తరతరానికి సామాజిక జీవన ప్రమాణంలో, పరిస్థితులలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. కనుకనే తరాలు మారినా అంతరాలు పెరగకుండా ఉండాలంటే, ఆ బంధ, అనుబంధ సారూప్యాలు కొనసాగాలంటే మన ఆలోచనల పుట్టుకలో కొన్ని సర్దుకుపోయే గుణాలు కూడా ఏర్పడాలి. మనలో సహజసిద్ధంగా ఏర్పడే స్వాభిమానం, అదేనండి ego, (నేను అనే అహం) అనే పొరను, ఒక తెర గా మార్చుకొని అప్పుడప్పుడు ఆ తెరను తొలగించి పరిసరాలను పరిశీలిస్తూ తదనుగుణంగా మన ఆలోచనలకు, ఆచరణలకు మార్పులు చేర్పులు చేసుకోవాలి. అప్పుడే మనకు అందరూ, మనం అందరికీ దగ్గరౌతాము.
మొన్న, ‘రాబోయే దశాబ్దాలలో మరియు నలభై ఏళ్ల తరువాత మనిషి జీవనశైలి ఎలా ఉండబోతోంది’ అనే విశ్లేషణను చదివాను. అందులోని కొన్ని అంశాలు వాస్తవమే కానీ మిగిలిన ఊహలన్నీ (predictions), ఊహలుగానే ఉండే అవకాశం లేకపోలేదు. నిత్యజీవన స్రవంతిలో శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు ఒక భాగమై పోయాయి. కనుకనే అనూహ్యమైన ఈ విజ్ఞాన ఫలితాలు రోజుకో క్రొత్త వస్తువును మనకు పరిచయం చేస్తూ, మనందరి జీవితాలను మరింత సుఖమయ జీవనానికి అలవాటు చేస్తున్నాయి తద్వారా సహజమైన ప్రకృతి ధర్మాలను విస్మరించే పరిస్థితిని కల్పిస్తున్నాయి. వాటివలన నిజంగా మంచి జరుగుతున్నదా లేక చెడు జరుగుతున్నదా అని బేరీజు వేసుకునే అవకాశం లేదు. కారణం, ఈ అనంత విశాల విశ్వం యొక్క కాల చక్రంలో మనిషి జీవన పరిమాణం అత్యంత స్వల్పం. ఎంత కాలం మనుగడ సాగించామని కాకుండా ఎంత సార్ధకతను చేకూరుస్తూ, స్వయం శక్తిని ఉపయోగిస్తూ జీవితాన్ని కొనసాగించామనే ఆలోచన మనకు కలగాలి. అప్పుడే అందుకు తగినవిధంగా మనం మన జీవన దారిని మార్పులు చేర్పులతో సరిదిద్దుకుని ముందుకు సాగుతాం. ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని మంచి అభివృద్ధి పథంలో రాణించాలంటే, అందుకు ఎంతో శ్రద్ధగా తెలివిని కాలానుగుణంగా పెంచుకుంటూ, సామాజిక స్పృహ ను కలిగి, సమాజ పోకడలను ఆకళింపు చేసుకుని జీవన ప్రయాణం కొనసాగించాలి. అదంత సులువైన ప్రక్రియ ఏమీ కాదు. కనుకనే అతి సులభంగా తప్పటడుగులు వేస్తూ వాటిని సరిజేసుకునే ప్రహసనంలోనే సగం జీవితం గడిచిపోతోంది. కీలకమైన కొన్ని చిన్న విషయాలను విస్మరిస్తూ అనుభవరాహిత్యంతో తప్పులు చేస్తున్నప్పుడు ప్రతి మనిషికి యంత్రాలు తోడుండి ఏమీ చేయలేవు. అదే పెద్దవారు, అనుభవజ్ఞులు, లేక మంచి ఆప్తమిత్రుడు మనకు ఆ సమయంలో మంచి సలహాలను అందించగలరు. మనం నిర్మించిన యంత్రాలు అందించలేని మనోల్లాస ఆరోగ్యకర జీవితాన్ని, మనం మనసుపెట్టి పెంచి పెద్దచేసి, మంచి జీవితాన్ని నిర్మించుకునేందుకు సహాయం చేసిన మన పిల్లలు లేక సాటి మనుషులు మనకు ఎప్పుడూ అండగా ఉంటారు. స్వార్థచింతన ఎప్పుడూ, ప్రతిచోటా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో నమ్మకం, మానవీయత, స్వచ్ఛతకు కూడా స్థానం ఉంటుంది. అది మనందరం నమ్మితేనే ఆనందకర జీవితాన్ని పొందగలము.
‘సర్వే జనః సుఖినోభవంతు’
thank you great message to humanity