Menu Close
అత్తలూరి విజయలక్ష్మి
దూరం (ధారావాహిక)
అత్తలూరి విజయలక్ష్మి

తండ్రి, తల్లిలా ప్రతిక్షణం పిల్లలతో ఇంటరాక్షన్ ఏర్పరచుకోడు.. అతనిలో కూడా భయం, వేదన, సంఘర్షణ అనేవి ఉంటాయి.. కానీ అవి ప్రేమ, గాంభీర్యం మాటున అవ్యక్తంగా ఉండిపోతాయి. కానీ, అతను ఇచ్చే రక్షణ, అభయం మూల స్తంభాలులా జీవితాంతం వాళ్ళని కాపాడుతూ ఉంటాయి. కారణం అతను మగవాడు.. స్త్రీకి కొన్ని నియమాలు ఏర్పరిచిన సంఘం పురుషుడికి కూడా కొన్ని నియమాలు ఏర్పరచింది.. వాటిలో అతి ముఖ్యమైనది అతని భావోద్వేగాలు బయటకు వ్యక్తపరచ కూడదన్నఅనైతిక బలం..అది బలం కాదు.. బలహీనత అని గ్రహించిన దీపక్ ఇప్పుడే ఆ బలహీనతని జయించి తండ్రిగా తన కూతురు భవిష్యత్తు పట్ల తనకున్న ఆశలని చెప్పమని ఆదేశించింది.. అందుకు అతను వేసిన తోలి అడుగు స్మరణ మనసులో ఏముందో తెలుసుకోవాలనుకోడం. ఇప్పుడు చెప్పకున్నా తరవాత స్మరణ తప్పకుండా తన మనసు విప్పి చెబుతుంది.. అందాకా సహనం వహించక తప్పదు.

సంధ్య మనసులో విపరీతమైన ఆవేదన, దుఃఖం నిండి ఉన్నాయి. ఇన్నేళ్ళ వైవాహిక జీవితంలో ఏనాడూ దీపక్ ఇంత కఠినంగా మాట్లాడలేదు. ఇంట్లో అన్ని విషయాలు సంధ్య ఆజమాయిషీలో, ఆమె ఆద్వర్యంలో జరుగుతూ వచ్చాయి. ఆమెకి మొదటిసారిగా ఆ ఇంట్లో తనకి కాక మరొకరికి పెత్తనం ఉందని అర్ధం అయింది.. అది భర్తే అని తెలిసాక ఇంతకాలం నేను నా భర్తని అలక్ష్యం చేసానా..అతనికి విలువ ఇవ్వలేదా అన్న ఆత్మ పరిశీలన మొదలైంది. ఏనాడూ ఆ ఇంట్లో ఆమె అడుగుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె మాటకు ఎదురు చెప్పిన వాళ్ళు, ఆమె మాటల్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు అకస్మాత్తుగా తన ఆలోచనల మీద, నిర్ణయాల మీదా వ్యతిరేకత రావడంతో సున్నితమైన ఆమె మనసు తట్టుకోలేక పోతోంది. ఇది సంధ్యకే కాదు ఆమె స్థానంలో ఎవరున్నా అదే భావన ఉంటుంది. నయనో, భయానో, బెదిరించో స్మరణ వివాహం తన ఆశలకి అనుగుణంగా చేయగలను అనే బలమైన ఆమె నమ్మకం మీద పెద్ద కొడవలితో ఒకే ఒక్క పోటు పొడిచి ఆ ఆశలను సమూలంగా నరికి వేసినట్టు ఆమె బాధపడుతోంది. ఇప్పుడు ఆమెకి కావాల్సింది ఓదార్పు కాదు.. తన భావాలను వ్యక్తపరచ గల స్వేచ్ఛ. ఉన్నది కోల్పోయాక కానీ దాని విలువ తెలియదు.. అలాగే సంధ్యకి స్వేచ్ఛ విలువ తెలుస్తున్న కొద్దీ తను స్మరణ పట్ల కొంచెం నిరంకుశంగా ప్రవర్తించానన్న పరివర్తన కలగసాగింది.. కాకపొతే దానికి పరిహారం ఎలా అన్నది మాత్రమే ఆమెకి తెలియడం లేదు..

