Menu Close
Sidhilaalo Prema

ప్రత్యేకమైన పనికి నియోగించబడిన కొన్ని వందల మందిలో నేనొకడిని.

ఆ పని కార్ఖానాను గుర్తుకు తెస్తుంది.

కార్ఖానా బయట- జీవితంలో రకరకాల వెలుగునీ, చీకటినీ, మసకనీ చూసే జిజ్ఞాసాపరుడిగా మధ్యాహ్నభోజన విరామ సమయంలో

“ఎవరావిడ” రంగనాథ్ ని అడిగాను.

అతను నాకంటే పదేళ్ళు చిన్న. శిష్యతుల్యుడు. నన్ను ‘గురూజీ’ అని పిలుస్తాడు.

“కన్యాకుమారి”

“ఏ వూరట?”

“ఒంగోలో..కర్నూలో..సరిగా వినపడలేదు”

“హు! చాలా అందమైన అమ్మాయి”

“నిట్టూర్పా! గురూజీ! మీకు పెళ్లి అయిపొయింది!”

“కన్యాకుమారికి అయిపోయిందా?”

“ఏమిటి, సార్ ఇలా...”

“సరే- నేను తెలుసుకోగలనులే”

కార్కానాలో అప్పటికే రెండు రంగుల బాల్ పాయింట్ పెన్నులు ప్రభుత్వ కాగితాల మీద కదం తొక్కుతున్నాయి. లోపలికి వెళ్ళాలి.

“మరేం అనుకోకండి. ఎందుకు ఇన్ని ప్రశ్నలు?”

“చిన్నవాడివి. సౌందర్యలాలన ఉంటే చుట్టూ సౌందర్యమే...దానిని ఆస్వాదించడమంటే ముతకగా అనుభవించాలనుకోవడం కాదు...ఇక వెళదామా?”

“గుడ్ ఆఫ్టర్ నూన్! మీట్ మై ఫ్రెండ్!” నా పేరు చెప్పి నన్ను అతనికి పరిచయం చేశాడు రంగనాథ్.

అతని వెనక ”మై ఫ్రెండ్..మిస్ కన్యాకుమారి!” అతను పరిచయం చేశాడు.

పరిచయాలైపోయాయి.

“మీ నవల మొదటినుండి చివరి వరకు చదివాను!” ఆమె చటుక్కున అంది.

నాకు వెయ్యకూడనిది వేసింది – సిగ్గు.

“కొన్ని అక్కడా అక్కడా చదువుతావా?” క్రాంతికుమార్ అడిగాడు.

“వీరి నవల సీరియల్ గా వచ్చింది. ఒక్క భాగం కూడా తప్పకుండా చదివానని చెబుతున్నా సర్! సుందరి చాలా అందంగా ఉంటుందా? ఆమెను మరిచిపోలేకపోతున్నాను.”

“టీ తీసుకో!” క్రాంతికుమార్ టీ కప్పు తీసుకొచ్చాడు.

“మేం గోల్కొండ వెళుతున్నాం!”

“మా పేర్లూ ఇచ్చాడు రంగనాథ్”

“మరే మంచి కంపెనీ..” ఆమె కళ్ళల్లో మెరుపు.

“కమాన్. కుమారీ! చెట్టుకింద కూచుందాం” ఆమె అతని వెనకాలే వెళ్ళిపోయింది.

“క్రాంతికుమార్ నీకు తెలుసా?” నేను రంగనాథ్ ని అడిగాను.

“మా సీనియర్. డెబ్బైనాలుగు బ్యాచి.”

నేను సిగరెట్టు కోసం తడుముకుంటుంటే రంగనాథ్ ఇచ్చాడు. సిగరెట్టు కంపెనీ ఎడ్వర్టైజ్మెంట్ గుర్తొచ్చింది. ఒకరికోసం ఒకరు తయారుచెయ్యబడిన జంట “మేడ్ ఫర్ ఈచ్ అదర్”

“లేవండి సార్!” రంగనాథ్ నన్ను బస్సులో కుదిపి లేపాడు. గోల్కొండ ఖిల్లా వచ్చేసింది.

