Menu Close
తెలుగు పద్య రత్నాలు
-- ఆర్. శర్మ దంతుర్తి

పదహారో శతాబ్దంలో కేరళప్రాంతంలో నారాయణ భట్టాత్తిరి గారు తన ఆరోగ్యాన్ని గురుదక్షిణగా సమర్పించాక గురువు దగ్గిరనుంచి తనకి అంటుకున్న రోగాన్ని నివారణ చేసుకోవడంకోసం గురువాయూరు శ్రీకృష్ణుణ్ణి నమ్ముకుని నారాయణీయం రచన చేసి రోగవిముక్తులౌతారు. నారాయణీయం పదేసి పద్యాలతో (దశకం) మొత్తం భాగవతం అంతా సంస్కృతంలో చేసిన రచన. ఈ నారాయణీయం రచన సాగిస్తున్న రోజుల్లో కొన్నిసార్లు (మన పోతనకి జరిగినట్టే) అపారకరుణాసాగరుడైన భగవంతుడికి అసలు నృసింహావతారంలో అంత కోపం ఎలా వస్తుందో, మరొకటో అర్ధంకాక రచన ముందుకి సాగనప్పుడు గురువాయూరు గుడిలోకి వెళ్ళి ‘ఇదిగో ఇలా ఫలానా చోట నాకు అర్ధం కాలేదు, ఏం చేయాలి?’ అని అడిగితే కృష్ణుడు ఆ రూపాన్ని చూపించేవాడుట. అది చూసాక బయటకొచ్చి రచన సాగించేవారు అంటారు. ఈ నారణీయాన్ని సంస్కృతలోంచి తెలుగులోకి అనువదించినవారు కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. దీన్ని తితిదేవారు ప్రచురించారు. ఈ నెల పద్యం ఆ నారాయణీయంలోని వామనావతారం దశకం లోనిది.

అనినన్ వాని యుదార వాగ్రచన నీ వాలించి వాత్సల్యమునన్
గొనియున్ వాని మదమ్ము డించుటకు రక్షోనాథు వంశమ్ము వ
ర్ణనముం జేసి ‘పదత్రయ మ్మొసంగుమన్నా! చాలు’ నన్నావు కా
దని సర్వమ్మును నీవయై యడుగ వహ్వా నవ్వరే యెవ్వరున్            [31.2]

వామనుడు బలి చక్రవర్తి దగ్గిరకి వెళ్ళి మొదటగా స్వస్తి వాక్యం చెప్పాడు. అప్పుడు బలి మహారాజు వామనుణ్ణి ఆహ్వానించి ‘వరచేలంబులో, మాడలో, ఫలములో వన్యంబులో, గోవులో…” కాక ఇంకా ఏం కావాలో కోరుకోమన్నాడు. దానికి సంతోషించి వామనుడు బలి చక్రవర్తిని వాత్సల్యంతో చూసి, మీ వంశం ఇంత మంచిది, మీ తాత ప్రహ్లాదుడు ఎంతో గొప్పవాడు అంటూ చెప్పాక మూడు అడుగుల భూమి చాలు అన్నాడు. ఇంతవరకూ అందరికీ తెలిసిన కధే. అయితే ఈ నారాయణీయం పద్యంలో ఉన్న ముఖ్యమైన విషయం పద్యంలో ఉన్న నాలుగో పాదం.

వామనావతారం ఎత్తినదే బలి చక్రవర్తి దగ్గిరనుంచి ఉన్నదంతా దోచుకుని దేవతలకి ఇవ్వడానికి కదా? కానీ మూడు అడుగుల నేల మాత్రం చాలు అదే ఇమ్మన్నావు, ఎందుకంటే ఎవరైనా ఏదైనా కోరుకో ఇస్తాను అంటే “మొత్తం నీకున్నదంతా ఇచ్చేయి,” అని అడిగితే అందరూ నవ్వరూ? అలా నవ్వులపాలు కాకుండా ఉండడానికి మూడు ఆడుగుల నేల చాలన్నావు. కానీ తీరా అడిగినది ఇచ్చాక తీసుకున్నదేమిటీ? సర్వస్వమూను. అంటే ప్రపంచాన్ని, పధ్నాలుగు లోకాలనీ సృష్టించినవాడికి మనం ఏపాటి, మనకున్న ఆస్తిపాస్తులేపాటి? భగవంతుడి మూడు అడుగులకన్నా తక్కువే కదా? అదే బలికి జరిగినది.

