Menu Close
Page Title
విదేశ విహారయాత్రలో ఊహించని ఉదారత

మా యిద్దరు అమ్మాయిలు శాంతి, ఆరతి, వాళ్ల పిల్లల స్కూళ్ల సెలవులు సరదాగా సద్వినియోగం చేసే ఉద్దేశ్యంతో అంతకు ముందు చూడనటువంటి 'ఐరోపా విహార యాత్ర' కై ప్రణాళిక తయారుచేయ సంకల్పించి ఆ బాధ్యతని హైస్కూల్ లో చదువుతున్న వాళ్ళ పిల్లలకి అప్పగించారు. వాళ్లు సంతోషంగా 'గూగుల్' ఆధారంతో శోధన ప్రారంభించారు. వాళ్ళల్లో వాళ్లు ఏ యే ఊళ్లు, దేశాలు తమాషా (ఫన్) కోసం చూడాలనే విషయాన్ని తీవ్రంగా చర్చించుకుని తుదకు ఇవన్నీ అప్పటికే చర్చించి డబ్బు పరంగా, కాల వ్యవధి పరంగా, పొదుపైన పధకం సిద్ధంచేసి ఉంచిన ‘తాజ్ టూర్స్’ వారి ప్రణాళికే బాగుందని యోచించి దానినే ప్రతిపాదించారు. అదీ కొద్దిరోజులలోనే ప్రారంభమవబోతుండడం, తాము ఎంచుకున్న దేశాలు, యాత్రాస్థలాలు, ఆ ప్రణాళికలో యిమిడి ఉండడంచూసి వారందరికీ, సరిగ్గా తమ శలవుల కోసమే తయారు చేసినట్లుండి సంతోషంతో ఎగిరి గంతులేశారు. పెద్దలందరూ కూడా వారి తర్కం విని 'ఓకే' అనేసారు. మేమిరువురం ఆ వినోద యాత్రకి అంత ఖర్చు చేయడానికి మనస్కరించక వాళ్లనే పోయిరమ్మన్నాము. వాళ్లంతా ముఖ్యంగా మనుమలు మనుమరాళ్ళు బలవంతంగా మమ్మలిని ఒప్పింపచేసి ఆ యాత్రలో పాల్గొనేటట్లు చేశారు.

Foreign Trip

15 రోజుల పాటు చూసిన వింతలు, ఆనందానుభూతులని మిగిల్చిన విశేషాలతో ఎనిమిది దేశాలకు విస్తరించి (లండన్, ఫ్రాన్స్, బెల్జియం, నెథర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్) కిక్కిరిసిన కార్యక్రమాలతో పరుగులు పెట్టించిన ఆయాత్ర పూర్తిగా వివరించడానికి ఈ వ్యాసపరిమాణం సరిపోదు. అందుకని చూసిన పర్యాటక విశేషాలు (యితరత్రకూడా లభిస్తాయిగనుక) క్లుప్తంగా తెలియజేస్తూ, నేను చెప్పదలచుకున్న యదార్ధగాధని వివరిస్తూ పాఠకులైన మీలో ఉత్సుకతని కొనసాగిస్తూ మీ అందరి మెప్పుని పొందడానికి ప్రయత్నిస్తాను.

