Menu Close
గోపీనాథుని వెంకయ్య శాస్త్రి
-- గౌరాబత్తిన కుమార్ బాబు --
Gopinaathuni-Venkayya-Sastri

శ్రీ దుర్భా సుబ్రహ్మణ్య శర్మ ‘నెల్లూరు మండలమున పెక్కుమంది కవులావిర్భవించినప్పటికీ తిక్కన వలె మహా కావ్య దీక్షా దక్షుడైనవాడు గోపీనాథ వెంకటకవియే’ అని ప్రస్తుతించారు. గోపీనాథ వెంకటకవి గురించి వెంకటగిరి సంస్థాన మరియు సాహిత్య చరిత్ర పరిశోధకుడు శ్రీ కాళిదాసు పురుషోత్తం చాలా విపులంగానూ, విమర్శనాత్మకంగానూ పరిశోధించారు. గోపీనాథుని వెంకయ్యశాస్త్రి శ్రీముఖ సంవత్సరం 1813లో జన్మించి, నందన సంవత్సరం ఆషాఢ శుద్ధ చతుర్దశి అనగా 1892 జూన్ 8న మరణించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. వీరిది కావలి తాలూకా లక్ష్మీపురం గ్రామం.

వెంకయ్య శాస్త్రి రచించిన రామాయణాన్ని కవిముఖతా విన్న అప్పటి వెంకటగిరి సంస్థానాధీశులు శ్రీ కుమారయాచమనాయుడు వెంకయ్య శాస్త్రిని తమ ఆస్థాన కవీశ్వరులుగా నియమించుకున్నారు.1859 ఆగష్టు 13న వెంకయ్య శాస్త్రి రామాయణ రాత ప్రతిని సంస్థానంలో సమర్పించారు. గోపీనాథ రామాయణం కంటే ముందు తెలుగులో ఉన్నటువంటి భాస్కర రంగనాథ మొల్ల రామాయణాదులు కథా ప్రతిపాదకములుకాగా, ఆమూలాగ్రము గ్రంథమంతా మూలముననుసరించి రాయబడినది గోపీనాథ రామాయణం.

వెంకయ్య శాస్త్రి పరమభాగవోత్తముడు. అధిగతపరమార్థుడు. అందువల్లే వీరు తమ గ్రంథమును కృష్ణాoకితం చేశారు. ధనముపై ఆశతో మనుష్యులను తమ గ్రంథములకు కృతిపతులుగా చేసే కవులను వెంకయ్య శాస్త్రి ఈ క్రింది పద్యంలో నిరసించాడు.

"నృపతుల్ వేడినన్ గరుణ నిచ్చిన నిత్తురు దంతి వాజిరత్న పటధనాగ్రహారములు దప్పక యన్నియు నస్థిరంబులా విపుల కృపా పయోనిధి యదువీరుని వేడిన ప్రీతినిచ్చు నిత్యపదము. నట్టివాని గొనియాడక యన్యుల వేడ నేటికిన్".

Gopinaathuni-Venkayya-Sastriఆస్థాన కవీశ్వరులైన పిమ్మట కుమారయాచమనాయుని ఆదేశం మేరకు వెంకయ్యశాస్త్రి కృష్ణజన్మ ఖండం అనువదించాడు. బ్రహ్మానంద శతకం రచించాడు. కుమారయాచమనాయుడు ఆంగ్లంలో రచింపజేసిన తమ వంశ చరిత్రలో వెంకయ్య శాస్త్రి రచించిన రామాయణం, కృష్ణ జన్మ ఖండం మరియు భగవద్గీతా శాస్త్రాలను తాను అంకితం పొందినట్లు రాయించుకోవడంతో రాజాగారికి, వెంకయ్యశాస్త్రికి మధ్య అపోహలు తలెత్తాయి. తరువాతి కాలంలో వెంకయ్య శాస్త్రి కుమారయాచమనాయుడి కుమారుడైన గోపాలకృష్ణ యాచేంద్రకు శిశుపాలవధ కావ్యాన్ని, అల్లుడైన చెలికాని వెంకటగోపాలరావుకు రాధికా పరిణయమను ప్రబంధాన్ని అంకితం ఇచ్చారు.

