Menu Close
అయ్యరు హోటల్ కమ్ సమాచార కేంద్రం
-- గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం --

ఈ ఊరిలో ఎవరి గూర్చి తెలుసుకోవాలన్నా, ఏ సమాచారం కావాలన్నా, అయ్యరు హోటల్ లోనికి అడుగుపెడితే చాలు; అదొక అనధికార సమాచారకేంద్రం. అయితే, ఆ హోటల్ కు పేరు తెలుపుతూ, బోర్డు లేదు. కాని, ‘జగమెరిగిన బ్రాహ్మణునకు జంధ్యమేల’ అన్నట్టు, ఈ ఊరిలోనే కాక, చుట్టుప్రక్కల ఉన్న అన్ని ఊళ్ళ వారికి తెలిసిన, ఆ హోటల్ కు, బోర్డు అవసరం పడలేదు.

ఆ హోటల్, సమాచారకేంద్రంగా ఎలా పనిచేస్తున్నాదో తెలుసుకొనే ముందు, దాని యజమాని అయ్యరు గూర్చి తెలుసుకొందాం. మన అయ్యరు, చెన్నపట్నంలో పుట్టి పెరిగేడు. అక్కడే, ఓ పేరుమోసిన హోటల్ లో పని చేసి, పాకశాస్త్రంలో కిటుకులు నేర్చుకొన్నాడు. పదేళ్లు పని చేసి, అంతో ఇంతో, వెనకవేసుకొన్నాడు. అక్కడ ఎన్నాళ్ళు పని చేసినా, ‘ఎక్కడి గొంగళి అక్కడే’ అని తెలుసుకొన్నాడు, ఇప్పుడు అయ్యరు గా మారిన, అప్పటి కోదండరామయ్య.  స్వంత వ్యాపారానికి, ఈ ఊరులో అవకాశాలు కొల్లలని, అతని మిత్రులు కొందరు సలహా ఇచ్చేరు. అది మన్నించి, ఈ ఊరికి డబ్బా డవాలుతో పయనమయ్యేడు. కాని, అప్పటికే అతని పేరునుండి ‘కోదండ’ ఎప్పుడు జారిపోయిందో, ఎలా జారిపోయిందో, ఆ పరమేశ్వరునికే ఎరిక. తత్కారణంగా కోదండరామయ్య, ఈ ఊరిలో రామయ్యగా, అడుగుపెట్టేడు. డప్పు బంగళాకు ప్రక్క నున్న వీధిలో, ఓ నాలుగు గదుల పెంకుటింట్లో, తన వ్యాపారానికి శ్రీకారం చుట్టేడు. రోజూ పరిశుభ్రమయిన తెల్లని లుంగీ, తెల్లని అరచేతుల చొక్కా ధరించి, నుదుట వీభూది  దట్టంగా రాసుకొని, గోడకు అమర్చిన దేముళ్ళ పటాలకు ధూపారాధన చేసి, గ్రాహకులకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటాడు, రామయ్య. ఉదయం ఆరు గంటలకే, వేడి వేడి ఇడ్లీలు, ఘుమఘుమ లాడుతూ, ఆవిర్లొస్తున్న సాంబారు, కొబ్బరి చట్నీ, ప్రత్యేకంగా తయారు చేసిన మలగాపొడి, దానిలోనికి, కాచిన కమ్మని నెయ్యి, తయారుగా ఉంటాయి. జనం రుచి మరిగేరు. త్వరలోనే, వ్యాపారం జోరందుకుంది. దోసెలు, ఉప్మా కూడా, వంటగది నుండి టేబుళ్లను చేరడం మొదలయింది. లోపల జాగా చాలక, కొందరు గ్రాహకులు బయట నిరీక్షించ వలసిన రోజులు వచ్చేయి. ఈ పరిణామాలతో, రామయ్య వ్యాపార వేదిక, డప్పు బంగళాకు ఎదురుగా, సుమారు ముఫై మంది గ్రాహకులకు చోటు కల్పించే, ప్రదేశానికి మారింది. తరిఫీదు చేయబడ్డ ముగ్గురు పనివాళ్ళు, వంటలకు నియమింపబడ్డారు. గ్రాహకుల సేవకు, ముగ్గురు కుదిరేరు. రామయ్య పర్యవేక్షణలో, హోటల్ ఖ్యాతి త్వరలో నలుదిక్కులా వ్యాపించింది.

