Menu Close
గంభీరాలకేమరుదు...... (కథ)
-- ఎన్నెలమ్మ, కెనడా --

మేరీ ఆనా డెస్క్ దగ్గర గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి. ఆ డిపార్ట్మెంట్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. అది కస్టమర్ సర్విస్ డిపార్ట్మెంటు. ఒక వైపు ఫోన్ కాల్స్ తోనూ, ఇంకో వైపు మేరీ ఆనా జోక్స్ తోనూ ఘొల్లున నవ్వులు వినిపిస్తుంటాయి. జీతం తక్కువైతే అవుతుందేమో కానీ అసలు ఈ డిపార్ట్మెంట్ లో పని చేయాలి అనుకుంటుంది సంధ్య. తన డిపార్ట్మెంట్ లో ఇంకా భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు అంటగట్టిన బాసిజం వదలని బాస్, ఆవిడ కింద భయపడుతూ పని చేస్తున్న ఉద్యోగులు. తను కెనడాకి కొత్తగా వచ్చినప్పుడు పని చేసిన కంపెనీలో సీ ఈ ఓ, తనూ ఒకే సారి గడప దాటాల్సి వస్తే, ఆయన ఒక చేత్తో తలుపు తెరిచి పట్టుకుని, గౌరవ పూర్వకంగా కాస్త వంగి, లోపలికి వెళ్ళమని ఇంకో చేత్తో చూపిస్తే బిత్తర బోయింది తను మొదట్లో. తనే కాదు క్లీనర్ రీటా వచ్చినా అతనిది అదే ప్రవర్తన. అతన్ని బట్టి అతని ఉద్యోగులు. చిన్న పెద్దా, నలుపు తెలుపు తేడాల్లేవు. ఉద్యోగులలో తేడాల్లేవు అందరూ సమానమే. ఇప్పటి వరకూ పనిచేసిన అన్ని చోట్లా ఇంచు మించు అంతే. ఈ మధ్య భారత దేశం లో కూడా హైరార్కియల్ మ్యానేజ్మెంట్ పోయి, సింగల్ లేయర్ మ్యానేజ్మెంట్ వచ్చేసిందని స్నేహితులు చెపుతుంటారు. మరి ఇక్కడ ఏంటో!! చూడాలి ఎలా నడుస్తుందో అనుకుంటూ కొన్ని పాత జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ పని చేస్తున్న సంధ్యకి "సంధ్యా చెక్కులు తప్పు ప్రింట్ అయ్యాయి," అని ఖంగారు పడిపోతున్న మీనూ కనిపించింది. "నేను రివర్స్ చేస్తాలే మళ్ళీ ప్రింట్ చెయ్యి" అని చెప్పి, ఒక్క నిమిషం లో "పొయ్యి ప్రింట్ చేస్కుని పండగ చేస్కో" అంది సంధ్య. "థ్యాంక్స్ ఎ లాట్ సంధ్యా. ఈ పూటకి నన్ను ఫయిర్ కాకుండా రక్షించావు, గుండె ఆగిపోయింది తెలుసా? నువ్వు రాక ముందు ఇలా జరిగినప్పుడు, విమ్మి నన్ను ఫయర్ చేసినంత పని చేసింది" అంది మీను. "మీనూ, కావాలని ఎవ్వరూ తప్పు చెయ్యరు. ఒక్కోసారి చెక్కులు మెషిన్ మీద అలయిన్ అవ్వవు ఇది మామూలే, అందరికీ జరిగేదే" అంది సంధ్య. "ఏమో ప్రతి రోజూ జాబ్ పోతుందేమో అనే అనిపిస్తుంది సంధ్యా. ఇందాక ఫాక్స్ కాపీ ఇవ్వడానికి వెళ్ళాను, బాస్ అసలే సీరియస్ గా ఉంది. ఆవిడ అలా ఉందంటే నాకు పలకరించడం కూడా భయమే" అంది మీనూ. "బాస్ అంటే భయమెందుకు, మనమున్నది కెనడాలో! నార్త్ అమెరికాలో కూడా ఇలా భయపడతారా" అనడిగింది మీనూని. "ఇంట్లో నేనొక్కదాన్నే పని చేస్తున్నాను సంధ్యా. మా వారు చదువుతున్నారు. ఆయన చదువు అయ్యేంతవరకు నా ఉద్యోగం కాపాడుకోవాలి. మళ్ళీ ఉద్యోగం దొరకడం కష్టం కదా" అంది మీనూ. "ఖర్మ, ఇలాంటి బాసుల వల్లే ఈ దేశాలు కూడా మళ్ళీ ఇంటి దగ్గరలా తయారవుతున్నాయి. మీనూ పాయింట్ కూడా కరెక్టే" అనుకుంటూ పనిలో లీనమయ్యింది సంధ్య.

