నిరసనల పోరు
నిప్పురవ్వల జోరు..
నిన్నటిదాకా
పరిమళాలు పంచిన
పూలతోట కాలుతోంది..
రేపటికి మిగిలేది
అస్తిత్వాల అస్థికలే కాబోలు..
కుల వివక్ష..
లింగ వివక్ష..
జాతి వివక్ష...
వివక్షలేప్పుడూ
విభజన రేఖలే గీస్తుంటాయా...?
ఐక్య రాగం పాడే వీణను
ఏక రాగానికే పరిమితం చేద్దామా..?
సంకుచితత్వాల్ని
సముద్రలోతుల్లోకి విసిరేద్దాం ..!
విశాలత్వాన్ని
వినీలాకాశంలా కాపాడుకొందాం..!
"విశ్వమానవ సౌబ్రాత్రుత్వం"
"వసుదైక కుటుంబం"
పద అర్ధాలు పదిలపరచుకొందాం ..!!
దేశం సరిహద్దుల్లో పహారా కాస్తూ
అహర్నిశలూ ప్రజలను కాపాడే సైనికుడు
నేడు దేశం గర్వించే అమర వీరుడయ్యాడు...
జనం గుండెల్లో ఆరని దీపమయ్యాడు
జన్మభూమి ఋణం తీర్చుకోవడానికి
సమిధగా మారిన *సంతోష్*
వెన్ను చూపని నీ పోరాటం
ఎందరో వీర జవాన్లకు స్ఫూర్తి దాయకం
నీ దేహం మరణించినా
నీ శౌర్యం నిన్ను అమరుణ్ణి చేసింది
దేశపటంలో చెరగని సంతకంగా మార్చింది....
జన్మనిచ్చిన అమ్మకు వీర పుత్రుడుగా
నాన్న కళ్ళలో వెలిగే గర్వంలా
నీ పేరును సార్ధక పరచుకున్నావు
సంతోషం గా మృత్యువు కౌగిలిలో ఒదిగావు...
జనన మరణాల మధ్య జీవితం
చరిత్ర గా మారే పుస్తకంలో
వీర జవానుగా లిఖింపబడిన పేరు వయ్యావు...
భరతమాత ముద్ద్దుబిడ్దవై కీర్తి చంద్రుడ వయ్యావు...
........................
దేశం కోసం ప్రాణాలను అర్పించిన సంతోష్ కి
కవితా నివాళి....
మాతృ దేశపు సేవార్చనలో
సంతోషమ్ముగ అసువులు బాసిన
ధీరపురుషుని వీరయాత్రకు
భరత ఖండపు సుమములన్నియు
నివాళులర్పింపగ పయన మాయె
శత్రువు ఎత్తును చిత్తు చేయగ
అసువులు సైతము లెక్క సేయక
బల్లెపు పోట్లకు తనువు తూలగ
స్వంత వూరిలో కన్నపేగు మెలిక పడగ
కన్నతల్లి కడుపు చిచ్చార్పగ
వీరుల కన్న వీర మాతలు
నివాళులర్పింపగ పయనమా యిరి
సరిహద్దు రేఖ ను పహారా కాస్తూ
చలికి వణుకుతు వాన కు తడుస్తూ
దేశరక్షణకు దేహార్పణచేసిన
త్యాగధనుని దేహైక్యమున కు
భారత మృత్తిక సమస్తమ్ము
నివాళులర్పింగ పయనమాయె
ఇరువది మంది ముద్దు బిడ్డలను
పొట్టనబెట్టుకున్న పొరుగు దుండగుల
ఆగడమ్ములను అణచివేయగ
పచ్చి బాలెంతరాలు నా భరతమాత
ఇరువది వేల మంది ని ప్రసవించె చూడు
ఆ పసికందుల కనుపాప వెలుగులో
పోయిన బిడ్డల రూపురేఖలు కదిలియాడగ
ధృవతార చెంతన ఇరువది చుక్కలు పొడవగ
భరతమాత స్నిగ్ధదరహాసం భరతావని నిండగ
జవాను సోదరులారా!విూకివే మా అశ్రు నివాళులు
మన చుట్టూ ఒక నగరం
దానినావహించి ఒంటరి ఆవరణం
భూగోళమంత చుట్ట్టుకొలతలో
ఆవరించి ఉంటుంది
మన ఇంట్లో మనమూ మన కుటుంబం
ఒంటరిగా ....... !
బయటకు వచ్చినా మనం ఏకాకులమే
చుట్టూ జనాలు ఉంటారు
మహారణ్యంలో చెట్ల మొదళ్ళులా
ఎవరి పరిధి వారిదే !
