Menu Close
Galpika-pagetitle
గల్పికావని-51 - HELLప్ లైన్ నంబర్ -- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

"సార్ నమస్తే!"

"నమస్తే ఎవరు?"

"నేను సార్ చిన్నా. మీ అభిమాని. ఇంతకు ముందు నాకు మీ పుస్తకాలు కూడా పంపించారు. ఒకాయనకి ఎ పాజిటివ్ బ్లడ్ కావలసొస్తే వెంటనే మీ మిత్రులు ముగ్గురిని పంపించి బ్లడ్ డొనేట్ చేయించారు. గుర్తొచ్చిందా?"

"గుర్తొచ్చింది చెప్పండి."

"మేమిక్కడ కరోనా వ్యాధిసోకినవారికి సేవలందిస్తున్నాం. బియ్యం, పప్పులు, కూరగాయలు, పండ్లు, ఇలాంటివి కొని ప్యాకెట్లు కట్టి వలస కూలీలకి అందిస్తున్నాం."

"వెరీ గుడ్. నేను చెయ్యగలిగిన సహాయం ఏమైనా ఉంటే చెప్పండి. మా ఇంటి దగ్గరే ఫ్రూట్ మార్కెట్ ఉంది. పళ్ళన్నీ చవగ్గా దొరుకుతాయి. రైతుబజారుంది. కూరగాయలు చవగ్గా దొరుకుతాయి. కావాలంటే కొని పంపిస్తాను."

"మీకంత శ్రమ ఎందుకు సార్. అన్నీ మేం చూసుకుంటాం."

"మేం మలక్ పేట గంజినించి సంవత్సరానికి సరిపడా ఒకే సారి బియ్యం పప్పులూ ఉప్పులూ సరుకులూ తెచ్చుకుంటాం. ఇప్పటికిప్పుడు కావాలంటే వంద కేజీల బియ్యం పంపగలను."

"కానీ ట్రాన్స్ పోర్ట్ ప్రాబ్లం కదసార్."

"ప్రాబ్లం ఏమీలేదు. మా వన్నాట్ ఎయిటాయనకి కారుంది. అందులో వేసుకొచ్చేస్తాను. మీ ఎడ్రస్ చెప్పండి."

"అబ్బో చాలా దూరం సార్. ఎక్కడ కొత్తపేట ఎక్కడ లింగం పల్లి. ఎన్ని చెక్ పోస్టులు దాటుకు రావాలో.., పోలీసులు మూడు కిలోమీటర్లు దాటి రానివ్వడం లేదు. ఒకవేళ వస్తే కేసులు బుక్ చేస్తున్నారు. అనవసరమైన రిస్క్ దేనికి సార్."

"మాకు రిస్కేముంది. మీడియా పాసుంటుందిగా. ఎవరూ అడ్డం చెప్పరు. కావాలంటే కెమేరా కూడా తీసుకొచ్చేస్తారు. మీ సేవలన్నింటినీ షూట్ చేసి మంచి కవరేజి కూడా ఇస్తారు."

"మంచిపనులు చెయ్యడమే పెద్ద కవరేజి. దానిముందు ఈ కవరేజి ఎందుకు పనికొస్తుంది?"

"అఫ్కోర్స్ మా టీవీలు వచ్చిన తరవాత సేవల్లో కవరేజీలే తప్ప సేవలుండట్లేదు. ఎనీ హౌ మీ సేవా నిరతికి నా జోహార్లు."

"సార్, జోహార్లతో కడులుపులు నిండవు సార్!"

"ఐతే ఏం చెయ్యమంటారో చెప్పండి."

"నా తరపున మీరు కరోనా రిలీఫ్ ఫండ్ కి కొంత ఫండ్ కలెక్ట్ చేసి పెట్టాలి."

"ఓకే. నానించి ఎంత ఆశిస్తున్నారు?"

"మీకు సాధ్యమైనంత."

"మీరంటూ ఓ ఫిగర్ అనుకుని ఉంటారుగా?"

"అలాంటిదేం లేద్సార్. మీరు ఎంత పంపినా సంతోషమే."

"ఆ ఫండ్స్ మీకెలా పంపించాలి?"

"ఆల్రెడీ మీకు మా సంస్థ అక్కౌంట్ నెంబర్ పంపించాను."

"ఏదో సేవాశ్రమ్ అంటూ వచ్చింది మీరు పంపిందేనా?

