Menu Close
Ontari Kshanalu title

గాఢ నిద్రలో ఉన్న నేను 'ఏవండీ ఏవండీ' అన్న పిలుపుకి ఉలిక్కిపడి లేచాను. ఏంటి అంటూ చిరాగ్గా మంచం మీదనుండి దిగి హాల్లోకి వచ్చాను. మా ఆవిడ టీ తెచ్చి టీపాయ్ మీద పెట్టి,

‘ఏవండీ తొందరగా తయారవండి. మమ్మల్ని ఎయిర్ పోర్ట్ లో డ్రాప్  చేయాలి. ఫ్లైట్ కి టైం అవుతుంది.’ అంటూ విసురుగా కిచెన్ లోకి వెళ్ళింది.

ఓహ్! ఈ రోజు వాళ్ళని వైజాగ్ ఫ్లైట్ కి డ్రాప్ చెయ్యాలి కదా అని అనుకుని టీ త్రాగి రెడీ అవ్వడానికి లేచాను. వాల్ క్లోక్ వైపు చూసాను. ఫరవాలేదు ఇంకా చాలా టైం ఉంది అనుకుంటూ బాత్ రూమ్ వైపు అడుగులు వేసాను. కాలకృత్యాల కుస్తీ అయ్యాక రెడీ అయ్యి హాల్లో కూర్చున్నాను. మా ఆవిడ మళ్ళీ టీ ఇస్తూ 'మీరు కూడా వస్తే బాగుణ్ణు. టిక్కెట్ ఎలాగూ ఉంది కదా' అంది.

నేను ముఖం దీనంగా పెట్టి 'ఈ టాపిక్ ఇప్పటికే డిస్కస్ చేశాం. నీకు తెలుసు కదా స్ట్రైక్ అవుతుందని. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇంకేమివుంది' అంటూ,

‘మీరు రెడీ నా’ అని అడిగాను. 'ఓ పది నిముషాలు పిల్లలు రెడీ అవుతున్నారు' అంటూ సమాధానం వచ్చింది.

నాకూ వెళ్లాలని ఉంది. ఎన్నో రోజులు ముందు ప్లాన్ చేసుకుని టికెట్స్ బుక్ చేశాం. మా ఆవిడ అక్క కూతురి పెళ్లి వైజాగ్ లో. అలాగే మా ఊరు శ్రీకాకుళం కు కూడా ఫ్యామిలీ తో వెళ్లాలని అనుకున్నాను. ఖర్చు, సెలవులు కలిసొస్తాయి అనుకున్నా. అయితే అనుకోకుండా మా ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు నిరవధిక సమ్మె ప్రారంభించాయి. ఈ పరిస్థితివల్ల నాసెలవు రద్దయింది. నా ప్లాన్ ఫెయిల్ అయ్యింది. అంతర్లీనంగా నా మనసు పాట అందుకుంది "అనుకున్నదొక్కటి అయినది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే ......".

"మేము రెడీ" అంటూ మా పిల్లలిద్దరూ కిందకి వచ్చారు. పెద్దవాడికి తొమ్మిదేళ్ళు, రెండో వాడికి ఏడేళ్లు. "పదండి" అంటూ లగ్గేజ్ ని కార్లో పెట్టాను. టైం చూసుకున్న తరవాత గూగుల్ మాప్ లో ట్రాఫిక్ చూసుకున్న. ఫరవాలేదు నెమ్మదిగా వెళ్లొచ్చు అనుకుని కార్ స్టార్ట్ చేశాను.

మా ఆవిడ ఇంక అందుకుంది. ‘ఇల్లు జాగ్రత్త. అడ్డమైనవాళ్ళని ఇంట్లోకి తీసుకురాకండి. బిర్యానీలు తినకండి మీకసలే అల్సర్. రిటర్న్ టిక్కెట్ కూడా కాన్సల్ చేయలేదు. స్ట్రయిక్ ఆగిపోతే వెంటనే బస్సెక్కేయండి’ ....అలా ..అలా చెప్పుకుంటూ పోతోంది. ఇంత లో ఎయిర్పోర్ట్ టోల్ గేట్ వచ్చింది. ఫాస్ట్ టాగ్ చూపించి ముందుకు కదిలాను.

