Menu Close
అత్తలూరి విజయలక్ష్మి
దూరం (ధారావాహిక)
అత్తలూరి విజయలక్ష్మి

ఆమె మనసంతా మావగారి మాటల మీదే కేంద్రీకృతమైపోయింది. ఈయన జీవితంలో ఏదో రహస్యం ఉంది.. అది ఏమై ఉంటుంది? అత్తగారి రూపం, స్వభావం ఆమెకి తెలుసు.. ఆవిడతో కాపురంలో ఆయన పొందిన నరకం, అవమానం అన్నీ తెలుసు.. ఆయన ఎవరినన్నా ప్రేమించారా! అందుకేనా చిన్నకొడుకు కార్తీక్ ప్రేమ వివాహాన్ని అంత సహృదయంతో అంగీకరించారు. ప్రేమ మీద విశ్వాసం ఉన్న వాళ్లకి కుల, మత, జాతి, వర్గాల తేడాలు ఉండవు.. అవసరం అయితే స్మరణకి ప్రేమ విషయంలో పెద్దరికంతో కౌన్సిలింగ్ చేస్తాడు అనుకుంటే ఇలా మాట్లాడుతున్నారేంటి?

ఆ రాత్రి భర్తతో అంది “ఇవాళ మీ నాన్నగారిలో ఇంకో కోణం చూశానండి..”

“ఏంటది” కుతూహలంగా అడిగాడు దీపక్.

“ఆయనకి ఏదన్నా ప్రేమకథ ఉందా ఫ్లాష్ బ్యాక్ లో...” అతనికి అభిముఖంగా తిరుగుతూ అడిగింది.

“ఏం? ఆయన నీకు చెప్పారా..”

“ఊహు ... నాకే అనుమానంగా ఉంది. కచ్చితంగా చాలీస్ సాల్ పెహలే ఆయనకేదో విషాద గాధ ఉందనిపిస్తోంది.”

“కొంపదీసి ఏదన్నా టివి సీరియల్ కి డైలాగ్స్ రాస్తున్నావా!” భయం నటించాడు.

“జోక్ కాదు నిజం..”

దీపక్ నవ్వి... “ఉందేమో! నాన్నే నయం నాకన్నా...” అన్నాడు.

సరిగ్గా అదే సమయంలో నిద్ర పట్టని ఆంజనేయులు గతం పొరలు, పొరలు గా విప్పుకుంటూ చెదిరిపోయిన జ్ఞాపకాలను పోగుచేసుకోసాగాడు.

వారం రోజుల తరవాత స్మరణ రాత్రి పది తరవాత కూడా కూర్చుని ల్యాప్ టాప్ ఒళ్లో పెట్టుకుని ఆఫీస్ పని చేసుకుంటోంది. దీపక్, సంధ్య పడుకున్నారు.

ఆంజనేయులు అప్పటికే ఒక నిద్ర అయిపొయి, దాహం వేసి లేచాడు. మంచం పక్కన కూజాకోసం చూస్తుంటే చేయి తగిలి కూజా కిందపడి నీళ్ళు ఒలికిపోయాయి. నెమ్మదిగా మంచం దిగి, అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి స్విచ్ ఆన్ చేసి లైటు వేసాడు. అలాగే మెల్లిగా హాల్లోకి వెళ్లి చూస్తే స్మరణ ఇంకా సోఫాలో కూర్చుని లాప్ టాప్ చూస్తోంది సీరియస్ గా. ఆయన నెమ్మదిగా అడిగాడు.. “తల్లీ.. నాక్కాసిని మంచినీళ్ళు కావాలమ్మా..”

స్మరణ తాతగారి పిలుపు విని ఉలిక్కిపడి లేచి “అయ్యో లేచి వచ్చావా ! నన్ను పిలవకపోయావా” అంటూ మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది.

ఆయన గట, గటా తాగేసి “నా గదిలో కూజాకింద పడి నీళ్ళు ఒలికాయి.. కొంచెం తుడుస్తావా” అన్నాడు.

“అయ్యో అవునా!” అంటూ వెళ్లి మాప్ తీసుకుని వచ్చి తుడిచేసింది..

“రా తాతయ్యా పడుకుందువుగాని” అంది ఆయన చేయి పట్టుకుని.

ఆయన సోఫా వైపు చూస్తూ “పన్నెండు అవుతోంది ఇంకా ఆ లాప్ టాప్ పట్టుకుని కూర్చున్నావు నిద్ర రావడంలేదా” అన్నాడు.

“లేదు తాతయ్యా.. నా ఫ్రెండ్స్ చాటింగ్ లోకి వచ్చారు” అంది.

