Menu Close
sravanthi_plain
చైత్రచిత్రం

మత్తకోకిల

చైత్రమన్న వసంతశోభకు చక్కనౌ నుడికారమై

పత్రపుష్పఫలాదికాంచితపాదపద్విజరాగముల్ (1)

చిత్రచిత్రకవిత్వశాస్త్రవిశేషచర్చలు షడ్రుచుల్

మిత్రబంధుసమాగమంబులు మించు రోజులె తెచ్చుగా                         1

(1) ఆకులు,పువ్వులు,పండ్లు మొదలగువానితో చక్కగా శోభిల్లేచెట్లు, పక్షులకూతలు

ఉ.

ఏవిభు దేవళం బొకటియేనియు లేని ప్రదేశ ముండదో

ఏవిభు నామసంస్మరణ ఎంతటికార్యమునైన తీర్చునో

ఏవిభు రాజ్యమందు భువియే తరియించెనొ ధర్మవర్తనన్

ఆవిభు జన్మమున్ పరిణయంబును వేడుకసేయు చైత్రమే                     2

కం.

సీతారామవివాహము

చేతోరంజకపవిత్రసేవాకృతియౌ (1)

ఆ తలబ్రాలౌ ముత్యము

లే తలవ్రాతలను దిద్ది హిత మొనగూర్చున్                                     3

(1) మనస్సును ఆహ్లాదపఱచే పవిత్రమైన సేవాకార్యక్రమము అగును /
మనస్సును ఆహ్లాదపఱచే పవిత్రమైన సేవకు ఆకారము అగును

కం.

పేరు వికారియె అయినన్

శ్రీరఘురామునికటాక్షసిద్ధిని (1) చైత్రం

బే రమ్యమైన నాందయి (2)

కూరుచు వత్సరముపాటు కూరిమిశుభముల్                                  4

(1) శ్రీరాముని కడగంటిచూపు పొందుటచే

(2) మొదలు అయి

కం.

“శ్రీరామ” అని తలంచిన

కారుణ్యము తోడ త్వరగ కాన్పించి వెతల్

తీరిచి ప్రోచెడి సీతా

మారుతిలక్ష్మణసమేతు మది భావింతున్                                       5

Posted in April 2019, సాహిత్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!