మా వాళ్ళని దించేసి కార్ ని పార్కింగ్ లాట్ లో పార్క్ చేసి వచ్చాను. సెల్ఫ్ కియోస్క్ ద్వారా చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ ప్రింట్ తీసుకున్నాం. థాంక్స్ టు టెక్నాలజీ. డిపార్చర్ ఎంట్రీ వైపు కదిలాము. నేను మాత్రం గేట్ బయటే ఉన్నాను. మా ఆవిడ ముఖం డీలాగా పెట్టి లోపలికెళ్ళింది. పిల్లలకి ప్రయాణం అంటే పండగ. వాళ్ళు ఆ లోకం లో ఉన్నారు. ఫ్లైట్ టేకాఫ్ టైం వరకు అక్కడే ఉన్నాను. తరువాత ఇంటికి తిరుగుముఖం పట్టాను. నేను ఇంకా ముప్పావు దూరం వచ్చానో లేదో అప్పుడే మా ఆవిడ నుండి ఫోన్, కార్ పక్కకి తీసి ఫోన్ ఎత్తాను "ఏమండీ వైజాగ్ చేరాము" అని. "ఓహ్ గ్రేట్ నేను ఇంటికి చేరేసరికి ఇంకా టైం పడుతుంది వెళ్ళాక చేస్తాను" అని ఫోన్ పెట్టి కార్ స్టార్ట్ చేశాను.

బెంగళూరు ట్రాఫిక్కా మజాకానా. కొంచెం దూరానికి కార్ ని బదులు కాళ్ళను నమ్ముకుంటే తొందరగా వెళ్తాము. ఈ ఊరు సాంకేతిక వలస నిపుణులు, అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో కిట కిట లాడుతూ ఉంటుంది. అందరికీ ఇదో ఉద్యోగ ధామం.  పైగా మహానగరం అందుకే ఇంత ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ సమస్యలు అన్నీ మహానగరాలలో నేడు ఉండేదే. బెంగుళూరులో అది మరీ ఎక్కువ.

కార్ పార్క్ చేసి ఇంట్లోకి అడుగు పెట్టాను. ఇంటికి చేరి తలుపు తియ్యగానే ....ఏదో నిశ్శబ్దం ...ఏదో వెలితి... , ఏదో ఆనందం.... అర్థం కాలేదు. కానీ నిశ్శబ్దం మాత్రం భయంకరంగా ఉంది. పెద్ద ఇల్లు అంతర అంతస్తులు. ఎప్పుడూ పిల్లల అరుపులు మా ఆవిడ విరుపులు తో సందడిగా ఉండేది.

మా ఆవిడకి ఫోన్ చేసి పరామర్శ అయ్యాక వడ్డించుకుని తిన్నాను. ఎక్కడ బయట తింటానో అని వంట మనిషితో వంట చేయించి వెళ్ళింది. ఒంటరిగానే తిన్నాక అలా నడుం వాల్చాను. నిద్రలోకి జారుకున్నాను.  ఫోన్ రింగ్ కి మెలకువ వచ్చింది. మా ఆవిడ ఫోన్. ఇప్పుడు సాయంకాలం సరిగమలు ... అయ్యాక ఫోన్ పక్కన పడేసి టీ పెట్టుకుని సోఫాలో కూర్చున్నాను. ఏవేవో ఆలోచనలు. టీవీ ఆన్ చేశాను ఏదయినా సినిమా చూద్దామని. స్మార్ట్ టీవీ వచ్చాక ఇప్పుడు అన్నీ ఇంట్లోనే చూడడం జరుగుతున్నది.

