తేనెలొలుకు
పెద్దల సుద్ది
కోటి రూకలైన కూటికోసమెగదా!
చిల్లి గవ్వ కూడా చెంత రాదు
కడకు యెవ్వరైన కాటికేగవలయు
ఇంత దానికెంత చింత నీకు
నాది నాది యనుచు ప్రోది చేయగనేల
కడుపు మించి కూడు గతక లేము
ఎంత యున్న మనకు సొంతమేదికడకు
ఆలు బిడ్డ లెవరు ఆశలేల !?
మనది మనము యనిన మధుర భావమగునె!
దానమిచ్చి జూడ ధన్యమగును
ఆర్తు లాదుకొన్న హాయిగల్గు మదికి
మనిషివైన నీకు మనసులేద!?
ఎప్పుడైన మనము ఇలను వీడవలదె!
చిన్నిసాయమైన చేయలేవ?
చావవలదు బ్రతికి చచ్చి బ్రతుకవలె
మనిషి జన్మకున్న మర్మమిదియె