Menu Close
SirikonaKavithalu_pagetitle
నాభి గమ్మత్తు -- గంగిశెట్టి ల.నా.

మరణానికి మరో పేరు మారకం
మనిషికి మరణం లేదు, మారకముంటుంది...
ఆ మారకానికో విలువ ఉంటుంది
అంతర్జాతీయ విపణిలో కాదు
అంతర్వ్యోమ పరావర్తక వీధిలో....
ఇప్పటికెన్ని మారకాలు జరిగాయో
ఎంత నమ్మకంగా అమ్మ దమ్ములో ఆత్మ కమ్ములు మారాయో...
"ఒక్కమారు కాదు, రోజూ, కొన్ని వేల కణాలు
పాతవి పోతూ కొత్తవి వస్తూ ఉన్నాయి
అనుదినం పుడుతూ గిడుతున్నావు ,
ఏ పుట్టుకకు ఉత్సవం? ఏ గిట్టుటకీ దుఃఖం?"
ఆ నాడే నిలదీశాడు బుద్ధుడు
ఆత్మ వ్యథా జ్ఞాన ప్రయాణంలో మారకం విలువల సామాజికత ప్రబోధించాడు
ఏదీ ఆ ప్రబోధం? నీ ఆత్మ సంచిలో దానికి చోటేదీ?
ఆత్మా జీ!నువ్వు  ప్రేతమూ కాదు, దయ్యమూ కాదు, దైవమూకాదు
నువ్వో మూట కట్టిన కర్మవి
దానికి ముద్ర కొట్టిన ధర్మువి
ధరిత్రి ఇచ్చినదాన్ని నీదనుకోటం కాదు ధర్మం,
కర్మగా కరిస్తూ నిన్ను నువ్వువ్యాకరించుకో
నీ సంచయాల సంచీని నీకు నువ్వే ఖాళీ చేసుకో....

నువ్వో నిరంతర పరిణామం, జ్ఞేయశాలలో నువ్వో అజ్ఞాత జీవప్రయోగం
రసాయన నాళిక- నీ వెన్నెముక తంత్రీ ప్రవాహం, నీ పట్ల నీ విశ్వాసం....
అదే కాలాంతానికి ఆత్మ సాధించే భరోసాపత్రం!
ఎవర్నో కలుసుకొంటావన్న మాటొద్దు..
నిన్ను నువ్వే పూర్ణంగా ఆవిష్కరించుకొంటావ్
పోనీ, పరిపూర్ణంగా అనావిష్కరించుకొంటావ్........

గ్రహిస్తే, అస్తిన్నాస్తికి తేడాలేదు
అంతా నడుమ నాభిగమ్మత్తే!!

హృదయసమీరం -- పాతూరి అన్నపూర్ణ

సమాగపు సరిహద్దులను
చెరిపేసుకునే సందిగ్దంలో
నాకు నేనుగా
నీనుండి విడివడప్పుడు
చెరువులోని చేపను
ఒడ్డున పడేసినట్లుంది
నీరక్షణ కవచంలో
గడిపిన కొన్ని క్షణాలు
జీవితకాలం నేమరేసుకునే
మరపురాని జ్ఞాపకాలు
మళ్ళీ ఈ శబ్దాలలోికి
బంధాల ప్రపంచంలోకి
ఆంక్షల వలయాల బరిలోకి
అయిష్టంగానే అడుగు పెట్టాను
తలపుల దుప్పటిని
నిక్షిప్తంగా దాచుకుంటూ
గుండె తలుపులూ మూసేసాను
ఎప్పుడో ఓ సూర్యోదయంలో
నులివెచ్చని కౌగిలిలా
నీ ప్రేమ పరిమళం నన్ను తాకుతుంది
మరెప్పుడో ఓ చంద్రోదయంలో
నీ స్పర్శతో నేను  ద్రవిస్తాను
వసంతం వచ్చి పలకరించి నట్లుగా
వూహల వూయలలూగుతాను
నేను వదిలి వెళ్లిన వూసులతో
బ్రతుకుతున్న నువ్వు
నేనంటూ విడిగా లేననే నిజాన్ని
బహిర్గతం చేస్తున్నావు
అప్పుడు మళ్ళీ నా నిశ్శబ్దం
పటాపంచలై ప్రవహిస్తుంది
హ్రుదయాన్ని తడిపేందుకు
కంటినుండి జారిన భాష్పం
మౌనంగా ఎదపై ఒదిగి పోతుంది

విముక్తి కావాలి -- నక్క హరిక్రిష్ణ

నిన్నటిదాకా తెలియనే లేదు
నేనున్నది గాడాంధకారంలోనని
చేతన రేఖలకి అడ్డం పడుతున్న
సజీవ సమాధుల తెరచాటున అని
మార్మిక దాడి జరుగుతున్నా
చలనంలేక బూడిద మిగిల్చిన ప్రమత్తతలోనని

