Menu Close
manusmrithi page title
రెండవ అధ్యాయము (ఇ)

స్వాధ్యాయేన వ్రతైర్హోమై స్త్రైవిద్యేనేజ్యయా సుతై : |
మహాయజ్ఙైశ్చ యజ్ఙైశ్చ బ్రాహ్మీయం క్రియతే తను : || (2- 28)

వేదాధ్యయనం చేయడం చేత, వ్రతములు, హోమములు చేయడం వలన, త్రైవిద్య అనే వ్రతం ద్వారా (దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణలు సమర్పించడం ద్వారా), శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకొనడం ద్వారా (నేజనమ్ అంటే శుభ్రపరచుకొనడం), పుత్రులను పుట్టించడం ద్వారా, పవిత్రత కోసం గృహస్థు రోజూ చేయాల్సిన పంచ మహాయజ్ఞములు చేయడం చేత, జ్యోతిష్ఠోమము మొదలైన శ్రౌత యజ్ఞములు చేయడం చేత ఈ తనువు బ్రహ్మప్రాప్తికి యోగ్యమైనదిగా చేయబడుతుంది.

దైవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం తీరడం కోసం రోజూ వారికి సమర్పణలు చేయడమే త్రైవిద్య. దేవ యజ్ఞము (హోమము), బ్రహ్మయజ్ఞము (వేదాధ్యయనము), భూతయజ్ఞము (కాకబలి), పితృయజ్ఞము (పిండ తర్పణ క్రియ), మనుష్య యజ్ఞము (అతిథి పూజ) అనేవి ఐదూ ప్రతి గృహస్థు నిత్యం చెయ్యాల్సిన పంచ మహా యజ్ఞములుగా పేర్కొన్నారు. శ్రుతులలో (వేదాలలో) చెప్పబడిన పలు యజ్ఞాలను శ్రౌత యజ్ఞాలు అంటారు. బాహ్య (శారీరక) శౌచము, అంతరంగ (మానసిక) శౌచము శరీరాన్ని మనసునూ ఆరోగ్యంగా ఉంచుతాయని ప్రాచీనుల విశ్వాసం.

ఈ శ్లోకానికి  కుల్లూకభట్టు తన సంస్కృత వ్యాఖ్యానంలో వివరణ ఇస్తూ -
‘బ్రాహ్మీ బ్రహ్మప్రాప్తి యోగ్యేయం తను:’ అనడం, సరస్వతి వేంకట సుబ్బరామ శాస్త్రి తమ తెలుగు వివరణలోనూ - ‘ఈ శరీరము బ్రహ్మప్రాప్తియోగ్యమైనదిగా జేయబడుచున్నది’ అనడం (పేజీ 43) కొంత చిత్రమని అనిపించింది. బ్యూలర్ కూడా తన ఆంగ్లానువాదంలో ‘This human body is made fit for union with Brahman’ అనే ఇచ్చాడు. ఇక్కడ మనకి ఒక ప్రశ్న తలెత్తకపోదు. పరమాత్మలో లీనమయ్యేది (బ్రహ్మప్రాప్తి పొందేది) ఈ శరీరమా? దానిలో ఉన్న ఆత్మా? ‘భగవద్గీత’ లోనూ ‘వాసాంసి జీర్ణాని యథావిహాయ’ (శ్లో. 2 -22) లో ‘చినిగిపోయిన పాతబట్టలను విడిచి మనుజుడు ఇతరములగు కొత్త బట్టలనెట్లు ధరించుచున్నాడో, అట్లే దేహియగు ఆత్మయు శిథిలములైన పాత శరీరములను వదలి, ఇతరములగు క్రొత్త శరీరములను ధరించుచున్నాడు’ అని వివరణ ఇవ్వబడింది. అలాగే జనన మరణములలోనూ, మోక్ష ప్రాప్తి లేక బ్రహ్మ ప్రాప్తి లోనూ అనశ్వరమైన (ఎప్పటికీ నశించని) ఆత్మకే తప్ప నశించిపోయే శరీరానికి ఎలాంటి పాత్ర లేదని చాలా స్పష్టంగా ‘భగవద్గీత’ లో పలు సందర్భాలలో వివరించబడింది. ఆ నేపథ్యంలో చూస్తే  మనువు చెప్పింది వాటికి  కొంత విరుద్ధంగా ఉంది. మన సంప్రదాయ సాహిత్యంలో ఈ తరహా పరస్పర వైరుద్ధ్యాలు ఎన్నో ఉన్నాయి.

