"చదివించే స్తోమత లేకగాని, చదివిస్తే, నా బంగారు కొండకి ఎంత చదువైనా అవలీలగా వచ్చి ఉండేది కదా" అని, అప్పుడప్పుడు అనుకుని కొడుకును తలుచుకుని బాధపడుతూ ఉంటుంది మీనాక్షి.
పై చదువులు చదివినా స్కాలర్షిప్ వస్తుంది జీవన్ కి. కాని దానివల్ల కొంత వరకూ మాత్రమే సాయమవుతుంది గాని, మొత్తం అన్ని ఖర్చులకూ అది చాలదు. పై చదువంటే కనిపించని ఖర్చులు ఎన్నో ఉంటాయి, కొంతైనా చేతి డబ్బు అవసరం ఉండక మానదు. డిగ్రీ పూర్తయ్యే సరికే చిన్నచిన్న అప్పులు బోలెడు లెక్కకొచ్చాయి. ఇప్పుడు అవి తీర్చడం ఎలాగన్నదే పెద్ద సమస్యయ్యి కూచుంది. కొడుక్కి డిగ్రీ చేతికి రాగానే ఉద్యోగం వస్తుందనీ, నెలకింతని ఆ అప్పులన్నీ చిటికెలో తీర్చెయ్యవచ్చుననీ అనుకుంది మీనాక్షి. కాని అలా జరగలేదు. జీవన్ తన అవసరాలన్నింటికీ ఇంకా తల్లిమీదే ఆధారపడవలసి వస్తోంది. గోల్డు మెడల్ సంపాదించినంత తేలికగా జీవన్ ఉద్యోగం సంపాదించుకో లేకపోతున్నాడు. డిగ్రీ చేతికివచ్చి, అప్పుడే సంవత్సరమయ్యిందిగాని, అతడు ఇంకా నిరుద్యోగిగానే ఉన్నాడు.
జీవన్ కి వయసు ఇరవై నిండాయి. అంటే పెళ్లి చెయ్యవలసిన వయసు వచ్చిందని అర్థం. కాని, "తా దూర కంత లేదు గాని, మెడకొక డోలు"అన్నట్లు, తన అవసరాలకు చాలినంత కూడా సంపాదించుకోలేని వాడికి పెళ్ళేమిటి! ఏదో ఒక ఉద్యోగం వచ్చి ప్రయోజకుడై, పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోగల స్తోమత ఉన్నప్పుడే కదా పెళ్లి - అనుకునేది మీనాక్షి. కాని, "పెళ్ళిచేసి, వాడిని ఒక ఇంటివాడిని చేశాకే కదా నా తలపైనున్న బాధ్యత తీరేది" అని కూడా మళ్ళీ అనుకునేది.
కిరణ్ కి ఆటో నడిపే శక్తి ఎలాగూ లేదు. ఇక జీవన్! ఉద్యోగం దొరికేదాకా ఆటో నడపాలనుకున్నాడు గాని, రాఘవ జీవన్ కి డిపాజిట్ లేకుండా ఆటోని బాడుగకు ఇప్పించ లేకపోయాడు. కాని జీవన్ మనసులో చిగురించిన, తనుకూడా ఏదో ఒక చిన్నపనిచేసి, ఎంతోకొంత డబ్బు సంపాదించి తల్లికి సాయపడాలి అన్న కోరిక నానాటికీ బలపడుతూ వచ్చింది. ఏ పని చేస్తే బాగుంటుంది అన్నదానిమీద తీవ్రంగా ఆలోచించసాగాడు జీవన్. రకరకాల ఆలోచనలతో అతనికి తల వేడెక్కిపోతోందేగాని, ఏదీ అనుసరణీయంగా తోచడం లేదు. విధ విధాలైన ఆలోచనలతో అతడు సతమత మైపోతున్నాడు.
ఆ రోజు మధ్యాహ్నం భోజనానికని ఇంటికి వచ్చిన మీనాక్షి కొడుకును అడిగింది, "ఒరే జీవా! నువ్వు ప్రయివేట్లు చెప్పగలవురా" అని.
