Menu Close
పిసినారితనం
-- దినవహి సత్యవతి

పీ క రా! ... లా గి రా!

పీనాసి కళాత్మకరావు ఉర్ఫ్ పీకరా, పోచికోలు రామం గారి దౌహిత్రుడు. ఒక్కగానొక్క కూతురిని వదిలి ఉండలేక అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు పోచికోలుగారు. ఇంటి పేరు పీనాసే అయినా మంచి మనిషి ఆయన అల్లుడు. అలా పైసా కట్నం ఇవ్వక్కరలేకుండా ఇంటెడు చాకిరీ చేసి, వడ్డీ వ్యాపారం చేసే తన కూతురి చేతిక్రిందకి మనిషి దొరికాడని మురిసిపోయాడు మామ పోచికోలు!

అయితే సాధారణంగా పీనాసుల పిసినారితనం వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ ప్రతిబింబిస్తుంది...కానీ పోచికోలు రామం అందుకు కొంచం విరుధ్ధం. పిల్లికి బిచ్చం పెట్టకపోయినా తాను మాత్రం కక్కుర్తి పడకుండా కడుపునిండా తింటాడు. ముద్దుల మనుమడిని తన తోనే కూర్చోబెట్టుకుని తనలాగే తిండి పోతుని చేసేసాడు......పైగా “ఒరేయ్ పీకరా..ఏదైనా మానుకోగానీ తిండి మాత్రం మానకురా.....’అని హితబోధ కూడా చేసాడు. అసలే తాతగారి మాటలు వేదవాక్కుల్లా భావించే పీకరా అదే బాట నడిచాడు!

అలా తాతని చిన్నప్పటినుండీ గమనించీ..గమనించీ... ఆయన పిసినారి లక్షణాలనే జీవన ఆదర్శాలనుకుని తనకి తెలియకుండానే వాటిని ఆపాదించుకున్నాడు పీకరా...

మచ్కుకి ఒకసారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు పోచికోలు గారు రిక్షా మాట్లాడి అల్లుడినీ కూతురినీ ఎక్కించాడు.

“ఓ తాతా అయితే నువ్వూ నేనూ ఇంకో రిక్షా ఎక్కుతామా భలే! భలే!” అని సంబరంగా చప్పట్లు కొడుతున్న మనుమడికేసి చూసి “ఓరి వెర్రి నాగన్నా ఇంతోటి దానికి ఇంకో రిక్షా దండగెందుకురా?” అని కూతురూ అల్లుడూ కూర్చున్న సీటుకీ రిక్షావాడికీ మధ్యన ఉన్న ఖాళీలో తాను నిలబడి, మనవడిని తన ప్రక్కన నిలబెట్టుకున్నాడు పోచికోలు!

పాపం ఆ రిక్షా అబ్బీ రిక్షా ఎక్కడ తలక్రిందులవుతుందోనని భయంతో లబో దిబోమని తలబాదుకున్నాడే గానీ కిక్కురుమనలేదు...కారణం ఆయనిచ్చిన పైకం తోనే రిక్షా కొన్నాడు కనుక!

“అబ్బో తాతా నీది భలే తెలివి!” అని మెచ్చుకోలుగా చూసాడు పదేళ్ళ  పీకరా...

ఇలాంటి మచ్చులెన్నో బలమైన అచ్చులై పీకరా బుర్రలో, మనసులో గాఢమైన చెరగని ముద్రను ఎంత బలంగా వేసాయంటే...

ఏడవతరగతి పబ్లిక్ పరీక్షలలో ఠావులు ఠావులు వ్రాసేసి....ఎక్కడైతే అరఠావు ఖాళీగా ఉందో ఆ పేజీలన్నీ ఊరికెనే వ్యర్థమవడమెందుకని చింపి ఇంటికి తెచ్చేసాడు!

తను చేసిన పనిని తాత తప్పక మెచ్చుతాడని ఆయన దగ్గరికి వెళ్ళి “తాతా తాతా.... చూడు నేనెంత మంచి పని చేసానో!?” అని చూపించాడు....

పీకరా చేతిలో అరఠావు తెల్ల కాగితాల చిన్న దొంతర చూసి “అబ్బో! అబ్బో! ఏమిటిరా ఇవి... ఇన్ని కాగితాలు నీకెక్కడివి?” అని పోచికోలు, చిత్తు లెక్కలు వ్రాయడానికి కాగితాలు కొనక్కరలేకుండా దొరికాయని లోలోనే మురిసిపోతూ, వాటిని చేతిలోకి తీసుకుని వెనక్కి తిప్పి చూసి నోరెళ్ళబెట్టాడు అంతే! ఆనాడు పడిపోయిన ఆ నోటి మాట మరి బ్రతికున్నంత కాలమూ రానేలేదు ఆయనకు...