రామయ్యకో అలవాటుంది. రోజూ ఉదయం దేముళ్ళ పటాలకు ధూపారాధన చేస్తున్న సమయంలో, తమిళ భక్తి గీతాలు పాడుకొంటూ ఉంటాడు. అతను మాట్లాడే తెలుగులో, కొంత తమిళ యాస కూడా ఉంటుంది. చాలా మంది గ్రాహకుల చెవిలోకి, అవి చేరేయి. వారందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చేరు.

రామయ్య,…అయ్యరూ… అని. కొందరు రుజువు కూడా చూపించేరు. ఇంత రుచికరమయిన వంటలు కేవలం అయ్యరులే చేయగలరూ… అని, సుప్రీం కోర్టుకెళ్లినా, కొట్టి పారేయలేని వాదన, వినిపించేరు. అంతే కాదు. మనవాళ్ళు చేసిన ఇడ్లీలు, రాళ్ళలా ఉంటాయి. అయ్యరుల ఇడ్లీలు, దూదిలా ఉంటాయి, అని సాక్ష్యాలు చూపెట్టేరు. అయ్యరు నిత్యం ధరించే మల్లెపువ్వు లాంటి తెల్లని లుంగీ, కేవలం అయ్యరులకే ట్రేడ్ మార్క్ అని, మన వాళ్ళు దూదేకుల సాయిబు లాగ, రంగు గళ్ళ లుంగీలతోనే, ప్రతిరోజూ ప్రత్యక్షమవుతారని ధృవీకరిస్తూ, రామయ్య, అయ్యరే అని సాక్ష్యాలను బలపరచేరు. ఇంకేమి, రుజువులు కూడా దొరికేయి. తిరుగు లేదు. రామయ్య, రామా అయ్యరు అయిపోయేడు. అంతటితో ఆగిపోలేదు. ఇప్పుడంతా SMS రోజులు కదండీ. ఏదయినా చావు కబురు తెలియగానే, ముచ్చటగా మూడు అక్షరాలు, RIP అని మెసేజ్ కొడతారు. అక్కడితో చెల్లు. అలాగే, ఆ ఊరిలో కొందరిని, ‘ఎక్కడికి’ అని అడిగితే, ‘రామా అయ్యరు హోటల్ కు’ అని చెప్పేటంత సమయం ఉండదు వాళ్లకు. ‘అయ్యరొటల్’ అని క్లుప్తంగా చెప్పి, సెల్ ఫోన్ మీద చూపుడు వేలును, క్రిందకి మీదకి త్రిప్పడంలో బిజీ అయిపోతారు. చూసేరా అయ్యరు పేరు చరిత్ర. కోదండరామయ్య పేరు నుండి, ఈ ఊరు చేరక మునుపే కోదండ జారిపోయింది. మొదట్లో, ఈ ఊరు వాళ్ళు రామయ్యను, రామా అయ్యరు చేసేరు. రామ రామా, క్రమేపి రామా కూడా, కోమా లోకి పోయింది. ఇవ్విధంబున, చెన్నపట్నం లో పుట్టి పెరిగిన కోదండ రామయ్య, ఈ ఊరు వచ్చి, అయ్యరు గా అవతారం ఎత్తేడు. కొందరు ఆయనను ఇంకా రామయ్య, అనే పిలుస్తారు. అధిక శాతం అయ్యరు అంటారు. “రామయ్య, అంటేనేమి, అయ్యరంటేనేమి, నా పొయ్యి వెలుగుతూంటే” అని విశాలమయిన వ్యాపార దృక్పథంతో, అందరికి చిరునవ్వుతో, సమాధానమిస్తాడు, రామయ్య కమ్ అయ్యరు.

మన రామాయణంలో, డప్పు బంగళా ప్రస్తావన వచ్చింది కదూ. దాని ఉత్పత్తి కూడా తెలుసుకొందాం. నిజానికి, ఆ బంగళాకు, డప్పులకు, ఎట్టి సంబంధమూ లేదు. అందులో గతంలో, ఎప్పుడో ‘డఫ్’ దొరగారు ఉండేవారట. మన తెలుగు దొరలు, ‘డఫ్’ను, ‘డప్పు’గా మార్చేశారు. ఇదండీ, డప్పు బంగళా చరిత్ర.