Foreign Trip

మేము మా రెండవ అమ్మాయి ఆరతి పిల్లలు సాగర్, శరత్ & ఆదర్శ్ ర్యాలీ (నార్త్ కరోలినా నుంచి), మా పెద్దమ్మాయి శాంతి, అల్లుడు శ్రీనివాసు, పిల్లలు శ్రీకాంత్, సౌమ్య (సాన్ డియెగో, క్యాలిఫోర్నియా నుంచి) బయలుదేరి వేర్వేరు సమయాలలో కొద్దిఘంటల తేడాలో 2011 జులై మొదటి వారంలో లండన్ చేరుకున్నాము. మా రెండవ అల్లుడు సురేష్ ఆఫీస్ పనులలలో తలమునకలవుతూ మాతో రా వీలు కాలేదు. మా ఆరతి బట్టల బాగ్ మా ఫ్లైట్ లో రాలేదు. 'కంప్లైంట్' చేస్తే అసలు ఆ పెట్టె 'ర్యాలీ'లో మా ఫ్లైట్ లోనే ఎక్కించలేదట. బహుశా తరువాతి ఫ్లైట్ లో రావచ్చునని, రాగానే హోటల్ కి పంపిస్తామని చెప్పారు. ఆమె వద్ద వేసుకున్నవి తప్ప వేరే దుస్తులులేవు. బహుశా సాయంత్రం మేము తిరిగి వచ్చే వేళకి హోటల్ కి వస్తాయేమో అనుకున్నాము. కాని ఆ రాత్రి కూడా రాలేదు. మరునాడు ఉదయమే మా బస్సు సుదూర ప్రయాణానికి సిద్ధమై ట్రావెల్ ఏజెంట్ మమ్మల్ని తొందరచేసాడు. అప్పటికి దాని బట్టల పెట్టె రాలేదు. చేసేదిలేక మేము బస్సు ఎక్కి కూర్చుని ఎయిర్పోర్ట్ వాళ్లతో మేము మరునాటి రాత్రి ఉండబోయే ఊరు, హోటల్ పేరు చెప్పి అక్కడకు పంపమని తెలియజేశాము. అతడు సరేనన్నాడు.

Foreign Trip

మొదటి రోజంతా, లండన్ లోని పర్యాటక కేంద్రాలైన, బకింగ్ హామ్ పాలస్, లండన్ ఐ, బిగ్ బెన్ ఆన్ పార్లమెంట్ హౌస్, సెయింట్ పాల్'స్ కేథడ్రల్, లండన్ టవర్, మున్నగునవి చూసి ఆనందించాము. ముఖ్యముగా పిల్లలు. రెండోరోజు ఉదయమే బయలుదేరి ఊరంతా బస్సులోనే తిరిగి, 'డోవర్' నుంచి ఫ్రాన్స్ లోని "వూల్ సిటీ' అని పిలువబడే 'కలియాస్' కి 'స్ట్రైట్ అఫ్ డోవర్' ద్వారా ఒక పెద్ద రవాణా పడవలో చేరుకున్నాము. అక్కడి 'ఇమ్మిగ్రేషన్ ఫార్మాలిటీస్' పూర్తిచేసుకుని మళ్ళీ బస్సులో మాప్రయాణం బెల్జియం వైపు కొనసాగించాము. బెల్జియం లోని 'అంత్వేర్ప్' పొలిమేరలలో' భోజనానికి ఆగి తాజ్ టూర్స్ వాళ్ళు ఇచ్చిన వేడివేడి భోజనం ఆరగించి, 'రెస్ట్రూమ్ బ్రేక్' తీసుకుని తిరిగి బయలు దేరాము. దగ్గరలోనే ఉన్న బెల్జియం సరిహద్దు దాటి 'బృస్సేల్' వద్ద ఉన్న 'మినీ యూరోప్ మ్యూసియం' చూసి వారి నేర్పరితనానికి జోహారులర్పించి, జర్మనీ లో ప్రవేశించి మా ప్రయాణం కొనసాగించాము. చాలా దూరం వెళ్ళాక మేము అక్కడనుంచి చాలాచోట్ల తిరిగి 'నెథర్లాండ్స్' లో 'ఆమ్స్టర్ డాం' లో 'నూర్డ్జీకనాల్' లో పడవలో షికారు కి వెళ్ళినప్పుడే తన బాగ్ పోయిన సంగతి తెలిసింది. అక్కడ శాంతి తన 'బాగ్' కోసం వెతకగా కనబడకపోవడం వల్ల చాలా ఖంగారు పడింది. అందులో ఆమె బంగారు ఆభరణాలు, క్రెడిట్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్, కొన్ని డాలర్స్ కూడా ఉన్నాయి. క్రిందటి మారు ఆగి బయలు దేరిన చోటునుంచి చాలాదూరం వచ్చేసాము, తిరిగి వెళ్ళుటకు వీలు కాని పరిస్థితి. రెండు దేశాల సరిహద్దులు కూడా దాటేసాము. మా ‘గైడ్’ కి తెలియజేస్తే తాను ఏమీ చెయ్యలేనని అయినా తరువాతి విశ్రామంలో తన ఇతర కాంటాక్ట్స్ ద్వారా ప్రయత్నిస్తానని, ఎక్కువగా ఆశలు మాత్రం పెట్టుకోవద్దు అని కూడా చెప్పాడు. దానితో దాని మనఃస్థితి అతలాకుతలమైపోయింది. ఆరతి బట్టల పెట్టి మరునాడు కూడా మా హోటెల్ కి రాలేదు. ఆరోజే కాదు మాట్రిప్పు మొత్తంలో అది మమ్మల్ని చేరనే లేదు. రోజు రోజు మారుతున్న మా ప్రోగ్రాం చూసి చివరికి విసుగుపుట్టి ఎయిర్లైన్స్ వాళ్ళు ర్యాలీకి పంపించివేశారు. ఇంక చేసేది లేక దగ్గరలో ఉన్న బట్టలకొట్టులో తనకి సరిపోయే బట్టలు మూడు జతలు కొనుక్కుని ఆ యాత్ర అంతా వాటితోనే గడిపింది.