ఆ ఇంటికి మూలస్థంభం లాంటి ఆంజనేయులు మూలాలు కదిలిపోయే పరిస్థితి వస్తోందన్న ఆందోళనతో మొదలు నరికిన చెట్టులా నిస్తేజంగా పడి ఉన్నాడు.. ఆయన మెదడు ఆలోచన కోల్పోయింది. అటు కోడలికి మనో ధైర్యం, మనవరాలికి నైతిక బలం రెండూ ఇచ్చే స్థితిలో ఆయన లేడు.. ఇరవై నాలుగు గంటల్లో తన జీవితంలో ఇలాంటి అనూహ్యమైన మార్పు వస్తుందని ఆయన ఏనాడూ ఊహించలేదు.. తన ఊహల్లో  చిరస్మరణీయంగా నిలిచిపోయిన ప్రియురాలి జ్ఞాపకాలే ఊపిరిగా జీవిస్తున్న ఆయనకీ మొదటిసారిగా తను చేస్తున్నది తప్పు అనే భావన కృంగదీస్తోంది.. జీవితం తెల్లకాగితం అయినప్పుడు ఆ కాగితం మీద ఏం రాసుకోవాలి అని నిర్ణయించుకునే అధికారం వ్యక్తిగతం కావచ్చు... కానీ తన జీవితం అనే కాగితం మీద మరణించిన భార్య, కొడుకులు, కూతురు, కోడళ్ళు, అల్లుడు, మనవరాలు, మనవాళ్ళు... అనే ఒక వ్యవస్థ అనే గీత గీసి  ఉంది.. ఆ గీతకి ఆవల నిలబడి ఉన్నాడు తను.. ఆ గీత తనొక్కడు దాటితే మొత్తం వ్యవస్థ కూలిపోతుంది. తన ప్రేమ కథ కేవలం వ్యక్తిగతం.. అది ఎప్పుడో భూస్థాపితం అయింది..అప్పుడప్పుడు తలచుకోడానికి ఆయనకీ జీవితంలో ఉన్నవి ఆ స్మృతులే.. వ్యవస్థ అనేది చుట్టూ కంచెలా ఏర్పడ్డాక కొన్ని స్మృతులను తలచుకునే స్వేచ్ఛ కూడా ఉండదన్న వాస్తవం ఇప్పుడే తెలిసింది. ఎంత  విషాదం! మనిషినే కాదు ఈ సమాజం మనసుని కూడా నియంత్రించగలదు..

తన రహస్యం తెలుసుకున్న స్మరణ అనాలోచితంగా మాలతిని వెతుక్కుంటూ నర్సాపూర్ వెళ్ళడం ఎంతగా పట్టించుకోకూడదనుకుంటున్నా పుండులా సలుపుతూనే ఉంది. మాలతిని స్మరణ కలవడం, తన దగ్గరకు తీసుకురావడం అనేది జరుగుతుందో, లేదో కానీ ఆయన మనసులో తెలియని ఆందోళన మాత్రం కలుగుతోంది. బహుశా ఇంతకాలం కాపాడుకుంటూ వస్తున్న గౌరవ మర్యాదలు మంటకలిసి పోతాయన్న భయం కావచ్చు.. తన చుట్టూ తను నిర్మించుకున్న బలమైన వ్యవస్థ కూలిపోతుందేమో అనే భయం కావచ్చు.. ఏది ఏమైనా ఇప్పటికీ ఆయనకి తను చేసింది తప్పా! ఒప్పా అనే సందిగ్ధం లోనే కొట్టుకుపోతున్నాడు అన్నది నిజం..కుటుంబ వ్యవస్థ, సామాజిక కట్టుబాట్లు అనేవి లేకపోయి ఉంటే  స్వేచ్ఛకి పరిమితులుండేవా! స్వేచ్ఛకి పరిమితులు లేకుంటే సమాజం ఎలా ఉండేది? ఇవన్నీ ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నలే..

ఇరవై నాలుగు గంటల క్రితం దాకా సందడిగా, సరదాగా ఉన్న విశాలమైన ఆ ఇంట్లో ఆ ముగ్గురు వ్యక్తుల మానసిక సంఘర్షణ తాలూకు ప్రతిస్పందనలు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. కుటుంబం అనేది గతానికి, భవిష్యత్తుకీ మధ్య వేసిన రహదారి లాంటిది. గమ్యాన్ని చేరాలంటే ఎవరైనా సరే ఆ దారిలో నడవాల్సిందే..

