Menu Close
Page Title

దేవుడే దిగివస్తే 'పరమాచార్య' అవుతారేమో!

4. ఆశ్వీయుజ మాసం – ఆమ్ర ఫలం

పరమాచార్య స్వామివారు కంచి శ్రీమఠంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వారి ముందు నేలపైన బుట్టలలో నానారకములైన పళ్ళు ఆన్నీ ఉన్నాయి. నాకు గుర్తున్నంతవరకూ అది పురట్టాసి (ఆశ్వీయుజ) మాసం.

ఒక చిన్న అమ్మాయి అక్కడ ఉన్న గుంపు చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉంది. మహాస్వామి వారు ఆ పిల్లని పిలిచి “ఇక్కడున్న పళ్ళల్లో నుండి నీకు నచ్చిన ఒక పండు తీసుకో” అని అన్నారు. అక్కడున్న బుట్టల్లో పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష, జామ, కమలాలు ఉన్నాయి. కాని ఆ పిల్ల “నాకు మామిడీ పండు కావాలి” అని అడిగింది. అది మామిడి పళ్ళ కాలం కాదు. మామిడి చెట్లకు పిందెలు కూడా కాచే కాలం కాదు. మహాస్వామి వారు ఆలోచనలో పడ్డారు. “వేదపురీ! మామిడి తాండ్ర ఏమైనా ఉన్నదేమో మెట్టూర్ స్వామి దగ్గర కనుక్కో” అని అన్నారు. తరువాత వారు ధ్యానంలోకి వెళ్ళారు.

రెండు నిముషాల తరువాత ఆంధ్రదేశం నుండి పండ్ల బుట్టి చేత పట్టుకొని ఇద్దరు భక్తులు వచ్చారు. ఆ పళ్ళెంలో రెండు పెద్ద మామిడి పళ్ళు ఉన్నాయి. మహాస్వామి వారు కళ్ళు తెరిచారు. వారు ఆ చిన్నపిల్లని పిలిచి “వాటిని తీసుకో” అని చెప్పారు. ఆ పిల్ల ఆ పళ్ళనుండి ఒక మామిడి పండుని తీసుకొన్నది. వేదపురి తిరిగి వచ్చి “మామిడి తాండ్ర కూడా లేదు” అని చెప్పి, ఆ పిల్ల చేతుల్లో ఉన్న మామిడి పండుని చూసి ఆశ్చర్యపోయారు.

“అరెరె! ఈకాలంలో మామిడి పండు ఎలా వచ్చింది?” అని మహాస్వామి అడిగారు. పొంగుకొస్తున్న భావోద్వేగంతో కళ్ళ నీరు కారుతుండగా వేదపురి మహాస్వామి వారితో “పెరియవ మామిడి పళ్ళ గురించి తలచుకున్నారు. అవి వచ్చాయి” అని అన్నారు. పరమాచార్య స్వామి వారి శక్తి ఎంతటిదో మా కళ్ళారా చూసినందుకు మాకు చాలా సంతోషం కలిగింది. కాని తరువాత చూస్తే ఆ పళ్ళను తెచ్చిన ఆ తెలుగు వారు మాకు ఎక్కడా కనపడలేదు. బహుశా మా మాంస నేత్రాలకు కనపడని చోటికి వెళ్లి పోయారేమో!!!

--- రాధా రామమూర్తి, పుదుకొట్టై - మహాపెరియవళ్ దరిశన అనుభవంగళ్

5. దుర్గా పంచరత్నం

దుర్గా పంచరత్నం దుర్గాదేవిని స్తుతిస్తూ చేసిన మహాద్భుతమైన స్తోత్రం. దీన్ని మనకు అందించినది పరమాచార్య స్వామి వారు. ఆ స్తోత్రం ఎలా వచ్చిందో దానికి సంబంధించిన కథను చూద్దాం. అది తేనంబాక్కంలో మహాస్వామి వారు మకాం చేస్తున్న కాలం. అప్పుడు మధ్యాహ్నం 2 గంటల సమయం. మహాస్వామి వారు ఒక కాలును నీటిలో ఉంచి చెరువు గట్టు పైన కూర్చుని ఉన్నారు. మహాస్వామి వారు చప్పట్లు చరచి నన్ను రమ్మని ఆజ్ఞాపించారు. ఒక కాగితం కలం తీసుకుని తన ప్రక్కన కూర్చో అని సైగ చేసి చెప్పారు. నేను వాటిని తీసుకుని వచ్చి వారి వద్ద కూర్చున్నాను. మహాస్వామి వారు ఒక్కొక్కటిగా సంస్కృత పదాలను చెప్పడం ప్రారంభించారు. ఒక్కొక్క సందర్భంలో ఒక భావాన్ని చెప్పి దానికి సరియగు సంస్కృత పదం చెప్పమనేవారు.

