పోయిన నెల ఈ బృహదీశ్వరాలయంలో విశేషాలు కొన్ని చూసాము. ఆ గోపురం చూస్తుంటే ఇంకొన్ని విశేషాలు తెలిసాయి. జాగ్రత్తగా ఆ వీడియో చూడండి -అంత పెద్ద గోపురం నీడ కింద మీకు కనిపించదు. ఇది ఈ ఆలయంలో అద్భుతమైన విశేషం. మొత్తం గుడి నీడ గోడల నీడలాగా కనిపిస్తుంది తప్ప, గోపురం నీడలో కనబడదు. ఈ వీడియో తీసింది పూర్తిగా వేసవి కాలంలో పొద్దున్న 11 గంటలకి కాబట్టి తప్పక నీడ కనపడాలి, కానీ లేదంటే కట్టడంలో ఉన్న విశేషమే కదా? పైగా, ఈ గోపురంలో ఉన్న శిల్పాలన్నీ ఏకశిలతో తయారు చెయ్యబడి, చాలా శాస్త్రీయంగా ఉన్నాయి. శివ పరివారాన్నంతా చూడచ్చు గోపురం మీద. ఈ గోపురం వెనక, దాదాపు 60 అడుగుల వెనక సిద్ధర్ ఆలయం ఉన్నది. దానికి ఎడమవైపు వినాయకుని గుడి, కుడివైపు సుబ్రహ్మణ్యాలయం ఉన్నాయి. బృహదీశ్వరాలయంలో ఇంత పెద్ద గోపురం, దాని మీద అన్ని శిల్పాలు, వెయ్యి సంవత్సరాలు చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నవి. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ ఆలయంలో ఎక్కడా సిమెంటు వంటి పదార్ధం వాడలేదు. ప్రతి రాయిని సరిగ్గా చెక్కి అమర్చారు. అయినా ఎంత పకడ్బందీగా కట్టారో చూస్తే ఆశ్చర్యం వెయ్యదూ?
ఈ సిద్ధర్ ఆలయానికి కుడివైపు, అంటే ప్రధాన గుడి గోపురం ఈశాన్య దిక్కువైపు సుబ్రహ్మణ్యాలయం ఉన్నది. ముందు ఇది అమ్మవారి ఆలయం అనుకున్నాను. కానీ ఒకరితో సంప్రదిస్తే చోళులకి ప్రధాన శివాలయంతో పాటు అమ్మవారి ఆలయం నిర్మించడం ఆచారం కాదని చెప్పారు. ఇక్కడ ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడిగా వెలిసి ఉన్నాడు. పక్కన వల్లీ దేవసేన తల్లులు ఉన్నారు. ఆ విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో? కాస్త మంచిగా అడిగితే అర్చకులు దీపం తీసుకుని వెనకనున్న మూడు ముఖాలూ అద్దంలో మనకి బాగా కనబడేటట్లు చూపిస్తారు. అక్కడ అర్చకులు నాకు తమిళంలో స్వామి గురించిన ఒక నినాదాన్ని నేర్పించారు కూడా. "ఆళగు సొల్లుక్కు మురుగా, అలగు ఎండ్రు పోళ్రుక్కు మురుగా!", అని! (దీంట్లో తప్పేమైనా ఉంటే అది నా తప్పే. వాళ్ళు జాగ్రత్తగానే నేర్పించారు; నాకు తమిళం కొంత వచ్చు కానీ, అలవాటు తగ్గింది ఈమధ్య) . ఆ ఆలయ ప్రాంగణంలో కొంత సేపు కూర్చున్నాము. అక్కడ ఒక ద్వారపాలక విగ్రహం ముస్లిముల దాడికి గురైనదని చెప్పారు. కింద ఫోటో చూడండి, ఎంత మంచి విగ్రహం ముక్కు విరక్కొట్టబడి ఉందో చూస్తారు. ఇన్ని గుడులలో ముస్లిముల అరాచకత్వం, హిందువుల ఆలయాలు ధ్వంసం చెయ్యడం కనిపిస్తున్నా, ఇవాళ్టి మీడియా ఆ అపకృత్యాలన్నీ జరగనట్టు ప్రచారం చేస్తారు! ఎన్ని అద్భుతమైన శిల్పాలని మనం పోగొట్టుకున్నామో అర్థమైతే మీరు కూడా చాలా బాధపడతారనే అనుకుంటున్నాను. మనందరం త్వరపడి ఈ అత్యాచారాన్ని ఎదుర్కోకపోతే ఈ దుశ్చర్యలు ఆగవు. ఈ మధ్య ఆంధ్ర దేశంలో జరిగిన అత్యాచారాలు గుర్తుంచుకోండి.
ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ గర్భ గుడి ద్వారం ముందు కింద ఉన్న రాతిమీద తెలుగు అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. ఎదో శాసనం లాగా కనబడింది నాకు. ఇది నల్ల రాయి. అంటే రాజు ఏదో శాసనం రాయించి ఉంటాడని అనుకున్నాను. మనుషులు ఎంతసేపు అక్కడ ద్వారం దాటుతూ ఉండడంతో ఆ శిల ని ఫోటో తియ్యలేక పోయాను. అంటే ఇక్కడ దాకా తెలుగు వ్యాపించి ఉండేదన్న మాట అక్షరాలా నిజం. ఇలాంటి తెలుగుని పోగొట్టుకోడానికి వెనకాడట్లేదు ఇప్పటి తరం వాళ్ళు. ఎంత తెలివి తక్కువ తనం!
