Menu Close
సుబ్బారావు-సుబ్బలక్ష్మి
-- చివుకుల పద్మజ

సుబ్బలక్ష్మి ఎక్కిన ఆటో కాలనీలోకి ప్రవేశించింది. వీధి మొదలుకుని ఒకటే హడావిడిగా కనిపించింది. పట్టు చీరెల రెపరెపలు .. చేతుల్లో పసుపు కుంకుమల పొట్లాలు .. పక్కింటి ముందు షామియానా .. వరుసగా కుర్చీల్లో ముత్తయిదువలు .. వాళ్లకు పసుపు రాస్తూ పక్కింటి వాళ్ళ పెద్దకోడలు.

సుబ్బలక్ష్మి ఆటో దిగేసరికి పక్కింటి ఆవిడ నవ్వు పులుముకుని "వచ్చారా.. వెళ్లి స్నానం గట్రా చేసి రండి. మా చిన్నకోడలితో కైలాసగౌరీ నోము చేయిస్తున్నాను. వాయనం అందుకుందురుగాని" చెప్పింది. మనసులో మాత్రం .. అమ్మ సుబ్బలక్ష్మీ!.. నువ్వు లేవు కదా, నీ దిష్టి తప్పుతుందని నోము పెట్టుకుంటే .. ఇట్టే దిగిపోయావే .. మెటికలు విరిచింది.

"అలాగే" తిరిగి నవ్వుతూనే సమాధానం చెప్పింది కానీ సుబ్బలక్ష్మి గుండె మండటం మొదలు పెట్టింది. ఒక్క పరుగున ఇంట్లోకి చేరుకుంది. లోపల సుబ్బారావు పరిస్థితి డిటో..డిటో..మింగలేక..కక్కలేక..భార్య తోడు లేక..గుండె మంట భరించలేక లోటాలు లోటాలు 'ఈనో' తాగేస్తున్నాడు.

"ఎంత పని జరిగిందండీ.. పైగా నేను లేని సమయంలోనా!" ముక్కు చీదింది.

"అదే కదా నేను ఏడుస్తుంటా..మంచిదైంది నువ్వొచ్చి. అయినా అప్పుడే వచ్చేవేంటి. రేపు కదా రావాల్సింది" ఆరాగా అడిగాడు సుబ్బారావు.

"ఆ.. మా వదిన ఉండనిచ్చిందీ.. పిల్లకు అటు నిశ్చితార్ధం కాగానే నన్నిటు ఎక్కిచ్చేసింది"

భార్యాభర్తలు ఇంక ఒక్కటై విలపించారు..ఇల్లంతా కన్నీళ్లమయం..తుడవాలంటే ఒక షోలాపూర్ దుప్పటి సరిపోదు.. అయినా ఆ దంపతుల విలాపం అంతా తొందరగా తగ్గదు.

*** *** *** *** *** ***

ఒకసారి ఈ దంపతుల ఫ్లాష్ బ్యాక్ ..అదేనండి.. భూతకాలం లోకి తొంగి చూద్దాం…

సుబ్బారావు ఒక గవర్నమెంట్ ఉద్యోగి. భార్యా సమేతుడై అమలాపురంలో నివసించెడివాడు. భార్య పేరు కామాక్షి, బహు ఉత్తమురాలు. అత్త ఉన్నను, లేకున్నను కామాక్షి ఉత్తమురాలే. ఎల్లవేళల పూజలు, పునస్కారములు ఆచరిస్తూ 'పతియే ప్రత్యక్ష దైవము' అనెడి మాట ఉగ్గుపాలతో నేర్చుకున్నదై భర్తకు అన్ని సేవలు మనసారా భక్తి శ్రద్ధలతో అందిస్తూ ఉండెడిది. మన సుబ్బారావు మాత్రం బహు కుళ్ళుమోతు. ఎవరైనా బాగుంటే రెండు కళ్ళతో చూడలేకపోయేవాడు. ఏదో ఒక విధంగా వాళ్ళను చెడగొట్టనిదే నిద్రపోడాయెను.

ఆఫీసులోను, చుట్టుపక్కల పది మైళ్ళ దూరంలో వున్న వారందరును సుబ్బారావు బాధితులే. అన్నదమ్ములు, బావ-బావమరుదులు, తండ్రీకొడుకులు, స్నేహితులు మొదలగు వారెవరైనా సుబ్బారావు కంట్లో పడినచో ఆగర్భశత్రువులగుదురు. ఆడవాళ్ళ జోలికి వెళదామంటే పాపం కామాక్షి సహకరించదాయె. తానొక్కడే పూనుకుందామంటే..అసలే ఆడవాళ్లు..ఎందుకొచ్చిన గోల అని చాటుగా వాళ్ళ మీద పడి ఏడవటం తప్ప ఏమీ చేయలేకపోయేవాడు.