ఒక్కసారిగా జీవన్ కి మనసుకి పట్టిన మబ్బు విడినట్లయ్యింది. సంతోషంగా తలెత్తి, తల్లి ముఖంలోకి చూస్తూ అడిగాడు, "చెప్పగలను. ఎవరికిట?"
"యాజులు తాతయ్యగారి మనవలకు."
"అదేమిటమ్మా! వాళ్ళకు మన సుజాతక్క చెపుతోoది కదా, ఇప్పుడు ఆమె కేమొచ్చింది?"
"కడుపొచ్చింది! ఏడో నెల వెళ్ళొస్తోంది. తొలి చూలేమో, రేపో మాపో పుట్టింటివాళ్ళు వచ్చి పురిటికని ఆమెను పుట్టినింటికి తీసుకెడతారుట, అదీ సంగతి! ఉద్యోగానికి కూడా సెలవు పెడుతోంది. ఇంతకీ ప్రయివేటు చెప్పడం నీవల్ల నవుతుందా కాదా? ముందు అది చెప్పు" అంది మీనాక్షి.
"ప్రయివెట్లు చెప్పగలనన్నా కదమ్మా! తప్పకుండా చెపుతా. నాకో రెండు మూడుచోట్ల ప్రయివేట్లు దొరికితే చాలు, నువ్వా మిఠాయి కొట్టుపని మానెయ్యవచ్చు" అన్నాడు జీవన్.
కొడుకు తనని గురించి ఆలోచించడం మీనాక్షికి సంతోషాన్నిచ్చింది. "నాన్నా! నేనంటే నీ కెంత ఇదిరా" అంటూ కొడుకు చెంపలంటి, ఆ చేతులతో తన చెంపలపై మెటికలు విరుచుకుంది. ఆ తరవాత అంది, "పొద్దున్న యాజులు తాతయ్య అమ్మమ్మగారితో అనడం విన్నాను, "పిల్లలకు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, సరిగా ఈ సమయంలో ప్రయివేటు ఆపేస్తే ఎలాగ, ఎవరినైనా మరో టీచర్ని చూడాలి" అని. నువ్వు సరేనంటే ఆ సంగతి నేను తాతయ్యగారితో చెపుతాను."
"వేరే ఎవరికీ చెప్పోద్దనమ్మా, వాళ్ళకి చదువు నేను చెపుతా. తాతయ్య గారికి నువ్వు ఈ వేళే చెప్పెయ్యి, చెయ్యి దాటిపోనీకుసుమీ" అన్నాడు జీవన్ ఉద్వేగంతో.
"అయ్య హడావిడా! అన్నింటికీ తొందరేనా? ముందు మనం అన్నాలు తినాలి. ఆ తరవాత, కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని, నేను స్వగృహా వాళ్ళకు సాయం చెయ్యడానికి వెడతా. సాయంకాలం వంటకు వెళ్లినప్పుడు తప్పకుండా ఈ సంగతి తాతయ్యగారికి చెపుతా - పిల్లలకి చదువు నువ్వు చెపుతావనీ వేరే ఎవరికీ ఆ పని పురమాయిం చొద్దనీను, సరా... ముందు నువ్వు భోజనం కానియ్యి" అంటూ కొడుక్కి నెయ్యి వడ్డించింది మీనాక్షి.
డిగ్రీ అందుకుని సంవత్సరమయినా ఇంకా నిరుద్యోగిగానే ఉన్నందుకు వచ్చిన మనస్థాపంవల్ల రాత్రులందు సరిగా నిద్రపట్టక, ఏ తెల్లవారుఝామునో నిద్రపోయిన జీవన్ - ఇదివరకైతే, పొద్దెక్కిగాని నిద్ర లేవలేకపోయే వాడు. అలాంటిది ఆరోజు తల్లి లేచి పనులు చేసుకుంటున్న సందడికే నిద్రలేచి కూర్చున్నాడు జీవన్. తల్లి అందించిన కాఫీ తాగి, స్నానం చేసి, బ్రేక్ఫాస్టుగా చద్దన్నంలో ఆవకాయ కలుపుకుని రెండు ముద్దలు తిని, తల్లితోపాటుగా తనూ యాజులుగారి ఇంటికి బయలుదేరాడు.
