Menu Close
Galpika-pagetitle

సంధ్యాసంగమం -- వాసిలి

గోదావరికి సాగరానికి పెళ్లయి ఏడాదిన్నర అయింది. వైవాహిక జీవితం ప్రతీరాత్రి వసంతరాత్రిలా సాగిపోతోంది.

“అమ్మాయ్ గోదారీ, నీ కళ్యాణోత్సవాన్ని ప్రతీరోజూ కళ్లముందుకు తెచ్చుకుంటున్నాను ... అలాగే నీ పుత్రోత్సాహాన్ని కూడా చూస్తూ కళ్లలో నిలుపుకోవాలనుందే” అంది అమ్మమ్మ అమృత.

గోదారీ అని ఎవరైనా అంటే గోదావరి గయ్ మని లేచేది ... ఎగ్జెంప్షన్ వొక్క అమ్మమ్మ మాత్రమే.
పొరపాటున వొకేవొక్కసారి సాగరం ‘గోదారీ’ అని ఎంతో ప్రేమగా అన్నా ఆ రాత్రి నవదంపతులిద్దరికీ వసంతరాత్రి కాలేకపోయింది.

ఎందుకో గోదావరికి గోదారి అంటే ఇష్టం వుండదు.

“సరేలే అమ్మమ్మా, వొక్క నైన్ మంత్స్ వెయిట్ చేయ్ ... నీ చేతుల్లో మునిమనవడ్ని పెట్టేస్తా” అంది.

“అన్నీ నీ చేతుల్లోనే వున్నట్టు యీ బడాయికేం తక్కువ లేదు” అంటూ అమృత మూతి మూడువంకర్లు తిప్పుతుంటే అనుకోకుండా గోదావరి చేయి పొట్ట మీది కెళ్లింది ... ఏదో పారవశ్యం. నిండు వేసవి అయినా ఆ పారవశ్యంలోకి గోదావరి బిరబిరమంటూ వచ్చి చేరింది.

***

ఉగాది వచ్చింది ... గోదావరి నిండు గర్భినీ ... ప్రతీ అయిదు నిమిషాలకో మారు వేళ్లు పొట్టను సవరిస్తున్నాయి ... అమ్మకీ, అమ్మమ్మకీ గోదావరి కాస్త విచిత్రంగా అనిపించినా వారూ ఆనందంగానే గోదావరిని చూస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. గోదావరి మాత్రం తన గర్భంలోని చిన్న సాగర చేష్టల్ని అనుభూతిస్తోంది.

ఆ చిరు కదలికలు తన గుండెలయను చేరుతున్నాయి. లోపలి ఏ చిన్న కదలిక అయినా సరే తన అస్తిత్వంనిండా వ్యాపిస్తోంది. తన కడుపులో నుండి ఎన్నెన్ని వూంగాలో ... అన్నీ తన మనస్సుని వూయెల వూపేవే. “పిచ్చిసన్నాసిని నేనెప్పుడు వూయల వూపుతానో” అనుకుంటూనే వుంది ... అంతలోనే తన పసికందు గుండెలపై చేరటమూ తను అటూ యిటూ కదులుతూనే వూపేయటమూ జరుగుతోంది...

గోదావరికి నొప్పులు ప్రారంభమయ్యాయి. సాగరానికి ఫోన్ వెళ్లింది. అమ్మ, అమ్మమ్మల హడావిడికి సాగర్ ఆతృత తోడయ్యింది.

***

గోదావరిని ఐసొలేషన్ రూమ్ లోకి తీసుకెళ్తున్నారు. అంతకు మునుపు తనను రిలేటెడ్ డ్రస్ తో రెడీ చేస్తూంటే గోదావరి మురిపెంగా వాటి వంక చూడటం డాక్టర్లకి ఆశ్చర్యం వేసింది. గోదావరికి మాత్రం తనను డెలివరీకి సిద్ధం చేస్తున్న ఫీలింగ్. ఐసొలేషన్ రూమ్ అంటే తనకు డెలివరీ థియేటర్ లా అనిపిస్తోంది.

