ఆలోచనలు – ఆచరణలు
మన ఆలోచనలు ఎల్లవేళలా ఒకేవిధంగా ఉండవు. ఏదైనా ఒక సమస్య పరిష్కారం కొరకు ఆలోచిస్తున్నప్పుడు ఒక సమాధానం దొరకవచ్చు. అది సరైనదా? లేదా? అనే సంశయం ఎప్పుడూ ఉంటుంది. అప్పుడు చేయవలసినదల్లా మనం ఉన్న ప్రదేశం నుండి మరో చోటికి వెళ్లి కొంచెం సావధానంగా మనసును, మెదడును నియంత్రించుకొని మళ్ళీ క్రొత్తగా ఆలోచిస్తూ అప్పుడు లభించిన సమాధానం పాత దానితో పోల్చి చూసి ఏది ఉన్నతమైనదో తెలుసుకుంటే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
ఉచిత సలహాలు ఇచ్చేవారు ఎంతో మంది ఉంటారు. వారి సమస్యలకన్నా ఎదుటివారి సమస్యలమీద ఆసక్తి ఉండే వారు మనచుట్టూ ఎంతోమంది ఉంటారు. ఎదుటివారి ప్రభావం మన ఆలోచనల దృష్టిని మరల్చినప్పుడు మనం ఆచరించాల్సిన విధానం లో మార్పులు జరిగి అనుకున్న ఫలితాలు లభించవు. అట్లని ఎదుటివారి సలహాలను తృణీకరించ కూడదు. కాకుంటే ఇతరుల సలహాలు మనకు ఎంతవరకు సరిపోతాయో గమనించాలి. ఎందుకంటే, ఏ ఇద్దరి జీవన విధానం మరియు ఆలోచనలు ఒక్కటిగా ఎల్లప్పుడూ ఉండవు. కనుక మనకు సంబంధించిన సమస్యలు మన జీవన విధాన కోణం లోనే చూడాలి.
సాటి మనిషికి అవసరమైనప్పుడు మనం ఎందుకు సహాయం చేయాలి అని ఒక మిత్రుడు ప్రశ్నించి, వెంటనే మనం ఎంత సహాయం చేసిననూ కనీస గుర్తింపు కూడా లేదు అని అన్నప్పుడు అది నిజమే కదా అని నాకూ అనిపించింది. ఆ క్షణంలో నా ఆలోచనల పరిధి అంతవరకే వచ్చింది. కానీ ఆ తరువాత మరింతగా మెదడుకు పనిపెడితే అప్పుడు సేవ అనే మాటకు నిజమైన అర్థం స్ఫురించింది. మనం సేవ లేక సహాయం చేసినందువల్ల మనకే మంచి జరుగుతుంది. ఒక మంచి కార్యాన్ని చేశామనే ఆత్మసంతృప్తి మనలో కలిగి తద్వారా మనసుకు ఎంతో హాయి చేకూరుతుంది. ఇక ఆ సహాయం తీసుకొన్న వారికి ఎంత సంతృప్తి కలిగిందనేది వారు ఆశించిన సాంద్రతను బట్టి ఉంటుంది. అది మనకు అనవసరం. మనలో సందేహం ఎప్పుడు కలుగుతుందంటే మనం సేవ చేయాలనే ఆలోచన మొదట కలిగి ఆ తరువాత ఆ సేవను ఎదుటివారు గుర్తించాలనే మరో ఆలోచన మొదటి ఆలోచనను ఆక్రమించినపుడు ఆ సందిగ్దావస్థలో ఆలోచనలు మిళితమై ఒక రకమైన గందరగోళాన్ని సృష్టిస్తాయి.
మనిషి ఆలోచనల రూపకల్పన విధానం కాలంతో పాటు మారుతూ ఉంటుంది. కనుకనే యుక్తవయస్సులో ఉన్న ఆలోచనల ప్రవాహం దిశ మారుతూ వచ్చి ముదిమి వయసులో పూర్తి విభిన్నంగా ఉంటుంది.
బాగా సంపదలు, ఆర్ధిక వనరులు చేకూరిననాడు మనలోని ఆలోచనల ప్రక్రియ కీర్తి ప్రతిష్టల వైపు మరలుతుంది. పదిమంది మనలను గుర్తించాలనే తపన మొదలవుతుంది. విభిన్న రూపాలలో ఆర్ధిక సహాయం అందించడం మొదలు అనేక కార్యక్రమాలను జరిపించడం ఇత్యాది ప్రక్రియల ద్వారా తమ ఉనికి తెలియజేసేందుకు ఉత్సుకత చూపించడం జరుగుతుంది. అయితే కాలక్రమేణా ఆ పేరు ప్రతిష్టలు కనుమరుగయ్యే అవకాశాలున్నాయి. అదే సామాజిక సేవా దృక్పథం తో నిత్య సేవలను సమాజానికి అందించేవారి పేరు రాబోయే తరం వారు కూడా గుర్తుపెట్టుకునే విధంగా స్థిరంగా ఉంటాయి. దీనర్థం మనిషి సామాజిక జీవన రూపకల్పనకు సంపదలు అవసరమే కానీ అవే సరైన రూపకల్పనలకు దారులు కావు.
కొంతమంది డబ్బులు బాగా సంపాదిస్తారు. వృద్ధాప్యం వచ్చినా ఆ డబ్బు మీది వ్యామోహం తగ్గదు. డబ్బును ఆదా చేయాలనే ఆలోచన సదా వెన్నంటి ఉంటూ, కనీస అవసరాలకు కూడా డబ్బును వెచ్చించడానికి ఇష్టపడరు. ఆ ఆలోచన యొక్క పర్యవసానం ఆ వ్యక్తితో కలిసి అతను లేక ఆవిడ మీద ఆధారపడి జీవిస్తున్న సాటి మనుషులందరూ ఎన్నో సౌలభ్యాలను కోల్పోవడం జరుగుతుంది. కేవలం తిండి, బట్ట, గూడు మాత్రమే కాదు నేటి సమాజంలో దొరుకుతున్న సౌలభ్యాలు ఎన్నో మన శ్రమను తగ్గించి, సుఖంగా, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి. అలాగే మరికొంతమంది వారి వద్ద డబ్బు లేకున్ననూ, ఏదో గొప్పలకు పోయి లేనిపోని ఖర్చులతో కుటుంబంలో కలతలను, కష్టాలను కొనితెచ్చుకొంటారు. ఏదైనా మన ఆలోచనల పరిధిలోనే జరుగుతుంది. కనుకనే మంచి ఆలోచనను మనమే సృష్టించుకొని, సమతుల్యమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. నేను పైన వ్రాసిన ఈ మాటలన్నీ ప్రత్యక్షంగా నేను నా జీవితంలో చూసిన, చూస్తున్న సన్నివేశాలు.
సాటి మనిషిని ప్రేమించడం నేర్చుకుంటే మనోనిబ్బరం కలుగుతుంది. సాటి జీవిని ప్రేమించి, లాలిస్తే మానవత్వం పరిమళిస్తుంది. అపుడే మనిషి జీవితానికి పరిపూర్ణత్వం లభిస్తుంది.
‘సర్వే జనః సుఖినోభవంతు’