“చాటింగ్ అంటే” ప్రశ్నార్ధకంగా చూసాడు.

“చాటింగ్ అంటే మౌనంగా మాట్లాడుకోడం ... ఇలారా చూపిస్తాను..” నవ్వుతూ ఆయన చేయి వదలకుండా అలాగే సోఫా దగ్గరకు తీసుకుని వచ్చి “కూర్చో” అంటూ తను కూర్చుని పక్కన కూర్చోబెట్టుకుంది. లాప్ టాప్ తీసుకుని చూపిస్తూ “ఇదిగో ఇలా కేవలం మాటల్ని రాసుకుంటాం.. ఇదివరకు ఆడవాళ్ళు గోడల మీద నుంచి, మీలాంటి వాళ్ళు రచ్చబండ దగ్గర చేరి చెప్పుకునే వాళ్ళు కదా! ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు, హాయిగా మంచాల మీద పడుకుని కబుర్లు చెప్పుకోడం అనమాట.... ఒకవిధంగా చెప్పాలంటే  కబుర్లు రాసుకోడం..”

“ఎలా చెప్పుకుంటారు? ఏది నేను చూడచ్చా...” అడిగాడు లాప్ టాప్ లోకి తొంగిచూస్తూ.

“నీకు అర్థం కాదు తాతయ్యా..”

“నువ్వు ఎక్స్ ప్లైన్  చేయి”

“సరే.... ఇదిగో ఇది చాటింగ్ బాక్స్...”

“నువ్వు ఇప్పుడు మాట్లాడేది ఆఫీస్ వాళ్లతోటా “

“కాదు.. ఆఫీస్ పని అయిపొయింది.. కొంచెం పెండింగ్ ఉంటే చేసేసాను.. యు ఎస్ లో ఉన్న నా ఫ్రెండ్స్ ఆన్ లైన్ లో ఉన్నారు అందుకని చాట్ చేస్తున్నా. వాళ్లకిది మార్నింగ్ కదా...ఇలా చూడు” వాట్స్ అప్ ఓపెన్ చేసి చెప్పసాగింది..

“దీన్ని వాట్స్ అప్ అంటారు.. నా ఫ్రెండ్స్ నలుగురున్నారు. అందరం గ్రూప్ చాటింగ్ చేస్తున్నాము. వాళ్ళు నా స్కూల్ ఫ్రెండ్స్.. అలాగే ఫేస్ బుక్ లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. వాళ్ళతో కూడా మధ్య, మధ్యలో మాట్లాడుతుంటా. మధ్య, మధ్య గూగుల్ లో నాకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే సెర్చ్ చేస్తుంటా”

“గూగుల్ ఏంటి? వాట్స్ అప్ ఏంటి? ఫేస్ బుక్ ఏంటి?”

“ఇవన్నీ ఆప్స్ ... ఆప్ అంటే అప్పికేషన్ సాఫ్ట్ వేర్.. సుందర్ పిచాయి పేరు విన్నావా... గూగుల్ పేరు చెప్పగానే ఆయన పేరు చెప్పేస్తే మేము ఇంటర్వ్యూ లో పాస్ అయినట్టు.. అలాగే ఫేస్ బుక్ పేరు చెప్పగానే జుకర్ బర్గ్ పేరు చెప్పాలి... వీళ్ళంతా సాఫ్ట్ వేర్ రంగంలో నిష్ణాతులు.. “

మనవరాలి పరిజ్ఞానానికి ముగ్దుడయాడు. నిజానికి ఆధునిక విద్యా విధానంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల ప్రభావంతో నేటి యువత మేధస్సు ఎంతో వికసిస్తోంది.. అది చాలా సహజమైనదే అయినా, ప్రతి తాతగారి లాగే ఆయన కి కూడా తన మనవరాలు మాత్రమే గొప్ప మేధావి అనిపించడంలో వింతేమి లేదు..

“ఇంకా చాలా ఉన్నాయి తాతయ్యా! అవన్నీ తెలియాలంటే నీకు కంప్యూటర్ గురించి కొంతన్నా తెలియాలి.. నా గదిలో డెస్క్ టాప్ ఉంది... ఇది లాప్ టాప్.. ఆఫీస్ ఫైల్స్ అన్నీ ఇందులో సేవ్ చేసుకుంటా.. ఇవన్నిటినీ ఐకాన్స్ అంటారు.. ఇదిగో ఇలా క్లిక్ చేస్తే చాలు ఏదైనా కావాలంటే ఓపెన్ అవుతుంది. నీకు గూగులే సెర్చ్ చూపించనా!” స్మరణ గబుక్కున వాట్స్ అప్ క్లోజ్ చేసి గూగుల్ ఓపెన్ చేసింది.