"అవున్సార్."

"నిన్నే మా అపార్టుమెంటు తరపున ఇంటికి రెండు వేలు చప్పున ఫండ్స్ కలెక్ట్ చేసిచ్చాం.  ఈరోజు వెళ్ళి మళ్ళీ ఫండ్సంటే ఎవ్వరూ ఇవ్వరు."

"పోనీ మీరైనా మీకు తోచిందివ్వండ్సార్. పోయినసారి అనాధశరణాలయంలో బట్టల పంపిణీ చేసినప్పుడు ఇచ్చారు కదా?"

"అఫ్ కోర్స్ ఇవ్వచ్చు. కానీ నేను రిటైరయిపోయాను."

"అందుకే మీకు తోచినంత ఇమ్మంటున్నాను."

"నేను మీకు పంపిన పుస్తకాల విలువ దాదాపు మూడువేల పైనే ఉంటుంది. అందులో రెండు వేలు నా తరపున ఫండ్ గా మీరే ఇవ్వండి. మిగిలింది డిస్కౌంట్."

"అలా కాద్సార్."

"ఓకే. డిస్కౌంట్ వద్దనుకుంటే ఆ మిగిలిన డబ్బులు నా అక్కౌంట్ లో వెయ్యండి. అక్కౌంట్ నెంబర్ మెసేజ్ పెడతాను."

సేవాశ్రమం ఫేక్ అనే విషయం చిన్నాకి నేను చెప్పలేదు. మీరుకూడా చెప్పకండి. ఎంతైనా లేకలేక దొరికిన రీడర్. అనవసరంగా వదులుకోవడం ఎందుకు?

హృదయం ఉంటే...కధానిక -- పాతూరి అన్నపూర్ణ

"రవీ! నీ భార్య రోజూ ఎక్కడికో వెళ్ళి వస్తోంది. అడుగుదామనుకున్నా. కానీ నాకాపిల్లతో మాట్లాడ బుధ్ధి కావడం లేదు"అంది సరోజనమ్మ.

"ఎక్కడికెళుతుందమ్మా..అందునా ఈ లాక్ డౌన్ సమయంలో..నీదంతా అనుమానం "అన్నాడు రవి.

"అవున్లే! నువ్వు నన్నక నీ పెళ్ళాన్ని అంటావా? ముఖంలో కళ్ళు మాత్రమే కనిపించేలా గుడ్డ కట్టుకుని చేతులకి తొడుగులు వేసుకుని మరీ వెళ్తున్నది అన్నది సంధ్య అత్తగారు సరోజనమ్మ కళ్ళు తిప్పుతూ"

ఈ మధ్య ఏదో గొడవ జరిగి అత్తాకోడళ్ళకు మాటల్లేవు.

"నేను కనుక్కుంటాలే! రోజూ నాకు ఎదో ఒక ఏరియాలో డ్యూటీ వేస్తున్నారాయె.."అన్నాడు పోలీస్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న రవి.

"ఏంటి రోజూ ఎక్కడికో వెళ్తున్నావంట. అమ్మచెప్పింది..బయట పరిస్థితి ఎలావుంది..నీకేమన్నా అయితే ఎలా.. ఇవన్నీ ఆలోచించావా.” అన్నాడు రవి బెడ్రూం లో దిండు కవర్లు తొడుగుతున్న సంధ్య తో.

"అదేనండీ కూరలకో, పిల్లలకు బ్రెడ్ జామ్, బిస్కట్లకో, ఏవైనా పచారీ సామానుకో వెళ్తున్నాను" అంది సంధ్య.

"సరే..జాగ్రత్తగా వుండు..అన్నీ ఒక్కసారి తెచ్చుకో" అన్నాడు రవి.

మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సంధ్య మళ్ళీ బయల్దేరింది.

నోటికి, ముక్కుకు, తలకీ గట్టిగా చున్నీ చుట్టి, చేతులకూ కాళ్ళకూ గ్లౌసులు ధరించింది. పిల్లలిద్దరికీ ఆడుకునేందుకు ఐ పాడ్ ఇచ్చింది.

వెంటనే సరోజనమ్మ రవికి ఫోన్ చేసి విషయం చెప్పింది.

"వస్తున్నా..ఇంటికి దగ్గరలోనే ఉన్నానమ్మా..ఈరోజు నుండి నాకు డే డ్యూటీ కాన్సిల్ చేశారట. రాత్రికి రమ్మన్నారు" అన్నాడు రవి.

