మాటల వంతెన కింద ఇద్దరం నదై ప్రవహించడం ...
కొన్ని కలల పడవల్ని హృదయాలపై తేలియాడించడం
నిన్నా మొన్నటి కథలా లేదూ....!?
నేను కొన్ని మౌనాలను ఇసుకలా పోస్తుంటే....
కాస్త తడి మనస్సు అద్ది
నువ్వు దిద్దిన సైకత చిత్రానికి ఎన్ని భావనలో చెప్పేందుకు
గుండె గొంతు తెరవక తప్పని క్షణాలు
ఇప్పుడే విచ్చుకున్న మల్లెల్లా పరిమళం వెదజల్లడం లేదూ...!
నువ్వు ఏవో దిగుళ్లను ఆలోచనల సంచుల్లో మోసుకొచ్చినప్పుడల్లా....
నేనెగరేసిన నవ్వుల పావురాల వెంట పరిగెడుతూ
నువ్వు తేలికవ్వడం నేనెలా మరువగలనూ....!
ఇద్దరం పంచుకున్న వెన్నెలలూ....
తుంచుకున్న నక్షత్రాలూ
అలసిన రాత్రులని
ఇప్పటికీ సేదతీర్చడం...
కలని ఎలా భ్రమించనూ...
నీ ఇంటి చూరుకి నేనో అక్షరమై వేళ్ళాడడం....
నా నట్టింట్లో నువ్వో ఆకుపచ్చ వాక్యమై మొలవడం....
ఇద్దరం కలిసి ఓ కొత్త కావ్య నిలయాన్ని కట్టడడం....
ఇప్పుడే ...ఇంత క్రితమే జరిగినట్టు లేదూ...!
నువ్వో గతమని...
నేను నీ స్మృతిననీ
ఎంత చెప్పినా వినదే మనస్సు!
తనక్కడే ఆగిపోయింది....
ఎక్కడైతే...
నువ్వూ... నేనూ...
మనమయ్యామో...
ఓ విరిసిన వనమయ్యామో...
ఆ మధుర స్మృతుల వద్దే ఆగిపోయింది!
ఆగిపోయే నా ఊపిరికి
ప్రాణ వాయువు నందిస్తూ....
తనక్కడే ఆగిపోయింది!
నా కవితను ప్రచురించిన మధు సర్ కి ఉమ గారికి ధన్యవాదాలు
ధన్యవాదాలు sir
చక్కటి భావాలు.హృదయాన్ని ఆకట్టుకునేవి.
Dhanyavaadaalu sir