ఒకరితో ఒకరు కలవరు
కలిసినా మనసులతో మాట్లాడరు
క్షణిక చూపులే పలకరింపులు
చిరునవ్వులే సంభాషణలు !
కటిక దుఃఖమైతేనే
"అయ్యో పాపం!" అని
వారినుండి ఒక మాట !
పెళ్ళిలాంటి సందర్భాలలో
"ఫంక్షన్ బాగా చేసారు" అని
మరొక్క చిరు మాట !
కడవరకూ అంతే .....
అభిమానాలు కడలికి అవతలి అంచే!
మనిషికీ మనిషికీ మధ్య
ఎవరికీ వారే
లక్ష్మణ రేఖలు గీసుకుంటారు
మనకెందుకులే చోద్యం అని
ఉదాసీనంగా ఊరుకుంటారు!
ఒకరి ముఖం మరొకరికి
తెలియని సందర్భాలూ ఎక్కువే
తెలుసుకునే అవసరాలూ తక్కువే!
ఇరుగు పొరుగు వాళ్ళ పేర్లు
తెలియాలంటే
పోస్టు మాన్ ని అడగాల్సిందే
అతనికీ తెలియక పొతే
మీడియాలో ప్రకటన ఇవ్వాల్సిందే!
మన చుట్టూ ఒకనగరం
భూగోళమంత కొలతలో
దానినావరించి ఒంటరి ఆవరణం
సౌర కుటుంబ భ్రమణం లా
ఒకరికొకరు బహుదూరం!
సంఘ జీవనంలో
చీమలూ పక్షులూ .. ఇంకా జంతువులు
మనకన్నా ఎంతో నయం!
మనకు జ్ఞానమున్నా ఏం ప్రయోజనం ?
సమాజంలో మనం వ్యర్ధజీవులం!
ఎవరి ఏమరిపాటువల్లనో
ఈ లోకం లోకి వచ్చిన వాణ్ణి
'లోకం నాకేమవుతుందో '
జవాబు లేని ప్రశ్న!
'నేను లోకానికేమవుతానో '
పిడికెడు గుండె అణచుకోలేని కోర్కె ....
పిచ్చిగానో కచ్చిగానో
జీవితమనే దేవాలయాన్ని
ఒంటరి తనపుఉలులతో
ఒక్కన్నే మలచుకొన్నాను...
ఎవరో మాటల ఫిరంగులతో
నేలమట్టం చేస్తే
ఒ చిరునవ్వు నవ్వి
వెళ్ళిపోయాను
అనంత నిర్లిప్తతలోకి ....
ఆలోచనలు మళ్ళీ
జీవంపోశాయి నా లోని శిల్పి కి
చేయాలనో చేయకుండా వుండలేకనో
మనసు రూపాన్ని చిత్రించాను తపన తో
ఎవరో
నిర్దాక్షిణ్యంగా కాలరాస్తే
ఓ జాలిచూపును చూసి
వెళ్ళిపోయాను
అనంత నిర్వేదంలోకి ....
హృదయంలో ఏదో ఒక చావని ప్రేరణ
మళ్ళీ మెులకెత్తింది ....
జ్ఞానమో అజ్ఞానమో
ప్రేమో ద్వేషమో
అలవికాని ఆలోచనల్ని
చేతనయినంతవరకు
కవితలు గా మలచి
మానవాళి కెరటాలపై ఒదిలాను
ఇది పేరులేని కవిత్వం !
ఇది పేరు రాని కవిత్వం !!
పుట్టడం మన చేతిలో లేదు
మరణం మన మూహించలేము
మధ్య జీవితాన్ని ఎలా నిర్వహించుకోవాలో.... మనమే నిర్ణయించుకునే స్వేఛ్చ మనకున్నది.
జీవితం సమాజానికి ఉపయుక్తమవుతే, జాతి ఉద్ధరణకు అంకితమయితే, అది సమగ్రతను, సంపూర్ణతను సాధించినట్లుగానే భావించాలి. ధైర్యం, సాహసం ఊపిరులుగా సాగిన
జీవితాన్ని విజయవంతంగా గడిపినట్లుగానే భావించాలి.
ఆ క్రమంలో దేశానికి గర్వకారణంగా నిలిచి, ప్రాణాలను దేశమాత గౌరవాన్ని కాపాడేందుకు అర్పించిన అమరుడు... సంతోష్ కు అశ్రునయనాలతో నివాళులు అర్పిస్తూ ...
పూల తోట కాలు తోంది
కవిత ప్రస్తుత సామాజిక
వ్యవ స్త ను అద్దంలో చూపిస్తూ
ప్రశ్ని స్తోంది.ఆలోచించ మంటున్న ది.
కవి గారికి శుభాకాంక్షలు.