అలా అన్ని పదములు జతకూడిన తరువాత ఒక మహత్తరమైన స్తోత్రం వచ్చింది. అదే దుర్గా పంచరత్నం (శ్వేతాశ్వర ఉపనిషత్ సారము). ప్రతి శ్లోకము యొక్క చివరి పాదము “మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి” అనే మకుటంతో ముగుస్తుంది. (ఈ శ్లోకాన్ని మనం కామాక్షి ఆలయ ముఖద్వారానికి ఎడమ ప్రక్కన ఉన్న గోడపై పాలరాతి శిలపైన చెక్కి ఉండటం గమనించవచ్చు.)

మహాస్వామి వారు ఈ స్తోత్రం చేస్తూ మధ్యలో “నీవే భగవద్గీతను బోధించిన దానివి” అని వచ్చింది. ఒక్క క్షణం ఇటుతిరిగి అలోచిస్తున్న నా వైపు చూసి, మహాస్వామి వారు “కామాక్షి గీతోపదేశం చేసింది అనునది నీకు ఎందుకు తప్పు అని అనిపిస్తోంది” అని అడిగారు. నేను చిన్నగా నవ్వి మౌనం వహించాను. వెంటనే వారు గీతాభాష్యం పుస్తకం తీసుకురమ్మని చేతులతో సైగ చేసి ఆదేశించారు. వెనువెంటనే 8 సంపుటముల గీతాభాష్యం స్వామి వారి వద్దకు వచ్చి చేరింది. వారు ఒక పుస్తకమును తీసుకుని దాన్ని తెరిచి అక్కడ తెరవబడి ఉన్న పుటములో ఒక శ్లోకమును దాని భాష్యమును చదవమన్నారు.

ఆ శ్లోకం ఇదే “బ్రహ్మణోహి ప్రతిష్ఠాహమ్”

“మార్పులేని శాశ్వతమైన బ్రహ్మానికి, శక్తి రూపమైన మాయ ప్రతిష్ఠ. అది నేను. నేను బ్రహ్మాన్ని మరియు దాని ప్రతిష్ఠను అనునది సరియగును. ఎందుకంటే దానికి భాష్యం “శక్తి శక్తిమతోః అభేదత్” అని ఉంది. శక్తి మరియు ఆ శక్తి కలిగిన వారు వేరు వేరు తత్వము కాదు. శక్తికి ఆ శక్తి ఉన్నవాడికి అభేదము.” ఈ సంఘటన ఆ స్తోత్రం యొక్క విశిష్టతని తెలియజేస్తుంది.

|| దుర్గా పంచరత్న స్తోత్రం ||

తే ధ్యానయోగానుగతా అపశ్యన్
త్వామేవ దేవీం స్వగుణైర్ నిగూఢామ్ ।
త్వమేవశక్తిః పరమేశ్వరస్య
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 1

ఓ సర్వాధిష్ఠానేశ్వరీ! ఓ మోక్షప్రదాత్రీ! నిరంతరము ధ్యానయోగమునందు మునులు యోగులు మున్నగువారు సత్వరజస్తమో గుణములచే వ్యక్తము కాకుండగానున్న సకలదేవతాస్వరూపిణియగు నిన్నే చూచుచున్నారు. ఆ పరమేశ్వరునియొక్క శక్తివి కూడా నీవే. నన్ను రక్షించు.