***************
మీనాక్షిద్వారా జీవన్ అభిప్రాయాన్ని విన్న యాజులుగారు, అతనిని తన మనుమలకు ప్రయివేటు మాష్టారుగా నియమించి, ఈరోజు ఏడున్నర దాటగానే మంచి ముహూర్తం ఉందనీ, ఆ సమయంలో జీవన్నివచ్చి పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టమనీ మీనాక్షిచేత జీవన్ కి కబురుపెట్టారు.
సరిగా ముహూర్త సమయానికి జీవన్ యాజులుగారి ఇంటికి చేరుకున్నాడు. అతను వచ్చే సరికే పిల్లలు చాప పరిచి పుస్తకాలు ముందుంచుకుని, చాపమీద కూర్చుని కొత్త ప్రైవేటు మాష్టారికోసం ఎదురు చూస్తున్నారు. పాఠాలు చెప్పడానికి నాందిగా జీవన్ పిల్లలచేత, ముందుగా గణేశ ప్రార్ధన, ఆపై సరస్వతీ ప్రార్ధన చేయించి, తరవాత వాళ్ళకి పాఠం మొదలుపెట్టాడు. అతడు చాలా ఉత్సాహంగా పిల్లలకు పాఠం చెప్పసాగాడు. భావుకుడైన జీవన్ పాఠం చెపుతున్న తీరు యాజులుగారికి బాగా నచ్చింది.
ఆ రోజు మొదలు ప్రతిరోజూ పిల్లలు ప్రైవేటుకి వేళ అయ్యిందనగానే చాప పరుచుకుని, పుస్తకాలు ముందర ఉంచుకుని, జీవన్ రాకకోసం ఎదురు చూస్తూ కూర్చునేవారు. అది యాజులుగారికి మరీ నచ్చేది. జీవన్ కి కూడా పిల్లలు అలా తన రాకకోసం కనిపెట్టుకుని ఉండడమన్నది చాలా సంతోషాన్నిచ్చింది. ఇన్నాళ్ళూ తనకు ప్రయివేట్లు చెప్పడంలో ఉన్న ప్రజ్ఞను తను వినియోగించుకోనందుకు కించపడ్డాడు. “ఎంత తెలివి ఉంటేనేమిటి, ఒక్కొక్కసారి మెదడు సరిగా పనిచేయదు. అందుకే, “బుధ్ధి కర్మానుసారిని” అంటారు అందుకే! కిన్నూ చెప్పినట్లు, ఆ “టైం” రావాలి దేనికైనా” అనుకున్నాడు.
ఒకప్పుడు అతని దృష్టిలో పిల్లలకు పాఠాలు చెప్పడమంత బోరింగ్ పని మరోటి లేదు. వాళ్ళు అల్లరి చేస్తూ, గోలగోలగా ఉంటారనీ, వాళ్ళకి పాఠాలు వినడం మీద శ్రద్ధ కంటే, పంతులుగారి బుర్ర తినడంలోనే శ్రద్ధ ఎక్కువనీ అభిప్రాయ పడేవాడు. కాని ప్రస్తుతం అతని అనుభవం వేరేగా ఉంది. క్రమంగా జీవన్ కి అసలు విషయం ఆకళింపుకి వచ్చింది…
పిల్లలు తమ గురువును అభిమానించడం, అభిమానించకపోవడం అన్నవి కేవలం ఆయన ప్రవర్తనమీద, పాఠాలు చెప్పే తీరు మీద ఆధారపడి ఉంటుంది - అని అతనికి అర్థమయింది. వెంటనే అతనికి ఈ గురుశిష్య సంబంధాలను ఆధారంగా చేసుకుని ఒక కథ రాయాలన్న ఆలోచన వచ్చింది.