అవును, జూనియర్ సాగరాన్ని తొమ్మిది నవమాసాలు కంటికి రెప్పలా చూసుకుంటూ అపురూపంగా పెంచుకుంటూ వచ్చింది. తీరా కాన్పు సమయానికి తనే డాక్టర్లని పరుగులు పెట్టించిందట. అసలు తాను బతుకుతానో లేదో అనికూడా డాక్టర్లు వర్రీ అవుతుంటే తనే ప్రొయాక్టివ్ గా “నథింగ్ టు వర్రీ డాక్టర్ ... నా బాబును లోపలున్నప్పుడు ఎలా పెంచానో అంత ముద్దూ మురిపాలతో బయటా పెంచుతాను” అని చక్కగా పండంటి బిడ్డను ప్రసవించి అమ్మమ్మ చేతుల్లో పెట్టింది.

***

గోదావరిని ఐసొలేషన్ రూంలో వుంచి అప్పుడే ఎనిమిది రోజులైపోయింది. రోజురోజుకీ క్షీణిస్తోంది. ఇక పోరాడ లేకపోతోంది. అసలు యిన్ని రోజులు యింతమాత్రమైనా బ్రతికిందంటే మనసు నిండా చిన్ని సాగరాన్ని నింపుకుని ... తన కళ్లలోనే అన్ని ఆటపాటలూను. అవే ఇక్కడిదాకా లాక్కొచ్చాయి.
డాక్టర్ లోపలి కొచ్చాడు ... గోదావరిని అనుమానంగా చూసాడు ... గోదావరి చెక్కిళ్లపై మరో గోదారిని చూసాడు ... చలించాడు ... వొక్క క్షణం చేష్టలుడిగిన వాడయ్యాడు.

కన్నీటిని కూడా తుడుచుకోలేని పరిస్థితి గోదావరిది. పెదాలు కదిపింది ... డాక్టర్ దగ్గిర కొచ్చాడు.

“డాక్టర్ ఇది మీకు సాధ్యం కాదని తెలుసు. నేను రోజూ ఇక్కడి నుండే నా బాబుతో ఆడుతూ పాడుతూ వున్నా వాడక్కడ ఏడుపు ఆపటం లేదు. వాడ్ని వొక్కసారి నాకివ్వరూ ... మళ్లీ ఎప్పుడూ ఏదీ మిమ్మల్ని కోరను.”

గోదావరి అభ్యర్థనతో డాక్టర్ సాగరమే అయ్యాడు. “రేపు తప్పక చూపిస్తానమ్మా ... మీరే జాగ్రత్తగా వుండాలి”

“తప్పకుండా డాక్టర్ ... నా ప్రాణానికి హామీ నేనే”

***

గోదావరి వొంటినిండా ఏవో రసాయనాలు పూస్తున్నారు ... సువాసనతో గోదావరిని సేదతీరుస్తున్నాయవి ...

ఎక్కడో దూరంనుండి తన చిన్నిసాగరం గుక్కపెట్టి ఏడుస్తున్నాడు ... తనకేమో ఏడ్చే వోపికా లేదు ... కళ్లలో గోదారి కనుమరుగైంది.

అడుగో ... చిన్నారి! డాక్టర్ చేతుల్లోంచి అమాయకంగా చూస్తున్నాడు. “రారా చిన్ని కన్నా” అంటూ కళ్లతోనే పిలిచింది. వాడికి అమ్మ పిలుపు వినపడిందన్నట్లు ఏడుస్తూనే విచిత్రంగా నవ్వాడు ... ఆ నవ్వు అందం ఆ అమ్మకు మాత్రమే స్వంతం.

గోదావరి గుండెలపై చిన్ని సాగరం ... గోదావరి తన గుండెలయని సాగరంలో కలిపేసింది ... చిన్ని సాగరం ఏడుపు ఆపేసాడు ‘అమ్మా మళ్లీ ఏడవను’ అన్నట్టు.

***** ఈ శీర్షిక ఇంతటితో సమాప్తం *****

Posted in September 2022, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!