“నాకింత సంపద ఉంది, నేనింత ఇవ్వగలను…” అనే గర్వం ఇంకా ఉంది బలి మహారాజుకి. ఆ గర్వంపోతే తప్ప ఆత్మానుభవం అసంభవం. ఆ గర్వం ఎలా పోతుంది? చేసిన పాప పుణ్యాలు భగవదర్పిదం చేసాక. పుణ్యం మనని పైలోకాలకి తీసుకెళ్తుందనుకుంటే, ఆ పై లోకాలని ఒక పాదంతో ఆక్రమించాడు వామనుడు. బలి చేసిన పుణ్యం మామూలు పుణ్యం కాదు. నూరు అశ్వమేధాలు చేసినది. అంతటి పుణ్యం, భగవంతుడికి ఒక పాదం మేర కూడా కాదు. పాపం వల్ల కింది లోకాలకి వెళ్తాం అనుకుంటే దాన్ని కూడా ఒక పాదం తో ఆక్రమించాడు వామనుడు. ఇంక మిగిలినది అహంకారం. అది పోవడానికి బలి ‘నీ పాదం నా తల మీద ఉంచు’ అని అడిగాడు. ఆ పాద స్పర్శతో బలికి అహంకారం పోయి భగవంతుడంటే ఎవరో జ్ఞానోదయం అయింది. ఆ తర్వాత ఆయనకి భగవంతుడి విశ్వరూపం అవగాహన అయింది – ఎలా అయింది? “ఇంతింతై వటుడింతయై, మరియు దానింతై …” అన్నట్టూ.

వామనుడు మొదట యజ్ఞవాటికలో అడుగుపెట్టగానే బలి చక్రవర్తికి అవగాహన ఉంది వచ్చినవాడేవరో. మూడు అడుగుల నేల చాలు అనగానే వచ్చినవాడు శ్రీహరి అని గ్రహించాడు. అందుకే “నిరయంబైన, నిబద్ధమైన, ధరణీ నిర్మూలంబైన, కులాంతంబైన, దుర్మరణంబైన…” “మేరువు తలకిందైనను, పారావారంబులింకబారిన, లోలోధారుణి రజమైపోయిన” ఆ భగవంతుడు అడిగిన కోరిక తీరుస్తానని చెప్పాడు. ఎందుకంటే ఎన్ని జన్మల పుణ్యం చేస్తే భగవంతుడు మన దగ్గిరకొచ్చి దేహీ అనే అదృష్టం మనకి వస్తుంది? ఎంతో పుణ్యం చేసాక వచ్చిన జ్ఞానంతో అన్న మాట అది. అందుకే గురువు శుక్రాచార్యులు ఇవ్వద్దు అన్నా, శపించినా ముందూ వెనకా చూసుకోకుండా దానం ఇచ్చేసాడు బలి. ఈ ఇవ్వడానిక్కారణం కూడా “ఆత్మార్ధే పృధ్వీంత్యజేత్,” అనేదే కారణం. ఆత్మ జ్ఞానం కోసం ప్రపంచాన్ని వదులుకోవాలి. శ్రీరామకృష్ణులూ, బుధ్ధుడూ, వివేకానందులూ సన్యసించడానిక్కారణం అదే.

విష్ణుకథలు కళ్యాణాత్మకాలు. ఎన్ని సార్లు ఎవరు చదివినా అవి కొత్తగానే ఉంటాయి. అవి వర్ణించడానికి ఎవరికి ఎంతకాలం పడుతుందో తెలియదు; అదే భగవద్విభూతి అంటే. మనకి పోతన పద్యం చదివితే ఎంతటి అనుభూతి కలుగుతుంతో కథ అంతా తెలిసినా నారాయణీయం పద్యం చదివితే కూడా అటువంటి అనుభూతే కలగడానిక్కారణం ఈ కథలు కళ్యాణాత్మకం అవడం వల్లే. నారాయణీయంలో రాసిన భట్టాత్తిరిగారి సంస్కృతం శ్లోకం ఇది.

తా మక్షీణాం బలిగర ముపాకర్ణ్య కారుణ్య పూర్ణో
ప్యస్యోత్సేకం శమయితుమనా దైత్యవంశం ప్రశంసన్
భూమిం పాదత్రయ పరిమితాం ప్రార్థయామాసిథ త్వం
సర్వం దేహీతు నిగదితే కస్య హాస్యం న వాస్యాత్

****సశేషం****

Posted in December 2021, వ్యాసాలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!