అసలు అతనికి కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే —
కొత్తగా యవ్వనంలోకి అడుగుపెట్టిన రోజుల్లో జీవన్ మనసులో ఏవేవో ఊహలు పుట్టి అలజడి చేస్తూండేవి. చదువు పూర్తయ్యాక తరచూ లైబ్రరీకి వెళ్లి ఏవేవో పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతున్న జీవన్ మేధకి ఒకరోజు ఒక మంచి ఆలోచన పొడజూపింది. వెంటనే కలాన్ని, కాగితాన్ని అందుకుని, ఒక కథరాసి, "హితైషిణి" పత్రికకి పంపాడు. అది పబ్లిష్ అయ్యి, అతనికి పారితోషికాన్ని అందించింది. పాఠకులనుండి దానికి మంచి స్పందన కూడా వచ్చింది. దాంతో ఆ పత్రిక వాళ్ళు అతనిని ఇంకా ఇంకా కథలు రాయమంటూ ఎంతగానో ప్రోత్సహించారు. అది మొదలు అతడు "జీవన్" అన్న తన వ్యావహారిక నామాన్ని కాకుండా, "చిరంజీవి" అన్న తన పూర్తి పేరునే కలం పేరుగా చేసుకుని, తరచూ కథలు రాయసాగాడు. అలా మొదలయ్యింది అతని రచనా ప్రస్థానం!
క్రమంగా కథలు రాయడం అతనికి ఒక అలవాటుగా మారింది. అతడు రాసిన కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడుతూ, అతనికి రచయితగా మంచి పేరు తెచ్చాయి. జీవన్ అంటే ఎవరికీ తెలియదు గాని రచయిత చిరంజీవి, కథల రూపంలో అందరికీ పరిచయస్తుడే! కాలక్రమంలో "చిరంజీవి" అందరికీ అభిమాన రచయిత అయ్యాడు. ఊరూరా అతని కథలకోసం ఎదురు చూసే పాఠకులు కోకొల్లలుగా ఉన్నారు. తనకు అభం శుభం తెలియని వయసులో తాతయ్య తనకు పెట్టిన పేరు "చిరంజీవి." కాని సౌలభ్యంకోసం వచ్చిన మార్పుతో ఇప్పుడు "జీవన్" అన్నది తన వ్యావహారిక నామ మయ్యింది. తాతయ్య జ్ఞాపకంగా, తాతయ్య తనకు పెట్టిన పేరుని తను, తన కలం పేరుగా చేసుకున్నాడు. అనతి కాలం లోనే ఆ పేరుకి, ఒక రచయిత పేరుగా మంచి గుర్తింపు వచ్చింది. అది అలాంటిలాంటి సాదా సీదా పేరా ఏమిటి! అది, సాక్షాత్తూ, ఒక్క అంగలో సముద్రాన్ని లంఘించి లంకను చేరిన వాడు, సంజీవనీ పర్వతాన్ని పెకలించి తెచ్చి లక్ష్మణుని బ్రతికించిన వాడు ఐన వీర హనుమాన్ పేరుకదా!
***************
జీవన్, యాజులుగారి మనవలకి ప్రైవేటు మొదలుపెట్టి నెలయ్యింది. ఫెళఫెళ లాడే సరికొత్త వంద రూపాయిల నోట్లు పది తెచ్చి, జీవన్ చేతిలో ఉంచారు యాజులుగారు. అది తీసుకెళ్ళి తల్లి చేతిలో పెట్టి, ఆమెకు పాదాభివందనం చేశాడు జీవన్. కధలకు వచ్చే పారితోషికాన్ని పక్కన పెడితే, అది అతని తొలి సంపాదన!
మీనాక్షి పట్టరాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఆనంద భాష్పాలు ఆమె చెంపల్ని తడిపాయి. మెరిసే కళ్ళతో ఆమె కొడుకువైపు మురిపెంగా చూసింది.
"అమ్మ ఎంత అల్పసంతోషి! నిజంగా నా కేదైనా మంచి ఉద్యోగం వచ్చి, నెలజీతం మొత్తం తెచ్చి ఆమె చేతిలో ఉంచితే ఇంకెంత మురిసిపోతుందో" అనుకున్నాడు జీవన్ మనసులో.