దారిలోనే సంధ్య కనిపించింది. ఆమె నడిచి వెళ్తూ ఒక పెద్ద మిద్దె ఇంట్లోకి వెళ్ళింది.

రవి ఆ వీధి చివర్లో ఆగిపోయాడు సంధ్యకోసం కాపు కాస్తూ. అసలు సంధ్య ఈ ఇంట్లోకి ఎందుకు వెళ్ళింది అనుకుంటూ టెన్షన్ పడుతున్నాడు.

ఓ పదిహేను నిమిషాల తర్వాత ఓ పదిమంది ఆడవాళ్ళు తలా ఒక పెద్ద స్టీల్ కాన్ లు పట్టుకుని బయటకు వచ్చారు. వాళ్ళందరూ మెడల్లో ఐ.డి కార్డులు గొలుసుగా వేసుకున్నారు. రవి వాళ్ళకు తెలీకుండా వాళ్ళ వెనకాలే వెళ్ళాడు.

వాళ్ళంతా రెండు మూడు సందులు తిరిగి ఓ వృధ్ధాశ్రమానికి వచ్చారు. బయట పెద్ద చెట్లతో చల్లగావున్నది. ఓ చెట్టుకింద పొడవాటి బెంచి వుంది. దానిమీద ఈ కాన్లన్నీ వరుసగా పెట్టారు. వీళ్ళని చూడగానే ఆశ్రమం లోపలనుండి బిలబిల్లాడుతూ యాభై మంది వృధ్ధులు బయటకు వచ్చారు. శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కుని అందరూ దూరాన్ని పాటిస్తూ లైన్లో నించున్నారు. ఇంతలో ఓ ఇరవైమంది దాకా అనాధ పిల్లలు కూడా బయటనుండి వచ్చారు.

వాళ్ళు తెచ్చుకున్న కంచాలలో అన్నం పెట్టించుకుని కూర, సాంబారు, పచ్చడి, మజ్జిగతో ఆబగా తింటున్నారు. సంధ్య అందరికీ అడిగి అడిగి వడ్డిస్తోంది..ఆమెతో వచ్చిన వాళ్ళు తలా ఒక పదార్ధం వడ్డిస్తున్నారు.

ఇదంతా చూస్తున్న రవికి సంధ్య పై ప్రేమ, గౌరవం పెరిగి పోయాయి.. అతని కళ్ళలో సన్నటి కన్నీటి తెర కదిలింది..సంధ్య చూడకుండా ఇంటికి వచ్చేశాడు.

ఇంటికి తిరిగి వచ్చిన సంధ్య రవిని చూసి అవాక్కయింది. గబగబా బాత్రూం లోకి వెళ్ళి తలారా స్నానం చేసి వచ్చింది. ఫాన్ కింద జుట్టు ఆరబెట్టుకుంటూ అతనేం అడుగుతాడోనని భయపడుతోంది.

నేనే చెప్పేస్తేపోలా అనుకుంటూ నేను అని ఏదో చెప్పబోతున్న సంధ్యతో "నేనంతా చూశాను సంధ్యా. నువ్వెంత గొప్ప పని చేస్తున్నావో తెలుసా. ఈ పరిస్థితులలో ఎందరో బీదా బిక్కీ, అనాధలు, ఎవరూలేని వృధ్ధులకు మీరంతా అన్నంపెట్టి వాళ్ళకు ప్రాణం పోస్తున్నారు. మీ ప్రాణాలను కూడా లెక్క చెయ్యకుండా శ్రమ పడుతున్న పుణ్యాత్ములు మీరంతా..నిన్ను చూస్తే చాలా గర్వంగావుంది అన్నాడు రవి."

"మేమంతా అందరి దగ్గరా డబ్బులు తీసుకొని వాటితో పప్పూ, ఉప్పూ, కూరగాయలు కొని పదిహేను రోజుల నుండీ ఈ పని చేస్తున్నాము. మాకు కలెక్టరు గారు ఐ.డి కార్డులు కూడా ఇప్పించారు. ఇంట్లో చెప్తే అత్తయ్య, మీరు పంపియ్యరని చెప్పలేదు." అంటున్న సంధ్యతో ఎంతో గొప్ప హృదయం నీది అంటూ ఇది నా డొనేషన్ అంటూ జేబులో వున్న రెండువేల రూపాయల నోటు సంధ్య చేతిలో పెట్టాడు రవి..

