డా॥ తిరుమల రామచంద్రగారి ఆత్మకథ ‘ఒక పరిశీలన’
ఆధునిక వచన సాహిత్య ప్రక్రియలలో ప్రసిద్ధి చెందిన ప్రక్రియ ‘‘జీవిత చరిత్ర’’ (ఆటోబయోగ్రఫీ). ఇది పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో ఏర్పడినది. జీవిత చరిత్ర, స్వీయచరిత్ర ఒకటికాదు. ఒక వ్యక్తి చరిత్రను ఇతరులు రాస్తే జీవిత చరిత్ర. తన చరిత్రను తానే రాసుకుంటే స్వీయచరిత్ర. దీనికి ఆత్మకథ, ఆత్మ చరిత్ర, అనుభవాలు, జ్ఞాపకాలు, గతస్మృతులు అనే పేర్లు కూడ ఉన్నాయి. స్వీయచరిత్రను రాసుకోవడం కత్తిమీద సాము వంటిది.
స్వీయచరిత్ర ఒక వ్యక్తి జీవితానుభవాల సంపుటి. దీనిని చదివితే తోటి మానవుల కష్ఠసుఖాల పట్ల సానుభూతి, అవగాహన కలుగుతాయి. మనం ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ముఖ్యంగా జీవిత సత్యాలను తెలుసుకోవడానికి స్వీయ చరిత్రను చదవాలి. స్వీయచరిత్ర అంటే మానవుల చరిత్ర, దేశచరిత్ర, సమాజ చరిత్ర. ఒక రకంగా స్వీయచరిత్ర అంటే మానవ ప్రవృత్తుల సింహావలోకనం, సమాహార స్వరూపం. కనుక ఒక సంఘంలో ఒక కాలంలో ఏయే పరిస్థితులు ఏయే పరిణామాలు తెస్తాయో, వాటి క్రమబద్ధత ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలంటే మేధావులైన వారి స్వీయచరిత్రలు ఉపయోగపడుతాయి. సాంఘిక ఆర్థిక రాజకీయ మత నైతిక సాంస్కృతిక పరిణామాలన్నిటికీ ప్రాతిపదికమైన మానవ జీవిత సంబంధాలు స్వీయచరిత్ర ద్వారా ప్రతిపాదితమైనట్లు తక్కిన ప్రక్రియల ద్వారా ప్రతిభావంతంగా, ప్రభావశీలంగా ఆవిష్కృతం కావు. ఎందుకంటే ఇందులో ప్రత్యక్ష కథనం కాబట్టి ఇవి పాఠకులపై జరిపే ప్రభావం అనల్పంగా ఉంటుంది.
తెలుగులో స్వీయచరిత్ర రచనకు ‘నేనే ఆద్యుడ్ని’ అని కందుకూరి వారు చెప్పుకోవటం విశేషం. కందుకూరి తర్వాత ఆ స్థాయిలో తగిన జీవిత చరిత్రగా, అందరి ఆదరణకు పొందిన స్వీయచరిత్రగా ముఖ్యమైనది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘‘అనుభవాలు, జ్ఞాపకాలూనూ’’. ఆ తర్వాత చెప్పుకోదగిన స్వీయచరిత్ర డా. తిరుమల రామచంద్రగారి ‘‘హంపీ నుండి హరప్పా దాకా’’. అయితే వీరు ఈ ఆటోబయోగ్రఫీలో కవర్ చేసిన తన జీవితభాగం ఆయన బ్రతికిన దానిలో మూడవ వంతు కూడా లేదు. కాని ఇంత ఆత్మ నివేదన ప్రవణంగా ఏ రచనా రాలేదు. కరుణ, శృంగారం, సుకుమార హాస్యం వంటి వాటితో నిండిన ఈ గ్రంథం పాఠకులను పూలతోటలో విహరించేటంతటి సంతోషాన్ని కల్గిస్తుంది. ఈ గ్రంథంలోని అరవై ఒక్క అధ్యాయాలు అరవై ఒక్క కథలుగా చదివిస్తాయి. వీరు తన స్వవిషయాలను చాలా సృజనాత్మక భావుకతతో, ప్రతిభతో ఆవిష్కరించడం వారి వంటి ఉపజ్ఞాప్రాభవులకు మాత్రమే సాధ్యం.