ఇద్దరేసి, ముగ్గురేసి ముందుకు నడుస్తున్నారు.

దర్వాజా దగ్గర చప్పట్లు కొడితే దూరంగా కొండమీద మెషిన్ గన్ మోతలా వినపడుతోంది శబ్దం.

ఎందుకో తాళం కప్పు జ్ఞాపకం వచ్చింది. మధ్యయుగంలో పాతివ్రత్య పటకాలకి తాళం కప్పలు వేసేవారట. ఏవేవో భద్రతా చర్యలు.

“గుడ్ మార్నింగ్, సర్! మీతో కలిసి రావచ్చా?” కన్యాకుమారి అడిగింది.

“ఇది రంగ్ మహల్. నవాబు జనానా లోని బీబీలు, బేగం లు ఇక్కడే ఈ కొలనులో జలకాలాడేవారట.

నీరు ఇగిరిపోయిన కొలను ముందు క్రాంతికుమార్, కన్యాకుమారి..

శిధిలాల మధ్య ఈ దయనీయమైన అవస్థను తప్పించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ నిటారుగా నిలబడింది ఈ మహల్.

వడలిపోతున్న యౌవనాన్ని బిగపట్టి నుంచో పెట్టడానికి ప్రయాసపడే మనిషి తపన గుర్తుకొచ్చింది.

అంతే కాదు. మరొకటీ గుర్తుకొచ్చింది.

-“సర్, ట్రంక్ కాల్! రామారావు గారు మీరేనా?”

“నాకు ట్రంక్ కాలా? ఎక్కడినుంచి?” రేజర్ గడ్డం మీద నుంచి ఎత్తి అడిగాడు.

“బెంగుళూర్”

గుండె దడ దడ లాడుతుండగా పరిగెత్తాను.

-“హలో! రావ్ ఎవరది?”

“చాల్లెండి బడాయి. మూడు రోజులై ఉత్తరం లేదు. ఎందుకట అబ్బాయి గారికి అంత కోపం”

ఆమె మాటలు అందరూ వింటున్నారన్న భ్రాంతితో ..భయంతో..సిగ్గుతో ఒళ్ళు చచ్చిపోయింది.  చుట్టూ చూశాను.

“ఉత్తరం రాయలేదు. తీరిక లేదు. కార్కానా!”

“వై! అబద్ధం! పచ్చి అబద్ధం..బండ అబద్ధం!”

“అయితే మాత్రం..తెలిఫోనే..”

“రెండున్నర గంటలై వెయిట్ చేస్తున్నా. మా ప్రొఫెసర్ ఇంటి నుంచి. వాళ్లకు తెలుగు రాదులెండి.”

“యూ ఫూల్!”

“మీరు అలాగే అంటారు. మీరు కోపంతో రాసిన వుత్తరం అందింది. తరువాత నిజంగానే రాయడం మానేశారు. నాకు బెంగ.. నేను బయలు దేరుతున్నా రేపు సాయంకాలం..కాచిగూడా చేరేసరికి ఆరున్నరవుతుందట.”

“రియల్లీ! కానీ, ఏయ్, రాణి నా కొలీగ్స్..”

“యూజ్ యువర్ బ్రెయిన్స్!”

“మన వూరువారోయ్. వాళ్ళు ఇంటిదగ్గర...”

“మీ ఆవిడతో చెప్పేస్తారు! సర్ నేనూ ఆడదాన్ని. మీరు కాదు. ప్లీజ్ ఎక్స్టెండ్...అబ్బ! ఇదొక గొడవ వాళ్ళ సొమ్ము పోయినట్టు అరుస్తారు ఈ ఆపరేటర్లు. మాహాప్రభో, అక్కడున్నారా?”

“ఆ! ఇక పెట్టేయ్యనా”

“అంటే, ఇంతసేపూ ఇక్కడ ..నేను ఏం మాట్లాడరేం?”

“ఏం మాట్లాడను?”