దేవాత్మశక్తిః శ్రుతివాక్య గీతా
మహర్షిలోకస్య పురః ప్రసన్నా |
గుహాపరం వ్యోమ సతః ప్రతిష్ఠా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 2

ఓ సర్వేశ్వరీ! మోక్షధాత్రి! నీవు దివ్యమగు ఆత్మశక్తిని, వేదవాక్యములచే గానము చేయబడితివి. మహర్షిలోకమును ముందుగా అనుగ్రహించితివి. అత్యంత నిగూఢమగు నివాసము నీది. సత్పదార్థమునకు అధిష్ఠానము నీవు. నన్ను రక్షించు.

పరాస్యశక్తిః వివిధైవ శ్రూయసే
శ్వేతాశ్వ వాక్యోదిత దేవి దుర్గే ।
స్వాభావికీ జ్ఞానబలక్రియాతే
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 3

ఓ దుర్గా! శ్వేతాశ్వతరోపనిషద్వాక్యములచే చెప్పబడిన దివ్యరూపిణీ, నీవు పరాశక్తివి. అయినను అనేకులచే అనేకవిధములుగా చెప్పబడగా వివిధరూపములుగా వినబడుచున్నావు. నీయొక్క జ్ఞాన, బల సంబంధమగు క్రియారూపములోని శక్తి నీకు స్వాభావికమైనది. సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి! నన్ను రక్షించు.

దేవాత్మశబ్దేన శివాత్మభూతా
యత్కూర్మవాయవ్య వచో వివృత్యా|
త్వం పాశవిచ్ఛేదకరీ ప్రసిద్ధా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 4

దేవాత్మశబ్దముచే చెప్పబడు నీవు, కూర్మ వాయుపురాణముల వాక్యవివరణచే శివాత్మురాలివైతివి. నీవు ఈ భవపాశములను ఛేదింపగలిగినదానిగా ప్రసిధ్ధురాలవు. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి! నన్ను రక్షించు.

త్వం బ్రహ్మపుచ్ఛా వివిధా మయూరీ
బ్రహ్మ ప్రతిష్ఠాస్యుపదిష్టగీతా ।
జ్ఞానస్వరూపాత్మ తయాఖిలానాం
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 5

అమ్మా, నీవు బ్రహ్మమే పుచ్చముగాగల వివిధరూపములనుండు మయూరివి బ్రహ్మమునకు అధిష్టానమైనదానివి. అనేక గీతలను ఉపదేశించిన దానవు. అందరిలోనుండు జ్ఞాన స్వరూపము నీవే. అందరిలోని దయాస్వరూపము నీవే. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి! నన్ను రక్షించు.

కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి విరచితం. ప్రతిరోజు దీన్ని చదివిన వారికి మోక్షం తథ్యం.

6. MS-SubbuLakshmi-UNUN సెక్రటరీ జనరల్ యూ థాన్ట్ ఆహ్వానానికి అనుగుణంగా ఎం ఎస్ సుబ్బులక్ష్మి అక్టోబర్ 23, 1966, న న్యూ యార్క్ లో ఐక్యరాజ్య సమితిలో ప్రార్ధన చెయ్యడానికి వెళ్లారు. ఆ ప్రార్థనా గీతాన్ని రచించిన మహాస్వామి, తన భక్తురాలైన సుబ్బులక్ష్మి గారిని ఆశీర్వదించి పంపారు. ఒక సంగీత విద్వాంసురాలు అక్కడ పాడడం అదే ప్రధమం. ఆ గీతం:

'మైత్రీమ్ భజతాం హృజ్జత్రీమ్, ఆత్మేవదేవ పరాణపి పశ్యతా
యుద్ధం త్యజతా, స్పర్ధమ్ త్యజతా, త్యజతా పరేషు అక్రమాక్రమణం |
జననీ పృథివీ కామ దుఘాస్తై,జనకో దేవః సకల దయాళుః
దామ్యతా దత్త దయాధ్వం జనతాః, మైత్రీమ్ భజతాం హృజ్జత్రీమ్ ||'