“చూడు దీన్నే గూగుల్ అంటారు.. ఇది ఒక నిధి నిక్షేపం లాంటిది.. ఈ ప్రపంచంలో నీకే విషయం తెలుసుకోవాలన్నా ఇక్కడ నీకు కావాల్సింది టైపు చేసి సెర్చ్ అని నొక్కితే మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది.. ఇది మన దగ్గర ఉంటె సమస్త ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే.. దీన్ని ఫేస్ బుక్ అంటారు ... దీన్నే సోషల్ మీడియా అని అంటారు.. అంటే ఇది వరకు రోజుల్లో మీరంతా రచ్చబండ దగ్గర చేరి చెప్పుకునే కబుర్లు ఇప్పుడు ఇందులో ఎవరి గదిలో వాళ్ళు కూర్చుని ఇందులో చెప్పుకోవచ్చు.. ఒక్కసారి దీంట్లోకి ఎంటర్ అయ్యామంటే కుప్పలు, తెప్పలుగా వచ్చేస్తారు ఫ్రెండ్స్.. మనకి ఓపిక ఉన్నంత మందిని ఫ్రెండ్స్ చేసుకుని కబుర్లు చెప్పుకోవచ్చు.. దీని ద్వారా నాకు ఎంత మంది ఫ్రెండ్స్ అయారో చెప్పలేను.. నేను ఎంటర్ అయే  టైం కి ఎవరు ఆన్ లైన్ లో ఉంటే వాళ్ళతో మాట్లాడుతా..నీకో సంగతి తెలుసా.. నా స్కూల్ డేస్ లో దూరమైన ఫ్రెండ్స్ బోలెడు మంది నాకీ పేస్ బుక్ ద్వారా కలిసారు..”

ఆశ్చర్యంగా వినసాగాడు... “ఏంటి! స్కూల్ డేస్ లో దూరమైనా ఫ్రెండ్స్ ఈ ఫేస్ బుక్ ద్వారా కలిసారా.. ఎలా!”

“ఏం లేదు.. సింపుల్ ... ఇందులో ఎకౌంటు ఓపెన్ చేసుకుని మన ఫోటోలు పెట్టుకుంటాం కదా అవి చూసి గుర్తుపడతారు. దాదాపు మా ఏజ్ వాళ్ళంతా ఫేస్బుక్ గ్రూప్ లో ఉన్నారు తాతయ్యా.. మాకన్నా పెద్దవాళ్ళు, మీ వయసు వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చూడు ఈయన పెద్దాయన రిటైర్ అయి ఫేస్ బుక్ గ్రూప్ లో చేరి కాలక్షేపం చేస్తున్నాడు. సాధారణంగా ఈ గ్రూప్ లో మాలాంటి వాళ్ళు ఉండరు.. నాకు ఆయన బాగా తెలుసు.. ఒకరోజు ఎ.టి.ఎం లో మనీ డ్రా చేయడానికి వెళ్లాను. పాపం ఆ రోజు ఆయన కళ్ళద్దాలు తెచ్చుకోకుండా వచ్చారు.. నేను హెల్ప్ చేసాను. నా గురించి చాలా వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అలా పరిచయం అయారు.. నాతో అప్పుడప్పుడు చాట్ చేస్తుంటారు.. వీళ్ళంతా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు... పార్టీలు చేసుకుంటారు.. వాళ్ళ ఫీలింగ్స్, భావాలు, జనరల్ టాపిక్స్, రాజకీయాలు అన్నీ షేర్ చేసుకుంటారు.. వీళ్ళల్లో ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం విడిపోయినవాళ్ళు కూడా ఈ ఫేస్ బుక్ ద్వారా మళ్ళి కలిసారు.”

ఆయన ఉద్వేగంగా వింటున్నాడు. ఆయన మనసులో ఏవో ఆలోచనలు, ఆశలు రెక్కలు విదిలించసాగాయి.. “అయితే! నేను కూడా ఇందులో చేరచ్చా..” అడిగాడు మొహమాటంగా..

“ఎందుకు చేరకూడదు? తప్పకుండా.. నీకు కూడా ఎకౌంటు ఓపెన్ చేయనా!” హుషారుగా అడిగింది. మళ్ళీ తనే నిరాశగా అంది.. “కానీ నా లాప్ టాప్ నీకు ఎలా షేర్ చేయగలను.. నీకు ఒక టాబ్లెట్ కొంటాను.. రేపు షాపింగ్ చేద్దాము.. మంచి టాబ్ కొనిస్తా.. బోలెడు కాలక్షేపం అవుతుంది. వాట్స్అప్ , ఫేస్ బుక్.. YouTube లో నీ పాత సినిమాలు కూడా చూడచ్చు.”