“కోపం పోయిందా?”

“నిజంగా వచ్చిందనుకున్నావా?”

“మరి అనుకోనా? ఆ ఉత్తరం చదివితే నాకు చచ్చే ఏడుపు వచ్చింది. ఉన్నికృష్ణన్, గ్రేస్ అంతా చుట్టూ మూగేశారు. ఏమైందంటే. ఏం చెప్పను బాబూ! మీ కోపం సముఖంలో చూపించండి కాని..”

“మళ్ళీ ఏడ్చేసినట్టున్నావు! యూ సిల్లీ, ఇక ఫోన్ బిల్ పెంచకు. నాకు కోపం లేదు. స్టేషన్ కు వస్తా. పెట్టేస్తా. బై!”

“బెంగుళూరు లో మీ వాళ్ళెవరున్నారు?” ఒక సహోద్యోకి ఆరా తియ్యబోయాడు.

“రామారావు పేరుతో వచ్చిన చిక్కు. ప్రతి పదిమందిలో ఒకడుంటాడేమో!”

సెకండ్ ఫ్లోర్ లో ఓ రామారావుకి ఆ ఫోన్ కాల్!”

--ప్లాట్ఫారం మీద హడావుడిగా తిరుగుతున్నాను. రైలొచ్చి మూడు నిమిషాలైంది. రాణి జాడ లేదు.

“ఏమండీ!” రాణి గొంతు.

స్వెట్టర్, మఫ్లర్ .. అంతా పూలు. “పూల బంతిలా ఉన్నావు” అన్నాను. రూముకెళ్ళాక ఎలుగుబంటి లా ఉన్నావు” అన్నాను. రాణి రక్కేసింది. చాలాసేపు నవ్వుకున్నాం.

గోల్కొండ వెళ్లాం. రామదాసు బందీఖానా, రామాలయం, ఆ ఎత్తులు ఎలా ఎక్కేవారో! నాకు పిక్కలు, తొడలు నొప్పెడుతున్నాయి. సాయంకాలం వరకూ తిరిగాం. రాణికి అలసట ఉండదు.

“కాళ్ళు పీకుతున్నాయి”

“పట్టానా?”

ఆమె పెదవుల మీద చెయ్యి వేశాను. నా వేళ్ళు ఆమె గుప్పిట్లో దాచుకుంది చాలాసేపు.

“ఏమండీ! మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి! అందుకే వచ్చాను. మీ కోపం, తాపం ఉత్తరాల్లో తట్టుకోలేను.”

నాకు కళ్ళు మూతలు పడుతున్నాయి.

“ఏమిటో అంత ముఖ్యం?” ఆమె నుదుట వేలితో గిరులు గీస్తూ అడిగాను.

“బొట్టు చేరిపేస్తున్నారా?”

“నో! నో! పెదవులతో ఆమె నుదుట..ఆమె కొంత కాలం మరిచిపోయింది. ఆమె చెప్పబోయేదేమిటో తెలుసుకోలేనంత మూర్ఖుడిని కాదు.

“మా వాళ్ళు నాకు సంబంధం చూశారు!”

“పురిటికి వస్తావుగా!” నాలో ఏదో దుష్టశక్తి నన్ను ప్రేరేపించింది. ఆరాధన లోని స్త్రీకి సహనం అపరిమితం.

“ఇక నిద్రపోండి! అలిసిపోయారు.”

ఆ గొంతులో కన్నీళ్లు, ఆవేదన, ఆక్రోశం ఆ క్షణంలో వినరాలేదు. ఇప్పుడు మరపు రావడమూ లేదు.

రెండు రోజులు – రెండు వసంతాలు. రెండు జీవిత కాలాలు నాకు మధువు పంచి ఇచ్చి రాణి రైలెక్కి పోయింది...నేను ఎక్కేంచేశాను.

“మీ ముఖంలో ఏమిటో ఆ తళతళలు?”

రూమ్ కి వచ్చాక అడిగాడొకతను.