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ లో పదంతస్తుల బిల్డింగ్... చుట్టూ విశాలమైన ఆవరణ... ఓ పక్కగా కారు పార్కింగ్ లాట్.. మరో పక్క అందమైన లాన్... లాన్ మధ్యలో వాటర్ ఫౌంటెన్... పాండ్... అందులో కలువపూలు.. సమయం తొమ్మిదిన్నర.. విశాలమైన గేటులోంచి ఆవరణలోకి దూసుకువచ్చింది ఖరీదైన ఆడి కార్. ఆ బిల్డింగ్ ప్రవేశ ద్వారం ముందు ఆగింది. అందులో నుంచి తెల్లగా, సన్నగా, పొడుగ్గా అందంగానే కాదు ఎంతో హుందాగా ఉన్న యువకుడు దిగాడు. ఆరు మెట్లు ఎక్కి ఎంట్రన్స్ దగ్గరకు రాగానే ఆటోమాటిక్ గా గ్లాస్ డోర్ తెరుచుకుంది. వెండి కరిగించి వజ్రాల పొడి కలిపి తాపడం చేసినట్టున్న ఫ్లోర్, తళ, తళ మెరుస్తున్న గోడలు.. గోడలకి అక్కడక్కడా మోడరన్ ఆర్ట్ ఫోటోలు.. ఇత్తడి కుండీల్లో ఇండోర్ ప్లాంట్స్ .. మధ్యలో ఇత్తడి తొట్టిలో నీళ్ళు పోసి గులాబీలు అందంగా పేర్చి ఉన్నాయి. యాంబియన్స్, కమ్యునికేషన్ స్కిల్స్, ఇంప్రెసివ్ గా ఉండే డ్రెసింగ్, మంచి మానరిజమ్స్, ధారాళంగా ఇంగ్లీషులో మాట్లాడగల సామర్ధ్యం ఇవన్నీ కార్పోరేట్ కంపెనీల ప్రధాన లక్షణాలు.. అవన్నీ కావాల్సిన దానికన్నా ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రతి అంతస్తులో.

అతను నేరుగా లిఫ్ట్ దగ్గరకు వెళ్లి బటన్ నొక్కాడు.. లిఫ్ట్ క్షణంలో వచ్చి ఆగింది. విశాలంగా ఉంది. అతను లిఫ్ట్ లోకి నడిచి ఎనిమిదో నెంబర్ నొక్కాడు.

పొడుగాటి కారిడార్.. దాటగానే ఎడం పక్క గ్లాస్ డోర్.. అక్కడ కూడా ఇంటరీయర్ డేకోరేషన్ కళ్ళు చెదిరేలా ఉంది. అతను నేరుగా ఒక విశాలమైన హాల్లోకి వెళ్ళాడు అదే కాన్ఫరెన్స్ హాల్. అప్పటికే అక్కడ పది మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ కూర్చుని ఉన్నారు. అతను లోపల అడుగుపెట్టగానే అందరూ గబుక్కున లేచి నిలబడ్డారు. పొడుగాటి టేబుల్, దానికి రెండు పక్కలా కుర్చీలు.. ఒక వైపు డయాస్.. దాని మీద ధగ, ధగ లాడే లైట్స్, పోడియం, మైక్, ఖరీదైన వి ఐ పి కుర్చీలు.. టేబుల్ వెనకాల ప్రొజెక్టర్..అతను నేరుగా డయాస్ మీద ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్లి అందరికీ విష్ చేసాడు. అందరూ గుడ్ మార్నింగ్ అన్నారు.

“ప్లీజ్ సిట్ డౌన్” అన్నాడు కూర్చుంటూ.

అందరూ కూర్చున్నారు. ఏ సి నిశ్శబ్దంగా చల్లదనాన్ని అందిస్తుంటే రూమ్ స్ప్రే మొగలిపూల పరిమళాన్ని ఆ చల్లదానానికి అడ్డుతోంది. అందరూ పాతిక ఏళ్లకు అటూ, ఇటూగా ఉన్నారు. అందులో నలుగురు అమ్మాయిలూ ఉన్నారు. అందరికీ డ్రెస్ కోడ్ గ్రే కలర్ పాంట్, తెల్లని షర్టు..

హెచ్ ఆర్ మేనేజర్ వినయ్ అతనికి విష్ చేసి పోడియం దగ్గరకు నడిచి గొంతు సవరించుకుని చక్కటి ఇంగ్లీషు లో ఆ యువకుడిని అందరికీ పరిచయం చేసాడు.. “హి ఈజ్ అవర్ సి ఇ వో మిస్టర్ మాధవన్.. సుమారు ఏడాదిగా యు ఎస్, యు కే, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలు పర్యటించి ఇటీవలే తిరిగి ఇండియా వచ్చారు.. ఈ కంపనీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ, తన మేధస్సుతో, వాగ్దాటితో ఎన్నో ప్రాజెక్ట్స్ సంపాదించి ఈ రోజు టాప్ టెన్ సాఫ్ట్ వేర్ కంపెనీ లలో ఒకటిగా మన కంపని నిలబెట్టిన ఘనత మాధవన్ గారిదే.. లెట్ అజ్ గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్ ...” అతని మాటలు పూర్తి కాకుండానే చప్పట్లు హాల్లో ప్రతిధ్వనించాయి. అతను చాలు అన్నట్టు కుడిచేయి కొద్దిగా ఎత్తి సంజ్ఞ చేసాడు.