తిరుమల రామచంద్రగారు ఏ పుస్తకానికైనా పరిచయ వాక్యాలు కూర్చేటప్పుడు, ఆ పరిచయాన్ని ‘మనవి మాటలు’ అనేవారు చివరన తనను ‘భాషా సేవకుడు’ అని అభివర్ణించుకునేవారు. అంతటి సౌజన్యమూర్తి దురదృష్టవశాత్తు తన స్వీయ చరిత్రను పుస్తక రూపంలో చూసుకోకుండానే దివంగతులైనారు. కాని మృత్యుశయ్యలో కూడా ఈ గ్రంథాన్ని గురించే కలవరించారు. ఈ పుస్తకం రావడానికి ఎవరు తోడ్పడతారా? అని ఉత్సుకతతో ప్రతీక్షించారు. అయితే వారు లోకాంతరగతులైన రెండు నెలలలో అప్పాజోస్యుల విష్ణుబొట్ల ఫౌండేషన్ (అ.జో.వి.భా) వారి సహకారంతో ఈ పుస్తకం రూపుదిద్దుకొంది. డా.అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ) ‘మనన్విమాటలు’ పేరుతో మొదటి ముద్రణలో, ‘మనవి మాటలు’ పేరుతో రెండవ ముద్రణలో రెండు ముందుమాటలను వ్రాశారు. జి.వి.అమరేశ్వరావు అందమైన రేఖాచిత్రాలను సంతరించి, సుందరంగా ముఖచిత్ర రూపకల్పన చేశారు. ఇలా తిరుమల రామచంద్రగారి ‘హంపీ నుంచి హరప్పా దాకా’ గ్రంథం వెలుగులోకి వచ్చింది. ఈ మేలి గ్రంథంతో తులతూగ గలిగిన గ్రంథాలు ఒక శతాబ్దంలో ఇరవైదాకా వెలువడితే అది చాలా గొప్ప సంగతే అవుతుంది. సాహిత్య ప్రక్రియలన్నింటిని కలిపి లెక్కించినా ఒక శతాబ్దిలో ఇటువంటి మహోత్తమ గ్రంథాలు ఇరవై ముప్పై కన్న ఎక్కువ పరిగణనలోకి రావు. ఎందుకంటే ఈ రచన నవరసభరితమైన ఆధునిక వచన మహాకావ్యం. ఇతిహాసం భారతీయ సంస్కృతిలోని మేలిమిని సాక్షాత్కరింపజేస్తున్న సుందరపురాణం. చారిత్రాత్మక స్వీయ చరిత్రాత్మక కథనం. ఒక నవల కన్నా వేగంగా, ఆకర్షకంగా, ఉత్తేజభరితంగా, చదివించే ఈ రచన ఎంతో విలక్షణమైనది, విశిష్టమైనది.
మొదటి అధ్యాయం ‘గుండ్రాయి చెప్పిన గాథ’లో అనేక చారిత్రక విషయాలను విశ్లేషించారు. రామచంద్ర గారి పూర్వీకులు విజయనగర సామ్రాజ్యంలో, తాడిమర్రి పాలకుల వద్ద గురువులుగా వ్యవహరించిన తీరును, రామానుజ మతాన్ని, తమ ఇంటి పేరైన తిరుమల నామ ప్రాధాన్యాన్ని ఆకట్టుకునే శైలిలో వివరించారు.
రెండవ అధ్యాయం ‘కమలాపురం’లో కమలాపుర స్థలనామ విశేషాన్ని తెల్పి, మొదటి అధ్యాయంలోని సగం విరిగిన ఇనుపగుండు గాథను ఫిరంగి గుండని తేల్చిపారేశారు.