ఔనా... నిజమే(నా...) -- గౌరీ కాసాల

పొద్దున్న తొమ్మిది కావస్తోంది.

రాధిక, వసంత, వాసు రెండో ట్రిప్ కాఫీ ముగించారు. ఒక ఐదు నిమిషాలు పిచ్చాపాటీ అయ్యాక మెల్లిగా లేవబోయింది వసంత వంటకి ఉపక్రమించాలి కదా! అనుకుంటూ.

"ఉండు ఉండు ఉండు ఇవాళ వంట నేను చేస్తాను బెండి ఫ్రై అన్నావు కదా."

“నేను చేస్తాను లెండి'' అంటూ లేవబోతున్న వసంత చేతులు పట్టి కుర్చీలో కూర్చోబెట్టి

"నేను చేస్తాను. మై హు నా....అని రాగం తీస్తూ వంటింట్లోకి వెళ్ల బోతూ మళ్ళీ వెనక్కి తిరిగి

“ఇవాళ వంట నేనే చేస్తాను. మేము పని చేయలేమేమో అనేకద మీ  ఆలోచన.... అహహా... వంట అంటే అసలు నలుడు భీముడు అంటారు కదా..నాలుగు రకాల అభినయాలూ ప్రదర్శిస్తూ వంటింట్లోకి వెళ్ళి పోయాడు వాసు.

గంటలో... కంచం మీదా స్పూన్ తో కొడుతూ భోజనానికి రమ్మన్నాడు.

లోపలికి వెళ్ళిన వసంత, రాధిక ముగ్ధులయిపోయారు.

డైనింగ్ టేబుల్ ని చాలా చక్కగా అమర్చాడు వాసు. ఖాళీ అయిపోయిన తేనె సీసా లో రంగు నీళ్ళు పోసి చిన్న మొక్క పెట్టాడు. పెద్ద కంచాలు పక్కన చిన్న చిన్న ప్లేట్లలో బెండకాయ కూరని ఆర్టిస్టి క్ గా అమర్చి మధ్యలో పుదీనా రెమ్మలు పెట్టాడు....ఇంకా.. స్టార్ హోటల్ లెవెల్లో అన్నీ అమర్చాడు.

"అబ్బా ఎంత బాగా అమర్చారండీ.... " చేతల్లో చూపించాల్సిన ప్రేమనంతా కారణాంతరాల వల్ల కళ్ళల్లో గుప్పిస్తూ మనోహరంగా నవ్వింది వసంత.

"ఎక్స్లెంట్ బావా" అంటూ వచ్చి కూచుంది రాధిక గూడా.

అలంకారమే కాదు వేపుడు కూడా బాగా చేశాడు వాసు. పప్పు చారు లో వేపుడు నంచుకుంటూ తన్మయత్వంతో తెగ పొగిడేసింది వసంత.

భోజనాలయ్యాక హాల్ లో కూర్చున్నాడు వాసు. వక్కపొడి ఇవ్వటానికి వచ్చి తను అక్కడే కూలబడింది రాధిక.

"మీ అక్క ఏది" అడిగాడు వాసు.

"బట్టలు ఉతుకుతోంది మెషిన్ పాడయిందిగా బావా"

"హు... నన్ను సతాయించడానికే" అని గొణగి.

రాజ్యాలు కొల్లగొట్టిన మహా వీరుడిలా మొహం పెట్టి  ప్రారంభించాడు వాసు. "యు నో రాధికా.. నేను ఏం చేసినా ఆర్టిస్టిక్ గా ఉండాలంటాను. ఇలా చేస్తే ఎంత హాయిగా ఉంటుందో కదా! మీ అక్కా.. ఆ మాటకొస్తే ఆడవాళ్లు..ఎందుకు కాజువల్ గా చేస్తారో నాకు అర్థం కాదు. అసలు... ..

"మీ పెళ్లి అయి ఎన్నాళ్ళయింది బావా...”

మధ్యలో ఆపుతూ అడిగింది రాధిక.

"రెండేళ్ల పైనే అయింది" అన్నాడు. అసందర్భపు ప్రశ్నకి కి విస్తూ పోతూ.