అటు తిరిగి ఇటు తిరిగి మిధునం సినిమా పెట్టాను. ఆలోచనలు ఎటో వెళ్లాయి. నాకు సినిమా పిచ్చి. డైరెక్టర్ అవ్వాలని కధలు పట్టుకుని ఎందరి దగ్గరకో వెళ్ళాను. కొందరి ఉచిత సలహాతో షార్ట్ ఫిల్మ్ మొదలుపెట్టాను. కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం బాధ్యత నాపై వేసుకుని మొదలు పెట్టాను. అన్నీ అవాంతరాలే. అప్పుడు అర్థం అయ్యింది. "నా కథ రాత నాదే అయినా నా తల రాత నాది కాదు విధాతది" అని.  ఎలాగూ ఎం.టెక్ చేశావు ఉద్యోగం చేసుకోవచ్చుగా అని అందరు అనేవాళ్ళు ఇంత చదివాక ఎందుకులే అని దృష్టి ఉద్యోగం మీద పెట్టి సాధించాను. బెంగళూరు లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం.

ఆర్ద్రత తో సినిమా చూశాను. డిన్నర్ కి బిర్యానీ ఆర్డర్ చేశాను. మా ఆవిడ వద్దన్న మాటలు గుర్తొచ్చినా సరేలే ఒక్కసారే కదా అని లాగించేశాను. టైం పది దాటింది. మా ఆవిడకి ఫోన్ చేశాను. పిల్లలతో మాట్లాడాను. కొంత ఊరట.

సోఫాలో నడుం వాల్చాను. ఏవో ఆలోచనలు. ఏమీ పాలుపోవట్లా. ఒంటరి క్షణాలు ఎందుకో నిర్లిప్తతని తీసుకొచ్చాయి. పిల్లల తో సరదాగా గడపడం అలవాటై దిగాలుగా ఉంది.

సోషల్ మీడియా లో కొంత టైం గడిపినా చిరాకు మాత్రం పోలా. అప్పుడే బయట నుండి లైట్ పురుగు వచ్చింది. తరమడం అవట్లా. తలుపేసాను. మళ్ళీ సోఫాలో చేరబడ్డాను. నా ద్రుష్టి అంతా ఆ పురుగు మీదే ఉంది. అటు తిరిగి ఇటు ఎగిరి గోడ మీద వాలింది. కొద్దిగా దూరంలో బల్లి కనపడింది. అలాగే బల్లి వైపు తదేకంగా చూస్తున్నా. నా ఆలోచనలు అంతుర్యుద్దం చేస్తున్నాయి. పురుగుని కాపాడాలా లేక బల్లి ఆకలి తీర్చాలా అని. నేను అలాగే చూస్తున్న ఎటూ తేల్చుకోక. ఇంతలో బల్లి తన పని తాను కానిచ్చేసింది. ఒక్క క్షణం అయ్యో పురుగుని కాపాడలేదే అని నాకు బాధగా అనిపించింది. అప్పుడే గుర్తొచ్చింది బిర్యానీ తిన్న విషయం. ఎందుకీ అనవసర ఆలోచనలు? ఇప్పుడు అర్థం అయింది ఒంటరి క్షణాలు ఎంత భయంకరంగా ఉంటాయో అని. ఒక్క రోజుకే నేను ఇంతలా ఉంటె??....అప్పుడే మా అమ్మ గుర్తొచ్చింది!.

అందరూ తలో దారి వెతుక్కుని తనని ఒంటరిగా వదిలేశాం. తను ఆ ఇల్లు దాటి ఎక్కడకి రాదు. మేము ఉద్యోగం కోసం ఊరు దాటాం. ఉద్యోగం వదిలి వెళ్ళలేము.

వెంటనే ఫోన్ అందుకున్న, కొన్ని క్షణాలైన ఫోన్లో మాటలతో గడిపేద్దామని.

ఒంటరి తనానికి కొన్ని క్షణాలైనా ఎంతో ఊరట.

**** సమాప్తం ****

Posted in July 2020, కథలు

2 Comments

  1. డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక జ్ఞాపకం లా వుంది కానీ…కథ లా లేదు.
    రచయిత కొంచెం జాగ్రత్త తీసుకుంటే దీనిని
    మంచి కథ గా తీసుకు రాగలరు.రచయితకు
    శుభాకాంక్షలు.
    ___డా కె.ఎల్.వి.ప్రసాద్
    హనంకొండ _506004

    • నరేంద్ర బాబు సింగూరు

      మీ అమూల్యమైన విశ్లేషణకు, సూచనకి ధన్యవాదములు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!