ఇంతకీ పోచికోలు మాటపడిపోవడానికి పీకరా చేసిన నిర్వాకం ఏమిటయ్యా అంటే... పేద్ద గొప్పగా పొదుపు చేస్తున్నానని ఫీలై పోయి ఒకవైపు తెల్లగా ఉందని చింపాడు సరే, అయితే దాని వెనుకవైపు వ్రాసిన ప్రశ్న తాలూకు జవాబు కూడా పోతుందని తట్టలేదు పాపం పీకరా కి!.

ఆ విధంగా ఏడవ తరగతి డింకీ కొట్టిన పీకరా ని...ఎవ్వరూ మెచ్చుకోకపోగా తాతగారి దుస్థితికి తనే కారణమని అందరూ తిట్టిపోయడంతో అవమానపడి మరింక చదవనని మొరాయించాడు...

అలా పీకరా చదువు చట్టుబండలైంది..

కానయితే తాత మంచాన పడ్డాక తల్లి వెనకాల తిరిగీ తిరిగీ వడ్డీ వ్యాపారం లక్షణాలు బాగా వంటబట్టించుకుని వ్యాపారంలో దిట్ట అనిపించుకున్నాడు...

మాట పడిపోయినా వ్రాత పడిపోని పోచికోలు తాను బ్రతికుండగానే మనుమడి పెళ్ళి చూడాలని పట్టుబట్టడంతో ఆ ప్రయత్నాలు మొదలెట్టింది పోచికోలు కూతురు!

చదువూ సంధ్యాలేని పీకరా కి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే గంతకు తగ్గ బొంతని ఆ దేవుడు నిర్ణయించే ఉంటాడని నిరూపిస్తూ పీకరా పెళ్ళి కుదిరింది.

పెళ్ళి కూతురు పేరు లావి గిరిజా రాణి అంటే సూక్ష్మంగా లా.గి.రా...అన్నమాట!

బాగున్నాయి ఇద్దరిపేర్లూ ఒకరు పీకరా ఇంకోరు లాగిరా...ఇకనేం వీళ్ళ సంసారం లాగానాం..పీకానాం... అనుకుని నవ్వుకున్నారు పెళ్ళికి వచ్చినవారందరూ!

పెళ్ళైంది...మధ్యాహ్నం భోజనాలై చుట్టాలందరూ వెళ్ళిపోయి సద్దుమణిగింది ఇల్లు. అందమైన కొత్త పెళ్ళాన్ని చూసుకుని మాలావు మురిసాడు పీకరా!

‘అమ్మయ్య! ఇంక మనమే మిగిలాము...అమ్మాయ్ ఇవాళ రాత్రికి నాకు ఇష్టమైన పదార్థాలన్నీ చేయించు కడుపునిండా తినాలని ఉంది’ అని కాగితంపై వ్రాసి చూపించాడు పోచికోలు!

“అవునే అమ్మా...నాక్కూడా” నోట్లోంచి  ఊరుతున్న లాలాజలాన్ని తుడుచుకోవాలని ధ్యాసైనా లేకుండా ఎగిరాడు పీకరా!

అంతలో అక్కడికి వచ్చిన క్రొత్త కోడలు లాగిరా గడుసుతనం చూపిస్తూ గబుక్కున పీకరా చేతిలోంచి ఆ కాగితాన్ని లాక్కుని చదివి...

“అదేంటీ మీ ఇంట్లో రెండు పూటలా భోంచేస్తారా? ఇలా అయితే ఇంక సంసారం గడిచినట్లే! తినికూర్చుంటే కొండలైనా కరిగిపోతాయని మా తాతయ్య చెప్పాడు నాకు. మేము మా ఇంట్లో ఒక్క పూటే భోజనం చేస్తాము. అప్పటినుంచీ చూస్తున్నాను మీ దుబారా అంతా...ఏదో పెళ్ళి కదాని నేను ఏమీ అనలేదు. ఇకనుంచీ అలాంటివేఁ కుదరదు. అందరికీ ఒక్కపూటే భోజనం అదీ కూరా చారూ..అంతే!” తెగేసి చెప్పింది లావి గిరిజా రాణి.

“ధభేల్!“ శబ్దంతో కుప్పకూలాడు పోచికోలు...గడుసు పెళ్ళాం లాగిరా మాటలకి గుడ్లు వెళ్ళబెట్టాడు పీనాసి కళాత్మక రావు ఉర్ఫ్ పీకరా!!!!!

**** సమాప్తం ****

Posted in July 2020, కథలు

2 Comments

  1. నరేంద్ర బాబు సింగూరు

    చాలా బాగుంది. లాగి.. పీకి.. నవ్వులతో కొట్టారు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!