కళ్ళలో కణవిస్పోటనమయ్యింది
చూపులు విచ్చుకునే సరికి
నాలోకి పరకాయ ప్రవేశమయ్యింది
వివాద రాగం ఆలపిస్తూ
గులాబీలని భ్రమింపజేస్తు
ఎవరో నా స్వేచ్ఛను బందీ చేస్తున్నరు
వక్ర గీతలల్ల దింపి వేయిస్తున్నరు
తెల్లటి ఫలకాల మీద
నెత్తురు చిత్రాలను గీస్తున్నరు
నా కలల సౌధాన్ని కూలుస్తున్నరు

మెదడు నిండా చీకటి ఒంపుకున్న
ఆ కుటిల స్పర్శ ఎవరిదో తెలిసింది
కత్తులు విరుచుకున్న వ్యూహం పన్ని
మనిషితనాన్ని మెల్లమెల్లగా మింగుతున్న
విలువల భక్షకుడి ఆనవాలు దొరికింది

వాడి చూపుడు వేలు శాసనానికి
కాగితాన్ని నలుపు చేసే సిరాచుక్క
కలాన్ని కూడా నలుపు చేసింది
రచించిబడిన కుటిల తంత్రంలో
వాడికి వశమై తిరుగుతుంది
హింసోన్మాధం
పైశాచికం ఆహ్లాదమయ్యి
మరణ సముద్రాలు తవ్వుతున్నడు
రంపపు కోరలు చెక్కుతున్నడు
నేనంటే వాడికి ఒక మాంసపు ముద్ద
గ్లాసులో నింపుకున్న నెత్తుటి చుక్క

విధ్వంసం వాడి ఆయుధం
నిర్దాక్షిణ్యం వాడి అర్హత
వాడు విస్తరించిన చోటల్లా
కంటకాలు మొలుస్తున్నయి
బాల్యాపు రెమ్మలను సైతం నములుకుంటు
బలిపీఠాలను నిర్మిస్తున్నడు
ఎల్లలు లేని మారణహోమాన్ని
కలలు కంటున్నడు

వాడి ఎత్తుగడల ఆలింగనాలలో
పన్నాగపు ఉచ్చులో పడింది తెలియక
అక్షరాలకు స్థిమితం తప్పింది
స్వీయ హస్తాలతో
కాళ్ల కింద నేలను
కబేళాలకు ఈడ్చుతున్నయి
బతుకు అపహరించబడింది

నాకిప్పుడు
ఉచ్ఛ్వాస నిశ్వాసలకు భరోసా కావాలి
ఆత్మరక్షణకు
ఆయుధం కావాలి
మెదడుకు వేసిన సంకెళ్లనుండి
విముక్తి కావాలి!!!

పుస్తకం -- లలితా భాస్కర దేవ్

పుస్తకం
కనిపించే వాగ్దేవి
మస్తిష్కాన్నీ తెరుస్తుంది

పుస్తకం
‍ఆది గురువై భోధిస్తే
అజ్ఞాత మిత్రువై అక్కున చేర్చుకుంటుంది

పుస్తకం
అమ్మఒడి ఓదార్పును అందిస్తే
అపురూప అనుభవాలను చూపుతుంది

పుస్తకం లోని ఏ పుట ఎవరెవరికి స్ఫూర్తినిస్తుందో
ఏ చరితకు
శ్రీ కారం చుడుతుందో
ఎవరికి తెలుసు

పుస్తకం
ఎవరి ఎద లోతుల కథలను తెలుపుతుందో
ఎందరి హృదయాలను మెలిపెడుతుందో?

పుస్తకం
ఎన్నో తరాల చరిత్రకు  ప్రతిరూపం.

ఎవరికి తెలుసు పుస్తకం  లోని
అక్షరాల  అలవోక అర్థాల ఒదుగులలో
ఎన్ని జీవితాల వెలుగులు దాగున్నాయో!

పుస్తకం
స్ఫూర్తినిచ్చే విజ్ఞాన ఖనిలా
అందంగా చేతుల్లో ఒదుగు
ఊహల ఊయలు ఊపుతూ
కర్తవ్యాన్ని  బోధిస్తుంది

వయో భేదాలు లేక
అక్షరాభ్యాసం మొదలు
ఆఖరి క్షణం వరకు  నీచెంత వుంటే
నీవెప్పుడూ నిత్య  సత్యాన్నివేషివే

మిగిలిన మనిషి -- స్వాతి శ్రీపాద

మనిషికీ మరణానికీ మధ్య
ఇరుకుదారుల మధ్య
ఎన్ని విశాలమైన సముద్రాలు తవ్వుకుంటావో
ఎన్ని రెక్కలను అతికించుకు
ఎన్ని గగన యానాలు చేసివస్తావో
నేలమాళిగల లోలోపల ఎన్ని నిధులు
బంధించి సమకూర్చుకుంటావో
అవేవీ నిన్ను అంగుళమైనా పెంచలేవు.

