Menu Close
ప్రకృతి వరాలు పుష్పాలు
ఆదూరి హైమావతి

మందారం పువ్వు

Hibiscus Flower

మందారం అనేది ఒక అందమైన పువ్వు. భగవంతునికి అర్పించే ముఖ్యమైన పూలలో ఇది ఒకటి. మందారం భాగవతంలో విశిష్టస్థానం సంపాదించింది.

మందార మకరంద మాధుర్యమునఁ దేలు;
మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు;
రాయంచ సనునె తరంగిణులకు?
లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు;
కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక;
మరుగునే సాంద్ర నీహారములకు?
నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?"—

అంటాడు పసివాడైన ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశ్యపునితో. కవి పోతన హృదయం ఎంత ఉన్నతమైనదో మనకు ఈ పద్యం ద్వారా గోచరిస్తుంది. ఇంచు మించు ప్రతి తెలుగు వారినోటా ఈ పద్యం వస్తూనే వుంటుంది. చాలా మధురమైన పద్యం.
అలామందారం ఈ గ్రంధంలో ఉన్నత స్థానం పొందింది.

Hibiscus Flowerమందారం ఒక దేశ జాతీయ పుష్పంకూడా.1958 సంవత్సరంలో మలేషియా వ్యవసాయ మంత్రిత్వ శాఖ జాతీయ పుష్పంగా దీనిని నామినేట్ చేసింది.జూలై 28 1960 న, మలేషియా ప్రభుత్వం మందార పువ్వు జాతీయ పువ్వుగా ప్రకటించింది. అలా ఇది ఒక జాతి చిహ్నమైంది. ఈ మందారపుష్పాలు అన్నీ పూలమొక్కలవలె ఒక చెట్టు అందించే అందమైన పూలు.

Hibiscus Flowerఇది మాల్వేసి కుటుంబానికి చెందినది. తూర్పు ఆసియాకు చెందిన పుష్పజాతి ఇది. దీనిని చైనీస్ హైబిస్కస్ లేదా చైనా రోస్ అని కూడా అంటారు. దీనిని ఉష్ణ, సమశీతోష్ణ ప్రాంతాలలో పెంచుతారు. పువ్వులు పెద్దవిగా ఎరుపు, పసుపు, గులాబీ, ఇంక అనేక రంగుల్లో, ఏక దళపుష్పంగానూ, ముద్ద పూవుగానూ కూడ పూస్తాయి. వాసన లేకుండానే తమ ఆకారంతో, రంగుతో మనస్సునేకాక పూజలో దేవునిముందూ ప్రధమస్థానాన్ని అలంకరిస్తాయి. సువాసన లేకుండానే ఆకర్షణీయంగా ఉండేపూలు ఇవి. ముద్ద మందారానికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళులుంటాయి.

అందమైన పుష్పాలైనా ఇవి మకరందాన్ని గ్రోలే కీటకాలు, పక్షుల్ని ఆకర్షించవు, అనేమాట వున్నా వీటి మీద మనం సీతాకోకచిలుకలను చూస్తాం. మా ఇంటి తోటలోని చాలా రకాల మందారాలపై సీతాకోక చిలుకలు వాలడం చూశాం.

Hibiscus Flowerఅంతేకాక పోతన ఊరికే 'మందార మకరంద --'అని చెప్పరుకదా! అంటే మిగతావానిలా ఎక్కువ కీటకాలు రాక పోవచ్చు కానీ వీటి పుప్పొడి కోసమే కాక వీనిలోని మాధుర్యంకోసం సీతాకోకచిలుకలు రావడంకద్దు

అతితేలికైన పువ్వు ఇది, ఆకారానికి పెద్దగా ఉన్నా తేలికైనదీ, సుకుమారమైనదీనీ, చీమలు ఎక్కువగా దీన్ని ఆశ్రయించుకుని వుంటాయి.

వీనిలో చాలా రకాల జాతులు ఉన్నాయి. తెలుపు, పసుపు, కాషాయం, ఇంకా అనేక  రంగులలో పూలు ఉంటాయి.

ఈ చెట్టు నక్షత్రాకార కేశాలతో అన్నికాలాల్లో పెరిగే  పొద. మిగతా పూలలా ఇది ఒక కాలంలోకాక అన్నికాలాల్లో పూస్తుంది. అందుకే భగవంతుని అర్చించేవారు తప్పనిసరిగా తమ ఇళ్ళలో ఈ మందారాలను పెంచుతారు. కొన్నిజాతుల మందారాలు గుట్టగా వస్తే మరికొన్ని చిన్న చెట్టుగా ఎత్తుగాకూడా పెరుగుతాయి.

Hibiscus Flowerమందార పువ్వులు, ఆకులతో వెంట్రులకు ఊడవు. ఆకులను నూరి తలకు అంటుకుని ఒక గంట నానినాక తలంటు స్నానంచేస్తారు. పూలను ఎండబెట్టి కొబ్బరినూనెలో వేసి కాచి తలకు రోజూ రాచుకుంటే వెంట్రుకలు తెల్లబడవు అంటారు. మందార పుష్పాలను పసిఫిక్ ద్వీపాలలో సలాడ్ లో వేసుకొని తింటారుట. ఇందాక చెప్పుకున్నట్లు భారతదేశంలో ఈ పువ్వులు దేవతల పూజ లో ఉత్తమస్థానంలో వున్నాయి. మగువల ముచ్చట ముడులమీద ఒక్క పువ్వు ధరిస్తే ఎంతో అలంకారంగా వుండటమేకాక శుభసూచికము అని అంటారు.

మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ట. ఇవి మన శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి. మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులను కొంతవరకూ నిరోధించవచ్చు.

Posted in June 2020, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!