నాలుగవ అధ్యాయం ‘పాడుపట్టణమైన విజయనగరం’లో విజయనగరం ఇప్పటి లండన్ నగరం కన్నా విశాలమైనదని, కమలాపురం విజయనగర సార్వభౌముల అంతఃపురాలకు దగ్గరగా ఉన్న ప్రాంతమని, విద్యా దృష్టిలో చూస్తే పూర్వమిది గొప్ప విద్యా పీఠమని, మహా వాగ్గేయకారులు, విద్వద్వరులు నివసించిన ప్రాంతమని, అయితే బహుమనీ సుల్తానుల రెండు లక్షల సైన్యం ఓవర్ టైం కూడా చేసి, విజయనగరాన్ని ఆరు నెలల పాటు ధ్వంసం చేసారని, అంతటి మహానగరంలో కమలాపురం వంటి ఊళ్లు ఇప్పుడుండటమే గొప్పవని ఆ ఊరి నుంచే విజయనగర శిథిలాలు ప్రారంభమవుతాయని చెప్పి, వాటిని విశ్లేషిస్తారు. తర్వాత ధార్వాడ నుంచి వచ్చిన మోడీ వేసేవాళ్ళ అపూర్వ వినోదాలను, విచిత్రాలను ఆకర్షణీయమైన మాటలతో చెప్పి, చివరకు అంతటి కళాకారులకు దక్కినవి వారం రోజుల తిండిగింజలు, పదిహేను రూపాయలని, మరి ఇప్పటి ఇంద్రజాలికులు పెద్దపెద్ద ఆడంబరాలతో లక్షలు గడిస్తున్నారని వాపోతారు.
అయిదవ అధ్యాయం ‘బసివి నాగమ్మ’లో ‘‘మన ఆచారాలు అన్నీ మంచి ఉద్దేశంతో ప్రారంభమై చెడ్డ పరిణామంలో ముగుస్తాయి. బసివి పద్ధతి మన దేశంలో వేల సంవత్సరాల నుంచి ఉంది. ఈ సంసార బంధంలో చిక్కుపడక తనను భగవంతుని సేవకు జీవితమంతా అంకితం చేయడం దీని ఉద్దేశం. పూర్వం మగవారు ఇలాంటి సేవ చేసేవారు. వారిని ఏకాంగి, ఏకాంగి వీరుడు అనేవారు. దైవ సేవ కోసమే కాదు, రాజసేవ కోసం, తన లక్ష్యసిద్ధి కోసం ఇలా అంకితమయ్యేవారు. అలాగే మహిళలు అంకితమయ్యేవారు. దీనికి గొప్ప ఉదాహరణ గోదాదేవి. తన వివాహం భగవంతునితోనేనని రంగనాథునికి జీవితం అర్పించి ఆయనలో ఐక్యమైంది.
ఈ పాత సంప్రదాయం శైవవైష్ణవ మతాలకు పాకింది. వీరశైవ మత ప్రవర్తకుడు బసవేశ్వరుడు. అతడు పరమేశ్వరుని వాహనమైన వృషభనంది అవతారమని తదనుయాయుల విశ్వాసం. వృషభ శబ్ధం ప్రాకృతంలో బసవ అయి కన్నడంలో చేరింది. బసవని లాగే పరమేశ్వరునికి కింకరుడై జీవితాన్ని తదారాధనకు వినియోగించేవాడు బసవుడు. ఆ విధంగా వివాహాది సంసార జంజాటం మాని పరమశివ కైంకర్యానికి జీవితాన్ని అంకితం చేసిన మహిళ బసవి, బసివి. పిల్లలు కలగని వారు తమకు పిల్లలు పుడితే ఒక సంతానాన్ని బసవిగా భగవత్కైంకర్యానికి వదులుతామని, జబ్బుపడిన బిడ్డపడే తీరని బాధను చూచి ఓర్చుకోలేని తల్లిదండ్రులు జబ్బు కుదిరితే నీ సేవకే బసివిగా వదులుతామని మొక్కుకోవడం కూడా కొన్ని కులాలలో చిన్నతనంలో ఉండేది’’ అని దేవదాసీ, బసవి (బసివి) వ్యవస్థ యొక్క మహత్తర ఉద్దేశాన్ని కూలంకషంగా వివరించారు.