https://youtu.be/az9zYiC3JHo

7. రష్యన్ - రిషి

చాలా సంవత్సరాల క్రితం చెన్నైకి వచ్చిన రష్యా మరియు అమెరికా విశ్వవిద్యాలయ ఆచార్యులు పరమాచార్య స్వామి వారిని దర్శించుకున్నారు. 1987లో సోవియట్ యునియన్ లో భారతీయ సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి కొన్ని విశ్లేషణాత్మక పేపర్స్ తయారు చేసి మహాస్వామి వారికి చూపించడం నాకు అలవాటు. మహాస్వామివారు అనుగ్రహించిన అటువంటి ఒక పేపర్ తో మేము రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ మరియు మాస్కోలోని ఓరియంటల్ స్టడీస్ ఇన్ స్టిట్యూట్ అధ్యక్షుడు రిబెకొవ్ కు అందచేయాలని వెళ్ళాము. ఆయన గదిలో ఉన్న ఒకేఒక చిత్రపటం కంచి పరమాచార్య స్వామివారిది. అతను ఇంతవరకు మహాస్వామి వారిని ఎప్పుడూ కలవలేదు. ఆయన మాతో “నేను ఎప్పుడైనా చెన్నై వస్తే ఒకటి నేను మహాస్వామి వారిని కలవాలి, రెండు ఒక వలంపురి శంఖు సంపాదించాలి” అని అన్నారు.

కొన్నేళ్ళ తరువాత రిబెకొవ్ చెన్నై వచ్చారు. వారు మహాస్వామి దర్శనం కోసం నాతో పాటు శ్రీమఠానికి వచ్చారు. మేము మఠంలోకి వెళ్ళగానే ఈ రోజు మహాస్వామి వారి దర్శనం లేదు. వారికి జ్వరంగా ఉంది అని అన్నారు. నాతో వచ్చిన రిబెకొవ్ మహాస్వామి వారిని అడగాలని కొన్ని ప్రశ్నలు వ్రాసుకుని వచ్చారు. మహాస్వామి వారి దర్శనం దొరకదు అని మేము చాల నిరాశపడి వెనుతిరుగుతుంటే శిష్యులు మమ్మల్ని వెనుకకు పిలిచి “మహాస్వామి వారు మిమ్మల్ని పిలుస్తున్నారు” అని అన్నారు. భక్తుల సందడి లేని ఏకాంత దర్శనం మాకు లభించినందుకు మాకు చాలా సంతోషం వేసింది. మేము లోపలికి వెళ్ళగానే పడుకున్న మహాస్వామి వారు లేచి కూర్చుని నాతో పాటు వచ్చిన అతని ముఖంలోకి కొద్దిసేపు చూసారు. కొంత సమయం తరువాత అతను ఆనంద భాష్పాలు కారుస్తూ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. చాలా సేపు నిశ్శబ్దంగానే ఉండిపోయాము. కొద్దిసేపటి తరువాత మహాస్వామి వారు నాతో “అతను ఏం అడగాలనుకుంటున్నాడో అడగమను” అని ఆన్నారు.

అందుకు రిబెకొవ్ “నా అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి” అని అతను ఇక ఏమి మాట్లాడదలుచుకోలేదు. మహాస్వామి వారు అతన్ని ఉద్దేశించి “మీ రష్యా భాషలో సంస్కృతము యొక్క ఆనవాళ్ళు చాలా కనిపిస్తాయి. అందులోను ఉత్తర రష్యాలో మట్లాడే మాండలికంలో సంస్కృత శబ్ధములు ఎక్కువగా ఉపయోగిస్తారు” అని అన్నారు.

అందుకు రిబెకొవ్ “నిజమా? అది ఎలా?” అని అడిగాడు.

మహాస్వామి వారు “మీ దేశానికి రిషివర్శం అనే పేరు కూడా కలదు. ఎందుకంటే యాజ్ఞావల్క్యుడు మొదలైన ఋషులు అక్కడే ఒక వేద పరిశోధనా కేంద్రమును స్థాపించారు” అని అన్నారు. మహాస్వామి వారు మాకు ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పారు. వారు చెప్పిన విషయాలను విని మేము ఆశ్చర్యపోయాము. మేము వారితో సెలవు తీసుకుంటూ రిబెకొవ్, మహాస్వామి వారితో “నేను హిందువు కావాలంటే ఏమి చేయాలి?” అని అడిగాడు.

“నువ్వు ఏమి చేయకపోయినా నువ్వు హిందువువే” అని అన్నారు.