ఇప్పుడు మిస్టర్ మాధవన్ మన కొత్త ప్రాజెక్ట్  ప్రెజంటేషన్ చేస్తారు..

మేనేజర్ తన సీటులోకి వెళ్ళిపోయాడు.

మాధవన్ లేచి పోడియం దగ్గరకు వచ్చాడు.

అమెరికన్ యాక్సెంట్ కలిసిన ఇంగ్లీషులో అతని స్వరం మంద్రస్థాయిలో వినిపిస్తుంటే అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ పాటిస్తూ విన్నారు. ఆ ప్రాజెక్ట్ గురించి, దాని కోసం తను ఎంత ప్రయత్నించాడో, ఎంత మందిని కలిసాడో, ఎన్ని చర్చలు జరిపాడో అందులో ఉన్న అడ్వాంటేజ్ గురించి వివరించాడు. ప్రొజెక్టర్ మీద పవర్ పాయింట్ ప్రెజంటేషన్ చేసాడు. మధ్యలో మేనేజర్ ని అడిగి  హైదరాబాద్ బ్రాంచ్ లో ఎంత మంది పని చేస్తున్నారు.. ఎన్ని ప్రాజెక్ట్స్ పూర్తీ అయాయి తెలుసుకున్నాడు. పదకొండున్నరకి అందరికీ టీ, బిస్కెట్స్ వచ్చాయి. దాదాపు రెండు గంటల సేపు అతని వాగ్ధాటి సాగిపోయింది.

ఒంటి గంట కి షార్ప్ గా ఆపేసి అందరికీ థాంక్స్ చెప్పి లంచ్ టైం అయింది అని చెప్పి వెళ్ళిపోయాడు.

అతను వెళ్ళిపోగానే అందరూ మైకం లో నుంచి బయట పడినట్టు అయ్యారు. కంపనీ ఏర్పాటు చేసిన లంచ్ అతను ఎందుకు అటెండ్ అవడంలేదో అనుకుంటూ అందరూ డైనింగ్ హాల్లోకి వెళ్ళారు.

మొదటిసారి సి.ఇ.వో ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళే దాదాపు అందరూ.. కార్పొరేట్ కంపెనీ ల్లో ఎప్పటికప్పుడు పాతనీరు కొట్టుకుపోయి కొత్త నీరు చేరినట్టు స్టాఫ్ మారుతూ ఉండడం మామూలు. వారి, వారి అర్హతలను బట్టి కొంచెం అనుభవం సంపాదించగానే అంతకన్నా మంచి జీతం, ఇతర పెర్క్స్ చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. డైరెక్టర్స్, సీనియర్ మేనేజర్స్ మాత్రం సి.ఐ.వో తో వీడియో ద్వారా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అందుకే వాళ్ళందరికీ మొదటి సారి చూసిన ఆ వ్యక్తి గురించి మరి కొన్ని వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తి తో చేతుల్లో ప్లేట్స్ పట్టుకుని మేనేజర్ని చుట్టేశారు అందరూ. ఎవరు ఈ మాధవన్... ఎక్కడివాడు... యు ఎస్ లో ఉంటాడా.. వగైరా వివరాలు..కుతూహలంగా అడిగారు.

“అతను తమిళియన్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు.. యుఎస్ లో ఎంఎస్ చేసి, ఎంబిఎ చేసాడు.. చాలా తెలివైన వాడు.. ఒకవిధంగా చెప్పాలంటే మేధావి.. ఇవాళ ఈ కంపెనీ ఇంత డెవలప్ అయింది అంటే అతనే కారణం.. మంచి స్కిల్స్ ఉన్నాయి.. తల్లి, కొడుకు మాత్రమే ఉంటారు..ఇటీవలే ఇండియా వచ్చాడు.. ప్రస్తుతం బెంగుళూరు లో సెటిల్ అయాడు..”

“పెళ్లయిందా? ఒకమ్మాయి ఆత్రంగా అడిగింది..

“తెలియదు...” మేనేజర్ సమాధానం విని ఆమె ఆలోచనలో పడింది. ఆమె మనసు అప్పటికప్పుడు రెక్కలు తొడుక్కుని అతని చుట్టూ ఎగరడానికి ప్రయత్నిస్తోంది.. మాధవన్... సో హ్యాండ్ సమ్ అనుకుంది.

------

పచ్చటి ప్రకృతి మధ్య నుంచి కారు నడుపుతూ “హమ్మయ్య మొత్తానికి బయట పడ్డాం బాబూ” అంది స్మరణ రిలాక్స్ అవుతూ.