నాభిచ్ఛేదనకు పూర్వం (బొడ్డు కోసే ముందు) పురుష శిశువుకు జాతకర్మ చేస్తారు. ఈ సందర్భంగా హిరణ్యము (బంగారము), మధు (తేనె), సర్పిస్ (నెయ్యి) - వీటిని మంత్రయుక్తంగా శిశువు చేత నాకిస్తారు. పదవ రోజు తరువాత పదకొండు లేక పన్నెండవ రోజున గానీ లేక మరేదైనా మంచిరోజునగానీ, ఒక సుముహూర్తములో, సుగుణవంతమైన నక్షత్రమునందు ద్విజునికి పేరు పెట్టి జాతకర్మ చేస్తారు.

నామకరణం

మంగళ్యం బ్రాహ్మణస్య స్యాత్ క్షత్రియస్య బలాన్వితమ్ |
వైశ్యస్య ధనసంయుక్తం శూద్రస్య తు జుగుప్సితమ్ || (2- 31)

బ్రాహ్మణుడి పేరు శుభ వాచకము (మంగళప్రదమైనది) గానూ, క్షత్రియునిపేరు బలవాచకముగా, వైశ్యుని పేరు ధనవాచకముగా, శూద్రుని పేరు నిందితమైనది (జుగుప్స కలిగించేది) గా ఉండాలి.

బ్రాహ్మణుడి పేరు శర్మ శబ్దంతో కూడినదై ఉండాలి. క్షత్రియుని పేరు రక్షా సమన్వితమై ఉండాలి. వైశ్యుని పేరు పుష్టిసంయుక్తమై (భూతి లేక సంపదతో కూడినదై) ఉండాలి. శూద్రుని పేరు  ప్రైష్యసంయుతమై ఉండాలి. (ప్రైష్యమ్ అనే సంస్కృత పదానికి దాస్యము, బానిసత్వము, సేవావృత్తి అని అర్థాలు).  అంటే శూద్రునికి పెట్టే పేరు అతడి దాస్య వృత్తిని సూచించేదిగా ఉండాలన్నమాట.

ఇక్కడ పాఠకులకు కొంత వివరణ అవసరం. ఋగ్వేదంలోని (6 -75 - 19) మంత్రంలో ‘బ్రహ్మ వర్మ మమాంతరమ్’ అని ఉంది. బ్రహ్మ అంటే ఇక్కడ ప్రార్థన అనీ, వర్మ అంటే కవచం (Coat - of - mail) అనీ అర్థం చెప్పి వ్యాఖ్యాతలు ‘ప్రార్థన నాలో ఉండి నన్ను కాపాడే కవచం వంటిది’ అని దీనికి భావం చెప్పారు. సామవేదం లోని 1972 వ మంత్రంలో ‘శర్మ వర్మ మమాంతరమ్’ అని మరో పంక్తి కలపబడి ఉంది. శర్మన్ అంటే ఆధ్యాత్మిక రక్షణ అని అర్థం. వర్మన్ అంటే భౌతిక రక్షణ అని అర్థం. ‘శర్మ వర్మ మమాంతరమ్’ అంటే ఆధ్యాత్మిక రక్షణ నాలో ఉండి నన్ను కవచంలా కాపాడుతున్నది అని భావం. శర్మ అంటే ఆధ్యాత్మిక రక్షణ కల్పించడం ద్వారా శుభం చేకూర్చేవాడు. వర్మ అంటే భౌతిక రక్షణ కల్పించేవాడు. క్షత్రియుడు (క్షతాః త్రాయతే ఇతి క్షత్రియ:) గాయం నుంచి కాపాడి శరీరానికి భౌతిక రక్షణ చేకూరుస్తాడు. కనుక బ్రాహ్మణుని పేరు శర్మ శబ్దంతోనూ, క్షత్రియుని పేరు వర్మ శబ్దంతోనూ కూడి ఉండాలి. ఇక వైశ్యుని పేరు ధనము( భూతి) తో కూడి ఉండాలి. శూద్రుని పేరు మాత్రం సేవావృత్తి సూచకమైన ‘దాసు’ శబ్దంతో కూడి ఉండాలి. ఇక్కడ సరస్వతి వేంకట సుబ్బరామశాస్త్రి తమ వ్యాఖ్యానంలో బ్రాహ్మణులు శుభశర్మ అనీ, క్షత్రియులు బలవర్మ అనీ, వైశ్యుడు వసుభూతి అనీ, శూద్రుడు దీనదాసు వంటి పేర్లు పెట్టుకోవాలని ఉదాహరణలు కూడా సూచించారు.