“అయినా సంతృప్తిగా లేదు. నాకు ఒక హిందూ పేరు ఉంటే బావుండును” అని రిబెకొవ్ అన్నాడు.

స్వామి వారు నవ్వుతూ నావైపు చూసి “ఇతను తెల్లని గడ్డముతో ఋషి లాగా కనిపిస్తున్నాడు కనుక ఇతని పేరు రిషి” అని అన్నారు. రిబెకొవ్ ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు ఈ రిషి (రిబెకొవ్) మాస్కోలో రామకృష్ణ మఠం యొక్క శాఖను స్థాపించారు.

8. ఎంతటి మహానుభావులు! ఎంతటి కరుణాసముద్రులు!!

మాయవరం శ్రీ శివరామకృష్ణ శాస్త్రి (మాయవరం పెరియవ) చాలా బాధ పడుతూ ఏడుస్తూ శ్రీ మఠం వచ్చారు. ఆయన చేసే ‘భాగవత సప్తాహం’ మహాస్వామి వారు చాలా మెచ్చుకునేవారు. మాయవరం శాస్త్రి గారు ఎప్పుడు సప్తాహం చేసినా శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా వింటున్నాడా అన్నట్టు తమ ధ్యాసను భాగవతం పైన తప్ప వేరే వాటిపైన ఉంచేవారు కాదు. అంతటి మహాత్ముడు కన్నుల నీరు కారుస్తూ మఠం మేనేజరు శ్రీ విశ్వనాథ అయ్యర్ గారితో మాట్లాడుతున్నారు. మేనేజరు వారు శ్రీ కణ్ణన్ మామతో “శాస్త్రి గారు ఎందుకో చాలా భారమైన హృదయంతో దీనంగా ఏడుస్తూ వచ్చారు. ఈ విషయాన్ని మనం వెంటనే మహాస్వామి వారితో చెప్పి శాస్త్రి గారు మహాస్వామిని కలుసుకునేలాగ చెయ్యాలి” అని అన్నారు. శ్రీ కణ్ణన్ మామ విశ్రాంతిలో ఉన్న మహాస్వామి వారిని కలిసారు. మహాస్వామి వారు “ఏమిటి” అని అడగగా. మామ శాస్త్రి గారి విషయం చెప్పారు.

అందుకు మహాస్వామి వారు “అతను కార్ లో వచ్చాడు కదా, అతన్ని పాద ప్రక్షాళన చేసుకుని వెనుక ఉన్న గుమ్మం వైపు నుండి రమ్మను” అని అన్నారు. మహాస్వామి వారు ఒక ఉసిరికాయ చెట్టు కింద కూర్చుని ఉన్నారు. శాస్త్రి గారు వచ్చి స్వామి వారికి వందనం చేసి బాధపడుతూ “పెరియవ నా అల్లునికి ఆరోగ్యం సరిగ్గా లేదు. ఎక్స్ రే తీయిస్తే అతని రెండు ఊపిరితిత్తులు సగం పాడైపోయాయని ఇప్పుడు ఒక్కటి మాత్రమే పనిచేస్తూ ఉందని చెప్పారు. అతను ఒక నెల కంటే ఎక్కువ రోజులు బ్రతకడని కూడా చెప్పారు.” అని వాపోయాడు. శాస్త్రి గారు అలా చెప్తూ మాహాస్వామిని ప్రార్థిస్తూ “ఒకవేళ జరగరానిది జరిగినా కానీ ఈ దుఃఖం నన్ను ఆవరించకుండా మీరు నన్ను అనుగ్రహించమని వేడుకుంటున్నాను” అని అన్నారు. (మనలో ఎవరు ఇలా ప్రార్థించగలరు, ఒక్క జ్ఞానులు/పండితులు తప్ప). శాస్త్రి గారు మరలా చేతులు జోడించి మహాస్వామి తో “ఈ శరీరం వెళ్లిపోయినా నాకు ఈ దుఃఖం నన్ను బాధింపకూడదు” అని అన్నారు. అప్పుడు కణ్ణన్ మామ “అతను ఏడుస్తూ కూడా తనకు ఈ దుఃఖం బాధించకూడదు అని అంటున్నాడు” అనుకున్నారు. మహాస్వామి అది విని ఒక విచిత్ర మైన ప్రశ్న వేసారు “ఒకవేళ ఆ యంత్రములు తప్పు చెప్తున్నయేమో కదా?” అని. అప్పుడు శాస్త్రి గారు “మేము 27 ఎక్సరేలు తీయించాము అన్నీ డాక్టర్లు చెప్పినదే రుజువుచేస్తున్నాయి. ఇక 20-25 రోజులకంటే ఎక్కువ బ్రతకడు అని”. అప్పుడు మహాస్వామి వారు “నువ్వు వేదాంతం బాగా నేర్చుకున్నావు కదా అందులో ‘భగవాన్ భయ నాశనః’ అని ఉంది కదా ఆయననే శరణువేడు” అన్నారు. ఆ మాటలను విని శాస్త్రి గారు తేలిక పడ్డ మనసుతో ప్రసాదమును స్వీకరించి వెళ్ళిపోయారు. కానీ 15 రోజుల తరువాత చాలా ఆత్రుతతో మఠానికి తిరిగివచ్చారు. కణ్ణన్ మామ వారిని చూసి “ఆ రోజు చాలా చాలా బాధపడ్డాడు” అనుకున్నారు మేనేజరు మామతో, “చూస్తూ ఉంటే వారి అల్లుడు మరణించినట్టు ఉన్నది త్వరగా తీసుకువెళ్ళు” అన్నారు.