సంధ్య ఈ మధ్యనే ఆఫీసులో చేరింది. చాలా కలుపుగోలు మనిషి. కొత్తా పాతా లేకుండా అందరినీ పలకరిస్తూ, సామరస్యంగా మాట్లాడుతూ, చెణుకులు విసురుతూ, నవ్విస్తూ ఉంటుంది మొదటి రోజు నించీ. ఆమె విమ్మీ తో కూడా అలా ఉండడం భలే ఆశ్చర్యం గానూ, అద్భుతంగానూ ఉంటుంది మీనూకి. బాస్ దగ్గరికి వెళ్ళక్కరలేకుండా ప్రతీదీ చిటుక్కున పరిష్కరిస్తున్న సంధ్య ని చూసి తన కోసం దేవుడు పంపాడు అని మనసులో మురుస్తుంది మీనూ.

ఆ రోజు ఇన్వెంటరీ లెక్కేసే రోజు. ఉద్యోగులందరూ చాలా పొద్దున్నే వచ్చేసి పని మొదలెట్టెయ్యాలి. అలా ముందుగానే వచ్చినందుకు కృతజ్ఞతగా మ్యానేజ్మెంట్ వారు పిజ్జాతో పాటు, భారతీయులు ఎక్కువగా ఉన్నందున సమోసా కూడా ఆర్డర్ చేస్తుంటారుట. ఏడాదికి రెండు సార్లు జరుగుతుందిలా. మంత్ ఎండ్ కాబట్టి లంచి కి వెళ్ళే సమయము ఉండదెవ్వరికీ. అందరూ పిజ్జా, సమోసా డెస్క్ దగ్గరికే తెచ్చుకుంటారు. కానీ, బ్యాంకు చెల్లింపుల సమయం అయ్యే వరకూ కదలడానికి ఉండదు సంధ్య, మీనూలకి. ప్రింట్ చేసిన చెక్స్ తీసుకెళ్ళి బాస్ టేబుల్ టేబుల్ మీద పెట్టి వచ్చిన మీనూ "సమోసా తెచ్చుకుందాం వస్తావా" అని అడిగింది సంధ్యని. "సరే పద" అని వెళ్ళబోతూ, దార్లో బాస్ ఆఫీస్ గదిలోకి తొంగి చూసి "వస్తావా" అని అడిగింది సంధ్య.." నేను తెచ్చుకున్నా" అని బదులిచ్చిన బాస్ తో "డబల్ డబల్ పనులు చేస్తావు, ఇంకోటి తింటే తప్పేం లేదు. రా పోదాం" అంది సంధ్య. "వద్దులే ఇప్పటికే కడుపు నిండిపోయింది" అంది విమ్మి. "పోనీ మాతో రారాదూ పది నిమిషాలు పనికి బ్రేక్. కళ్ళకి మంచిది, కాళ్ళకి మంచిది" అంటున్న సంధ్యకి సమోసా, పిజ్జా టేబుల్ మీద అలాగే కనిపించాయి. "నువ్వు తిననే లేదుగా అప్పుడే కడుపు నిండడమేంటీ" అన్న సంధ్యతో "నీ బెస్టీ ఆనా పెట్టిందిలే కడుపు నిండుగా" అంది. "ఎందుకు, ఏదైనా ప్రాబ్లమా" అనడిగింది సంధ్య, ఇందాకా మీను చెప్పిన దాన్ని గుర్తుచేసుకుంటూ..."తను అదోలా ఉంది. సమోసా వాసన భరించలేకపోతోందిట" అంది. "విచిత్రంగా ఉందే, చాలా సార్లు 'సమోసా ఎవడు కనిపెట్టాడో కానీ, వాసన వస్తే చాలు ఆగలేను, తెలియని వాళ్ళ దగ్గరైనా అడిగి తెచ్చుకుంటా' అంటూ ఉంటుందే" అంది సంధ్య ఆశ్చర్యంగా.  ... "అదంతేలే ఆవిడగారు రోజుకో రకం. నేను తెచ్చుకుంటున్నప్పుడు, తన డెస్క్ దగ్గరి వరకూ రాగానే లిండా ఎదురొచ్చి, తన దగ్గరున్న పేపర్లు చూపించి ఏదో అడుగుతోంది. ఈ లోపు తను లేచి నించునీ ఎక్సూజ్ మీ, మీరేమీ అనుకోకపోతే కాస్త దూరంగా వెళ్ళి మాట్లాడుకుంటారా, నేను ఆ వాసన భరించలేక పోతున్నా' అంది. నాకు బీపీ ఒక్కసారి పెరిగిపోయింది.. ఈ లోపు బ్యాంక్ నించి కాల్, నిన్నటి చెల్లింపులు ఫెయిల్ అయ్యాయని, బుర్ర తిరిగిపోతోంది" అంది విమ్మి. "అయ్యో అలాగా, ఇప్పుడు సమోసా తెచ్చుకుని వస్తూ తనను దాటే రావాలి, మాకూ చెప్పుదెబ్బలు తప్పవన్నమాట, తెనాలి రామలింగడిలా నీకొచ్చిన దెబ్బలు నాకు సగం పంచు పోనీ" అని నవ్వుతూ "బ్యాంక్ ఫయిల్ నేను హెల్ప్ చేస్తాలే చిల్ల్" అంటూండగానే ఫక్కున నవ్వింది విమ్మి. బాస్ గారితో అంత చనువుగా మాట్లాడి నవ్వించి మరీ వచ్చిన సంధ్యని ఆశ్చర్యారాధనలతో చూసింది మీనూ.