తర్వాత సంఘంలోని స్వార్థపరులు ఊరికే ఉండరని, మంచిని పాడుచేస్తారని, ఆ విధంగానే దేవదాసి, బసివి పద్ధతి పాడయిపోయిందని, దేవునికి చెందిన బసివి, దేవ దున్నపోతులాగే ఉమ్మడి గ్రామానికి ఉమ్మడి ఆస్తి అయిందని, క్రమంగా మోతుబరుల మనిషి అయిందని, వ్యభిచారంతో జీవించే వ్యక్తి అయినదని ఆవేదన చెందుతారు. చివరలో బసివి నాగమ్మను గురించి చెబుతూ ఆమెను తలచుకుంటే తన వేద, పురాణ మహిళలందరూ గుర్తుకు వస్తారని, ఆమె పవిత్రతను, పాతివ్రత్యాన్ని కొనియాడుతారు.
పదకొండవ అధ్యాయం ‘తెనాలి రామన మంటపం’లో తన తాతగారికీ, నాయన గారికీ, పినతండ్రి గారికీ శిథిలాలలోని ప్రతి రాతిముక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసునని చరిత్రకెక్కని ఎన్నో విషయాలను వారు చెప్పగలిగేవారని, హంపీ శిథిలాలలో పాడుపడిపోయిన భువనవిజయ సభామంటపం ఎదుట దాదాపు అరమైలు దూరంలో ఒక గుట్టమీద నాలుగు స్తంభాల ఒక చిన్న మంటపమున్నదని, దానికి తెనాలి రామన మంటపమని పేరని తెల్పి, తన తాతగారి ద్వారా తెలుసుకున్న ఆ వృత్తాంతాన్ని విశదీకరిస్తారు.
పదమూడవ అధ్యాయం ‘అంజనంలో కనిపించిన పట్టణద ఎల్లమ్మ’లో పట్టణద ఎల్లమ్మ అంటే `పట్టణపు ఎల్లమ్మ’ అని, ఈమె విజయనగరం రక్షణ దేవతని, శత్రువుల ఆక్రమణ సమయంలో ప్రాణభయంతో అందరూ కట్టుబట్టలతో పారిపోయారని, వారు భూమిలోనో, విశాలమైన గోడల మధ్యనో దాచుకున్న డబ్బు తన చిన్నతనంలో చాలామందికి దొరికినట్లు వ్యాపిస్తూండేవని, ఎల్లమ్మ రాత్రంతా అదృశ్యంగా శిథిలనగరమంతా తిరుగుతుంటుందని, ఆ నిధులను రక్షిస్తుంటుందని, అలాంటి నిధులు పిడతలోనో, వాడలలోనో దాచినవి కొందరికి దొరికేవని, తనకిలాంటి గుర్తున్నటు వంటి రెండు మూడు సంఘటనలను వివరిస్తారు. అందులో భాగంగానే మార్కాపురం నుంచి వచ్చిన సీతానగరం రామాచార్యులనే మంత్ర శాస్త్రవేత్త, తన తాతగారైన నరసింహ తాతాచార్యుల గారితో అంజనం వేయడానికి ఒక రాత్రిపూట ఒక వ్యక్తిని ఎన్నుకొని, అతని కంటికి ఏదో రాసి, ఒక తమలపాకులో ఒక చుక్క అంజనం వంచి, ఏవో మంత్రాలు చదివారని. అంజనం రాసుకున్న వాడికి, ఆ అంజనం చుక్కలో నిధులతో పాటు, పట్టణద ఎల్లమ్మ కన్పించి, భయపెట్టగా అతడు ముందుకు పడిపోయాడని, మాంత్రికుడు తక్కిన మంత్రాలతో పాటు వైష్ణవ సంప్రదాయపు అభీతిస్తవం పఠించాడని, తర్వాత కొంతకాలానికి పట్టణద ఎల్లమ్మ గుడి పరిసరాలలో పురాతత్వశాఖవారే తవ్వకాలు కొనసాగించారని, అపూర్వమైన వస్తువులు, వజ్ర వైఢూర్యాలూ దొరికినట్లు విన్నానని ముక్తాయింపునిస్తారు.