నిజం నిప్పు లాంటిది కదా.. కొన్నాళ్ళకి ఆ కొట్టుకున్నవాళ్ళకి అసలు విషయం తెలిసిపోయి, పదహారు అక్షౌహిణీల సైన్యంతో సుబ్బారావు ఇంటి పైకి దండెత్తి వచ్చిరి. సుబ్బారావు భయపడిపోయి స్నానాలగదిలో దాకుంటే కామాక్షి బయటకి వచ్చి తన పతిని క్షమించి తన పసుపు-కుంకుమలు నిలబెట్టవల్సినదిగా ప్రార్ధింప, అంతట వచ్చినవారు శాంతించి "మీ ఆవిడ మొహం చూసి వదిలేస్తున్నాం. జాగ్రత్తగా వుండు" అని హెచ్చరించి నిష్క్రమించిరి.

కొన్నిదినములు సుబ్బారావు బహు జాగరూకతతో మెలిగెను కానీ పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదనే సామెత నిజం చేసెను.

పక్కవీధిలో కొత్తగా పెళ్ళైన జంట చెట్టాపట్టాలేసుకుని ఝమ్మంటూ బైకు మీద తిరగడం సుబ్బారావు కంట పడెను. మొదట్లో నిగ్రహించుకొన్నా, తర్వాత ఆగలేకపోయెను. ఫలితం..ఆ జంట ఒకరినొకరు కత్తులతో పొడుచుకునే స్థితికి వచ్చిరి.

ఒకనాటి ఉదయం...

"రేయ్ సుబ్బారావు.. బయటికి రా రా" దిక్కులు పిక్కటిల్లేట్టు అరిచిన అరుపుకి చుట్టుపక్కల నాలుగు వీధుల వాళ్ళు పోగు అయ్యిరి. తప్పనిసరై సుబ్బారావు బయటికి వచ్చెను.

"ఏరా.. భార్యాభర్తల మధ్య చిచ్చుపెడతావుట్రా"

"అయ్యో.. అయ్యో..ఏమైందండీ" కామాక్షి వచ్చెను మధ్యలో.

"ఏమైందా.. నీ మొగుడు మా అమ్మాయిని, అల్లుడ్ని విడదీశాడు. అమ్మాయి ప్రవర్తన మంచిది కాదని, ఇదివరలో ఎవరితోనో తిరిగిందని ఆకాశరామన్న ఉత్తరం రాశాడు మా అల్లుడికి. అదృష్టం కొద్దీ మా అన్న కొడుకు పోలీస్ కాబట్టి ఆ వుత్తరం ఎక్కడనించి వచ్చిందో పట్టుకోగలిగాం"

కామాక్షి క్రుద్ధురాలాయెను. ఎన్నిటికో ఓర్చుకుని వస్తున్ననూ.. భార్యాభర్తలను విడదీసిన తన భర్త చుప్పనాతితనం మాత్రం భరించలేక అప్పటికప్పుడు.. కాషాయం ధరించి.. భర్తను త్యజించి..ఆపద్ధర్మ సన్యాసం స్వీకరించి కాశీకి వెడలిపోయెను.

ఆ తర్వాత వచ్చిన వాళ్ళు సుబ్బారావును చంపినంత పని చేసి వదిలిపెట్టిరి. ఆ తదుపరి ఆఫీసు వాళ్లంతా ఏకమై పై అధికారులతో మోర పెట్టుకుని సుబ్బారావును అమలాపురం నుంచి అనంతపురం బదిలీ చేయించి పండగ చేసుకొనిరి.

ఇదిలా ఉండగా....

సుబ్బలక్ష్మి ఆ వూరులోనే అతివృద్ధ కన్య. అనగా నలభై ఏళ్ళు వచ్చిననూ ఇంకనూ పెళ్లి కాలేదు. సుబ్బలక్ష్మి అన్నగారు ఎన్ని సంబంధాలు చూసిననూ ఎవరూ ధైర్యం చేసి ముందుకు రారైతిరి. దాదాపుగా ఆ చుట్టుపక్కల వూళ్ళన్నిటిలోనూ సుబ్బలక్ష్మి పేరు సుపరిచితం 'తంపులమారి సుబ్బలక్ష్మి' అని.