ఆనా చాలా చాలా మూడీ అని అందరూ చెప్పుకుంటారు కానీ ఆమె మూడీగా ఉండడం ఈ మూడు నెలల్లో చూడలేదసలు. మొదటి సారి చూసుకున్న వేళావిశేషమేమో సంధ్యతో ఆనా చాలా బాగా మాటాడుతుంది. అసలు కొత్త అనే అనిపించదు. సంధ్య ప్రింట్ చేసినప్పుడల్లా తనే తీసుకొచ్చి"ఇవి నీవేనా మేడం" అని నవ్వుతూ అడుగుతుంది. అలాంటి ఆవిడ గురించి ఈ ఆఫీస్ లో ఏ ఇద్దరు కలిసినా వెటకారం గానే మాట్లాడతారు. లంచ్ రూం లో చాలా సార్లు కొల్లీగ్స్ ఆనా గురించి వెటకారంగా మాట్లాడ్డం సంధ్య వింటూనే ఉన్నా, తనకీ కొత్త కదా, తన డిపార్ట్మెంటు కూడా కాదు, తనకెందుకని అర్థం కానట్టు, వినీ విననట్టు వదిలేస్తుంది. ఒక సారి మీనూ కూడా తనకి ఆనాతో మాట్లాడడం భయం అనీ, ఒకోసారి ఒకోలా ఉంటుందనీ చెప్పి, తనకి ఏదో అనారోగ్యం ఉందనీ, అందువల్ల అలా కొన్ని సార్లు చాలా మూడీగా ఉంటుందనీ చెప్పింది. అలా ఆనా గురించి వింటూ ఉంటే మనసులో ఒకలాంటి బాధ కలుగుతుంది ఆమెకి, అలా అల్లరిగా మాట్లాడే ఆవిడకి అంత అనారోగ్యమేంటో అని. ఆమె గురించి చెడుగా చెప్పుకునే వారిలో తన బాస్ కూడా వారిలో ఒకరవ్వడంతో ఆమె ఇంకా ఇంకా ఆశ్చర్యపోతుంటుంది..

ఒకరోజు లంచ్ రూంలో మంచినీళ్ళ కోసం వెళ్ళిన సంధ్యకి తనతో పాటే కస్టమర్ సర్వీస్ లో చేరినమ్మాయి పెన్నీ ఎక్కిళ్ళు గుక్కిళ్ళు ఏడుస్తూ కనబడింది. ఆ అమ్మాయి హెచ్ ఆర్ లో పనిచేసే క్లౌడియాకి గాడ్ డాటర్. క్లౌడియాతో పాటు విమ్మి కూడా పక్కన కూర్చుని ఊరుకోపెడుతున్నారా అమ్మాయిని. వాళ్ళ బాస్ కి కంప్లయింట్ చెయ్యమని, లేకపోతే హెచ్ ఆర్ పరంగా తను యాక్షన్ తీసుకుంటాననీ, క్లౌడియా అంటోంది. "ఆమెతో ఎవ్వరూ పని చెయ్యలేరు, ఆ విషయం అందరికీ తెలుసు నువ్వు బాధ పడక"ని విమ్మి అంటోంది.