ఇరవయ్యో అధ్యాయం ‘నిద్రలో నడక’లో రామచంద్రగారి సమాశ్రయణ వృత్తాంతాన్ని పరమ సుందరంగా వర్ణించారు. గొప్ప సంస్కారంతో గాని, త్రికరణ పూర్వకమైన దాసభావం కలగదని, తిరుమలనంబి, భగద్రామానుజుల వారి వృత్తాంతాన్ని ప్రస్తావించారు.
ఇరవై ఒకటవ అధ్యాయం మహాతపసిస్విని కొండమ్మవ్వలో ‘‘కొండమ్మవ్వ దయామయి. ఆర్తులను ఆదుకొనేది. జబ్బుపడిన పిల్లలకు, మహిళలకు సేవచేసి, సేదతీర్చే చల్లని మాటలు మాట్లాడేది. గొప్ప మనస్విని. విధివంచనతో కాపురానికి వచ్చి కాంక్షలు తీరీ తీరని వయస్సులోనే వైధవ్యం పైనపడినది. పిల్లలు లేరు. విడిపోతే ఆస్తులలో చీలికలు వస్తాయని అత్తింటివారు ఆమెను పుట్టింటికి పంపలేదు. అత్తింటిలోనే ఎనిమిది పదుల ఆయుస్సు గడిపింది. తన బావగారి కుమారుణ్ని తన కుమారుడిగా భావిస్తూ, అతని పిల్లలను తన మనుమలుగా భావిస్తూ, ఒక చీదరింపు లేక సంతోషంతో, అందరినీ వాత్సల్య గౌరవాలతో చూస్తూ జీవయాత్ర గడిపింది. తన ప్రవృత్తిని మానవత్వం వైపు, జగత్కుటుంబ భావనవైపు మళ్ళించి, ధన్యురాలయింది’’ అని కొండమ్మవ్వను గురించి పేర్కొని, ఆమె త్యాగజీవితాన్ని కొనియాడుతారు.
ఇరవైమూడవ అధ్యాయం ‘భవతీ భిక్షాందేహి’లో ‘పూర్వం చాలామంది విఖ్యాతులైన పండితులు, హైకోర్టు న్యాయమూర్తులైన పలువురు వీధిదీపాల క్రింద చదువుకొని, మాధుకరమెత్తి చదువుకొని గొప్ప వాళ్ళయారని, ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో చదువు కొనసాగించడానికి వెళ్ళిన విద్యార్థులు అక్కడి వ్యాపార సంస్థలలో కార్యాలయాలలో కొన్ని గంటలపాటు పనిచేసి డబ్బు సంపాదించి అదనపు ఖర్చులకు వినియోగించుకొంటున్నారని, ఈ కాలంలో ఉద్యోగం చేసేవాళ్ళు పై వారి అనుగ్రహం కోసం తమ విధ్యుక్తధర్మాల నిర్వహణ కన్నా ఎక్కువగా ఈ పనులు చేస్తుంటారని, వాళ్ళను మనం ఉద్యోగం బిచ్చగాళ్ళని అందామా?’ అని మాధుకర వృత్తి ప్రాశస్త్యాన్ని తెలియజేస్తారు.
ముపై నాల్గవ అధ్యాయం ‘అమ్మమాట’లో ‘మానవుని మనసు కష్టాలు విచ్చినప్పుడు కాని నీతి ప్రవణం కాదనిపించింది. ఆ జీవితం చూస్తుంటే మా అమ్మతో ఆ మాటే అన్నాను. ఆమె అరగంటసేపు ఆపద్ధార్మాలను గురించి నాకు వివరించింది. ఆపత్కాలంలో మానవుని ధర్మబుద్ధి వికసించి వివేకం జాగృతమవుతుందని అది ఆపద గడిచిన తర్వాత గూడ కొనసాగితే మనస్సు నిజంగా పరిపక్వం అయినట్టని అన్నది’ అని తన తల్లి మాటలలోని నైతిక సారాంశాన్ని పాఠకులకు అందించారు.