అన్నావదినల మధ్య గొడవ పెట్టని రోజు లేదు. అన్నగారు సుబ్బలక్ష్మి సంగతి ఆకళింపు చేసుకున్నవాడవటం చేత భార్యతో సఖ్యంగా వుంటూ, సుబ్బలక్ష్మి ముందు మాత్రం నటిస్తూ కాపురం కొనసాగించుచుండెను. పుత్రికావ్యామోహం వల్ల తల్లితండ్రులకు తెలియలేదు గాని, బతికుండగా నిత్యం వాళ్ళ మధ్య కలహానికి సుబ్బలక్ష్మే కారణం.

సుబ్బారావు సంగతి విన్నవాడై, అతనే తన చెల్లెలికి సరైన మొగుడని నిశ్చయించి, భార్య సన్యసించినందున పునర్వివాహం చేసుకోవచ్చని, పేర్లు కూడా కలిసినందున మిక్కిలి శుభమని చెప్పి సుబ్బారావుని పెళ్ళికి ఒప్పించెను. భార్యావియోగం అనుభవించుచున్న సుబ్బారావు కూడా ఇందుకు సంతోషించి సుబ్బలక్ష్మిని తన అర్ధాంగిగా చేసుకొనెను. వాళ్ళిద్దరి చేత ఎవరి మధ్య గొడవ పెట్టమని ప్రమాణం చేయించెను సుబ్బలక్ష్మి అన్నగారు.

ఈ చుట్టుపక్కల సుబ్బలక్ష్మికి వున్న పేరు వల్ల వీళ్ళ కాపురం సరిగ్గా జరగదని అన్నగారు తన పరపతినంతా వుపయోగించి సుబ్బారావును విజయవాడ బదిలీ చేయించెను.

తద్విధముగా విజయవాడ పట్టణమున తమ నూతన కాపురం ప్రారంభించిరి సుబ్బారావు-సుబ్బలక్ష్మి దంపతులు. ఇదివరలో కామాక్షి తన జగడాలపురాణానికి సహకరించలేదు గాని, ఇప్పుడు సుబ్బలక్ష్మి తన తోడగుటచే సుబ్బారావు యధాశక్తి తన పూర్వజీవితాన్ని కొనసాగించుచుండెను.

చుట్టుపక్కల వాళ్ళు ఎవరు బాగున్ననూ, దంపతులిద్దరూ తమ ఇంట్లో గుండెలు బాదుకొనుచూ బహు బాధ పడుచుండిరి. దేవుడి మీద చేసిన ప్రమాణం చేత నోళ్లు కట్టేసుకుని కేవలం గుండెలు మాత్రం బాదుకొనుచుండిరి.

ఒకరోజు వెనక ఇంటివాళ్ల అమ్మాయి పెళ్లయి అమెరికా వెళ్తుంటే ఆ సందడి నంతా తమ పెరట్లోంచి వీక్షించిన దంపతులకు ఏమియు మార్గం కానరాక వున్నపళాన కాలనీకి కొంచెం దూరంలో వున్న గుట్ట పైన శివాలయానికి ప్రయాణం కట్టి, అక్కడ "దేవుడా.. నీకు నిత్య పూజలు, నైవేద్యాలు, ఆరాధనలు చేస్తున్నామే..మా బాధ తీర్చవయ్యా.. ఆ పిల్ల ప్రయాణం ఆపవయ్యా" అని సాష్టాంగ నమస్కారాలు చేయుచుండిరి.

అటుగా వెళ్తున్న సాధువు ఒకడు వీళ్ళ ఏడుపు చూసి "ఏమైనదయ్యా..చెప్పండి.. ఏమైనా సహాయం చేస్తాను" అనెను.

అన్నదే తడవు సుబ్బారావు తన గోడు వెళ్లబోసుకుని ఎలాగైనా ఆ పిల్ల అమెరికా కాపురం చెడగొట్టమనెను. దానికా సాధువు తిరస్కరించి "తప్పు నాయనా..ఆ పని చేయకూడదు.. అయినప్పటికీ నీకు మాట ఇచ్చాను కనుక ఒక వరం ఇస్తాను. నువ్వు ఈ రోజు వంద రూపాయలు ఖర్చు చెయ్యి, నీకు పదివేలు వస్తాయి. అంతటితో సంతృప్తి పడు" అని చెప్పి వెళ్లిపోయెను.