అదృష్టం కొద్దీ పేజ్ రావడంతో, సంధ్య అక్కడ నించి వెళ్ళిపోయింది. నెల తరవాత పెన్నీ ప్రెగ్నెంట్ అని అన్నౌన్స్ చేసింది. ఆనా అందరికీ మెయిల్స్ పంపింది "ఫలానా అమ్మాయి గర్భిణి, ఆ అమ్మాయికి తెలియకుండా మనం పాట్లక్ అర్రేంజ్ చేద్దాం, మీ శక్తి కొలది తినుబండారములు ఈ సమయానికల్లా తెండి" అని. ఆ రోజు అర్రేంజ్మెంట్స్ అదిరేలా చేసింది. ఆనా కప్ కేక్ స్పెషలిస్టు. బేకింగ్ ఆమెకు ఇష్టమయిన సబ్జెక్ట్. బేక్ చేసిన ఏ వస్తువైనా అందరికీ తీసుకొస్తుంది. "అరె ఎగ్స్ లేకుండా బేక్ చెయ్యడం కష్టమే, అయినా ప్రయత్నిస్తా ఏమైనా దొరుకుతాయేమో ఎగ్స్ లేకుండా" అంటూ ఎగ్గ్ తినని వాళ్ళకోసం ఏదో ఒకటి చేసుకొస్తుంది కూడా. వారంలో రెండు రోజులు ఆఫీసులో ఉన్న 10 మంది కోసం కాఫీయో, డోనట్సో తెస్తుంది ఆనా. తను ఏదైనా అర్రేంజ్ చేసిందంటే, తిరుగుండదు. మొదలు పెట్టడం నుంచీ, చివరికి మిగిలిన తినుబండారాలు అందరూ ఇంటికి తీసుకెళ్ళడానికి డిస్పోసబుల్ డబ్బాలతో సహా ఎక్కడా కొదవ రానియ్యదు. అందరూ తెచ్చినవన్నీ చాలా కళాత్మకంగా సర్దడంలో ఆమే బహు ప్రజ్ఞాశాలి. ఇలాంటి ఆనా వల్ల ఆ రోజు పెన్నీ ఎందుకు ఏడ్చి ఉంటుందబ్బా అనుకుంది సంధ్య. ఇంత దయగా ఉన్న ఆనా అంటే ఆఫీసులో ఎవరికీ పడదెందుకు? కస్టమర్ సర్విస్ విభాగాన్నంతా నవ్వులతో ముంచెత్తుతూ గోల గోలగా ఉంచే ఈవిడలో ఇంకో కోణముందంటే సంధ్యకి అసలు నమ్మకం కుదరదు. రాను రాను సంధ్య ఒక విషయం గమనించింది. ఆనా ఒక్కోరోజు ఎవరైనా పిలిచినా పట్టించుకోదు. పని వత్తిడి వల్ల కావచ్చు. అలాంటి రోజుల్లో ఆ విభాగమంతా సడి లేకుండా ఉంటుంది. సంధ్య అలవాటుగా అటు వైపు చూస్తుంది ఆనా లేదేమో అని. తను ఉండగా అంత నిశ్శబ్దమా అని నమ్మబుద్దెయ్యదు తనకి.

విమ్మికి ఆనా నచ్చదు. ఆనా నవ్వుతూ తనని పలకరించడం చూసినప్పుడల్లా సంధ్యతో చెప్తూ ఉంటుంది, "ఆనాతో వీలైనంత దూరంగా ఉండు, నీ మంచి కోసమే చెప్తున్నా" అని. అలా చెప్పినా కొద్దీ సంధ్యకి ఆనా మీద అదోలాంటి ప్రత్యేక ఆసక్తి కలుగుతుంటుంది. అందరూ ఆఫీసు 9 కి మొదలెడితే, ఆనా ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని 6.30 కే వచ్చేసి 2.30 కి వెళ్ళిపోతుంది. అక్కౌంటింగ్ విభాగం లో ట్రేడ్ పేమెంట్స్ ఉండడంతో ఎవరికీ 2 వరకూ ఊపిరి సలపదు. అందుచేత సంధ్యకి ఆనాతో వ్యక్తిగతంగా పరిచయం కలిగే అవకాశం రాలేదు.

ఒకసారి సంధ్య వాష్ రూంలో చేతులు కడుక్కుంటుండగా వచ్చింది ఆనా"నీతో ఒక విషయం చెప్పాలి, నువ్వు నాకు ఎప్పటి నించో తెలుసనిపిస్తుంది ఎందుకో" అంది. "అవునా, థ్యాంక్ యూ" అంది సంధ్య చిరునవ్వుతో. "బై ద వే, నీకు ఆరెంజ్ కలర్లో ఉండే ప్రెట్జెల్ లాంటి స్వీట్ తెలుసా" అంది. "జిలేబీయా" అంది సంధ్య.. "అవును అదంటే నాకు ప్రాణం, మా అమ్మ స్నేహితురాలెవరో అమ్మకి ఇచ్చిందిట మా చిన్నప్పుడు. మాకు తెగ నచ్చింది. మళ్ళీ తిందామంటే ఎక్కడ కొనాలో తెలీలేదు" అంది. "నేను తెస్తాలే ఈ సారి" అంది సంధ్య.

ఈ లోపు దీపావళి అని ఇండియన్లందరూ డబ్బులేసుకుని ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నప్పుడు "జిలేబీ కూడా తెద్దామా ఆనా ఇష్టమని చెప్పింది" అంది. "ఆమె అలాగే అంటుంది. సమోసా గురించి కూడా అలాగే అనేది, కానీ మొన్న చూసావుగా ఆ వాసన తను భరించలేనని చెప్పి డయిరెక్టుగా నన్ను తన దగ్గర నించి వెళ్ళిపొమ్మని చెప్పింది" అని విమ్మి అంది. తరువాత ఏమనుకున్నారో కానీ కొద్దిపాటి జిలేబీ కూడా తెచ్చారు. ఎవరో చెప్పారుట సంధ్య సజెస్ట్ చేసిందని, సంధ్య దగ్గరకొచ్చి మరీ మరీ థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళింది ఆనా.

