కుమారి శతకము
కం. | ఇరుగు పొరుగిండ్లకైనను వరుఁడో కాక అత్తగారో వదినయు మామో మఱిఁదియో సెలవీకుండగఁ తరుణి స్వతంత్రించి పోవదగదు కుమారీ! |
తాత్పర్యము: | ఇరుగు పొరుగిళ్లకు భర్తకాని, అత్తగారు కానీ, వదిన గాని, మామ లేక మరిది కాని అనుమతి లేనిదే స్త్రీ స్వతంత్రించి పోకూడదు. |
కం. | ఎంగిలి పరులకుఁ బెట్టకు కంగున మ్రోయంగ నీకు కాల్మెట్టియలన్ బంగారు లాభముండిన దొంగతనము సేయుబుద్ధిఁ దొలగు కుమారీ! |
తాత్పర్యము: | నీ ఎంగిలి ఎవ్వరకు పెట్టవద్దు. మట్టెల మ్రోత వినపడునట్లు నడువవద్దు. బంగారమైననూ దొంగిలించవద్దు. |
కం. | ఆలోచన యొనరించెడి వేళలలో మంతి భంగి కోరిన రీతిన్ కాలోచితకృత్యంబుల భూలోకమునందు గీర్తిఁబొందు కుమారీ! |
తాత్పర్యము: | భర్తకు కార్యాలోచనలో మంత్రి వలె మంచి సలహాలను ఇచ్చిన స్త్రీ ఈ లోకంలో గణ్యత పొందును. |
కం. | మగనికి నత్తమామకు దగు సేవ యొనర్చుచోట దత్పరిచర్యన్ మిగులనుతి బొందుచుండుట మగువలకుం బాడి తెలిసి మసలు కుమారీ! |
తాత్పర్యము: | భర్తకు, అత్తమామలకు తగిన రీతిగా సేవలు చేయుచు, ఆ సేవలలో మిక్కిలి మెప్పు సంపాదించుకొనుటకు మెలుకువతో ఉండవలయును. |
కం. | తిట్టినం దిట్టక కొట్టిన గొట్టక కోపించెనేని గోపింపక నీ పుట్టిన యింటికిఁ బాదము పెట్టిన యింటికి వన్నె పెట్టు కుమారీ! |
తాత్పర్యము: | ఓ కుమారీ! నీ భర్త తిట్టినను తిట్టక, కొట్టినను కొట్టక, కోపించినను కోపగించక, పుట్టినింటికి, మెట్టినింటికి వన్నె తీసుకు రమ్ము. |