ఆయన గుండె దడ, దడ లాడింది... ఫేస్ బుక్....ఇదేదో భగవంతుడు అనుగ్రహించి ప్రసాదించే వరం కాదు కదా! ఆశగా అడిగాడు. “నా ఫ్రెండ్.. నా చిన్నప్పటి ఫ్రెండ్ ఇందులో కనిపించే అవకాశం ఉందా..”

“తప్పకుండా ఉంది.. నో డౌట్..ఆయన ఇంటిపేరుతో సహా చెప్పు.. ఇప్పుడే గూగుల్ సెర్చ్ చేస్తాను.. ఆయన ఏం చేస్తారు?”

“పేరు, పేరు... కానీ, తనేం చేస్తున్నారో నాకు తెలియదు.. పేరు చెప్పగలను కానీ ఇంటి పేరు తెలియదు..” “ఒట్టి పేరుతొ కనుక్కోడం కష్టం తాతయ్యా.. ఒక్క పేరుతొ వందల మంది ఉంటారు.. ఉదాహరణకి ఆంజనేయులు అని టైపు చేసాను అనుకో నీ పేరుతొ ఉండే అనేక మంది వ్యక్తుల వివరాలు వస్తాయి. వాళ్ళ వృత్తి, ప్రవృత్తిని బట్టి వాళ్ళు మనకి కావాల్సిన వాళ్ళు అవునా, కాదాని తెలుసుకోవచ్చు. కాకపొతే నువ్వు ఫేస్ బుక్ ఓపెన్ చేసుకుని నీ డిటైల్స్ పెట్టి, నీ ఫోటో, అప్పటి ఫోటో పెడితే నీ ఫ్రెండ్స్ చూసే అవకాశం ఉంది..అలా వాళ్ళు నిన్ను తమ ఫ్రెండ్స్ లిస్టు లో యాడ్ చేసుకోవచ్చు”.

“నిజంగా ఉందా? ఆయన స్వరంలో వినిపిస్తున్న ఒకరకమైన ఉత్సాహం గమనించి ఆశ్చర్యంగా చూసింది.

“తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్..”

“అయితే నాకు కంప్యూటర్ ఆపరేషన్ నేర్పిస్తావా..”

“ష్యూర్... నీకు ఇంట్రెస్ట్ ఉంటె ఎందుకు నేర్పనూ..”

“రేపటి నుంచీ మొదలుపెడదామా!”

“అలాగే.. నువ్వేప్పుడంటే అప్పడు..”

ఆయన హటాత్తుగా స్మరణ ని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దుపెట్టుకున్నాడు.. “నా బంగారు తల్లి” అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

ఆయన వెళ్ళిన వైపు కాసేపు చిత్రంగా చూస్తూ ఉండిపోయిన స్మరణకి ఆయన మీద జాలేసింది. పాపం పెద్దవాళ్ళు ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళలేరు... ఇలాంటి వాళ్లకి వాళ్ళ, వాళ్ళ స్నేహితులను కలుసుకోవాలని ఉంటుంది కానీ, కలుసుకోలేరు. పెద్దవాళ్ళు అయినంత మాత్రాన వీళ్ళకి మనసుండదా! స్నేహితులుండకూడదా! తాతయ్య తను పుట్టి పెరిగిన ఊళ్ళో ఉండి ఉంటె ఎవరో ఒకళ్ళు ఇంటికి వచ్చి కబుర్లు చెప్పడమో, ఈయనే ఎక్కడికైనా వెళ్లడమో కాలక్షేపం జరిగేది. ఈ ఊళ్ళో తాతయ్యకి ఎవరు తెలుసు? బోర్ కొడుతున్నది కాబోలు.. రేపు తాతయ్య కోసం టాబ్ కొని ఆపరేషన్ నేర్పాలి.. ఎలాగైనా ఆయన ఫ్రెండ్ ని కలిసేలా చేయాలి.. అలాగే... అలాగే ... తన అన్వేషణ కూడా ఫలించాలి.. ఫేస్బుక్ ప్లీజ్ కెన్ యు హెల్ప్ మీ...” లాప్ టాప్ ని ముద్దుపెట్టుకుని లాగ్ అవుట్ అయి, లైట్ ఆఫ్ చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది.

****సశేషం****

Posted in December 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!