క్రిస్మస్ వచ్చేసింది. ఫ్యాక్టరీ మూసేస్తారు 2 వారాల పాటు. ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగులు మాత్రం వంతుల వారీగా రావాల్సి ఉంటుంది. ఆఫీసులో పెద్దగా ఎవరూ లేరు. ఒక్కో డిపార్ట్మెంట్ నించీ ఒక్కక్కళ్ళు వస్తే చాలు. క్రిస్మస్ టయిము, పైగా బ్యాంకుకి సెలవు దినం అవడంతో పని కూడా పెద్దగా లేదు, కస్టమర్ సర్విస్ నించి ఆనా, అక్కవుంటింగ్ నించి సంధ్య మాత్రం రావాలని షెడ్యూల్ ఉండడంతో అనుకోకుండా ఆ రోజు ఆఫీసులో వాళ్ళిద్దరికీ మాట్లాడుకోడానికి కుదిరింది. బాగా మంచు కురుస్తూ ఉండడంతో "మంచు తుఫాను మరీ దారుణంగా ఉంది. హైవే 10 మీద ఒక పెద్ద ఆక్సిడెంట్ నువ్వెలా వచ్చావు QEW (Queen Express Way) బానే ఉందా" అడిగింది సంధ్య. "రోడ్డు ఫర్వాలేదు డ్రయివ్వే క్లియర్ చెయ్యడమే కష్టమయ్యింది" అంది ఆనా. "నాకూ సేం" అంది సంధ్య. "అదేంటీ మీ వారు దింపుతారనుకుంటా కదా రోజూ, ఇదిగో ఈ కిటికీలోంచి కనిపిస్తుంది రోజూ" అంది నవ్వుతూ. "లేరులే ఇండియా వెళ్ళారు, అత్తగారికి ఒంట్లో బాగుండట్లేదని చూడడానికెళ్ళారు" అంది సంధ్య. "అవునా మా ఆయన కూడా ఇక్కడుండడు, అమెరికా అని పోతుంటాడు" అంది ఆనా. "ఒహ్ అవునా, కష్టమే, నువ్వు హ్యామిల్టన్ నించి రావాలి కదా" అంది సంధ్య. ఉన్న కాస్త పనీ కానిచ్చి, మొదటి సారి లంచ్ రూంకి కలిసి వెళ్ళారు. బోలెడు సరదా కబుర్లు దొర్లాయి. ఆనా ఒకటే నవ్వించింది. సంధ్య కూడా తక్కువ కాదు. పిల్లల గురించి చెప్పుకున్నారు. సంధ్య పాత ఉద్యోగాల గురించి అడిగి తెలుసుకుంది ఆనా. తరువాత ఆనా ఆగకుండా చెప్పింది. "36 వచ్చే వరకూ నా మనసుకి నచ్చిన వాడు దొరకలేదు. డేవిడ్ దొరికాక పెళ్ళి చేసుకున్నాము. తను చాలా మంచి వాడు. నేనూ, తనూ ఒకే లాగా ఆలోచిస్తాము. ఇద్దరం ఫన్ లవింగ్. తనకి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల కోసం ప్లాన్ చేస్తూ ఉండగా, తనకి క్యాన్సర్ అని తెలిసింది. తను పిల్లల కోసం ఒకటే తపించి పోతుంటాడు. దురదృష్ట వశాత్తూ, నాకు ఐదు సార్లు గర్భం రావడం, అబార్షన్ జరగడం, ఏవో మందులు, మాకులు, అనారోగ్యం, హార్మోన్ల ఇంబాలన్స్, ఒకరోజు నచ్చినవి ఇంకో రోజు నచ్చవు, ఒక రోజు సంతోషం ఇంకో నిమిషం దుఖం, ఎందుకొస్తుందో ఒక విసుగు.. జీవితమంటే విరక్తి, కానీ మా నాన్న నేర్పినట్టు పాజిటివ్ గా ఉండడానికి ప్రయత్నిస్తుంటా, మరి నాకు తెలియకుండా విపరీతమైన నిస్సత్తువ, విసుగు వచ్చేస్తుంటాయి, వాటిని తట్టుకుని మళ్ళీ మామూలవడం ఎంత కష్టమో తెలుసా? డేవిడ్ కి ఇవేమీ పట్టవు.. పిల్లలో పిల్లలో అంటాడు. తను చనిపోయే లోపు బాబో పాపో పుడితే చూసి ప్రశాంతంగా వెళ్ళిపోతానంటాడు.. తను ఉండబోడు అన్న మాట నా మనసులో ఎంత స్ట్రెస్స్ తెస్తుందో, పిల్లలని ఇవ్వలేకపోతానేమో అన్న తలపు అంతకు రెట్టింపు దిగులు తెస్తోంది.. ఆ మందులు, ఆ వాసన... ఓహ్.. చెప్పలేనసలు! మేము హంగేరీ నించి వచ్చాము. మా ఆచారం ప్రకారం పిల్లలలో మొదట కూతురు పుడితే ఆ అమ్మాయే ఇంటి బాధ్యతలని, తలితండ్రుల బాధ్యతని తీసుకోవాలి. నేను మా ఇంటికి పెద్ద. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు పెళ్ళి చేసుకుని దూరంగా వెళ్ళిపోయారు. అమ్మ నాన్న నా దగ్గరే. పెద్ద వయసు. బాగా అట్టెన్షన్ అవసరం వాళ్ళకి. ఇవన్నిటి మధ్యా వాళ్ళని సరిగా చూస్తున్నానో లేదో అని అనుమానం.." అశ్రు బిందువులు ఆమె చెంపల మీదుగా జారిపోతున్నాయి.."హే ఆనా, ప్లీజ్, కంట్రోల్. ప్లీజ్, ప్లీజ్.." సంధ్య అనునయిస్తోంది. "అయాం సో సారీ" కళ్ళు తుడుచుకుంది ఆనా. "ఆనా చనువు తీసుకున్నా అనుకోకపోతే ఒక మాటడగనా.. ఒంట్లో బాగలేదన్నావ్ కదా మరి డేవిడ్ అమెరికాలో ఎందుకు?" అడిగింది సంధ్య. "ఎవరి గోల వాళ్ళది సాండీ... పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాము కదా చాలా ఖర్చవుతుంది. తను బతికుండగా ఆ ఖర్చుకి సరిపడా సంపాదించెయ్యాలని, నాకు పిల్లలు పుట్టడానికయే ఖర్చు కాక మున్ముందు పిల్లలకీ కొంత డబ్బు వేసి చనిపోవాలని ఆయన కోరిక. అందుకే అమెరికాలో పనిచేస్తే, ఎక్కువ డబ్బొస్తుందని అక్కడుంటాడు. నువ్వే చెప్పు సాండీ.. ఇంక ఉంటాడో ఉండడో అనుకున్న వ్యక్తి నా దగ్గర ఉండడం సబబా లేక ఎక్కడో 12 గంటలు విమాన ప్రయాణాల దూరంలో ఉండడం సబబా..నువ్వే చెప్పు" అంది ఆనా. "నా ప్రకారం అయితే నువ్వే రయిట్, డబ్బుదేముందీ వస్తుంటుందీ పోతుంటుందీ.. క్వాలిటీ టయిం రాదు కదా" అంది సంధ్య. " అయినా, పిల్లలు కావాలనుకుంటే తను కూడా ఇక్కడుండాలి కదా మరి" అని కూడా అంది సంధ్య, "అలా అక్కరలేదు సాండీ, క్యాన్సరుకి మందులు మొదలెట్టకముందే డేవిడ్ కోరిక మేరకు అతని వీర్యం సేకరించి దాచారు. నేనొక్కదాన్ని ఆసుపత్రికి వెళితే చాలు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తారు. తనొచ్చేలోగా నేను ప్రెగ్నెంట్ అవ్వాలని డేవిడ్ కోరిక" అంది ఆనా. సంధ్యకి ఏమనాలో తెలియలేదు. “హోప్ ఆల్ గోస్ వెల్ ఆనా” అంది. "సాండీ ఈ ఆఫీసు మొత్తంలో నా విషయం నీకొక్కదానికే తెలుసు. నా వ్యక్తిగత విషయాలు ఎవరికీ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. నిన్ను చూసాకే అన్నీ చెప్పేసా, ఎవరికీ చెప్పవు కదూ" బేలగా పలికింది ఆనా కంఠం. "కమాన్ ఆనా ఈ ఆఫీసులోనా.. హహహహ్.."వెటకారంగా నవ్వింది సంధ్య.

