తొట్టతొలి వాట్సాప్ సాహితీ దినసంచిక "సాహితీ సిరికోన" (Silicon=సిరికోన; రలయోరభేదః) లోంచి ఏర్చి, కూర్చిన రచనలను చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి.
శిశిర వికారంలో
పాదపం చిగురు తొడుగుతుంది.
వయసు వికారంలో
తొలిప్రేమ పరిమళిస్తుంది.
మోహ వికారంలో
కలయిక పరవశిస్తుంది.
రూప వికారంలో
విత్తనం మొలక వేస్తుంది.
దేహ వికారంలో
దశావతారం ప్రతిఫలిస్తుంది.
దర్ప వికారంలో
విజయం కైవశమౌతుంది.
హింసా, ద్వేష, అసూయాది కోప వికారాలను
దయా స్నేహ భావ ప్రకృతి పరిహరిస్తుంది.
నిరాశా, దైన్య, హీన వికారాలను
ఆశా మలయానిలం ప్రతిఘటిస్తుంది.
బుద్ధి విలయ వికారాలను
మనోజవాల కళ్ళెం నిలదీసి ఆపుతుంది.
రాగ విరాగ సమన్వయ
ధృతి ధైర్య సంయోగం కలుగుతుంది.
సకల వికారాలను స్వాగతించగలప్రతిభ
అచల విశ్వాస అఖండాకృతులకు
కలుగుతుంది.
మానవతను మేలుకొలిపే
ధీమంత మొస్తుంది.
కాలానికి నవ వసంత రూపమొస్తుంది.
నగర వికారంలో
కొమ్మ కోకిల పాట
సమధర్మ జీవన రుచుల శ్రుతిని మీటుతుంది.
విశ్వ మానవ భూమి గీతం
బదులు పలుకుతుంది.
మాడిమిపూతల్లో
కోకిలల కూతలు కిలకిలమంటున్నాయి ఎందుకో
ఉగాది పండుగకు స్వాగతం చెప్పేందుకు
ముగ్గులతో మెరిసేటి వాకిళ్ళో
సందళ్ళు నిండాయి ఎందుకో
బంధు మిత్రుల మమతానురాలు పంచేందుకు
వేపపూలేమో విరగగాసున్నాయి
షడ్రుచుల వంటలు ఘుమఘమలాడుతున్నాయి ఎందుకో
బ్రతుకంటే కష్టసుఖముల పడవని తెలిపేందుకు
రాశులన్ని కలసి రత్నాల్లా మెరిశాయి
ఊసులన్ని కలసి ఉత్సాహమై మురిశాయి ఎందుకో
మనిషి మనుగడే భార తేలికల సంచియని
కృంగక బెంగక సాగిపోవాలని ప్రతియేటాఉగాది
పండగ తెలుపుతున్నందుకు
కొమ్మకొమ్మనా మధుమాసం ’
కోటి పలుకుల ఆమని గీతం
ఆరు రుచులతో అమృత కలశం
స్వాగతించేలే చైత్ర రధం ||
పడుగు పేకలై కష్ట సుఖాలు
పైడి పంటలై పిల్లాపాపలు
చిరు చేదుల చివరాకుల పూత
అరచేతికి అందే పులుపుల పిందె
అంతలోనె వినిపించే ఆకు చాటు తీయని గానం
వాసంత సమీరాన పులకించెలె ఉగాది హేల ||
చిరు నవ్వులు చిరు దివ్వెలు
పలకరించె తీయ తీయని మధువై
పంచాంగం వినిపించెను అటు ఆదాయం
ఇటు వ్యయమూ పన్నెండు నెలల భవితవ్యం
రాబోయే వత్సరాన సుముహుర్తపు రోజులూ
కాబోయే కలిమి లేమి కలబోతల మోజులు ||
ఆరు రుచులతో అమృత కలశం
స్వాగతించేలే చైత్ర రధం
శిశిరం సెలవు తీసుకుంటూ వసంతాన్ని ఆహ్వానించింది
వసంతం శిశిరానికి వీడ్కోలు పలికి కార్యార్ధమై పయనమైంది
మావిడి చెట్టు మీది కోయిల కొత్త రాగం ఆలపించింది
పచ్చని కోకలతో సింగారించుకున్న చెట్లన్నీ పడుచుపిల్లల్లా
రంగు,రంగుల పూల పైటలు ఎగరేశాయి
గంధర్వ కన్యల పాదాలకున్న మువ్వలు సందడి చేశాయి
మబ్బులు మృదంగం వాయించాయి
గడ్డిపూలు పరవశంతో తలలూపాయి
చిరుజల్లులు మావిడి పిందెలతో గోలీలాడాయి
వేపపూలు తెల్లని తివాచీ పరిచాయి
వీధుల్లో రాలిన ఆకులు అటు,ఇటూ గంతులేశాయి
అమ్మ చేతిలో చీపురు నీళ్ళతో చెడుగుడు ఆడింది
అక్క చేతిలో గడపలు సౌభాగ్యం సంతరించుకున్నాయి
వాకిట్లో వెదజల్లిన పుప్పొడి ముత్యాల ముగ్గులైంది
మావిడాకులు గుమ్మాలకి తోరణాలయాయి
వసంతం వాకిట్లోకి వచ్చింది
గాలి పేరంటమై నట్టింట్లోకి వచ్చింది
ప్రకృతి పసుపు, కుంకుమల తాంబూలమిచ్చింది
పక్వానికి వచ్చిన పండ్లు వాయనాలైనాయి
నింగీ, నేలా , గాలీ, నీరూ
నవవధువులా వచ్చిన ఆమనికి హారతిచ్చి
షడ్రుచుల సంగమానికి ఆహ్వానం పలికాయి