ప్రయివేట్లవల్ల మంచి రాబడి ఉంటుందన్నది అతనికి అర్థమయ్యింది. "మరో నాలుగు ఇళ్ళలో ప్రైవేట్లు దొరికితే ఎంత బాగుంటుంది! అప్పుడింక అమ్మను ఆ భగభగ మండే మిఠాయి పొయ్యిదగ్గర కూర్చుని చేసే పని మానిపించెయ్యవచ్చు కదా" అన్న ఆలోచన అతని మనసులోకి వచ్చింది.
పిల్లలకి తను కేవలం పాఠాలు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నెన్నో తనకు తెలిసినవి - వాళ్ళకు అర్థమయ్యేవి ఐన చిన్నచిన్న విజ్ఞాన విషయాలు చెప్పడం, తగిన సందర్భం వచ్చినప్పుడు, ఒక్కో కథ కూడా చెపుతూండడం, అప్పుడప్పుడు ఒక జోకో, ఒక సామెతో, ఒక పొడుపు కథో చేరుస్తూ పిల్లల్ని సంతోష పెడుతూ ఉండడం - ఇలాంటి కొన్ని అందమైన ప్రక్రియలవల్ల జీవన్ పాఠం చెప్పే తీరు పిల్లల మనసుల్ని గొప్పగా ఆకట్టుకుంది. ఇక వాళ్ళు ప్రయివేటు మాష్టారి ఎదురు చూడడంలో ఆశ్చర్యమేముంది!
పిల్లల అభిమానమే కాదు, ఇంట్లోని పెద్దవాళ్ళుకూడా "మాష్టర్ గారు వచ్చారు" అంటూ తనను గౌరవంగా పలకరించడం, రాగానే కాఫీ ఇచ్చి తమ ఆదరాభిమానాల్ని ప్రకటించడం వగైరా జీవన్ మనసును కూడా ఆకట్టుకున్నాయి. ప్రయివేట్లు చెప్పడం పైన ఇదివరకు అతనికున్న దురభిప్రాయo స్థానే, జీవన్ కి కూడా ఫ్రయివేట్లు చెప్పడం అన్నది ఎన్నెన్నో అందమైన అనుభూతులకు ఆలవాలమైనదిగా తోచింది.
తను రాగానే ఆత్మీయంగా ఆహ్వానించి, కాఫీ కప్పును చేతికి అందించే అమ్మ లాంటి ఆ యింటి ఇల్లాలి ఆత్మీయత, తను మనసుపెట్టి చెపుతున్న పాఠాన్ని శ్రద్ధగా చెవులోరజేసుకుని, మధురగానంలా వినే పిల్లలతీరు జీవన్ కి బాగా నచ్చింది.
నెలనెలా ప్రైవేట్లు చెప్పడం వల్ల వచ్చే డబ్బు తల్లికి ఇచ్చేవాడు జీవన్. అందులోంచి మళ్ళీ కొంత తీసి కొడుక్కి ఇచ్చేది మీనాక్షి "పోకెట్ మనీ"గా. ఆ సమయంలో ఆమె కళ్ళలో కనిపించే ఆనందం చూడడమన్నది జీవన్ కి ఎంతో తృప్తిని కలిగించేది.
చేతిలో డబ్బు కనిపించగానే మీనాక్షికి కొడుకు కట్టుకుంటున్న బట్టలు మరీ పాతవిగా తోచాయి. వెంటనే ఆమె జీవన్ కి రెండు జతల కొత్తబట్టలు కొంది. అంతే కాదు, ఇంట్లోకి ఎప్పటినుండో అవసరమైయున్న సామానుకూడా కొంది. ఆపై నెలనెలా మిగులుతున్న డబ్బుతో చిల్లర అప్పులు తీర్చడం మొదలుపెట్టింది. కాని జీవన్ కోరినట్లుగా తను మాత్రం మిఠాయి కొట్టు పనిని విడిచిపెట్టలేదు మీనాక్షి. అప్పులన్నీ పూర్తిగా తీరాకగాని తానా పనిని విడిచిపెట్టేది లేదని కొడుక్కి ఖండితంగా చెప్పేసింది. "అప్పు ముప్పు” అన్నది ఆమెకున్న గట్టి నమ్మకాలలో ఒకటి.