ఇంత దాచుకుని గంభీరంగా, దయగా, నవ్విస్తూ చల్లగా ఎలా ఉంటుందీ పిల్ల? అనుకుంటూ ఇంటికి డ్రయివ్ చేస్తున్న సంధ్య కార్ లో పెట్టి ఉన్న అన్నమయ్య పాటలో

‘కలశాబ్ధి కూతురట గంభీరాలకేమరుదు | తలపలోక మాతయట దయ మరి ఏమరుదు | జలజనివాసినియట చల్లదనమేమరుదు |కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి

అన్న పదాలు ఆనాకి సరిగ్గా సరిపోతాయనిపించింది.

పెళ్ళయిన కొత్తల్లో ఒకసారి మూడో నెల గర్భం పోయింది తనకి తరువాత ముగ్గురు బంగారాల్లాంటి పిల్లలు పుట్టినా, ఆ పోయిన గర్భాన్ని తలుచుకుని ఇప్పటికీ దుఃఖ పడుతుంది సంధ్య. అలాంటిది 5 గర్భాలు పోవడం ఎంత బాధాకరం అందునా ఒక సారి ట్రిప్లెట్స్, రెండు సార్లు కవలలు అని చెప్పారుట అని ఆనా ని తలచుకుంటూ బాధపడి సరిగా నిద్ర లేకుండా గడిపింది సంధ్య ఆ రాత్రి. ఇక్కడ అమ్మాయిలు భర్తల మీద ఆధారపడడానికి ఇష్టపడరు, అందునా తన తలితండ్రుల బాధ్యత కూడా ఉన్నప్పుడు అసలు ఆధార పడరు. ఇలాంటి పరిస్థితులలో ఆనా ఆఫీసుకి 40 మైళ్ళ దూరం నుంచి వస్తుంది. ఆనా ఇంత బాధ పడుతుంటే మిగతా వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు? తన డిపార్ట్మెంట్ లో ఎవరో ఒకరు ఆనా మీద కంప్లయింట్ చేస్తూనే ఉంటారు. అలాంటి ఉద్యోగులకి విమ్మి, క్లౌడియా సహాయం చేస్తుంటారు కంప్లయింట్ చెయ్యడానికి. ఆనా తన బాధలు బయటికి చెప్పకపోవడం వల్ల వాళ్ళకి తెలియదేమో అనుకుంది సంధ్య.

