అర్కపుష్పం [జిల్లేడు పువ్వు]
వినాయకునికి అతి ఇష్టమైనది జిల్లేడు. వినాయక చవితి రోజు చేసుకునే వర సిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజ లో ఈ అర్కపత్రం ఆకు ఇరవయ్యవది. జిల్లేడు కర్రతో వినాయకుని ప్రతిమచేసి కార్యాలయాల్లో ఉంచుకుంటే కలిసొస్తుందనీ, ఏఆటంకాలూ రావనీ కొంతమంది నమ్మకం. జిల్లేడుకు గణేషునికి ఉన్నంత గౌరవం ఉంది.
జిల్లేడు లేక అర్కం (లాటిన్ Calotropis) ఎన్నో వైద్య విలువలూ, అధ్యాత్మిక ప్రాతినిధ్యం గల మందు మొక్క. దీని పాలకు చాలా ప్రాధాన్యత ఉంది. జిల్లేడుకు వికర్తనము, విక్షీరము అనే పేర్లున్నాయి.
రథసప్తమి రోజున జిల్లేడు ఆకులను తలమీద ఉంచుకుని తలస్నానం చేయడం హిందువుల ఆచారం. ఒక ఆకుకు రంధ్రంచేసి దానిలోంచి సూర్యుణ్ణి చూస్తారు.
జిల్లేడులో మూడు జాతులున్నాయి. 1. తెల్లజిల్లేడు, 2. ఎర్రజిల్లేడు, 3. రాజు జిల్లేడు.
తెల్ల జిల్లేడు దూదితో దీపాలను వెలిగిస్తే సంపద కలుగుతుందని నమ్మకం. తెల్ల జిల్లేడు దూదిని ఇప్పనూనె లో తడిపి ఐదువారాలు ఆంజనేయస్వామికి వెలిగిస్తే కష్టాలు తొలుగుతాయని నమ్మిక. తెల్ల జిల్లేడు పువ్వులతో శివుని పూజిస్తారు. ఆకులతో సూర్యదేవుని పూజిస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది.
తెల్లజిల్లేడు చెట్టు ఇంట్లో పెంచితే సాక్షాత్తు గణపతి ఇంట్లో ఉన్నట్టే అంటారు పెద్దలు. విఘ్నాలు తొలగుతాయి, తలపెట్టిన పనులు అవుతాయి. ఇది ఇంట్లో వుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయంటారు. ఈతి బాధలు వుండవు. వ్యాపారం అభివృద్ధి అవుతుంది. విద్యార్ధులకు మంచి విజయం లభిస్తుంది.
జిల్లేడు పాలు కళ్ళలో పడితే కంటి చూపు పోతుందని అంటారు. ఐతే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో అనేక దివ్యమైన మందులు తయారుచేస్తున్నారు.
ఎర్ర జిల్లేడు వాయు దేవునకు ప్రతీకరం. ఈ జిల్లేడు చర్మ సమస్యలను, కీళ్ళ సమస్యలను ఆయుర్వేదవైద్యంతో తగ్గిస్తుంది.
ప్రకృతిలోని ఏ ఆకూ పూవూ భగవంతుడు వృధాగా పుట్టించడు. అన్నీ ఏదో ఒక విధంగా ఉపయోగకరమే. కేవలం అన్నింటినీ అన్నింటికీ వాడుకునే మానవుడు మాత్రం అందరికీ ఏమాత్రం ఉపయోగకరంగా జీవిస్తున్నాడో మనం ఆలోచించాలి.