“పాపం ఆంటీ తప్పేం లేదులే స్మరణా! మా అక్కయ్య అంటే పెద్దమ్మ కూతురు తను చాలా అందంగా ఉండేది.. తనని కూడా ఎక్కడికన్నా ఒంటరిగా పంపాలంటే మా పెద్దమ్మ ఇలాగే భయపడుతూ ఉండేది.. తన పెళ్లి అయాక పెద్దమ్మ రిలాక్స్ అయింది.. మన సొసైటీ అలా ఉంది కాబట్టి అమ్మలంతా ఆడపిల్లల గురించి భయపడుతూ ఉంటారు.. ఆడపిల్లలు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగే సమాజం రావాలి అని గాంధీగారు అన్నారు కానీ, మగపిల్లలు ఆడపిల్లలని గౌరవంగా, ప్రేమగా తోటి మనిషిగా చూడాలని చెప్పలేదు అనుకుంటా..” అన్నాడు బదరీ.

బదరీ వైపు ప్రశంసగా చూసింది స్మరణ. ఆ చూపుకి ఇబ్బంది పడుతూ “ఏదో అన్నా కదా అని మరీ నేను రాముడు లాంటి వాడిని అని అనుకోకు” అన్నాడు కొంచెం అల్లరిగా నవ్వి.

“నీ మొహం” అంది తేలిగ్గా నవ్వుతూ. బదరీ కూడా ప్రసన్నమైన మొహంతో విండో లోంచి బయటకి చూస్తూ “ఎంత బాగుంది స్మరణా! ఈ ఊరు” అన్నాడు.

“చూడడానికి కనువిందుగా, పసందుగా బాగానే ఉంటుంది.. కానే మనలాంటి వాళ్ళు ఉండలేరు బదరీ.. కొన్ని అందాలు కేవలం ఆస్వాదించడానికే... అనుభవించడానికి కాదు.” చిన్న ఊళ్లోకి కారు ప్రవేశించడంతో రోడ్డు పక్కన ఉన్న చిన్న బడ్డీ కొట్టు దగ్గర కారాపుతూ “ఇక్కడ కాఫీ తాగుదాం... నాకు ఇలాంటి చోట తాగడం ఇష్టం” అంది.

ఇద్దరూ కాఫీ తాగి కాసేపు చెట్ల నీడన కూర్చుని ఎదురుగా పారుతున్న పిల్ల కాలువ చూస్తూ స్వచ్చమైన గాలి గుండెల నిండా పీల్చుకున్నారు. ఆకాశాన్ని అందుకోవాలన్న ఉత్సాహంతో ఏపుగా పెరిగిన పేరు తెలియని చెట్ల మీద అప్సరసలు దేవతా వస్త్రాలు ఆరవేసినట్టు అనేక రకాల తీగలు అల్లిబిల్లిగా అల్లుకుని ఉన్నాయి. ఎంత పచ్చగా ఉంది స్మరణా ఇలాంటి ప్రకృతి సౌందర్యం చూస్తుంటే కవిత్వం వచ్చేస్తుంది..” అన్నాడు బదరీ పరవశంగా..

“థాంక్స్ చెప్పావు.. ఇంకా నయం.. పద, పద వెళదాం” సరదాగా నవ్వుతూ లేచి కారు వైపు నడిచింది. అంత భయం దేనికి? నేను నిజంగా కవిత్వం చెప్పగలిగితే ముందు ఇన్సూరెన్స్ చేయిస్తాలే” నవ్వాడు.

కారు స్టార్ట్ చేస్తూ మనం సాఫ్ట్ వేర్ వాళ్ళం మనకెందుకు కవిత్వం..  కాసేపట్లో పాలకొల్లు చేరతాం.. అక్కడ హాయిగా పాటలు పాడుకుంటూ, డాన్సు లు చేద్దాం” అంది.

బదరీ సన్నగా “పాలకొల్లు సంతలోన పాపాయమ్మో అనే పాట హమ్ చేయసాగాడు.”

“పాటలు పాడుకుంటూ డ్రైవ్ చేయడం చాలా బాగుంటుంది కదూ” అంది.

“ఓ పాట పాడు విని తరిస్తాను” అన్నాడు.

“తరించడం కాదు పారిపోతావు... నువ్వు పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక ..”

ఇద్దరూ నవ్వేసారు. కారు పాలకొల్లు చేరింది కుడివైపు పెద్ద కాలువ, కాలువ అవతల పచ్చటి పొలాలు, ఓ పక్క మావిడి తోటలు, కాలువ ఒడ్డున కొబ్బరి చెట్లు, స్మరణ కారు ఆపి అటుగా వెళ్తున్న  రైతులను అడిగింది “ఇది పాలకోల్లెనా”

“ఆయ్ పాలకోల్లెనండి” అన్నారు.