ఒకసారి విమ్మి ఆనా మీద విసుక్కుంటే, "తనకి ఆరోగ్య సమస్య కదా విమ్మీ, పోనీ వదిలెయ్యచ్చు కదా" అంది సంధ్య. "నాకూ ఆరోగ్యం బాగాలేదు. కొంచెం షుగర్ కూడా వచ్చింది" అంది విమ్మి. ఇదేం పోలిక రా బాబూ ఇలాంటి వాళ్ళతో కష్టమే అనుకుని "అందుకే నువ్వు ఎక్స్ట్రా స్వీట్ అన్నమాట" అని జోక్ చేసి వదిలేసింది సంధ్య.

ఆనా తండ్రి చనిపోయారు. ఫ్యునరల్ వీకెండ్ ట. తన పని మళ్ళీ మిగతా వాళ్ళని ఇబ్బంది పెడుతుందేమోనని పగలూ, రాత్రీ పని చేస్తున్న ఆనాని చూసి ఇలాంటి పనిమంతురాలు కాబట్టే ఆఫీసులో ఎన్ని కంప్లయింట్స్ వచ్చినా తనని వదులుకోరు అనుకుంది సంధ్య. తండ్రి మరణాంతరం ఇంటి దగ్గర అన్నీ చక్కబెట్టుకోవడానికి సెలవు కావాలని కోరింది ఆనా. తను ఆఫీసుకి రాకపోవడంతో విమ్మీ క్లౌడియా మొదలైన వారు ఊపిరి తీసుకున్నారు. మళ్ళీ ఒకసారి పిల్లల కోసం ప్రయత్నం చెయ్యమని డేవిడ్ వత్తిడి తెస్తున్నాడని తన శరీరము, మనసు సహకరించడం లేదని, ఎలాగూ సెలవు తీసుకుంటున్నాను కాబట్టి ఇంకో సారి డేవిడ్ కోసం ప్రయత్నిస్తానని రెస్ట్ రూం దగ్గర కలిసినప్పుడు సంధ్యకి మాత్రం చెప్పింది ఆనా. "ఈసారి తప్పకుండా సఫలీకృతమవుతుంది నేను కూడా ప్రార్థనలు చేస్తాను" అంది సంధ్య. "ఏమో చూడాలి డేవిడ్ కూడా నన్ను అర్థం చేసుకుంటే బాగుండును" నిరాసక్తంగా అంది ఆనా.

ఆనా సెలవు నించి తిరిగి వచ్చాక "ఎలా ఉన్నావు" అని అడిగింది సంధ్య. "ఏమీ తేడా లేదు మామూలే" నవ్వు తెచ్చుకుంటూ అంది ఆనా. ఇంక పొడిగించి బాధించ దలచుకోలేదు సంధ్య. తన మనసే అంత బాధ పడుతుంటే ఆనా పాపం ఎలా తట్టుకుంటోందో అనుకుంటోంది చాలా సార్లు. దేవుడెందుకు ఇలా శిక్షిస్తాడో కదా. డేవిడ్ కి పిల్లలని పెంచుకోవడం ఇష్టం లేదు. తన పిల్లలు కావాలంటాడు. ఏమిటో విచిత్ర పరిస్థితి.

కొత్తగా కొన్న అమెరికా ఆఫీసులో శిక్షణ నిర్వహించడానికి సంధ్య 3 నెలల పాటు అమెరికాలో ఉండాల్సి వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు సంధ్య ఒక విశేషమైన వార్త ఈనాడులో చదివింది. దాని ప్రకారం గుజరాత్ లోని ఒక గ్రామంలో అద్దె గర్భాలు దొరుకుతాయని, అన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతాయని, విదేశీయులు అద్దె గర్భాలని వాడుకోవచ్చని చదివిన వార్త చూసి భలే సంతోషమేసింది సంధ్యకి. ఇది ఆనాకి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఆనా ఫోన్ నంబరు తీసుకోవలసిన అవసరం సంధ్యకి ఎప్పుడూ రాలేదు. ఆఫీసులో అడగడానికి ఆమెతో స్నేహం గా ఉన్నవారు కూడా లేరు. ఆనా ఫోన్ నంబరు తీసుకోనందుకు బాధ పడింది సంధ్య. కెనడా వచ్చేదాకా ఓర్చుకోవడం కష్టమే అనిపించింది. ఆనా కస్టమర్ సర్విస్ విభాగం కాబట్టి ఈ మెయిల్ పంపితే మొత్తం డిపార్టుమెంట్ కి వెళుతుంది.. సరేలే దేనికైనా సమయం రావాలి అనుకుంది సంధ్య.

