జీవితకాలం మొత్తం
గుండె తేమ
నాలుకపై ప్రవహించిందంటే
మనసు మనుగడలో జీవరహస్యం
రుచి కోల్పోదనే....
మండే మనసులో మరిగినా
కరగని ఇష్టం
ఎండి ఒక రుచితో
పండి మరో రుచితో
ఎక్కడో ఎదురుచూస్తునే ఉంటుంది.
కల ప్రశ్న
కాలం జవాబు కోసం
ఒంటరిగా ప్రేమతో కలసి తవ్విన
తవ్వకంలో ఆశ బయటపడేకొద్దీ
తీపి ఊహలకు కరువే లేదు.
పగిలిన నిద్రతో
కళ్ళు మనసును
తాకి దప్పిక తీర్చుకుంటుంటే
చేదుమాటలో తీపి అర్థం దాగిందనే...
తొలి అడుగు తురిమిన
దారి ఒడిలో నవ్వుల చెట్లకు
ఎదురుచూపులు ఎరువై
పచ్చని కోరిక ఏపుగా ఉందనే...
రోజుకో రంగుల కలతో అందం
గంటకో భావంతో సిగ్గును దాచే ఇష్టం
తొక్కిసలాటలో కిక్కిరిసిన
తీరిక లేని ఊహలు ఎన్నో
మనసు తీరంలో తిరుగుతున్నాయనే...
గుండె నాలుగు గోడల మధ్యలో
జ్ఞాపకం పాదముద్రల్లో
కాలం నిశ్శబ్దమై గడ్డకట్టి
ముఖంలో ఆలోచనలు
కెరటాలై ఎగిసిపడుతున్నాయి.
ఇప్పటి వరకు ఎక్కడా
తడవని కళ్ళు తడిసి ముద్దై
వెచ్చని ఆశతో ఆరబెట్టుకునే ఇష్టంలో
మొలిచిన దృశ్యాల్లో గెలిచిన ఆనందం
పూచి పిలుస్తుందనే....
ఒక వాక్యమైనా మహా గ్రంధమే
ఒక్కో అక్షరం మరికొన్ని అక్షరాలతో
కలసి తిరిగే సంచారంలో
మహోన్నతమైన భావపు
అద్భుత ప్రయణమే జీవితం.
రాళ్లకు మాటలొచ్చు.
పలుకరిస్తే రాగాలై వాటేసుకుంటాయి.
మెత్తని వేళలో,మత్తు క్షణాల్లో
సుతిమెత్తని ప్రేమకు మనిషి బానిసే...
కాంతులను చెక్కే ఆయుధం ప్రేమ.
పూల వాసనలో ముంచి తేనెలో కడిగి
చిలకరించే నవ్వులో మెరుపులన్ని మనసుల్ని కడిగే మహత్తులే.
రాత్రులు ఉదయించిన కలలను
పగలు అస్తమించకుండా
సూరీడు కళ్ళకు సంకెళ్లు తొడిగే
పడక దిగని పచ్చని కల
వేరులా పాకుతున్నదనే....
పెదాలకు తగాదా వచ్చి
గొంతుకు కునుకు లేదు.
రాసుకున్న పలుకు లేఖలను
పారేసుకున్న పిచ్చితనంతో
ఒట్టి చేతులు కాలాన్ని వెనక్కి ఈదుతున్నాయి...
సహనమనే యుద్ధంలో
కాలం వ్యతిరేక పక్షంలా
విసిరే ప్రశ్నలు, రాత్రుళ్ళకు అంటుకుని
మండే పగటిలో మసికాబడ్డ ప్రతి రోజుకు
ప్రాణ ప్రతిష్ట చేసేదే మౌనం
నా బరువులో సగం
నాది కాదని తెలిసి విస్తుపోయాను.
నాలో సగం హక్కు నీదని
తెలుసుకుని ఆశ్చర్యపడ్డాను
ఒక్కోసారి ఉన్నట్లుండి
కల మాట్లాడకపోవడంతో
కంటికి రెప్పలు శత్రువుగా
నిద్రను మోయలేక రాత్రి నలిగిపోతుంది.