ఈ కర్మ భూమిన..
కాలడి గ్రామాన
ఆర్యాంబ గర్భాన
జననమొందిన
ఆది శంకరా నీవు
శివ రూపాన
మూర్తీభవించిన
అవతార పురుషుడివే..
పువ్వు పుట్టగనే
పరిమళించినట్లుగనే..
బాల శంకరుడివై
శాస్త్రాలు నేర్చితివె
ఏక సంథాగ్రాహివై..
వేదాలు వల్లించితివే..
కడు పేదరాలిపై
కరుణ జూపి,
కనకధార స్తవం
ఆశువుగా చేయగా,
అమ్మ శ్రీదేవి ముదమొంది
కనకపు ఉసిరిక వర్షింపగా
కటిక దారిద్ర్యం తొలగి
ముదిత సంతసించెనే..
జీవుడు వేరు దేవుడు వేరు
కాదన్న నీ అద్వైత తత్వం,
ఒక అద్భుత సత్యం..
అది జగతికి జీవనసూత్రం..
అదియే వేదాంత సారం..
గురువే కదా జ్ఞానం అన్న నీ వచనం,
కలిగించె నీకు గురు గోవిందుల
పాద స్పర్శన భాగ్యం..
ఆ పాద సేవాఫలం
బీజమాయె,
బ్రహ్మసూత్రాల భాష్యమునకు..
దుష్టాచారాలు దూరంచేసి
సదాచారాలకు ప్రాణం పోసి
హైందవ ధర్మానికి జీవం పోసి
తరిగిన వేదాల విలువను రక్షించి
జగతికి మార్గదర్శివై నిలిచితివే
జగద్గురువై వెలిగితివే..
వైదిక ప్రచారమే నీ గమ్యంగా
వేదోపనిషత్తులే నీ ఆయుధాలుగా
భారతావనిన నలుదిశలుగా
వెలసే నాలుగు పీఠాలు చతుర్ధామాలుగా
నిలిచే నాలుగు వేదాలకు ప్రతీకగా
వెలిగె నేటికీ నాలుగు జ్యోతులుగా..