సంధ్య కెనడా వచ్చి ఆఫీసుకెళుతూనే "ఆనా నీతో కొంచెం మాట్లాడాలి" అంది. "చెప్పు, దేనిగురించీ" అంది పొడిగా.."అలా ఒక నిమిషంలో చెప్పేసేది కాదులే" అంది సంధ్య. "సరే మరి" అంది ఆనా ఆసక్తి లేకుండా. ఆనా పొద్దున్న 6.15 కల్లా వచ్చేస్తుంది కాబట్టి తను కూడా 6 కే ఆఫీసుకి వచ్చేసింది సంధ్య. "కాఫటేరియాకి రా" అంటూ వెళుతున్న సంధ్యని అనుసరించింది ఆనా. "ఆనా నీకొక శుభవార్త. ఇంక నీ శరీరానికి కష్టం కలిగించకుండా, డేవిడ్ కి నీకు పుట్టిన పిల్లలని పొందే అద్భుత అవకాశం. ఇలా మా దేశంలో అద్దె గర్భాలు దొరుకుతున్నాయి. అంతా ఆరోగ్యకర పరిస్థితులలో జరిగేలా, అద్దె గర్భం ధరించిన స్త్రీలు డాక్టర్ల పర్యవేక్షణలో 9 నెలలూ ఆసుపత్రిలోనే ఉంటారు. వారికి కావలసిన పౌష్టికాహారం అదీ అంతా చూసుకుంటారు డాక్టర్లు. ఖర్చు కూడా ఎక్కువేమీ కాదు" చాలా ఆనందంగా చెప్తూ ఆనా మొహంలో ఒక్క సంతోష వీచిక చూద్దామని విశ్వ ప్రయత్నం చేసింది సంధ్య. సంధ్యని చెప్పనిచ్చి "ఇట్ ఈజ్ టూ లేట్ మై డియర్" అంది ఆనా.. "అంటే?" సంధ్య ఆశ్చర్యపోతూ అడిగింది. డేవిడ్ చనిపోయాడన్న మాట వినాల్సొస్తుందని భయం కలిగింది సంధ్యకి.. "అంటే.... ఏమీ లేదు డేవిడ్ తో విడాకులు తీసుకున్నా" ఎలాంటి భావాలు లేకుండా చెప్పింది ఆనా. "వ్వాట్" అరిచినట్టుగా అంది సంధ్య. ఆనా కళ్ళల్లో ఒక చుక్క కన్నీరు జారబోయి ఆగిపోయింది. "అంతగా ప్రేమించిన డేవిడ్ ని.. చనిపోతాడనుకున్న డేవిడ్ ని... వై? " ఉద్రేకపడింది సంధ్య. "విను.. నాకు చాలా ఆలస్యంగా సోల్ మేట్ దొరికాడు. ఎంత మంచివాడో చెప్పలేను.. కానీ నా శారీరిక పరిస్థితి అర్థం చేసుకోకుండా పిల్లలు కావాలని బలవంత పెట్టడం ఎంతవరకు సమంజసమో అర్థం కాలేదు. ఆరవ సారి విఫలమయ్యాక కూడా ఇంకొక్కసారి ఆనా ప్లీస్ ప్లీస్ అని బతిమాలడం మొదలెట్టాడు.. ఇనఫ్ ఈసజ్ ఇనఫ్ .. విడాకులిచ్చేసా.. నన్ను అర్థం చేసుకోవట్లేదనిపించింది అంతే.. ఎంత రిలీఫ్ గా ఉందో తెలుసా" అంది." ... మరి డేవిడ్? ఎలా ఉన్నాడు"అంది సంధ్య. "బాగానే ఉన్నాడు సర్జరీ జరిగింది, కీమోలు అవుతున్నాయి. వీర్యం దాచాడు కదా, ఇంకా పిల్లలు కావాలని ఆశ. తను దాచిన డబ్బు ఎవరికైనా ఇస్తే, ఎవరైనా పిల్లలని కని పెడతారేమో అని చూస్తున్నాడు" అంది ఆనా. తన జీవితంలోనే కాదు తన చుట్టుపక్కల ఎవరి జీవితాల్లోనూ కూడా ఎన్నడూ వినని విషయాలు ఒకదాని తరువాత ఒకటి ఆశ్చర్యంగా వింటున్న సంధ్య, ఎప్పుడూ ఎవరితోనూ పంచుకోని విషయాన్ని చెప్పుకుని బరువు దింపుకుంటున్న మేరీ ఆనా రాత్రి షిఫ్ట్ లో పనిచేసే ఫ్యాక్టరీ ఉద్యోగులు ఇంటికెళ్ళడానికి ఉదయం 6.30 కి  కొట్టిన సైరన్ శబ్దానికి ఉలిక్కిపడి తేరుకుని ఆఫీసు వైపు అడుగులేసారు.

********

Posted in September 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!