చివరిదైన 61వ అధ్యాయంలో ‘డెయిలీ టెలిగ్రాఫ్’లో ‘నేను కళ్ళు తెరిచే వేళకు రాత్రి ఎనిమిది కొట్టింది. అప్పుడు లక్ష్మీబాయి గారి ఇంటికి మారడం ఎందుకులే అని అనుకున్నాను. రాత్రి సత్రం పంచలోనే కప్బోర్డ్ ఎదుట అందరితో పాటే ఉత్తరీయం పరచుకొని పడుకున్నాను. ఉదయం లేచాను. పని పునరావృత్తం అయింది. అవును. ఈ పునరావృత్తి రొటీన్ జీవికే కాదు, సృష్టికీ తప్పదా? భూమి తిరుగుతూనే ఉంది. సూర్యుని చుట్టూ, తన చుట్టూ చంద్రుణ్ణి తిప్పుకుంటూ! సూర్యుడు కూడా తిరుగుతాడట! ఈ భూచక్రానికేతప్పనప్పుడు నేనంతటి వాడిని? అయినా నేను నష్టపడినది లేదనే అనిపించింది. దేశం తిరిగాను. వయస్సు గడిచినా అనుభవం కలిగింది గదా అనుకుని లక్ష్మీభాయి గారి ఇంటికి బయలుదేరాను. అప్పుడు ఒక సూక్తి గుర్తుకువచ్చింది.
‘‘యస్తు సంచరతే దేశాన్ ` యస్తు సేవేత పండితాన్ ।
తస్య విస్తారితా బుద్ధిః ` తైలబిందు రివాంభసి’’ ॥
ఎవడు దేశాలు తిరుగుతాడో, ఎవడు పండితులను సేవిస్తాడో, వాడి బుద్ధి నీటిలో పడిన నూనె సెక్కలాగ విస్తారిస్తుంది. నాకవిరెండూ ఎంతవరకు అబ్బినాయో బేరీజు వేసుకుంటూ నడిచాను. నూరేళ్ళూ ఇలా నడుక తప్పదేమోనని అనిపించింది’ అని తన అనుభవాలను ఇలా ఒక మంచి శ్లోకంతో ముగించారు.
రచయిత రామచంద్ర గారు ప్రతి అధ్యాయంలో ఇలా ఆకట్టుకొనే అంశాలను, సందర్భోచిత సుప్రసిద్ధ శ్లోకం ద్వారా ఉటంకించి తన అనుభవాలను వింగడించారు, పాఠకులకు కనువిందు చేశారు. వారి మనస్తత్వ పరిశీలన, మానవ స్వభావ చిత్రణ, మనస్తత్వ ప్రతిపాదన చాలా అద్భుతమైనవి. ఆలోచిస్తే ‘‘హంపీ నుండి హరప్పా దాక రామచంద్రాయణమైన మధురం, మధురాక్షరం’’ అని మంజుశ్రీ గారన్నమాట అక్షరసత్యం. ఎందుకంటే ఇందులో రచయిత వైయుక్తిక విషయాలే కాక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సంబంధమైన పలు విషయాలు కన్పిస్తాయి. ఇవన్నీ చరిత్రకు సంబంధించిన విషయాలే! కనుక ఒక రకంగా ఈ గ్రంథాన్ని చారిత్రక రచనా విభాగానికి చెందిన ప్రక్రియగా పేర్కొనవచ్చు.
ఏది ఏమైనా స్వీయ చరిత్రను వ్రాసి మెప్పించటం చాలా కష్టం. ఎందుకంటే రచయిత తన జీవితంలోని సంఘటనలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. రచయిత రామచంద్ర గారు తన వ్యక్తిగత కుటుంబ విషయాలు, సామాజిక విషయాలు, సంఘటనాత్మకంగా ఒక క్రమపద్ధతిలో వివరించటంతో పాటు సమాజంలో వున్న పరిస్థితులను హేతుబద్ధంగా ఆలోచించి, సోపపత్తికంగా నిరూపించి ఈ విషయంలో కృతకృత్యులయ్యారు. పాఠకులను మెప్పించారు.