సాహితీ మూర్తిమత్వమా!
'నిన్ను గురించిన నిజం' చెప్పనా?
నీది పుస్తక కాదు...మస్తక చదువు
బీదరికాన్ని ఎదిరించి నిలిచి
చివరివరకూ నువ్వే పొందావు గెలుపు
అన్ని పురస్కారాలూ వరించింది నిన్నే
హారాలై ఒద్దికగా ఒదిగిందీ నీ మెడలోనే
ఎనిమిదిన్నర దశాబ్దాల జీవితం నీది
శతాబ్దాలకు సరిపడా అనుభవముంది.
అప్పట్లో- కూలీ వెతలు, కాపరి బాధలు, పనివాడి కడగండ్లు
అటు తర్వాతా వ్యధార్త జీవిత యథార్ధతలూ
నీకు తెలియనివి ఉన్నాయా ఏవైనా,
నీ కలం, గళాలకు అందనిదుందా ఏదైనా,
ఎన్నింటినైనా తట్టుకోవడంలో నీ తర్వాతేగా ఎవరైనా?
పిల్లల నుంచి పెద్దలదాకా
మక్కువపడి అదేపనిగా చదివే
కథ, నవల, నాటిక, వ్యాసం, పరిశోధన, రేడియో రచన
ఇన్నీ అన్నీ కావు, అవన్నీ వందల్లో.
సంపుటం, సంకలనం, జానపదం, విజ్ఞాన కదంబం
స్మృతి సాహితీ సర్వస్వం... అంతా అనంతం
లఘు కథానికలైనా, సుదీర్ఘ పరంపరలైనా
నువ్వు అందించిందంతా ఏ లెక్కకూ అందనంత.
రాసిన ప్రతిదీ ఎన్నెన్నో భావానుభూతుల నిధి
జీవితాల వాస్తవాలు, కల్పనలు
జనజీవన సమర పూర్వాపరాలు
ఆశలూ, శ్వాసలూ, భాషలూ, యాసలూ
అన్ని విధాల ఘోషలూ నీ కలం కొసల్లోనే!!
'సత్యాన్ని దాచటం సాధ్యం కాదు' అన్నది నువ్వే
'ఇనుప తెర వెనుక' అటూ ఇటూ నయనాలూ నీవే
ఎన్ని స్థితిగతులు ఎదురైనా అదురూబెదురూ లేని
తొలి అడుగు ప్రతిసారీ కచ్చితంగా నీదే!
(చేపట్టిన ప్రతి సారస్వత ప్రక్రియనూ నిత్యనూతనంగా మలచిన 'జ్ఞానపీఠ సామ్రాట్టు' రావూరి భరద్వాజ. ఆయనకు అప్పట్లో లోక్ నాయక్ ఫౌండేషన్ విశిష్ట పురస్కృతి ప్రకటన వెలువడి, ఈ డిసెంబరు 4 కి పుష్కరం పైమాటే. ఇదే సందర్భంలో, రావూరివారికి నమస్సుమాలతో నా ఈ వచన కవితా సమర్చన).