పురుషుని పేరు వినగానే నాలుగు వర్ణాలలో అతడు ఏ వర్ణానికి చెందినవాడో తేలికగా గ్రహించడానికి మనువు ఏర్పరచిన ఈ నామకరణ నియమాన్ని అనంతరకాలంలో బ్రాహ్మణులతో పాటు అన్ని వర్ణాలవారూ ఉల్లంఘించారు. ధర్మశాస్త్రాలను కాపాడే ధర్మరక్షకులు, ధర్మచ్యుతి కాకుండా చూసే సాక్షాత్ ధర్మ స్వరూపులు అంటూ మొదటి అధ్యాయంలో మనువుచేత ప్రశంసలు పొందిన బ్రాహ్మణులు ధర్మశాస్త్రం విధించిన నియమాలకు చేసిన ఉల్లంఘనలను కొన్నింటిని గురించి మాత్రమే ఈ సందర్భంగా ప్రస్తావిస్తాను. (విష్ణుభట్ల) ఆదిత్య వర్మ, (పి.వి.) నరసింహా రావు, (వల్లూరి) బసవరాజు వంటివి బ్రాహ్మణులు పెట్టుకున్న అనేకమైన క్షాత్ర సూచక నామాలలో నాకు తటస్థించిన వాటిలోని కొన్ని. రామదాసు, తులసీదాసు వంటి దాస్య సూచక నామాలు బ్రాహ్మణులు పెట్టుకోవడం కూడా మనకు తెలిసినదే. ఒరిస్సా లోనూ, తూర్పు, పశ్చిమ పంజాబ్ లలోనూ ‘దాస్’ అనే ఇంటిపేరు బ్రాహ్మణులలోనే ఉంది. అంతేకాదు. కృష్ణ యజుర్వేద తైత్తిరీయ శాఖీయుడు, కాశ్యప గోత్రీయుడు, ఉదుంబర బ్రాహ్మణుడు అయినట్టి సంస్కృత నాటకకర్త భవభూతి మహాకవి
(క్రీ.శ .680- 750) వైశ్య సూచకమైన ‘భూతి’ శబ్దాన్ని తన పేరులో కలిగివుండడం కూడా ఇటువంటిదే. ‘కంచే చేను మేసినట్లు’ ధర్మస్వరూపులని, అన్ని వర్ణాలకూ ప్రభువులనీ మనువుచే కీర్తించబడిన బ్రాహ్మణులు ఈ నియమోల్లంఘన చేసి మిగినవారికి ఆ విషయంలో మార్గదర్శకు లైనట్లుగా ఉంది చూడబోతే.

స్త్రీల పేర్లు సుఖోద్యం (తేలికగా పలక గలిగేవిగా), అక్రూరం (క్రూరమైన అర్థాన్నివ్వనివిగా), విస్పష్టార్థం (విస్పష్టమైన అర్థం కలవిగా), మనోహరమైనవిగా, శుభప్రదమైనవిగా, దీర్ఘవర్ణాంత (దీర్గంతో అంతమయ్యే పదాలుగా), ఆశీర్వాదమిచ్చేవిగానూ ఉండాలి. ఉదాహరణలు: ఉమా, రమా, యశోదా మొదలైనవి.

తెలుగులో స్త్రీల పేర్లు ఉమ, లక్ష్మి, కాత్యాయని, గౌరి అంటూ హ్రస్వంతో ముగుస్తాయి. అయితే సంస్కృతంలో స్త్రీల పేర్లు అన్నీ ఉమా, కాత్యాయనీ, గౌరీ, కాళీ, మదనికా, అవంతికా లక్ష్మీ అంటూ మనువు విధించిన నియమం ప్రకారం దీర్ఘాంతాలుగానే ఉంటాయి.