రెండు మూడు నెలలు గడిచాయి. గ్రాహకులు, సంతృప్తిగా అయ్యరు వంటకాలు ఆరగిస్తున్నారు. అయితే, వారిలో కొందరు, నామకే వాస్తే, ఒక ప్లేటు ఇడ్లీ ఆర్డర్ చేసి, తెలివిగా, వాటి పరిమాణం త్వరగా తరిగిపోకుండా జాగ్రత్త పడుతూ, సెర్వరు అటు వచ్చినప్పుడల్లా, ఖాళీ చేసిన సాంబారు కటోరీని, మళ్ళీ మళ్ళీ నింపించుకొంటూ, నాలుగయిదు కటోరీల సాంబారు, గుటకాయిస్వాహా చెయ్యడం మొదలుపెట్టేరు. తన కళ్ళ ఎదుటే, జరుగుతున్న సాంబారు చోరీని, అరికట్టదలచేడు, అయ్యరు. ఒక రోజు తెల్లవారేసరికి, పెద్ద పెద్ద అక్షరాలతో, ‘ప్రతీ అదనపు కటోరి సాంబారు ఒక రూపాయి.’ అని తెలియజేస్తూ నోటీసులు హోటల్ నాలుగు గోడలనూ అలంకరించేయి. ఖంగు తిన్న గ్రాహకులు అయ్యరును కలిసేరు. తమకు ఇడ్లీలు అనవసరం, కేవలం సాంబారే కావాలి, అని. వెల విషయంలో బేరసారాలు చేసేరు. ఒక ఒప్పందం కుదిరింది. ప్రతి అదనపు కటోరీ వెల డెభై అయిదు పైసలు.

అశ్వత్థామా హతః కుంజరః, అవకాశాలను సృష్టించుకోవడమే తెలివితేటలు.

ఆ ఊళ్ళో శంకరశాస్త్రి గారని ఒక సిద్ధాంతి ఉన్నారు. ఉపనయన, వివాహాది శుభకార్యాలకే కాక, ఏ విషయంలోనైనా, మంచీ చెడూ తెలుసుకోవాలన్నా, అందరూ, ఆయననే సంప్రదిస్తారు. ఆయనకు, లోకాభిరామాయణం మీద ఆసక్తి ఎక్కువ. ప్రతి రోజూ, ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో, వెడల్పయిన రంగుటంచుల, పరిశుభ్రమైన తెల్లని పంచ ధరించి, ఆకుపచ్చని శాలువా కప్పుకొని, ప్రత్యేకమయిన చేతులు లేని కుర్చీలో, అర్ధ పద్మాసనంలో ఆసీనుడై, ఎడమ పాదాన్ని కుడి అరచేతితో, సున్నితంగా నిమురుతూ, అయ్యరు హొటల్ లో ఆయన ప్రత్యక్షమవుతారు. కత్తెర పట్టినంత మేర కత్తిరింపబడి, సఖ్యతతో కలసి మెలసి ఉన్న నలుపు, తెలుపు, రంగుల జుట్టూ, చివర ముడి వేయబడిన ఆరంగుళముల పిలకా, నుదుట దట్టముగా రాయబడ్డ విభూతీ, చెల్లని పాత పావలా సైజు కుంకుమబొట్టూ, ఆయన సిద్ధాంతి గారని చెప్పకనే చెప్తాయి. ఈ హోటల్, నాలుగు గదుల పెంకుటింట్లో ప్రారంభమయినప్పుడు, శాస్త్రిగారే మొట్టమొదటి గ్రాహకులు. ఆయన బోణీతోనే, తన హోటల్ తక్కువ వ్యవధిలోనే, బాగా అభివృద్ధిలోనికి వచ్చిందని నమ్ముతున్న అయ్యరుకు, శాస్త్రిగారు అంటే చాలా గౌరవం. అలాగని, శాస్త్రిగారు ఆ గౌరవాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చెయ్యలేదు. తను ఆరగించిన ప్రతీదానికి, అణా పైసలతో చెల్లించేస్తారు.

ఒక రోజు అయ్యరు హోటల్ లో శంకరశాస్త్రిగారు కొలువు తీర్చి ఉన్న సమయంలో, పొరుగూరు నుండి వీరభద్రయ్య, వియ్యంకునితో బాటు అతని దర్శనానికి వచ్చేడు. ఇద్దరూ ఆయనకు వంగి నమస్కరించి, తమ పరిచయాలు చేసుకొన్నారు.