ఇద్దరూ కారు దిగారు.. కాలువ గట్టున నడవసాగారు. బదరీ ఫోన్ లో ఫోటోలు తీసుకున్నాడు. నావల్లో గడ్డి వాములు, సైకిళ్ళు అవతలి ఒడ్డుకి తీసుకుని వెళ్తున్నారు కొందరు యువకులు. ఎడం పక్క ఊరు కనిపిస్తోంది.. అడుగడుగునా బోలెడన్ని కొబ్బరి బొండాల కొట్లు.. కాలవ గట్టున తిరుగుతున్న యువకులు, కొబ్బరి బొండాలు అమ్ముతున్నవాళ్ళు.. వాళ్ళవైపు వింతగా చూడసాగారు.

“ఎవురమ్మా ఏ ఊరు అయిదరాబాదా మంది..” అన్నాడు ఒకతను.

“అవును... మీ ఊరు చూడ్డానికి వచ్చాం” అంది స్మరణ.

అతను ఫకాల్న నవ్వాడు... “మా ఊరా .. ఏముందండి మా ఊళ్ళో చార్మినారా, గోల్కొండా.. ఈ కాలవలు, పొలాలు... కొబ్బరిచెట్లు అంతే కదండీ” అన్నాడు.

“మాకు కావాల్సింది అవే” అన్నాడు బదరీ. నిజమే ఏదైనా లభించని దాని మీదే ఎక్కువ మమకారం ఉంటుంది అన్నట్టు వాళ్ళ వైపు ఎగాదిగా చూసి మా ఊరి కొబ్బరినీళ్ళు తాగండి అంటూ గుట్టగా పోసి ఉన్న కొబ్బరిబొండాలు రెండు కొట్టి ఇచ్చాడు అతను.

తియ్యటి నీళ్ళు, అంతకన్నా తీయని గుజ్జు రుచి చూసి వావ్ యమ్మీ అన్నాడు బదరీ..

“మీ ఊరు గురించి చెప్తారా అడిగాడు బదరీ.. “పెద్ద రాయి మీద కూర్చుంటూ...

“ఆయ్ ... పాలకొల్లు శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం మజ్జలో కదండీ ఇదుంది..దీనికి త్రిలింగదేశం అని కూడా అంటారండి..క్షీరారామం ఎల్లండి.. దారకా తిరుమల దగ్గరేనండి.. ఏడుకొండలవాడు.. మహిమగల దేవుడండి.. అతను చెపుతున్న తీరుకి నవ్వోస్తోంటే బలవంతంగా ఆపుకుని “థాంక్స్ బాబాయ్ ...నర్సాపూర్ వెళ్ళాలి.. వెళ్ళొస్తాము” అంటూ బదరీ చేయి పట్టుకుని కారు దగ్గరకు లాక్కుని వెళ్ళింది..

“వీళ్ళ భాషలో చెబుతోంటే వినడానికి సరదాగా ఉంది స్మరణా!” అన్నాడు బదరీ.

“బానే ఉంటుంది....మనం నర్సాపూర్ కాలేజ్ క్లోజ్ అయే లోపల చేరాలి..” అంది.

“కాలేజా!” ప్రశ్నార్ధకంగా చూసాడు.

“ఊ ... మా తాతయ్య చదువుకున్న కాలేజ్ యర్రమిల్లి నారాయణమూర్తి కాలేజి... హోటల్ చెక్ ఇన్ అయే ముందే వెళ్లి చూద్దాం”  అంది...

“నీ ఇష్టం నువ్వు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి తోక ఊపుకుంటూ రావడమేగా” అన్నాడు.

ఊళ్లోకి చేరేసరికి మూడూ నలభై అయింది.. ఎండలో పదును తగ్గి, నులివెచ్చని గాలులు వీస్తున్నాయి. పది నిమిషాల్లో కారు కాలేజీ గేటు ముందు ఆగింది. చాలా పెద్ద బిల్డింగ్..విశాలమైన ప్రాంగణం.. కారు గేటుకి కొంచెం అవతలకి ఆపి బిల్డింగ్ వైపు చూస్తూ అంది “దిగి లోపలికి వెళ్దామా..”

“ఎందుకు? ఏం చేస్తాం.. రానిస్తారో రానివ్వరో..”

“మా తాతయ్య చదువుకున్న కాలేజ్ కదా...చూడాలి.. దిగు” అంటూ డోర్ తీసుకుని దిగింది.

