తృప్తి
ఆ ఊర్లో కామేశానిది బంగారు అంగడి. పక్కనే సరుకుల అంగడి అనంతానిది. ఇద్దరి ఇళ్ళూ పక్కపక్కనే. ఇరువురూ బాగా సంపాదించి ఆ ఊర్లోకల్లా పెద్ద ధనవంతులుగా పేరుపొందారు. కానీ ఇంకా ఇంకా సంపాదించాలని ఆశ. తమ వ్యాపారాభివృధ్ధి గురించి రాత్రులంతా ఆలోచనల తో నిద్రపోరు.
కామేశం ఉదయం పదిగంటలకు బంగారు అంగడి తెరిస్తే రాత్రి పది గంటలకు మూసేసి ఇల్లు చేరుతాడు. అనంతు ఉదయం ఎనిమిదికే అంగడి తెరుస్తాడు, ఉదయాన్నే సరుకులకోసం మనుషులు రావడం మొదలు పెడతారు. పప్పులు, బియ్యాలూ వంటకోసం కావాలి గనుక జనం అతడి అంగడి ముందు బారులు తీరుతారు. ఒక్కోరోజు మధ్యాహ్నం భోజనం చేయను కూడా తీరుబాటు అయ్యేదికాదు అనంతానికి.
ఇహ కామేశం ఉదయం పదికి షాపు తెరిచి మధ్యాహ్నం మూడింటికి ఎలాగో భోజనం చేశాననిపించి పరుగుపరుగున వచ్చేవాడు. అతడి ముసలి తల్లి అతడు తింటేకానీ తినేదికాదు. ఆమెకు పసుపుకుంకుమ క్రింద ఇచ్చిన సొమ్ముతోనే అతడు వ్యాపారం ప్రారంభించాడు మరి. అందుకని ఎలాగో మధ్యాహ్నం భోంజనం తప్పక తినేవాడు. పైగా సరుకుల అంగడిలా నిత్యం బంగారు అంగడికి వచ్చేవారు తక్కువ. పెళ్ళిళ్ళ సమయంలో, శ్రావణ మాసం నోముల సమయంలో అతడికి తీరికే ఉండేది కాదు.
రాత్రికి కామేశము, అనంతూ ఇద్దరూకల్సి ఇంటికి కబుర్లాడుకుంటూ, వ్యాపారలావాదేవీల గురించీ, కష్ట సుఖాలనూ పంచుకుంటూ ఇల్లు చేరేవారు. ఇంటికెళ్ళేసమయానికి పిల్లలంతా నిద్రేపోయేవారు, తాము నిద్రలేచేసరికి పిల్లలు బడికి వెళ్ళేవారు.
అనంతం అంగడికి అతడి గోడవున్ నుంచి సరుకులు చెక్కబండిమీద రోజూ తెచ్చి అందజేసేవాడు వాసయ్య. అతడు ఉదయం ఏడింటికల్లా గంజిత్రాగేసి, ఇంట్లోబయల్దేరి గోడవున్ నుంచి సరుకులు చెక్క బండిమీద వేసుకుని లాక్కుంటూ ఎనిమిదికల్లా షాపు కొచ్చి దింపేసి, మళ్ళా గోడవున్ కెళ్ళి ఇలా రోజంతా పనిచేసి రాత్రి ఏడుకాగానే పని ఆపేసి ఇంటి కెళ్ళేవాడు.
ఇద్దరి షాపులకూ దగ్గరగా వాడికో పూరిగుడిసె. ఓపక్క కప్పుకూడా లేచి పోయి ఉంటుంది. ఇంటికెళ్ళగానే వాడు భార్యాబిడ్డలతో భోజనం చేసి వాడి ఇంటిముందున్న వేప చెట్టుక్రింది అరుగుమీద పాత బొంత వేసుకుని పడుకుని బిడ్డలిద్దరితో, భార్యతో కబుర్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండేవాడు.
రోజూ రాత్రి పది తర్వాత ఇంటికెళుతున్న కామేశానికీ, అనంతానికీ వారినవ్వులు, కబుర్లూ వినిపించేవి. సరైన ఇల్లూలేదు, సంపాదనాలేదు, చిరుగులబొంత మీద పడక. వాడు ఇంత అనందంగా ఎలాఉంటున్నాడో వారికి అర్ధమయ్యేదికాదు. తామిద్దరూ కోట్లకుపడగలెత్తినా ఏనాడూ వారిళ్ళలో నవ్వులే వినిపించవు. మాటలకే కరువు. ఒకరిముఖాలొకరు చూసుకునేది ఏదో పండగల సందర్భంలోనే.
వాసయ్య అంత సంతోషంగా ఎలాఉంటున్నాడో వారికి అర్ధమయ్యేది కాదు. ఓ రోజున ఇద్దరూ రాత్రి వెళుతూ వాసయ్య ఇంటిముందు నిల్చి అతడ్ని పిలిచారు."వాసయ్యా! ఏంటోయ్ అంతలా నవ్వుతున్నావ్!" అడిగాడు కామేశం.
"మీరా! అయ్యా! ఇంటికెళ్తున్నారా! మా నవ్వులకేముందయ్యా! ఏదో చెప్పుకుని నవ్వుకుంటాం." అన్నాడు.
"ఈరోజు ఏంతిన్నావు?"అడిగాడు అనంతం.
"మాకేముంటాయయ్యా! తినేందుకు మీరిచ్చే జీతం డబ్బుల్తో గంజి తాగుతాం, అందరం అన్నం తిన్న రోజు మాకు పండగే"అన్నాడు.
వారిద్దరికీ తమ ఇళ్ళలో బంగారుకంచంలో షడ్రసోపేతమైన భోజనం గుర్తొచ్చింది." నీవింత సంతోషంగా ఎలా ఉంటున్నావు వాసయ్యా! గంజి తాగి?"అడిగాడు కామేశం.
"కాలేకడుపుకు మండేగంజి. తృప్తే మా ధనం, ఎవరో దోచుకెళ్తారనే భయం లేదు. సంతోషమే మా బలం. దానికి మాకు కొరవలేదు. ఏరోజు గింజలు ఆరోజు గంజికాచుకుంటాం. దాచుకోను, పోతాయనే బయ్యమూ మాకు లేదు గదయ్యా!" అన్నాడు వాసయ్య.
ఇద్దరికీ ఙ్ఞానోదయమై, వాసయ్యకు వారింటి వారందరికీ తిండికి సరిపడా జీతం పెంచి, వ్యాపారాలు తమ బిడ్డలకు అప్పజెప్పి, హాయిగా తీర్ధయాత్రలుచేస్తూ, భారీగా దానధర్మాలు చేయసాగారు. అపుడు వారికి సంతోషం చిరునామా ‘తృప్తి‘ అని తెలిసింది.
నీతి - తృప్తి లేని జీవితం ఎడారిలో నీటిబొట్టు వంటిది.