“ఏమిటి, ఇలా వచ్చేరు.” శాస్త్రిగారి విచారణ.

“నిన్న రేతిరి, మా సిన్నమ్మాయికి పెళ్లి సేసినామండి, అయ్యగారు.” వీరభద్రయ్య జవాబు.

“శుభం. పెళ్లి బాగా జరిగిందా.” శాస్త్రిగారి కుశల ప్రశ్న.

“అంతా బాగానే జరిగినాదండి. కాని, మద్దిలో ఓ తప్పు జరిగినాదండి, అయ్యగారు.”

“ఏమిటి జరిగింది.” శాస్త్రిగారు కుతూహలంగా అడిగేరు.

“తాలి కడుతున్న ఏల…తుమ్మినారండి, అయ్యగారు.”

“ఆ టైము లోనే గదా, తుమ్ములు వినిపించకుండా మంగళవాయిద్యాల వాళ్ళు, పెంకులెగిరిపోయేట్లు వాయించాలి. వాళ్లేమిటి చేస్తున్నారప్పుడు.”

“ఆళ్ళుసేన గట్టిగానే వాయింసినారండి.”

“మరి, తుమ్ము ఎలా వినబడ్డాది.”

“ఏటి సెప్పనండి…అయ్యగారు. సయాన్న, అల్లుడు గారే, తాలి కడుతూ తుమ్మినారండి.” అని, వీరభద్రయ్య, విచారం వెలగబోస్తూ విన్నవించుకున్నాడు.

“మా పెద్దోడు, ఎప్పుడూ తుమ్మనే...నేదండి, అయ్యగారు. అదేటో నిన్న అలా తుమ్మినాడండి.” అని, వీరకాడు వినయంగా సంజాయిషీ చెప్పుకొన్నాడు.

“సేన తప్పు జరిగినాదీ, దీనికి ఇరుగుడు ఎంటనే సెయ్యాలా, అని మా ఊరి కరణంగారు, హుకుం సేసినారండి.” వీరభద్రయ్య ఉవాచ.

“ఆ విరుగుడు ఏమిటో చెప్పేడా.” చిన్న, వెటకారపు నవ్వుతో శాస్త్రి గారి ప్రశ్న.

“సెప్పేరండి. పెల్లి మొత్తాన్న, తొలి కా...డ నుండి …కేన్సిలు సేసి, మల్లీ ముందలి కా...డ నుండి

పెల్లి సేయాలని సెప్పినారండి.” వీరభద్రయ్య, దిక్కు తోచని ముఖంతో విన్నవించె.

“మా ఆడోళ్లకి అది నచ్చనేదండి, అయ్యగారు. మల్లీ పెల్లి సేత్తే, అది రెండో పెల్లి అయిపోద్ది, అని గొడవ ఎడుతున్నారండి.” కొశ్చను మార్కులా ముఖం పెట్టి, శాస్త్రిగారి ముఖంలోకి చూసేడు, వీరభద్రయ్య.

దగ్గరలోనే ఇడ్లీ, వడ, కాంబో తింటూ, ఈ సంభాషణ వేపు ఒక చెవి పారేసిన, పొట్టి ప్లీడరు ధర్మారావు, మాట కలుపుతూ, “వాళ్ళు చెప్పింది కరక్టే. లా ప్రకారం, అది రెండో పెళ్లే అవుతుంది.” అని లా పాయింటు చెప్పేడు.

“మా ఊళ్ళో పెద్దలంతా, ఈ ఇసయంలో తమకే బాగ తెలత్తది, సరైన ఇరుగుడు తమరే సెపుతారని సలహా ఇస్సినారండి. అందుకే తమ కాడకు ఒచ్చినామండి అయ్యగారు.” నమ్రతతో వీరభద్రయ్య మనవి చేసుకొన్నాడు.

“సరే, మొదటి పెళ్లి, కేన్సిల్ చేసి, రెండో పెళ్లి చెయ్యడానికి ఎంతవుతుందన్నారు.” శాస్త్రిగారు వ్యంగ్యంగా అడిగేరు వీరభద్రయ్యను.

“ఓ లచ్చ, దాక అవుతాది అన్నారండి.”

