తాల ఉద్యోగాలు ఊడగొట్టటానికి వచ్చిన మాయదారి యంత్రాలని ఆడిపోసుకున్నారు. ఇప్పుడు కంప్యూటర్ల వాడుక ఒక కుటీర పరిశ్రమలా మారిపోవటంతో కంప్యూటర్ల యెడల ఉండే ఆ భీతి పోయింది. ఇదే విధంగా జన్యు స్థాపత్యం (genetic engineering) కొద్ది బహుళజాతి కంపెనీల కబంధ హస్తాల్లోంచి బయటపడి జనసామాన్యపు చేతుల్లోకి వచ్చినప్పుడు ఈ జన్యు సాంకేతికం మీద అపనమ్మకం మటుమాయమైపోతుందని నా అంచనా.

జన్యు సాంకేతికం కూడ కలన యంత్రాలు తొక్కిన దారి వెంబడే వెళ్ళిన పక్షంలో – అంటే ఒక మహా పరిశ్రమలా కొద్దిమంది చేతులలో కాకుండా, ఒక కుటీర పరిశ్రమలా తయారయిన నాడు – ఈ పరిశ్రమకి కూడ ఒక స్వర్ణ యుగం వస్తుంది. మొన్న మొన్నటి వరకూ బీద దేశంగా మగ్గిన భారత దేశం కంప్యూటర్ల ధర్మమా అని అకస్మాత్తుగా మధ్య తరగతి దేశమైనట్లే, ఈ జన్యు సాంకేతికం కూడ కుటీర పరిశ్రమలా పరివర్తన చెందిన నాడు మన దేశం మరొక అడుగు ముందుకు వేసి సకల ఐశ్వర్యాలతో తులతూగుతుందని జోశ్యం చెబుతున్నాను. ఆ రోజు ఎప్పుడు వస్తుంది? కంప్యూటరు పరిశ్రమ ఊపు ఎలా అందుకుందో అటువంటి పరిస్థితులు మళ్ళా జన్యు సాంకేతికం విషయంలో సమకూడిన నాడు! కంప్యూటర్ల ధర నలుగురికీ అందుబాటు లోకి రావటం, కంప్యూటరు వాడకానికి క్రమణికలు రాయగలిగే ప్రతిభ అందరికీ అవసరం లేకపోవటం, అంతర్జాలం (Internet) అనే రహదారి ద్వారా సమాచారాన్ని ప్రపంచంలో ఒక మూల నుండి మరొక మూలకి లిప్త మాత్రపు కాలంలో పంపగలిగే స్థోమత రావటం – ఈ మూడూ కంప్యూటర్లని కుటీర పరిశ్రమగా మార్చటానికి తోడ్పడ్డాయి. ఈ రకపు త్రివేణీ సంగమం వల్ల జీవసాంకేతిక (biotechnology) రంగంలో వినియోగదారులకి అనుకూలమైన స్నేహశీల (user-friendly) వాతావరణం వచ్చిన నాడు జరుగుతుంది.

%%% సశేషం %%%

Posted in July 2020, Science

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!