"ఈ రెండేళ్లలో నువ్వు ఎన్నిసార్లు వంట చేశావు బావా". ఈ పిల్లకి వేపకాయంత వెర్రి ఉంది అనుకుంటూ

"ఏం మాట్లాడుతున్నావు రాధీ. ఇప్పుడంటే లాక్ డౌన్ అని ఇంట్లో ఉండిపోయాను గానీ రోజూ 8:30 తొమ్మిది కల్లా ఆఫీస్ కి వెళ్లి పోవాలి నేను."

"శని ఆదివారాల్లో ఎప్పుడన్నా.."

“ఆ రెండు రోజులైనా రెస్టు ఉండద్దా రాధికా” కోపంతో కూడిన నిష్టూరం ధ్వనించింది వాసు గొంతులో.

రాధిక కొంచెం సర్డుకుని గొంతు సవరించుకుంటూ "ఐ యామ్ సారీ బావా. నిన్ను బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. కానీ ఆడవాళ్లని ఎందుకంటావ్. మగవాళ్లు సహాయం చేస్తే అది సహజం. అసలు చేయాలి కూడా ! ఎంత  చదువుకున్నా, మన సాంప్రదాయాన్ని వదలక గొర్రెదాటు లో ఆడవాళ్లందరూ వంటింటికే అంకితమై పోతున్నారు. కానీ, వంట వాళ్ళే.. చేయాలని లేదు కదా. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇద్దరూ కలిసి మెలిసి చేసుకోవచ్చు. మీకు అలవాటు లేకపోతే ఊరు కోవచ్చు.. అంతేకానీ అమవాస కో పున్నమకో  ఓ సారి వంట చేసి ఆడవాళ్ళని వెక్కిరించకండి. ఇళ్లల్లో శుచిగా శుభ్రంగా చేయటమే మనవాళ్లు నేర్చుకుంటారు.

ఈ లాక్ డౌన్ లో జోకులూ ఎక్కువైపోయాయి. ఏదైనా కొంచెం పని చేస్తే చాలు మేము చేశాము అని ఫోటోలు. నిజం చెప్పు ఇవాళ నీకు చేయాలనిపించి చేశావు గాని రోజూ నీకే వంటింటి పని ఉంటే ఇంత లాగా నువ్వు చేయగలవా. నువ్వు చేసినందుకు చాలా సంతోషం.  ఐ రియల్లీ అప్రీషియేట్ ఇట్. నీకు మంచి కళాత్మక దృష్టి ఉంది.

కానీ, అన్నీ విషయాలని అలాగే చూడు.. నిన్నటికి నిన్న నువ్వు వాషింగ్ మిషన్ లో బట్టలు కుక్కి కుక్కి వేశావు. అది ఓవర్ లోడ్ అయి కాలి తగలడింది. లొక్డౌన్ లో రిపేర్ చేయడానికి ఎవరూ రారు.... రోజూ బట్టలు చేత్తో ఉతుక్కోవాలంటే ఎంత కష్టం.. ఆ బాధలో అక్క కొంచం విసుక్కుందని.. అందుకే మీకు సాయం చేయకూడదు అన్నావ్. నీ తప్పుని కప్పి పుచ్చు కుంటూ..ఇప్పుడు అక్క బట్టలు ఉతుకుతోంది అంటే సణుక్కున్నావ్. అ గిల్టీ తో ఇవాళ వంట చేసి” వాసు గబుక్కున లేచి..రాధిక నోరుమూశాడు...

రాధిక తలెత్తి  చూసింది....

వాసు కళ్ళలో నిజమైన అంగీకారం.... కొండొకచో..

పశ్చాత్తాపం...

తృప్తిగా నవ్వుతూ నోటి మీద చేయి తీసి లోపలికి వెళ్ళబోతూ కొంటెగా చూస్తూ "బావగారి లేత మనసు పైకి తేలదు. మాటలకు చేతలకు పొత్తు కుదరదు." పాడుతూ లోపలికి పరుగెత్తింది..

తృప్తిగా నిట్టూర్చాడు రాజు చెరగని చిరునవ్వుతో..