ఇహ..ఆ అమెరికా భాగోతం మర్చిపోయి, ఇంటికొచ్చి ఆ సాయంత్రం న్యూస్ పేపర్ బిల్లు అతనికి వంద రూపాయలు 'గూగుల్ పే' చేసిన సుబ్బారావు కి స్క్రాచ్ కార్డు లో పదివేలు వచ్చెను.

ఆశ్చర్యంతో తలమునకలు వేసి, ఆనందపడిపోయి ఆ రోజంతా చుట్టుపక్కల వాళ్ళ జోలికి వెళ్ళలేదు ఆ పుణ్యదంపతులు.

ఇహ..అది మొదలు ఎప్పుడైనా ఓర్వలేని సంఘటనలు జరిగినప్పుడల్లా గుడికి వెళ్లి సాధువు కోసం చూడటం రివాజు చేసుకొనిరి. తర్వాత మరో రెండు సార్లు ఇలా సాధువు వల్ల వంద రెట్లు ధనలాభం కలిగెను.

ఈ విధంగా కొనసాగుతున్న వారి కాపురం లో ఇప్పుడు పక్కింటి కైలాసగౌరి నోము మరొక్కమారు దుఃఖం తెచ్చిపెట్టింది.

ఇప్పుడిక వర్తమానంలో సుబ్బారావు-సుబ్బలక్ష్మి ఏం  చేస్తున్నారో చూద్దాం.

*** *** *** *** *** ***

చాలాసేపు ఆలా గుండెలు బాదుకున్న తర్వాత ఛాతి ఎముకలు అరిగిపోయాయేమో అన్న అనుమానం వచ్చి అదాటున ఆపేసి గబగబా ఆఫీసుకి వెళ్ళటానికి సన్నద్ధం అయ్యాడు సుబ్బారావు. సుబ్బలక్ష్మి మాత్రం "మీరు ఆఫీసు కెళ్ళండి. నేను గుడికెళ్తా" అనేసి సాధువును వెతుక్కుంటూ వెళ్ళింది.

చాలాసేపు నిరీక్షించాక సాధువు కనిపించగానే అమాంతం అయన కాళ్ళ మీద పడిపోయి యధాప్రకారం విలపించేసింది సుబ్బలక్ష్మి.

"పక్కింటి కోడలి సౌభాగ్యం చూడలేకున్నాము. వాళ్ళ కాపురం ముక్కచెక్కలవ్వా"

"తప్పమ్మా.. పరుల కీడెంచరాదు.. ఇప్పటికైనను కళ్ళు తెరవండి మీ దంపతులు.. మనసులు మంచివైతే మీకు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి"

"తట్టుకోలేకున్నాను స్వామీ"

"మీకిది అలవాటైపోయింది..ఇంక నా దగ్గరికి రాకండి..నేనేం చెయ్యను".

"ఎలాగంటే ఎలాగండి.. మీ వల్ల వచ్చే ఆ లాభం తోటి మా మనసులు ప్రశాంతంగా ఉంటున్నాయి. ఇవ్వనంటే కుదరదు" కాళ్ళు వదల్లేదు సుబ్బలక్ష్మి.

"సరే ఇదే ఆఖరు..ఈ సారి నువ్వు ఖర్చు పెట్టు. వంద రెట్లు వస్తుంది" సుబ్బలక్ష్మి చేతులనుంచి కాళ్ళను లాఘవంగా లాక్కుని తన దారిని తాను వెళ్ళిపోయాడు ఆ సాధువు.

కళ్లు తుడుచుకుని ఏం ఖర్చు పెడదామా అని అలోచించి, సుబ్బారావు కార్డు పుచ్చుకుని వెళ్లి పేద్ద జువెల్లరీ షాప్ లో దూరి లక్ష రూపాయల నెక్లెస్ కొనేసింది. రెండందాలా లాభం .. ఇటు బంగారం.. అటు కోటిరూపాయలు అని మురిసిపోతూ ఇల్లు చేరింది సుబ్బలక్ష్మి.

ఆ సాయంత్రమే గుండెపోటుతో సుబ్బారావు హరీమన్నాడు. కొద్ది రోజులకి సుబ్బలక్ష్మికి కోటి రూపాయల ఇన్సూరెన్సు చెక్కు వచ్చింది.

నీతి: పరుల కీడెంచిన, అది మన వినాశనమునకు దారి తీయును.

**** సమాప్తం ****

Posted in July 2020, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!