అక్కడ నించి మెల్లగా చుట్టూ ఉన్న నడిచే దారి ఉపయోగించి బృహన్నాయకి ఆలయం చేరుకున్నాము. పైన కప్పుందికాబట్టి కాళ్ళు మాడలేదు. మనకి ఈ ఆలయం చూడగానే తెలిసి పోతుంది, ప్రధాన ఆలయం కట్టినప్పుడు ఇది కట్టలేదని. రాయి గ్రానైట్ అని తెలుస్తుంది. ఆలయం Black Granite తో కట్టబడింది. ఇందాక చెప్పినట్లు ఇది 14 వ శతాబ్దం నాటిది. ఈ అమ్మవారిని "ఉళగం మూలదైయ్య నాచ్చియార్" అని కూడా అంటారు. అంటే విశ్వానికి మూలాధారమైన తల్లి అని అర్థం. అమ్మవారు నిలువెత్తు విగ్రహం - నిలుచుని ఉన్నది. చక్కగా పూజలు చేస్తున్నారు. అక్కడ ఆలయ అర్చకులనడిగితే మమ్మల్ని స్థిరవిగ్రహం వద్దకి వెళ్లనిచ్చారు. మామూలుగా తమిళనాడులో వెనకాల ధ్రువ విగ్రహం, ముందు ఉత్సవ విగ్రహం ఉంటాయి. అర్చకులు భక్తుల కైంకర్యాలు ఉత్సవ విగ్రహం వద్దే తీసుకుంటారు. మేము ఆ ధ్రువ విగ్రహం దగ్గిర హాయిగా అమ్మవారి పాదాల దగ్గిర కూర్చుని అర్చన చేయించుకుని చాలా సేపు దర్శనం చేసుకున్నాము. శివుడి దగ్గిర లభించని ఆ భావావేశం మనకి అమ్మవారి దగ్గిర పుష్కలంగా లభిస్తుంది. అమ్మ వారి చేతిలో పాశము, అంకుశము ఉన్నాయి. చక్కగా పూజ చేయించుకుని వారిచ్చిన కుంకుమ, ఇతర వస్తువులు, ఒక చిన్న పుస్తకం అన్నీ తీసుకుని బయలుదేరాము. అక్కడ గుడి చరిత్ర కూడా లిఖించబడి ఉన్నది. పైగా గోడలమీద, పై కప్పుమీద చాలా అందమైన చిత్రాలు ఉన్నాయి. ఎంత శాస్త్రార్ధాలు మనకి అర్థమవుతాయో ఆ చిత్రాలు చూసి!
శ్రీరంగం వరదరాజ స్వామి వారి ఆలయం చూసాక వచ్చిన ప్రశ్నే ఇక్కడ కూడా వచ్చింది నాకు. ఇంత పెద్ద గుడి ఎందుకు? గుడి కంటే, చుట్టూ ఆవరణం ఇంత పెద్దగా ఎందుకు కట్టారు? అని. అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అర్థమైన విషయాలు ఏమిటంటే, మొదటి సమాధానం వాస్తు శాస్త్ర నిబంధనలు. మూల విరాట్టు ఎంత ఎత్తులో ఉంటారో, దాన్నిబట్టి ప్రధాన గోపురం ఎత్తు నిర్ణయింపబడుతుంది. అలాగే మొత్తం ఆలయం పురుష స్వరూపం కాబట్టి, ఆ స్వరూపాకృతి అంత పెద్దగా ఉండి తీరాలి. దానిబట్టే ధ్వజస్తంభం ఎత్తు నిర్ణయింప బడుతుంది. మరి నంది అంత పెద్దగా ఉండవలసిన అవసరం ఏమిటి? దీనికి కారణం నంది శృంగాలు పానుమట్టం కి సరిగ్గా పైన ఉండాలి. అంటే నంది విగ్రహం కొమ్ములు, పానుమట్టం దాదాపు ఒకే ఎత్తులో ఉండి, శృంగాలు కొంచెం ఎత్తులో ఉంటాయి. నంది శివుడిని చూడడానికి ఏదీ అడ్డు రాకుండా ఇలా ప్రతి శివాలయంలోనూ ఉంటుంది. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించి, ఎడమ వైపు చూస్తే చండికేశ్వరుడి ఆలయం ఉంటుంది. గోపురంలో ఎడమవైపు ఒక 25 అడుగుల ఎత్తులో క్షేత్రపాలుడుంటారు.
పైగా ఈ ఆలయాలు ఇంత పెద్ద ఆవరణలతో కట్టడానికి కారణం అక్కడ ఊరిలో ఉండేవారందరూ ఏదైనా శత్రు బాధ వస్తే లోపల గుమికూడడానికి కావలసిన ఆవరణ ఉండడానికని ఒకరన్నారు. మరి ఆ మాట సబబుగా తోచినా, అదే కారణమా? అన్నది నేను విడిగా నిర్ణయించలేకపోయాను.
వినాయకుడి ఆలయం చాలా బాగుంది. కానీ ఎందుకో గుడిలోకి వచ్చిన వాళ్లంతా (మేము అక్కడ ఉన్నప్పుడు మాత్రమే అయి ఉండవచ్చు) వినాయకుడి గుడిలోకి రాలేదు. ఎక్కువ రద్దీ లేదు. విగ్రహం అందంగా ఉన్నది కానీ, తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యత వల్ల అలంకారాలు, పూజలు ఎక్కువగా జరుగుతున్నట్లు కనిపించక బాధనిపించింది. వినాయకుడు నా ఇష్టదైవం కాబట్టి.
ఈ ఆలయం ఒకసారి చూస్తే పూర్తిగా అర్థమవుతుందని నేననుకోను. మళ్ళీ వెళ్లి, ఇంకా జాగ్రత్తగా పరిశీలించవలిసిందే. శివుడి అనుగ్రహం ఉంటే తప్పక ఆ పని చేస్తాను. అయితే చలికాలంలో వెళ్ళవలసిందే!