***************
యాజులుగారి పూర్వీకులు అగ్రహారీకులు. తూర్పుగోదావరిజిల్లా లోని డెల్టా ప్రాంతమైన కోనసీమలోని మల్లెవాడ (కల్పితం)లో వారికి పంటపొలాలు, పళ్ళతోటలు, కొబ్బరిచెట్లు లాంటి వెన్నో ఫలసాయాన్నిచ్చే ఆస్తులు ఉన్నాయి. పూర్వ వైభవం ఇప్పుడు చాలావరకూ తగ్గిపోయినా ఇంకా, సంపన్న కుటుంబం - అనిపించుకోడానికి చాలిన ఆస్తిపాస్తులు మిగిలి ఉన్నాయి వాళ్ళకి. సిరిసంపదలున్న నిండైన కుటుంబం వాళ్ళది.
యాజులుగారి కొడుకూ, అల్లుడూ కూడా పెద్దచదువులు చదివిన వాళ్ళు కావడంతో, ఉద్యోగాల పేరుతో అమెరికా వెళ్లి, అక్కడే ఉండిపోయారు ఇద్దరూ కూడా. వెడుతూ వెడుతూ వాళ్ళు - తల్లితండ్రులు మరీ ఒంటరివాళ్ళు కాకూడదని, చంటిపిల్లల్ని వెంట నుంచుకుని, ఎడపిల్లల్ని తల్లితండ్రులకు అప్పగించి మరీ వెళ్ళారు. అలా ఇద్దరు మనుమల బాధ్యత యాజులుగారిదయ్యింది.
చాలా రోజులకు పూర్వం, అంటే - కొడుకు ఇండియాలో ఉండగా, యాజులుగారికి చాలా జబ్బుచేసింది. ఊపిరితిత్తులలో నెమ్ము చేరిందనీ, సముద్రపు గాలి పాడడం లేదనీ చెప్పి, గాలి పొడిగా ఉండే ప్రాంతంలో ఉండడం మంచిదని, ఆయనకు వైద్యం చేసిన డాక్టర్ చెప్పిన సలహా మేరకు, మూడువైపులా సముద్రంచేత చుట్టబడి, చెమ్మ ఎక్కువగా ఉండే మల్లెవాడను విడిచి, కొడుకు ఉద్యోగం చేస్తున్న ఈ ఊరికి, అంటే - ఆరోగ్యం కోసం దూర ప్రాంతానికి వలస వచ్చారు యాజులుగారు.
ఇక్కడకు వచ్చాక ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో, ఇల్లుకూడా కట్టుకుని, ఇక్కడే స్థిరపడిపోయారు. ఆ తరవాత కొడుకు ఉద్యోగం పేరుతో అమెరికా వెళ్ళిపోయినా కూడా, యాజులు దంపతులు మనుమలను పెట్టుకుని ఇక్కడే ఉండిపోయారు.
***************
ఢిల్లీలో ఉండే యాజులుగారి మేనకోడలు జానకి, చాలారోజులకు పుట్టినింటికి వచ్చింది. తిరిగి వెడుతూ ఒకసారి మేనమామనుకూడా చూసి వెళ్ళడం కోసం ఆమె యాజులుగారి ఇంటికి వచ్చింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. కూతురు కోవిద, కొడుకు శ్రీకర్ తల్లివెంట వచ్చారు. మూడురోజులు మేనమామ ఇంట్లో గడిపి, అటునుండి అటే హైదరాబాదు వెళ్లి విమానం ఎక్కి ఢిల్లీ చేరుకోడం అన్నది ఆమె ప్లాను. చుట్టాలరాకతో మీనాక్షికి చేతినిండా పని పడింది.
