ఏకాదశ అధ్యాయం (అమ్మవారి శ్రీ చక్రార్చన మహిమ)
శ్లోకాలు: 82-87, సహస్రనామాలు: 373-400
నిత్య క్లిన్నా దేవికి-- సదార్ద్ర చిత్తకు ప్రణామాలు.
ఉపమానమే లేనట్టి దేవికి వందనాలు.
నిర్వాణ సుఖాన్ని ప్రసాదించునట్టి పరమేశ్వరికి ప్రణామాలు.
నిత్యమై షోడాశికా యజ్ఞములచేత తృప్తిపొందే తల్లికి వందనాలు.
పరమశివునికు శ్రీకంఠుడన్న నామమున్నది. అట్టి శ్రీకంఠుని అర్ధాంగికి వందనాలు.
మహత్తర ప్రభావంచే తేజరిల్లునట్టి మహేశ్వరికి వందనాలు.
ప్రకాశమే స్వరూపంగా గల దేవికి వందనాలు.
సర్వజగత్తులలో ప్రసిద్ధిచెందిన మాతకు ప్రణామాలు.
పరమేశ్వరుని పత్నియైన పరమేశ్వరికి వందనాలు.
స్థావరజంగమాత్మకమైన యావద్విశ్వాన్ని సృజించెను నెట్టి మూలం ప్రకృతి స్వరూపిణికి ప్రణామాలు.
అవ్యక్త శబ్దం--బ్రహ్మవాచకము అనగా బ్రహ్మ స్వరూపిణికి ప్రణామాలు.
మహాతత్త్వ-- పరబ్రహ్మ స్వరూపాలకు వ్యక్తావ్యక్త స్వరూపమని పేరు. అట్టి రెండును తానైయున్న పరదేవతకు వందనాలు.
యావద్విశ్వంలోనూ వ్యాపించియున్న సర్వవ్యాపినికి వందనాలు.
* * * ఏకాదశ అధ్యాయం సమాప్తం * * *
ద్వాదశ అధ్యాయం (మంత్ర విద్య, సిద్ధ విద్య స్వరూప అమ్మవారు)
శ్లోకాలు: 87-97, సహస్రనామాలు: 401-474
వైకృత, ప్రాకృత, కౌమార నామకమైన వివిధాకృతులను దాల్చిన సర్వేశ్వరికి ప్రణామాలు.
తానే విద్యాస్వరూపిణియై మరల తానే అవిద్యాస్వరూపిణియై కూడ ఉండునట్టి మాతకు ప్రణామాలు.
మహాకామేశుడు--అంటే పరమశివుడని అర్ధము. అట్టి పరమశివుని నేత్రరూపమైన కలువలను వికసింపజేయుటకు వెన్నెలవంటి తేజోమయమూర్తికి వందనాలు.
భక్తుల హృదయగుహలలో రాశీభూతమైయున్న అజ్ఞానాంధకారాన్ని రూపుమాపడానికి అనంతప్రభలతో తేజరిల్లే భాస్కర స్వరూపిణికి నమోవాకాలు.
పరమశివునే దూతగాచేసి పంపగలిగిన శివదూతికి వందనాలు.
శివునిచే సయితమారాధించబడిన మహాశక్తికి ప్రమాణాలు.
‘శివ’ స్వరూపిణికి అంటే శాంతమూర్తికి వందనాలు.
జీవుని శివునిగ చేయగల మహాత్తర శక్తిగల తల్లికి నమోవాకాలు.
శివునకు ప్రియాన్ని చేకూర్చునట్టి శివప్రియకు ప్రణామాలు.
శక్త్యాతీతుడైన శివునికంటె పరమైన దేవికి--శివునియందు తత్తచిత్తురాలైన మాతకు ప్రణామాలు.
శిష్టజనులయందు -- సద్ధర్మ మార్గరతులైన వారియందు ఇష్టముగల తల్లికి వందనాలు.
శిష్టజనులచే అంటే విశిష్ట వ్యక్తులచే, గొప్పవారిచే కీర్తించబడునట్టి తల్లికి వందనాలు.
కొలువు తగినదైయుండి, కొలచ-- అసాధ్యయై తేజరిల్లు అప్రమేయమూర్తికి వందనాలు.
నిజతేజస్సుతో ప్రకాశించునట్టి స్వయం ప్రకాశ స్వరూపిణికి వందనాలు.