Foreign Trip

మరునాడు అనుకోకుండా మా 'గైడ్' మాదగ్గరికి వచ్చి శాంతి పర్సు దొరికిందని చెపితే మాకు ఆశ్చర్యంతో బాటు ఆనందం కూడా వేసింది. అతడు ఒక నెంబర్ ఇచ్చి ఆమె తో మాట్లాడండి ఆమె వద్ద మీ పర్సు ఉందని చెప్పాడు. శాంతి ఆమెతో మాట్లాడగా ఆమె జరిగిన వృత్తాంతమంతా చెప్పింది. శాంతి రెండు పర్సులు, ఒకటి తనది రెండోది వాళ్ళ అమ్మాయిది పట్టుకుని 'రెస్ట్ రూము' కి వెళ్లి ఒక మూల తగిలించింది. బస్సు హార్న్ విని వచ్చేటప్పుడు బస్సు బయలుదేరిపోతోందన్న హడావిడిలో ఒక దానినే తీసుకుని బయలు దేరింది. అది తనదే అనుకుంది కాని అది తన కూతురిది. తరువాత 'సిండీ ఒట్టో' అనే జర్మన్ దేశస్తురాలైన ట్రక్ డ్రైవర్ ఆ రెస్ట్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఆ పర్సుని చూసి ఎవరో మరచి పోయి ఉంటారని గ్రహించి చుట్టూ చూస్తే ఎవరు కనబడక పోవడంతో పర్సు తెరిచి చూస్తే దానిలో శాంతి జాగ్రత్తగా పెట్టుకున్న తన 'ప్రోగ్రామ్ షీట్' లో గైడ్ పేరు టెలిఫోన్ నెంబర్, అందరి నంబర్లు, ఏరోజున మేము ఎక్కడ ఉండేది, అక్కడి హోటల్ నంబర్లు వివరాలు ఉండడంతో ఆమె మా మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడ గలిగింది. 'సిండి' చెప్పిన విషయమేమిటంటే ఆమె తన ట్రక్ లో సామాను తీసుకుని చాలాదేశాలు తిరిగి మేము పారిస్ చేరుకునే సమయానికి ఆమె కూడా పారిస్ తన ప్రియుడిని కలవడానికి వస్తుందట. ఆరోజున పారిస్ లో మా హోటల్ కి వచ్చి దానిని అందజేస్తానని చెప్పింది. శాంతికి సిండీ తో మాట్లాడిన తరువాత గొప్ప ఊరట లభించింది, ప్రశాంతంగా మా మిగతా యాత్రని పూర్తి చెయ్యగలిగింది. సిండీని ఏమైనా కావాలా, హోటల్ లో రిజర్వేషన్స్ చెయ్యాలా అని అడగ్గా, ఆమె తనకేమీ వద్దని చెప్పింది. పారిస్ లో మేము దిగుతున్న హోటల్ కి వచ్చి కలుస్తానని చెప్పింది.