ఎవరూ పెద్దగా అభ్యంతర పెట్టలేదు.. అప్పుడే క్లాసులు పూర్తి చేసుకుని బయటకు గుంపులుగా వస్తున్నారు విద్యార్ధులు.. వాళ్ళల్లో కలిసిపోయి ఇద్దరూ స్వేచ్చగా తిరిగారు.. “ఈ కాలేజ్ 1949 లో చిన్న మొక్కగా మొదలైందట.. ఇప్పుడు ఆంధ్రా యూనివర్శిటీలో చాలా ప్రధానమైన స్థానం పొందిన కాలేజిగా పేరు పొందింది.. నీకు తెలుసా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎందఱో కలెక్టర్ లు, లాయర్లు, డాక్టర్స్, సైంటిస్ట్ లు అయారట. మన మెగాస్టార్ చిరంజీవి కూడా ఇక్కడే చదువుకున్నాడట. అదిగో ఆ విగ్రహం చూసావా అదే నారాయణమూర్తిగారిది. ఆయన కూడా పెద్ద లాయర్ ఎడ్యుకేషనిస్ట్...” జీవం ఉట్టిపడుతున్నట్టు ఉన్న విగ్రహం చూపిస్తూ హుషారుగా చెప్పింది. ఇద్దరూ చుట్టూ తిరిగి బయటకు వచ్చేశారు.

“ముందు మన స్టే ఎక్కడో చెప్పు నేను ఫ్రెష్ అవాలి” అన్నాడు.

“మంచి హోటల్ కి వెళదాం సరేనా..”  జి పి ఎస్ ఆధారంగా అధునాతనంగా కనిపిస్తున్న హోటల్ ముందు కారాపింది.

“రెండు సింగల్ కాట్స్ ఉన్న రూమ్ కావాలి” అంది స్మరణ కౌంటర్ దగ్గర కూర్చున్న మేనేజర్ తో.

“అలా ఉండవండి... డబల్ బెడ్, సింగల్ బెడ్ అంతే నండి ... రెండు సింగల్ రూమ్ ఇవ్వమంటారా!” అడిగాడు మేనేజర్.

“నేను అడిగింది ఇవ్వండి..”  అంది కొంచెం చిరాగ్గా.

“అల్లా ఉండదు మేడం” అన్నాడు.

“అయితే బెడ్స్ విడిగా ఉండే రూమ్ ఇవ్వండి అంది.

“అలాంటిది ఉంటుంది చూడండి అంటూ అటెండెంట్ని పిలిచి ఆవిడకు రూమ్ చూపించు అన్నాడు కీస్ ఇస్తూ. అతను “రండి” అంటూ స్మరణ వెంట రాగా లిఫ్ట్ దగ్గరకు నడిచాడు. సెకండ్ ఫ్లోర్ లో ఉంది రూమ్.. రెండు బెడ్స్ విడిగా ఉన్నాయి. మధ్యలో చిన్న కాబినెట్.. దాని మీద టేబుల్ ల్యాంప్ ... కిటికీ పక్క కార్నెర్ లో ఇంటర్ కం.. చిన్న ఫ్రిడ్జ్.. ఒక టేబుల్ రెండు కుర్చీలు.. నీటుగా ఉంది రూమ్.

తిరిగి వచ్చి ఆ రూమ్ బుక్ చేసింది. అటెండెంట్ బ్యాగులు తీసుకున్నాడు.

రూమ్ లో అడుగుపెట్టగానే కలయచూస్తూ అన్నాడు బదరీ. “ఈ ఊళ్ళో ఇంత మంచి హోటల్, ఇంత మంచి రూమ్ దొరుకుతాయి అనుకోలేదు తెలుసా”

తెల్లని బెడ్ షీట్స్, తెల్లని దిండు గలీబులు, తెల్లని దుప్పట్లు, తెల్లని టవల్స్ , తెల్ల గోడలు... శాంతి సంతకం లా ఉంది గది.

“బాబూ! మన దేశం బాగా డెవలప్ అయింది... ఇంకా ఎక్కడో ఉన్నావు నువ్వు.. బయటకి రా...” బదరీ నెత్తి మీద మొట్టింది.

“థాంక్ యూ స్మరణా.. నాకు ఈ ఊరు, పొలాలు, నదులు, అన్నీ చూపించినందుకు..”

“అప్పుడేనా.. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి.. వెళ్ళు ముందు నువ్వు ఫ్రెష్ అయి కిందకి రెస్టారెంట్ కి వెళ్లి లంచ్ ఆర్డర్ చేయి.. నేను రెడీ అయి వస్తాను” అంది మంచం మీద కూర్చుని ఒళ్ళు విరుచుకుంటూ..

“ష్యూర్ ....” అని బాగ్ లో నుంచి టవల్ తీసుకుని బాత్రూం వైపు వెళ్ళాడు.

స్మరణ చేతులు చాచి ఎక్సర్ సైజు చేస్తున్నట్టు గుండ్రంగా తిప్పుతూ “కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి... లాంగ్ డ్రైవ్ అయిపొయింది” అనుకుంది.