జానకి రాకతో యాజులుగారి ఇల్లు పిల్లల హడావిడితో సందడిగా ఉంది. ఆరోజు సెలవురోజు కావడంతో నెమ్మదిగా ఉదయం తొమ్మిదిగంటలకు వచ్చాడు జీవన్ ప్రైవేటు చెప్పడానికి. యాజులుగారి మనుమలతోపాటుగా జానకి కొడుకు కూడా వచ్చి కూర్చున్నాడు చాపమీద. జీవన్ అందరికీ తలకొక తెల్లకాగితం, రైటింగ్ పాడ్, పెన్సిలు చొప్పున ఇచ్చి, చెయ్యడానికి కొన్ని చిన్న చిన్న లెక్కలు కూడా ఇచ్చాడు. వాళ్ళా లెక్కలతో కుస్తీ పడుతూండగా, గుడిమైక్ లోంచి వినిపిస్తున్న భక్తి గీతాలు వింటూ, తను ఇప్పుడు రాస్తున్న కథయొక్క ముగింపును సుఖాంతం చేస్తే బాగుంటుందా లేక, విషాదాంతం చేస్తేనే నప్పుతుందా అన్నదాన్ని గురించి ఆలోచిస్తూ పరాకుగా ఉన్నాడు. లెక్కలు కరెక్టుగా చేసి మాష్టారి మెప్పును సంపాదించడం కోసం పోటా పోటీలుగా తలలు వంచుకుని ఏకాగ్రతతో ఆ లెక్కలని చేస్తున్నారు ఆ ముగ్గురు పిల్లలూను. ఆ సమయంలో అక్కడ ఇంకెవరూ లేరు.
అంతలో, "కాఫీ తీసుకోండి" అన్నమాట సుతారంగా కోకిల కూజితంలా వినిపించడంతో, అసలే పరాకుగా ఉన్నాడేమో ఉలికిపడి తలెత్తి చూసి ఆశ్చర్యపోయాడు జీవన్. అతనికి ఎదురుగా కాఫీమగ్గు పట్టుకుని వయ్యారంగా నిలబడి ఉంది పదహారేళ్ళ అమ్మాయి ఒకతె.
ఏ రోజు కానియ్యి, ఏ సమయంలో రానియ్యి జీవన్ ప్రైవేటు చెప్పడానికి రాగానే, యాజులుగారి భార్య రాజ్యలక్ష్మి, తప్పకుండా కాఫీ పంపిస్తుంది. ఆమె చెప్పగానే ఆ కాఫీ తానే కలిపి తెచ్చి కొడుక్కి ఇస్తుంది మీనాక్షి.
"ఈరోజు అలవాటుకి విరుద్ధంగా ఈ అమ్మాయి కాఫీ తెచ్చిందేమిటి! అసలు ఈ అమ్మాయి ఎవరు" అనుకుంటూ ఆ అమ్మాయివైపు వింతగా చూశాడు జీవన్.
కంచిపట్టు పరికిణీ, ఛిపాన్ ఓణీ, మెడలో నెక్లస్ వగైరా నగలతో - ఖరీదైన ముస్తాబులో ఉన్న ఆ పిల్లను చూసి, “ఎవరు ఈమె” అని ఆశ్చర్యపోయాడు జీవన్.
అతని చూపులలతో తనచూపులు కలిపి చెప్పింది ఆ అమ్మాయి, "నా పేరు కోవిద! మీరు నాకు చాలా బాగా నచ్చారు, 1-4-3 జీవన్ మాష్టారూ!" అంటూ కాఫీమగ్గు అతని చేతికి అందివ్వబోయింది.
కాని అతడు దాన్ని అందుకోలేదు. మెలికలు తిరిగిపోతూ ఆ అమ్మాయి చెప్పిన మాటలతీరుకి అప్రయత్నంగా అతనికి నవ్వొచ్చింది, కాని అది సభ్యత కాదని బలవంతంగా ఆ నవ్వుని ఆపుకునీ ప్రయత్నం చేశాడు జీవన్. అయినా అదుపుతప్పిన ఒక హాసరేఖ అతని ముఖాన్ని కాంతివంతం చేసింది.