నవజాత శిశువు గురించి

చతుర్ధే మాసి కర్తవ్యం శిశోర్నిష్క్రమణం గృహాత్ |
షష్ఠేన్నప్రాశనం మాసి యద్వేష్టం మంగళం కులే || (2- 34)

నాల్గవ నెలలో ఇంటి నుండి సూర్య దర్శనం కోసం శిశువును మొదటిసారి బయటకు తీసుకొచ్చే గృహ నిష్క్రమణ కార్యక్రమం, ఆరవ నెలలో శిశువుకు మొదటిసారి ఆహారం పెట్టే అన్నప్రాశనము నిర్వహించాలి. కుటుంబం లేక కులాచారం ప్రకారం తమకు సమ్మతమైన శుభదినాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి.

నవజాత శిశువును నాల్గవ నెల వరకు బయటకు తీసుకురాకుండా ఇంట్లోనే ఉంచడంలోనూ, నాల్గవ నెలలో మాత్రమే సూర్యదర్శనం కోసం ఇంటినుంచి మొదటిసారిగా బయటికి తీసుకొచ్చే గృహనిష్క్రమణ కార్యక్రమంలోనూ కొంత శాస్త్రీయత ఉంది. అదేమిటో తెలుసుకుందాం.

ఆధునిక వైద్యశాస్త్రం కూడా నవజాత శిశువు (Neonatal Baby) కి ఆరు నెలల వయస్సు వచ్చే వరకు సూర్యరశ్మి తగలకుండా ఉంచడం మంచిదని తేల్చింది. సూర్యరశ్మి వలన కలిగే కీడునుంచి నుంచి రక్షాకవచంలాగా పనిచేసే మెలనిన్ (Melanin) అనే పిగ్మెంట్ నవజాత శిశువు శరీరంలో చాలా తక్కువగా ఉండే కారణంగా ఇలా చేయడం అవసరమని ఇటీవల అమెరికాకు చెందిన శిశువైద్య విద్యాసంస్థ (అమెరికన్ ఎకాడెమీ ఆఫ్ పీడియాట్రిక్స్) ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలా ఆరు నెలలకు ముందే సూర్యరశ్మి తగిలితే శరీరంపై కొత్త పుట్టుమచ్చలు పుట్టుకురావడం లేక ఉన్న పుట్టుమచ్చలు పెద్దవి కావడం జరిగి మెలనోమా (Melanoma) లక్షణాలతో మొదలై అంతిమంగా తీవ్రమైన చర్మ కాన్సర్ కి దారితీసే ప్రమాదముంది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత (అల్ట్రా వయొలెట్) కిరణాలలో చాలా భాగం భూ వాతావరణంలోని ఓజోన్ పొర (Ozone Layer) పీల్చుకున్నప్పటికీ ఇంకా సూర్యరశ్మిలో మిగిలుండే ఆ కొద్ది అల్ట్రా వయొలెట్ కిరణాలు శిశువుకు హానిచేస్తాయి. శిశువును ఇంటిలోపలే గాజు కిటికీల నుంచి లోనికి వచ్చే సూర్యరశ్మిలో ఉంచుతారు కొందరు. కానీ అది కూడా ఏమంత సురక్షితం కాదు. ఎందుకంటే గాజు కిటికీ లోనుంచి ప్రసరించే సూర్యరశ్మికి బయటి సూర్యరశ్మికి గుణాలపరంగా చూస్తే పెద్దగా తేడా ఏమీ ఉండదు. కొందరు శిశువులు పుట్టుకతోనే కామెర్ల వ్యాధి (జాండిస్) తో పుడతారు. అలాంటి శిశువుల చర్మంలోని బైలిరుబిన్ ని ఛేదించి, జాండిస్ నివారించేందుకు అల్ట్రా వయొలెట్ కిరణాలు ఉపకరిస్తాయి కనుక వైద్యుల పర్యవేక్షణలో అవసరం మేరకు తగు జాగ్రత్తలు పాటించి వారిని సూర్యకాంతిలో ఉంచుతారు.

***సశేషం***

Posted in July 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!