Foreign Trip

మేము మాప్రయాణం నెథర్లాండ్స్ (హాలండ్) నుంచి కొనసాగించాము. తరువాత జర్మనీ, తరువాత ఆస్ట్రియా, ఇటలీ, చూసుకుని స్విట్జర్లాండ్ చేరుకున్నాం. మధ్యలో ఆల్ప్స్ పర్వతాలలో పొడవైన సొరంగాలు ద్వారా (ఒక చోట 18  కిలోమీటర్ల పొడవైన సొరంగం ద్వారాను) ప్రయాణిస్తూ, ఎతైన పర్వతాలపై వంపు సొంపుల దారులపై రమణీయ మంద గమనాలతోనూ, లుసెర్న్ సరస్సు తీరాన్న అందమైన కాలిబాటపై సుందర దృశ్యాలు చూస్తూ ఫోటోలు దిగుతూనూ, ఉల్లాసంగా గడిచింది మావినోదయాత్ర. అక్కడ మంచు పర్వతాలలో ప్రకృతి ని చూసి పులకించిపోయి తిరిగి ఫ్రాన్స్ చేరుకున్నాము. పారిస్  సంధ్యాసమయాన్న ఆరుతూ వెలుగుతూ కళ్లుమిరుమిట్లు గొలిపే 'ఈఫిల్ టవర్' అందాలు చూస్తూ 'సేయిన్ నది' లో మేము చేసిన విహార యాత్ర అద్భుతమైన అనుభవం. ‘లౌవ్రే మ్యూసియం’ లో మోనాలిసాని, ఇతర చలువరాతి   శిల్పాల అందాలు చూసి, కేథడ్రాల్ నార్టర్-డాం లోని ప్రశాంత చూసి, హోటల్ రూమ్ చెరుకు సమయానికి సిండి వస్తున్నానని కబురు చేసింది. ఆమె తన ప్రియుడ్ని తీసుకుని వచ్చింది, మమ్మల్ని కలిసి శాంతి పర్సు ఇవ్వడానికి.  పర్సు ఇస్తూ దాని లోని సామాన్లు అన్నీ సరిగ్గా వున్నాయోలేవో చూసుకోమంది. శాంతి చూసుకుని అన్ని సరిగ్గానే ఉన్నాయి ఏది పోలేదని చెప్పింది. సౌమ్యంగా మాట్లాడిన ఆమె చాలా మంచి మనిషిలా కనిపించింది. చాలా విషయాలు చెబుతూ తన తల్లి కూడా ఒకసారి పర్సు పోగొట్టుకుని ఎంత వ్యధ చెందినదో తలచుకుని, పర్సుని పోగొట్టుకున్న శాంతి అటువంటి బాధననుభవించకూడదని కోరుకున్నదట. ఎంతటి ఉదాత్త స్వభావం! శాంతి కొంత డబ్బు యివ్వబోయినా ఆమె తీసుకోలేదు. చివరికి బలవంతం చెయ్యగా ఆ వూరులోనే తన ఇంటినుంచి హోటల్ వరకు తన కారు గ్యాస్ కి అయ్యే ఖర్చులు తీసుకుంది. సిండి ఉదారతకు కృతజ్ణతా పూర్వక ధన్యవాదాలు తెలిపిన తృప్తి శాంతికి లభించింది.

Foreign Trip

మా వినోదయాత్ర పూర్తి చేసుకుని మేము ఇరువురం ఇండియాకి, శాంతి  సాన్ డియేగోకి, ఆరతి పిల్లలు ర్యాలీకి బయలుదేరారు. ఆరతి బట్టలున్న పెట్టి మాత్రం ఆమె తిరిగి ఇంటికి చేరాక అందింది.

-o0o-

Posted in September 2022, సాహిత్యం

2 Comments

  1. బులుసు నరసింహ మూర్తి ( డాలస్ టెక్సాస్ )

    మీ యూరోప్ పర్యాటక సందర్శన విశేషాలు తియ్యని తెలుగు లో చక్కగా తెలిపారు. పలువురికి ఉపయోగపడే సమాచారం అందచేసినందుకు ధన్యవాదాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!