క్రాంతికుమార్ ముఖంలోని తళుకులు ఆ కోవలోవేనా? ఆ చంద్రోదయాలేనా అక్కడ నెత్తావులుగా గుబాళిస్తున్నాయి?

“ఇక్కడ పన్నీటి స్నానాలు చేసేవారట!”

“ఇప్పుడు అక్కడ వాసన చూడకు!” అంటున్నాడు క్రాంతి.

“పురిటికి వస్తావుగా!” అంటున్నాను నేను.

“బొట్టు చేరిపేస్తున్నారా?” అంటూంది రాణి.

నా మనసులో ఆలోచన – “యూ ఫూల్! క్రాంతికుమార్! ఆమె నిన్ను ఆరాధిస్తోంది. ఆమె కళ్ళు చూస్తే తెలియడం లేదూ? సిల్లీ ఫెలో! ఏ స్త్రీ అయినా అరాధననిజీవితంలో ఒకే ఒకసారి, ఒకే ఒక్క పురుషుడికి ఇవ్వగలదు! టేకిట్ – టేకిట్ ఫర్ అల్ టైం. అందబోతున్న మధుకలశాన్ని చేయి జారవిడుచుకోకు!”

బాధపడటం లోని విలువ, దాని లోతులు తెలుసుకున్న మనిషే ఆ బాధను నిరోధించడానికి ఉపాయాన్ని సూచించగలడేమో!

ఆమెను ముట్టుకోకుండానే క్రాంతికుమార్ ఆమెను లాక్కుపోయాడు.

గుండెలో ఏదో వెలితి-వైరాగ్యం.  హర్మ్యాలు, విలాసభవనాలు, రాచనగరులూ రాళ్ళు, కుప్పలుగా మిగిలిపోయాయి.

శిధిల ప్రేమ శకలాలు గాజు పెంకుల్లా గుండెలో గుచ్చుకుంటున్నాయి. గుండెలో నుండి రక్తమూ, కళ్ళలో నుంచి నీళ్ళూ బయటకు చిప్పిల్లవు. లోపల ఇమడవు. ప్రేమికుల నరకమంటే ఇదేనేమో!

క్రాంతికుమార్ కు సలహా ఇవ్వలేకపోయాను. పిరికివాడిని. పోగొట్టుకున్న దాని విలువ కాళ్ళ ముందుకు వచ్చి వెక్కిరిస్తుంది.

రాణి మనసులోని ఆరాటం ఆనాడు అర్థం చేసుకోలేకపోయాను. మనసారా తనని ఆశీర్వదించమని ఆ మూగ మనసు ఆరాటం. జీవితాంతం ఆమె నా దాన్నిగా చేసుకోలేనని రాణికి తెలుసు. ఆమె నన్ను మోసం చెయ్యలేదు. నన్ను నేనూ మోసం చేసుకోలేదు.

ఈ శిధిలాలకు కారకులెవరు?

రాణి కాదు- నేను కాదు- నా భార్య కానేకాదు. నేనెవరినీ అర్థం చేసుకోలేక పోయినా వారిద్దరూ నన్ను అర్థం చేసుకున్నారు.

అందుకే ఆరాధించే స్త్రీకి సహనం అమితం అని పునరుక్తి దోషం లేకుండా మళ్ళీ అంటున్నాను.

-కన్యాకుమారి రామాలయంలో శిరస్సు వంచి చేతులు జోడిస్తూంది.

“నాకు పిచ్చి నమ్మకాలు లేవు” క్రాంతి అంటున్నాడు.

మగవాడి అహంకారం ఎంత వికృతంగా ఉంటుంది! ఆ అసహ్యకరమైన లక్షణాన్ని తట్టుకోగలిగినందుకు గానే స్త్రీ మూర్తి అంత పవిత్రంగా రూపొందించబడిందేమో!

లైంగికానందమే పరమార్థమనుకునే మగాడు తాను ఆరాధించే స్త్రీ ఎత్తుకి ఎదగడానికి ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో...

---- సశేషం ----

Posted in April 2019, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!