వాసిలి లాక్డౌన్ లుక్ : 2 - జంట బీరలు -- వాసిలి వసంతకుమార్

నేను డైనింగ్ టేబుల్ ముందుకు చేరా (చేరాతల కోసం కాదు లెండి) ... కానీ ఆవిడమాత్రం చరవాణిలో స్థిరవాణి అయిపోయింది ... కిచెన్ లోంచి అమెరికాతో సంభాషణ. రోజూ ఉదయాన్నే ఇద్దరు పిల్లలతో కబుర్లే ఆమెకు ఎ టు జడ్ విటమిన్ టాబ్లెట్స్. నాకేమో కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయ్... అపార్థం చేసుకుని నన్నూ చైనీయుడ ననుకుని అనుమానంగా చూసేరు ... కనీసం మెడలో బంగారు చైన్ కూడా లేదండోయ్, గాడ్ ప్రామిస్ ... అన్నట్టు గాడ్ ప్రామిస్సా... గాట్ ప్రామిస్సా. వో సీక్రెట్ చెప్పనా ఇప్పుడు ఎన్ని ప్రామిస్ లు చేసినా చెల్లవండీ బాబూ... గుడి తలుపులు మూసేసాక దేవతలందరూ రెస్ట్ లో వున్నారు, కాబట్టి మన చూపుల్లో వారి చూపులు పడవు కాక పడవు ... కాబట్టి గాడ్స్ కి మనకి నో లవ్ ఎఫైర్ ... మన మాటలు వారి చెవులను తాకవు కాబట్టి నో టచింగ్స్. సో నో ప్రామిసింగ్స్.

“ఏమోయ్”

“వొక్క పది నిమిషాలండీ ... చిన్నీతో మాట్లాడటమూ అవుతుంది ... ఇడ్లీలూ వుడుకుతాయ్” ఆవిడ మాటలు నన్ను చేరేలోపే ముప్పై ఏళ్ల క్రితమే యముడ్ని పలకరించి వస్తానన్న మా నాయనమ్మ ఇప్పటిదాకా రాకపోగా “పిచ్చి సన్నాసీ ఈరోజు నీకు ఇడ్డెన్లు ఫలహారంరా” అంటూ పలకరించింది. ఆ పలకరింపులోని ఇడ్డెన్లు, ఫలహారం నా కళ్ల ముందు కొచ్చేప్పటికి ఏదో ముంచుకొస్తున్నట్టు కడుపులోని ఎలకలు పరిగెత్తడం కాదు కదా చెప్పా పెట్టకుండా వుడాయించేసాయి.

“ఏవండీ వినిపిస్తోందా” అన్న శ్రీమతి స్వరం చెవిని పడేటప్పటికి రెండో చెవినుండి నాయనమ్మ తప్పుకుంది. ఎంతైనా పెద్దమనవడ్ని కదా నేను ఇడ్డెన్లు తినేవరకూ నన్ను చూస్తూనే వుంటుంది లెండి.

“ఫ్రిడ్జ్ లో రెండు బీరకాయలు వుంటాయి ... తీసి కట్ చేయండి ... ఎండిపోతున్నాయ్” అంటూ పురమాయింపు.

డోర్ తీద్దును కదా ఎక్కడా బీర ఆనవాళ్లు కనిపించలేదు. ‘ఎక్కడా లేవు’ అందామనుకుని, ‘సరిగ్గా కళ్లు పెట్టుకు చూడండి’ అనబోయే భార్యల డైలాగ్ గుర్తొచ్చి మళ్లీ ఫ్రిడ్జ్ లో తలపెట్టా ... ఆమె నోటిలో నోరు పెట్టే కంటే ఇదే బెటర్ అనుకుంటూ. మొత్తానికి ఫ్రిడ్జ్ లో వొణుకుతూ ముడుచుకుని వున్న బొటనవేలంత వెడల్పున్న ఒక బీరకాయ, చిటికెనవేలంత మంద మున్న మరొక బీరకాయ నా కళ్లకు దొరకగా, చేజిక్కించుకున్నాను. శమీవృక్షంపైనుండి తన అస్త్రాలను దింపుకున్న పాండవమధ్యముడిలా ఫీలయి నా విజయగాధకు నన్ను నేనే అభినందించుకున్నాను. నన్ను చూసీచూడకుండా చూస్తున్న ఆవిడ మాత్రం ‘మై పిటీ హజ్బండ్’ అనుకుని వుంటుంది లెండి ... ఆ కథా కమామీషు మరోసారి.

కటింగ్ పాడ్, పీలర్, చాక్ తెచ్చుకుని ఆ ములక్కాడ లాంటి వొక బీరకాయ తలా తోకా కట్ చేసాను ... మునక్కాడ (ల న లకు అభేదం నా గ్లామర్ లాంటి గ్రామర్ లో) లాంటి అద్వితీయ బీరకాయకూ అలాగే తల తీసేసాను. తోక తీద్దామనుకునేప్పటికి ఎండిపోయి నా కత్తి పదునును వెక్కిరించింది. అసలే మగాడ్ని కత్తికి లేని పౌరుషం నాలోకి పరకాయ ప్రవేశం చేసి గోల పెడుతుంటే బీరను సగానికి నరుకుదును కదా ....