సరిగా అప్పుడే యజమానురాలు చెప్పగా కొడుకుకోసం కాఫీ కలిపి తెచ్చిన మీనాక్షి అక్కడకు వచ్చింది. అక్కడ ఆమె కళ్ళబడ్డ దృశ్యం ఆమెకు వల్లమాలిన కోపాన్ని తెప్పించింది. తన చేతిలో ఉన్న కాఫీమగ్గుని విసురుగా పక్కనున్న స్టూల్ మీద ఉంచి, కోవిద చేతిలోని మగ్గుని గమ్మున అందుకుంది మీనాక్షి.
"అమ్మాయిగారూ, మీరు కాఫీలందించడం ఏమిటండీ, ఆ పనికి నేనున్నాను కదా! మీరిక లోపలకు వెళ్ళండమ్మా, అమ్మగారు మిమ్మల్ని ఎందుకో పిలుస్తున్నారు" అంది కోవిదతో మీనాక్షి, తనలో చెలరేగిన కోపాన్ని అణిచిపెట్టి చాలా మృదువుగా.
మీనాక్షికి తన చేతిలోని కాఫీమగ్గును ఇచ్చేసి, కంగారుగా లోపలకు వెళ్ళిపోయింది కోవిద.
"అదిగో నీ కాఫీ! స్టూల్ మీదుంది, తాగి తగులడు" అనేసి, చేతిలోని కోవిద ఇచ్చిన
కాఫీమగ్గుతోసహా విసవిసా నడుచుకుంటూ లోపలకు వెళ్ళిపోయింది మీనాక్షి.
తల్లికి అంత కోపం రావడానికి కారణం ఏమిటో తెలియక నిర్ఘాంతపోయాడు జీవన్. ఎలాగైనా ఆ లెక్కల్ని పూర్తిచేసి, మాష్టర్ గారి మెప్పు పొందాలన్న పట్టుదలతో ఉన్న పిల్లలు, వంచిన తల ఎత్తకుండా, వాటిని సాల్వుచేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళకి అప్పుడు అక్కడ జరుగుతున్నది ఏమిటన్నది ఎంతమాత్రం తెలియదు. అప్పటికే పిల్లలు లెక్కలు పూర్తి చేసి ఉండడంతో వాటిని సరిదిద్ది ఇచ్చి, మరి పాఠాలు చెప్పకుండా రేపటికి వాయిదావేసి, తల్లి తెచ్చిన కాఫీ మగ్గును అలాగే వదిలి, చిన్నబోయిన మనసుతో ఇంటికి వెళ్ళిపోయాడు జీవన్. తల్లి ప్రవర్తన మనసును చివుక్కుమనిపించడంతో జీవన్కి ఇక కాఫీ త్రాగాలనిపించలేదు. తను చేసిన తప్పు ఏమిటో, తన తల్లికి అంతకోపం ఎందుకు వచ్చిందో ఎంత తీవ్రంగా ఆలోచించినా అతనికి ఎంతమాత్రం అంతు చిక్కలేదు.
***************
మనసు కుదురుగా లేకపోడంతో కొంత సేపు అటూ ఇటూ తిరిగితిరిగి చివరకు ఇంటికి చేరుకున్నాడు జీవన్. ఇంట్లో ప్రవేశించి, తలుపు దగ్గరగా మూసి, చాప పరుచుకుని సీలింగువైపు దీక్షగా చూస్తూ పడుకున్న జీవన్ కి కాలం ఎలా గడిచిపోతున్నదీ తెలియలేదు.
టైం ఒంటిగంట ఔతూండగా, చేతినిండా భోజన సామగ్రితో భళ్ళున తలుపు తోసుకుని లోపలకు వచ్చింది మీనాక్షి. తల్లిని చూసి లేచి తల్లికి ఎదురుగా వెళ్ళాడు జీవన్. ఘల్లున శబ్దం వచ్చేలా తెచ్చిన సామాను క్రిందపెట్టి, తలెత్తి సూటిగా కొడుకువైపు చూసింది మీనాక్షి, "దౌర్భాగ్యుడా! అసలు నిన్నుగురించి నువ్వు ఏమనుకుంటున్నావురా" అంటూ మొదలుపెట్టింది.
తల్లి ఎందుకలా మాట్లాడుతోందో తెలియక జీవన్ తెల్లబోయాడు.