ఎన్ని వ్యాకరణాలు వల్లె వేస్తే నేం
ఎన్ని ఛందస్సులు నూరినూరి
కషాయం చేసుకు తాగితేనేం
మన్నన మంచిగంధం మాటకు
ఇవ్వలేకపోయాక
మంచితనం నాగరికత మనసుకు
నేర్పలేకపోయాక
నిన్ను నువ్వు ఆపాద మస్తకం
చదువుకోలేకపోయాక
ఎదుటి వారిని నాగుపామై సమీక్షించే
అధికారం నాలుకకొసలకు ఎక్కడిది?
మనిషితనం లేకపోయాక
రక్తమాంసాలూ
అస్థిపంజరమెందుకు
భూమికి భారంగా.....

ఈ కాలం పిల్లలు ... -- దేవరాజు విష్ణు వర్ధన్ రాజు

కరకట్ట లేని చెరువులు ...
ఆనకట్ట లేని ...నదులు ...

గాలి లో నడిచే ..అపసామాన్యులు ...
అన్నీ తెలుసనుకునే ... అమాయకులు ...

పుస్తకాన్ని తప్ప .....
జీవితాన్ని చదవడం తెలియని ...
నిరక్షరాస్యులు ...

వలువలతోటే ... విలువలు
అని భ్రమ పడే పసిపాపలు ...

ప్రేమకు ఆకర్షణకు తెలియని
" మిణుగురులు "

బంధాలు ..అనుబంధాల
జాడ తెలియని ...చకోర పక్షులు ...

ఆవేశకావేశకాలకు బానిసలు ...
ఆలోచనాలోచనలకు శత్రువులు ...

కాసుల పంటను విరగ పండించే రైతులు ...
బ్రతుకుపంటను పండించుకోలేని ..బైతులు

చట్టాలతో సంసారాన్ని సంస్కరించుకోవాలనుకునే ..అజ్ఞ్యానులు ..

బ్రతుకు భారమనుకునే ..భయస్తులు
జీవితాన్ని అనుభవించలేని .. పిరికివాళ్ళు ...

అహం అనే ఆయుధాన్ని ...
అలంకరించుకునే వాళ్ళు ...

ఆత్మీయతను ఆస్వాదించలేని ...
సంఘం చెక్కిన శిల్పాలు ...

ష్... గప్ చుప్ -- ఆచార్య రాణి సదాశివ మూర్తి
ఆకలేసి ఏడిచే శిశువు 
అమ్మపాలు నోటికందగానే
                ష్...  గప్ చుప్

గోరుముద్దలకు నిగ్గడించే చిన్నారి
అమ్మ చెయ్యి తొడమీద పడగానే
                ష్...    గప్ చుప్

కోతిలా కొమ్మలెక్కి దూకే కోణంగి
నాన్న చేతులు దేన్నో వెతకడం చూడగానే
                ష్...   గప్ చుప్

అల్లరిగా ఆకతాయి అక్షరాలు దిద్దేవేళ
మాస్టారి చేతిలో బెత్తం చూడగానే
                ష్...   గప్ చుప్ 

పదహారేళ్ళ పడుచుదనాన్ని వెన్నంటే యువత
పడుచు వెనుదిరిగి "సరే నీ బాధేంటో చెప్పం"టే
                ష్...   గప్ చుప్ 

నిజాయితీ ని కాలేజీ లో వదిలి దగాయిజానికి
అలవాటు పడ్డ ఉద్యోగి నిఘా విభాగాన్ని చూడగానే
                ష్...   గప్ చుప్ 

రచ్చబండ మీద రంకెలేసి రచ్చరచ్చ చేసి అందరినీ
ఊరుకో బెట్టే ఊరి పెద్ద ఇంట ఇల్లాలిని చూడగానే
                ష్...   గప్ చుప్ 

ఎన్నికల ముందు  అన్ని గుమ్మాలు ఎక్కి మొక్కి దిగి
గెలిచాకా మంత్రయ్యాక మళ్ళీ అయిదేళ్ళ వరకూ
                ష్...   గప్ చుప్ 

పొగడ్తలను పోగుచేసుకుంటూ ఆలుబిడ్డలకోసం 
ఆయువంతా ఖర్చుపెట్టి ఆయాసం మిగిలి మింగేస్తే
చివరికి           ష్...   గప్ చుప్
Posted in December 2021, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!