(స్టాప్ .. స్టాప్ ... ఆవిడొస్తోంది ...ముందు ఇడ్డెన్లు లాగించేసి... బీరకాయ పనిపడతా.)

ఈ త్యాగమూర్తులను క్షమించకండి -- అత్తలూరి విజయలక్ష్మి

భర్తకీ, పిల్లలకీ  హార్లిక్స్ కలిపి తీసుకువచ్చిన లక్ష్మి భర్త హాల్లో కనిపించకపోడంతో కంగారుగా అడిగింది పిల్లలని ... “నాన్నేరి?”

“అరుగో ఫోన్ మాట్లాడుతున్నారు..” కిటికీలోంచి గేటు దగ్గర ఫోన్ మాట్లాడుతున్నా తండ్రిని చూపించాడు కొడుకు.

లక్ష్మి గ్లాసులు టేబుల్ మీద పెట్టి గాభరాగా అరుస్తూ “ ఏవండి.. బయటకి ఎందుకు వెళ్ళారు? ఎన్నిసార్లు చెప్పాలి గుమ్మం కదలద్దని.. అయ్యయ్యో ముక్కుకి గుడ్డ కూడా లేకుండా... ఆ దిక్కుమాలిన ఫోన్ ఇంట్లో పలకనందా .. రండి ముందు రండి” ఆయాసపడుతూ గట్టి, గట్టిగా అరుస్తూ పిలిచింది. 

ఓ పక్క మాట్లాడుతూనే ఆవిడకి చేత్తో వస్తున్నా ఆగు అంటూ సైగలు చేస్తున్న సూర్యానికి భార్య అరుపుల్లో అవతల వాళ్ళ మాటలు సరిగా వినిపించకపోడంతో విసుగ్గా ఆవిడ వైపు చూస్తూ అవతల వాళ్లకి చెప్పాడు. నేను మళ్ళీ కాల్ చేస్తాను నందా! మా ఆవిడ చిందులు తొక్కుతోంది ... సారీ అంటూ ఫోన్ డిస్ కనెక్ట్ చేసి, లోపలికి వచ్చాడు.. ఏంటే! ఎందుకా చిందులు? ఇంట్లోంచి కదలనివ్వవేంటి..

నేను కాదు ప్రభుత్వం చెప్తోంది.. స్టే హోమ్ స్టే సేఫ్ అని... అయినా ఇప్పుడు మీరు ఎందుకు గేటు దాకా వెళ్లినట్టు.. వీధిలో వెళ్ళేవాడు ఎవడన్నా తుమ్మితే ఎంత ప్రమాదం జరిగేది! 

“మనిషన్నాక తుమ్ములు, దగ్గులు రాకుండా ఉంటాయా.. తుమ్మగానే కరోనా వచ్చినట్టు, వచ్చిన వాడు చచ్చినట్టా..మరీ ఈ నాలుగు గోడల మధ్య బంధించి చంపుతున్నావు..” 

“అవును చంపుతున్నాను. మిమ్మల్ని కాదు.. మీ ఆరోగ్యం కోసం, నా పసుపు, కుంకుమల కోసం ఈ మూడు నెల్ల నుంచి నన్ను నేను చంపుకుంటున్నా.. మీ అందరికీ ఏ లోటూ రాకూడదని, రకరకాల వంటలు చేసి పెడుతూ, ఇల్లు ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తూ గాడిద చాకిరీ చేస్తున్నా.“

“ఎవరు చేయమన్నారు. ఎదురింట్లో వాళ్ళు పనిమనిషిని పెట్టుకున్నారు.. నువ్వు పెట్టుకో వద్దన్నానా...ఇంట్లోకి ఎవరినీ రానివ్వవు, బయటకి ఎవరినీ పోనివ్వవు... ఈ అష్టదిగ్బంధనం ఏంటి. నాకు ఫ్రస్ట్రేషన్ వస్తోంది... అటు చూడు ఒక్కసారి వాళ్ళంతా వాకింగ్ చేస్తున్నారు.. దూరం, దూరంగా ఉంటూ, మాస్క్ వేసుకుని వెళితే ఏమవుతుంది. ఈ మాయరోగం ఇంక తగ్గదు ... అలా అని జీవితాంతం ఇలాగే ఉంటామా?” మండిపడ్డాడు సూర్యం.