తరవాత మంచం మీద వాలి ఫోన్ చేతిలోకి తీసుకుని ఫేస్ బుక్ ఓపెన్ చేసి పోస్టింగ్స్ అన్నీ చెక్ చేసుకుంది. ప్రతిరోజూ తనకి వస్తున్న వందల మెసేజెస్ లో మధు మెసేజ్ ఉంటుందేమో చూడడం మానదు.. కొన్ని ఆశలు తీరేవి కావు అని తెలిసినా ఆశించడం మానవ బలహీనత. ఆ బలహీనతని బలంగా నమ్ముతుంది స్మరణ. తన ప్రతి ఆశా తీరుతుంది అని ఆమె ప్రగాఢ విశ్వాసం. అందుకోసం నిర్విరామంగా కృషి చేయడం ఆమె తత్త్వం. గాలిలో దీపం పెట్టి దేవుడా ఈ దీపం ఆరిపోనీకు అని వేడుకోడం ఫూలిష్ నెస్ అని ఆమెకి తెలుసు.. అలాగని గాలిలో దీపం పెట్టడం మానదు.. పెట్టి దాని చుట్టూ అన్వేషణ, పట్టుదల, కృషి,. నమ్మకం అనే పరదాలు కట్టి ఉంచుతుంది. ఇప్పుడు కూడా ఆ పరదాల చాటు నుంచే మధు అనబడే తన చిన్ననాటి చెలికాడి జాడ కోసం వెతుకుతూ ఉంది. ... ఆ పరదా చాటు నుంచే తాతగారి ప్రియురాలు కనిపిస్తుందేమో అని విచారించడానికి వచ్చింది. మాలతిని కనుక్కోడం ఆమెకి పెద్ద కష్టంగా అనిపించడంలేదు.. ఎంత నాగరికత పెరిగినా, ఆధునికంగా మారినా, అభివృద్ధి చెందినా అదే ఊరు.. మనుషుల జీవన విధానంలో మార్పు వచ్చి ఉండచ్చు.. మట్టి కుండలో వంట చేసుకునే వాళ్ళు స్టీలు కుక్కర్ లో చేసుకుంటున్నారేమో! చాప మీద పడుకునేవాళ్ళు మంచం మీద పడుకుంటున్నారేమో ... ఎంత సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా చెరువుల్లో కలువలే ఉంటాయి ... గులాబీలు పూయవు.. మందార చెట్టుకి మల్లెలు పూయవు.. రెల్లుగడ్డి చెరుకుగడ అవుతుందా! ఉమ్మెత్త పూవుకి పరిమళం చుట్టుకుంటుందా! మహా అంటే మాలతి అనబడే ఆ అమ్మాయి ఇప్పుడు అమ్మమ్మ అవుతుంది అంతేగా!

స్మరణ ఆశావాది.. మాలతి కనిపిస్తుంది అని ఎంత గాఢంగా విశ్వసిస్తున్నదో, మధు తన జీవితంలోకి తిరిగివస్తాడని, ఋతువులు మారినట్టె తన జీవితం కూడా మారుతుందని ఆమె నమ్ముతోంది. మధు ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి విశ్వమంతా చుట్టి వచ్చి సమాచారం అందించే అంతర్జాలాన్ని నమ్ముకుంది. ఫలానా చోట ఉన్నాడు అని తెలిసి ఉంటే తప్పకుండా ఆ ప్రదేశానికి వెళ్లేదే...ఆమెకి తన సిద్ధాంతాల పట్ల ఉన్న స్థిరమైన నమ్మకమే అందుకు కారణం.

బదరీ టవల్ తో మొహం తుడుచుకుంటూ వచ్చాడు. టవల్ హంగర్ కి తగిలించి క్రాఫ్ సరిచేసుకుంటూ అన్నాడు. “ఓకే నేను రెస్టారెంట్ కి వెళ్తున్నాను.. నువ్వు రెడీ అయి వచ్చేసేయ్”.

“అలాగే” పక్కకి ఒత్తిగిల్లి కళ్ళు అరమూసి అంది.

“బాగా అలసిపొయావు కదూ డ్రైవ్ చేసి.. వెళ్ళేటప్పుడు మొత్తం నేనే డ్రైవ్ చేస్తాను” అన్నాడు.

నవ్వింది.. “అలాగే” బద్దకంగా అంది.

“నేనటు వెళ్ళగానే నిద్రపోవుకదా... పిచ్చి వెధవలా ఎదురుచూస్తూ కూర్చుంటాను” అన్నాడు భయం నటిస్తూ.

“డోంట్ వర్రీ... వస్తాను వెళ్ళు...” అంది.

భుజాలెగరేసి వెళ్ళిపోయాడు. రెండు నిమిషాల తరవాత లేచి తలుపు గడియవేసి బాత్రూం లోకి వెళ్ళింది.

****సశేషం****

Posted in September 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!