Menu Close
Kadambam Page Title
ఓ కవితా మహాధునీ !!

మహాధుని స్ఫూర్తి తో పారే పిల్ల కాలువ

-- విప్పగుంట రామ మనోహర

కుక్క పిల్లని కవితా వస్తువు చేసిన సాహసీ
అగ్గిపుల్ల గీసి మరీ నెత్తురు మండించిన తెంపరీ
కష్టజీవి కిరువైపుల నిలబడి
కవిగా మోసపు లోకంతో తలబడ్డ బాహుబలీ
ఓ కవితావేశపు మహా ధునీ !!
ఓ మరో ప్రపంచపు మహారథీ !!
శ్రీ శ్రీ ... శ్రీ రంగం శ్రీనివాస కవితావన కేసరీ !!!

ఈ లోకపు బాధంతా నీ బాధై
మరో లోకానికి దారులు వేసేందుకు
నీలో నువు కుమిలీ రగిలీ
నీ గొంతున లావా సెగలై పిగిలీ
నువు చూసిన ఆవేశపు స్వప్నాలూ
నీ వెగిరించిన విప్లవకీల విహంగాలూ
దేవతల నెదిరించిన భృత్యుల ధిక్కారపు ఘీంకారాలూ
నువు దారులు మళ్లించిన రథ చక్రాలూ
నువు స్పర్శించిన ముసిల్దాని ముడుతల దేహం
నువు చెక్కిన ఆకటి బాటసారి శిల్పం
సంఘర్షణలో ఆరిన దీపాలతో  వేలాడిన శిరసులతో
నువు పలికించిన హృదయపు సాక్షాలూ
నీ కథనాలూ పదములతో చేసిన కదనాలూ
నీ సాహిత్యపు ఔన్నత్యాలూ
కవితకు నువు తెగ్గొట్టిన ఛందో బంధాలూ
తిరిగి లిఖించిన నూతన చందాలూ
అన్నీ కడుపు మండిన నీ ఏడుపులే
ఎగిసి పడే ఆక్రోశపు ఉ ఛ్చ్వాసాలే
నెత్తురు మండే  నీ గుండెల రణన్నినాదాలే
వడి వడి గా అలజడి గా
నా నరనరమున జల జల రాలి పడే నిప్పుల కణికలే

నిను స్మరిస్తే మెదడున భూకంపం
నీ తలపే విప్లవ జ్వాలా ఆవహనం
నీవే నీ సరి
శ్రీ శ్రీ
నీవే కవితా శివతాండవ ఝరి
అగ్నిశిఖలు కక్కే  విప్లవ గిరి
సాహిత్యపు జలనిధి దాగిన అంతెరుగని సిరి... సిరి

-----*------

ధుని = నది

విప్లవ కీల = విప్లవ జ్వాల

Posted in July 2020, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!