“వీరభద్రయ్యా, ఏ అపచారము జరగలేదు. పెళ్ళికొడుకు, చన్నీళ్ళు స్నానం చేసి ఉంటాడు. దానివల్ల తుమ్మొచ్చింది.” అని శాస్త్రిగారు తన అనుమానం వ్యక్తబరచగానే,

“అవునండి అయ్యగారు. మా పెద్దోడు, పెందలి కాడే సల్ల…టి  నీల్లు, సానం సేసినాడండి.” కేసులో బలమయిన సాక్ష్యం దొరికినట్లు, ధైర్యం ప్రకటిస్తూ, పెళ్ళికొడుకు తండ్రి శాస్త్రిగారికి విన్నవించుకున్నాడు.

“మరేం, వాడికి కొద్దిగా జలుబు చేసి తుమ్మి ఉంటాడు. ఏ అపచారము జరగలేదు. మీ బ్రహ్మగారికి చెప్పండి. పెళ్లి కార్యక్రమం మిగతాది పూర్తి చెయ్యమనండి.” శాస్త్రిగారు, ఆర్దరు పాసు చేసేరు.

“అయితే అయ్యగారూ, ఇరుగుడు ఏటి సెయ్యనక్కర లేదా.” వీరకాడు ఆతృతగా అడిగేడు.

“ఈ విషయంలో విరుగుడు, తరుగుడు ఏమీ లేదు,” అని ధైర్యం చెపుతూ, తన తీర్పు ఇలా చెప్పేరు, శాస్త్రిగారు.

“ఈ తుమ్ముల విషయంలో చాలా అధ్యయనాలు ఎన్నో దేశాల్లో జరిగేయి. అవన్నీ వడపోసి ఏమిటి తెలుసుకొన్నారంటే - బ్రతికి ఉన్న మనిషి తుమ్మితే ఎట్టి దోషము ఉండదు, అని. అందుచేత మీరు భయపడనవసరం లేదు. నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. భద్రయ్యా, ఎల్లుండి ఆదివారం, మీ అమ్మాయిని, అత్తవారింటికి లక్షణంగా పంపించు. అది చాలా మంచి రోజు. గురుడు, కర్కాటకంలో ప్రవేశిస్తాడు. అది గురుడికి ఉచ్ఛ స్థానం. ఏడాది తిరిగేసరికి, మనవడిని ఎత్తుకొంటావు,”

హమ్మయ్య. వీరభద్రయ్యకు అతని వీరకాడుకు సమస్య తీరింది.

అయ్యగారూ, తమకు...” నసుగుతూ, వంగి దండం పెట్టి అడిగేడు, వీరభద్రయ్య.

“ఓ అయిదు పదులు ఇయ్యి. సరిపోతుంది.” అన్నారు, శాస్త్రిగారు.

వీరభద్రయ్య బిల్లు రాస్తున్న సెర్వరును, ఆ బిల్లులో, శాస్త్రిగారిది కూడా కలిపేయమని, సలహా ఇచ్చేడు,

వీరభద్రయ్య, వీరకాడు, శాస్త్రిగారికి పాదాభివందనం చేసి, శలవు తీసుకొన్నారు.

తుమ్ముల విషయంలో, శాస్త్రిగారు చెప్పిన సిద్ధాంతాన్ని విన్న పొట్టి ప్లీడరు ధర్మారావుకు, ఓ ధర్మసందేహం వచ్చి,

“శాస్త్రిగారూ, అయితే, మీరు చెప్పినట్టు తుమ్ముల వల్ల ఏ దోషము లేదని మన శాస్త్రాల్లో ఉందన్నమాట.” అని, సందేహ నివృత్తి చేసుకోబోయేరు.

“నేను, మన శాస్త్రాల గూర్చి ఎక్కడ చెప్పేనండీ. తుమ్ముల గూర్చి, అనేక దేశాల్లో అధ్యయనం జరిగందన్నాను. అందులో, మన దేశం, మన శాస్త్రాల ప్రస్తావనే లేదు. నిజానికి, ఇతర దేశాల్లో తుమ్ముని పట్టించుకోరుగదా. ఆ అమాయకులిద్దరికి, నమ్మకం కలిగే రీతిలో, భారత యుద్ధంలో ధర్మరాజు వారు, అశ్వత్థామా హతః...కుంజరః అన్నట్టు, నాకు అలా చెప్పవలసి వచ్చింది. ఇహ, ఆ అయిదు పదులు పుచ్చుకోవడం అంటారా, కేవలం వాళ్ల నమ్మకాన్ని ధృడబరచడానికే. లేక పొతే చూసేరూ, కట్నకానుకలు లేశమాత్రం వద్దని, మగపెళ్ళివారు సహృదయంతో తెలియజేస్తే, పెండ్లికుమారునకు ఏ లోపం ఉందో అని, ఆడపెళ్ళివారు అనుమానిస్తారట. నేను చేసింది సబబే అంటారా.”