వావిళ్ళ రామస్వామి శాస్త్రులు ముద్రించిన భగవద్గీతా శాస్త్రం పుస్తకపు పీఠికలో మాత్రం రాధికా పరిణయం కుమారయాచమనాయుడి బావమరిది, తిరువూరు జమిందారులగు శ్రీ వెల్లంకి సూర్యరాయని వారికి అంకితమిచ్చినట్లు రాశారు. ఆ విధంగా అయాచితంగా లభించిన రాజాశ్రయం వల్ల వెంకయ్య శాస్త్రులు తమ సిద్ధాంతాల విషయంలో కాస్త రాజీపడ్డట్లు తెలుస్తుంది.

కుమారయాచమనాయుడి కోర్కెపై త్రిమతస్తులు చదువుకోవడానికి యోగ్యంగా భగవద్గీతను శ్రీ భగవద్గీతా శాస్త్రమను పేరిట గద్య పద్యాలలో అనువదించారు. సాంఖ్యయోగంతో ఆరంభమై మోక్ష సన్యాసయోగంతో ముగిసే భగవద్గీతాశాస్త్రంలో 460 గద్యపద్యాలున్నవి. జ్ఞాన యోగమందలి "యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత(భ.గీ 4.7)" యను శ్లోకమును "ఎపుడెపుడు ధర్మమున కీలనుపహితము నధర్మమునకు నుపదయమగు నేనపుడెల్ల నవతరింపుదు విపులన్ నిజమాయచేత వీరవరేణ్య" అను కంద పద్యంలోకి తెనిగించారు.

భగవద్గీతా సారమనదగు "ధ్యాయతో విషయాన్ పుంసః(భ.గీ 2.62)","క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః(భ.గీ 2.63)"అను శ్లోకాలను "విషయములను జింతించు పురుషునకందు గలుగు సంగంబు మరియు సంగంబు వలన గలుగు గామంబు కామంబు వలన గ్రోధ మందు వలన జనించు మోహంబు పార్ధ యని ,పరగ మోహంబుచే స్మృతి భ్రంశనంబు గలుగు మరియు స్మృతి భ్రమ వలన బుద్ధి నాశము జనించు తద్బుద్ధి నాశనమున బురుషుడు నశించు నిక్కంబు కురువరేణ్య" అని ఆంధ్రీకరించారు.

శ్రీ కాళిదాసు పురుషోత్తం గోపీనాథుని వెంకయ్య శాస్త్రి కీర్తిని సాహిత్య చరిత్రలో శాశ్వతంగా నిలబెట్టగల కావ్యం శిశుపాలవధ అని రాశారు. శిశుపాలవధ కావ్యం గురించి ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి- "శ్రీనాధుని అనువాదం తరువాత ఇంత ప్రౌఢ సుందరమైన రచనము చదువలేదనిపించింది" అని రాశారు.

వెంకయ్య శాస్త్రి రామాయణం తరువాత తన కోసం రాసుకున్నది మటుకు మారుతీశతకం మాత్రమే. ఈ శతకం నూటపదహారు పద్యాలతో మత్తేభ శార్ధూల వృత్తాల్లో ఉంది.

పుట్టపర్తి నారాయణాచార్యులు - "గోపీనాథులు చాలా ప్రసిద్ధులైన విద్వత్కవులు, శాస్త్ర పాండిత్యముతో వీరి సాహిత్యము పరిపక్వమైనది, ప్రాచీన మహాకవుల కోవకు చెందిన వారిలో వీరు కడపటివారు "యని కొనియాడారు.

స్వతంత్ర పూర్వం తెలుగుదేశంలో విజయనగరం తరువాత పెద్ద సంస్థానం వెంకటగిరి. సాహితీ పోషణలోనూ వెంకటగిరి విజయనగరం సరసన నిలబడగలిగేలా చేయడంలో వెంకయ్య శాస్త్రిది ముఖ్యమైన పాత్ర. విజయనగరం ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి ఆద్యుడిని అందించగా, వెంకటగిరి ప్రాచీన తెలుగు సాహిత్యానికి కడపటి కవిని అందించింది.

Posted in September 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!