“ఇదిగో మాట్లాడకుండా టివి చూస్తూ ఈ హార్లిక్స్ తాగండి.. నాకు వేరేవాళ్ళతో సంబంధం లేదు.. నేను, మీరు నా పిల్లలు అంతే..” 

“నాకొద్దు హోర్లిక్స్” మనసులో కోపం రాజుకుంటుంటే అందుకోకుండా అసహనంగా టి వి వై దృష్టి మరల్చాడు. చైనా కాల్పుల్లో మరణించిన 36 సంవత్సరాల సంతోష్ శవాన్ని పేటికలో పెట్టి తీసుకువస్తున్న జవాన్లు ఒక పక్క, ఆ కుర్రాడి తల్లిని మీ అబ్బాయి కాల్పుల్లో మరణించిన ఈ పరిస్థితుల్లో మీకేమనిపిస్తోంది అని మైకు ఆవిడ ముందు పెట్టి మరీ ఏడిపిస్తూన్న పనికిమాలిన, బుర్రలేని శాడిస్ట్ విలేఖరిని ఒకవైపు చూపిస్తున్నారు. అవతల అతని భార్య కుళ్ళి, కుళ్ళి ఏడుస్తోంది. 

గబుక్కున లక్ష్మి చేయి పట్టి లాగి టివి వైపు చూపించి అన్నాడు. 

“అటు చూడు.. చూడవే.. ఆ తల్లిని చూడు, ఆ భార్యని చూడు..కళ్ళు, చెవులు పని చేస్తున్నాయా నీకు.. టివి దగ్గర కూర్చుని ఒకళ్ళ మీద, ఒకళ్ళు కత్తులు నూరుకునే చెత్త సీరియళ్ళు, వేళ్ళు నాకుతూ, అడ్డమైన వంటలు చూపిస్తూ సొల్లు మాట్లాడే వంట కార్యక్రమాలు చూడడం కాదు.

మనకోసం, మనందరి క్షేమం కోసం, మన దేశాన్ని కాపాడడం కోసం జీవితం సగం కూడా అనుభవించని ఆ వీరుడి మరణం చూడు. ఆ సైనికులను చూడు...వాళ్ళ  కుటుంబాలని , తనవాళ్ళని అందరినీ వదిలి దేశ సరిహద్దుల్లో దిక్కు, మొక్కు లేకుండా పడి ఉండి ... మన దేశాన్ని కాపాడుతున్నారు. ప్రపంచం అంతా ఉన్న కరోనా వాళ్లకు లేదా? మరి ఎవడూ వాళ్ళని అనరేం స్టే హోమ్ స్టే సేఫ్ అని..  మహా, మహా నాయకులం, ప్రజాసేవే పరమార్ధం అంటూ ఏసీ రూముల్లో, పళ్ళ రసాలు తాగుతూ జూమ్ మీటింగులతో పర్యవేక్షిస్తూ, దేశ సేవ చేస్తున్నాం అని చెప్పుకునే సిగ్గులేని నాయకులు వాళ్లకి ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేసారు? ఓ వీరుడా! త్యాగధనుడా! అంటూ దిక్కుమాలిన కవితలు పాడుకోడం తప్ప!”

తట్టుకోలేని బాధతో లక్ష్మి చేయి వదిలేసి సోఫాలో వాలిపోయి కనురెప్పల మీద నిలిచిన కన్నీటి బొట్టు కుడిచేతి చిటికెన వేలితో తుడుచుకుంటున్న సూర్యం కళ్ళకి నిశ్శబ్దంగా హార్లిక్స్ గ్లాస్ తీసుకుని చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ వంటగది వైపు వెళ్తున్న లక్ష్మి మసకగా కనిపించింది.

Posted in July 2020, కథానికలు

1 Comment

  1. డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జంట బీరల వంట ఉదంతం బావుంది.
    ఇడ్డెన లు తిన్న తర్వాత పరిస్తితి ఆ పెరుమా ళ్ళు కే ఎరుక,సూపర్ మీ గల్పిక*
    ___డా కె.ఎల్.వి.ప్రసాద్
    హనంకొండ

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!