దగ్గరలోనే, మసాలా దోస తింటున్న, రిటైరుడు తెలుగు పండితులు రామ్మూర్తి పంతులు గారు, స్పందిస్తూ,

“శాస్త్రి గారూ, కొన్ని విషయాలలో అబద్ధం చెప్పినా తప్పు కాదని, మన పురాణాలు చెప్తున్నాయి. మీకు తెలుసుగా, శ్రీమహావిష్ణువు, వామనుడి రూపంలో బలిచక్రవర్తి వద్దకు వచ్చి, మూడడుగుల భూమి కోరినప్పుడు, ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న బలి చక్రవర్తితో, అతడు వామనుడు కాదు, త్రివిక్రముడే అని, మాట తప్పినా తప్పు లేదని, శుక్రుడు హిత బోధ చేస్తూ,

‘వారిజాక్షులందు, వైవాహికములందు
బ్రాణ విత్త మాన భంగమందు
జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు
బొంకవచ్చు నఘము పొంద దధిప.’

అని. పెళ్లి వంటి కొన్ని అత్యవసర సందర్భాలలో అసత్యాన్ని చెప్పడం ధర్మ మార్గం తప్పడం కాదని, చెప్తాడు. అందుచేత, మీరు సరయిన సలహాయే ఇచ్చేరు.” అని, శాస్త్రిగారిని సమర్ధించేరు.

“మీకు, రెండు చేతులు ఎత్తి నమస్కారం చెయ్యాలి.” అని శాస్త్రిగారికి ఓ నమస్కారం సమర్పించుకొని, పొట్టి ప్లీడరు నిష్క్రమించేడు.

మరో పది, పదిహేను నిమిషాలలో, హోటల్ ముందు ఓ కారు ఆగింది. డ్రైవరు హోటల్ లోకి వచ్చి, శాస్త్రిగారిని వినయంగా అడిగేడు, “కొత్తూరికి దారి ఎటు సార్.” అని.

“కొత్తూరేనా.” అని, డ్రైవరు ఎటన్షన్ తన వేపు తిప్పుకున్నాడు, ఇడ్లీలు తిని మంచినీళ్లు తాగుతున్న, రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు.

“ఎలా వెళ్ళాలి సార్.”  సుబ్బారావుని అడిగేడు, డ్రైవరు.

“మీ కారులో, మరో మనిషికి జాగా ఉంటుందా.” సుబ్బారావు కూపీ.

“ఉన్నాది సార్. వెనక సీటులో అయ్యగారూ, అమ్మగారూ, ఇద్దరే ఉన్నారండి. నా పక్క సీటు ఖాళీయేనండి.” జాగా కన్ఫర్మ్ చేసేడు, డ్రైవరు.

“అయితే ఆగు. నేనీ కాఫీ తాగి మీతో వస్తాను; కొత్తూరు దాక. మరే కన్ఫ్యూజను ఉండదు.” హామీ ఇచ్చేడు, సుబ్బారావు.

“చాలా థేంక్స్ సార్.” తన సమస్య తీరిందనుకొని, డ్రైవరు వినయంగా సుబ్బారావుకు నమస్కరించి, అతని రాకకై ఎదురుచూస్తూ, కారు దిక్కుగా దారి తీసేడు.

సుబ్బారావు కాఫీ తాగడమయ్యింది. చేతితో గిఫ్ట్ పేకెట్ పట్టుకొని, డ్రైవరు పక్కన ఆసీనుడయ్యేడు. వెనక సీటులో ఉన్న దంపతులతో పరిచయం చేసుకొన్నాడు. తను వెళ్ళబోతున్న పెళ్ళికే, వారుభయులూ వెళ్తున్నారు. మరేం. సుబ్బారావు, అవకాశాన్ని తెలివిగా సృష్టించుకున్నాడు. రిటర్న్ రేజర్వేషన్ కూడా కుదిరిపోయింది.

 

(సశేషం)

Posted in December 2021, కథలు

2 Comments

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!