కణ్ణన్ మామ మహాస్వామి వద్దకు పరిగెత్తారు. ఈసారి కూడా మహాస్వామి విశ్రాంతిలో ఉన్నారు. మామ మాటలు విని “ఎందుకు వచ్చాడు? అల్లుడు మరణించాడా? ఖచ్చితంగా అంత్యసంస్కారములు అన్నీ పూర్తి అయి ఉంటాయి. అంతా అయిపోయిన తరువాతనే ఇక్కడకు వచ్చుంటాడు. అతను పండితుడు కదా ఇవన్నీ బాగా తెలిసుంటాయి” అన్నారు.

మామ అవునన్నట్టు తల పంకించి ఆరోజు మహాస్వామి వారు చాలా సాధారణ వ్యక్తి లాగా మాట్లాడుతున్నారే అనుకున్నాడు. శాస్త్రి గారు మహాస్వామిని సమీపించి “ఈశ్వరా మీ నోటీనుండి వచ్చిన మాటలు నిజము అయ్యాయి. అన్ని యంత్రములు అబధ్ధం చెప్పాయి. వైద్యులు ఏం ప్రమాదం లేదని అన్నారు. మా అల్లుడు కూడా బాగున్నాడు” అని అన్నారు. అదే ఉసిరికాయ చెట్టు, అదే మహాస్వామి వారు, అదే శాస్త్రి గారు. కానీ సందర్భము వేరు.

మహాస్వామి నవ్వుతూ “ఓ యంత్రములు కూడా అబద్దాలు చెప్తాయా. మనుషులు మాత్రమే చెప్తారు అనుకున్నాను” అని, అన్ని వివరములు కనుక్కుని శాస్త్రి గారికి ప్రసాదమును ఉత్తరీయాన్ని ఇచ్చారు”. తరువాత మాయవరం శివరామకృష్ణ శాస్త్రి గారు తన పుస్తకములో ఆ సంఘటన గురించి చెప్తూ “మహానుభావుల నోటి నుండి వచ్చు మాటల వలన ఏమైనా జరుగవచ్చు” అని వ్రాసుకున్నారు.

9. ఆంగ్లము – అహంకారం

ఒక కుటుంబం పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్తూ వారితో పాటుగా అమెరికాలో నివసిస్తున్న వారి స్నేహితుని కుటుంబాన్ని కూడా తీసుకువచ్చారు. కానీ, ఆ స్నేహితునికి మన ధర్మము, సంస్కృతి సంప్రదాయాల మీద, ముఖ్యంగా కాషాయధారులైన సన్యాసుల మీద అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు. కానీ తన స్నేహితుని బలవంతం పైన మహాస్వామివారి దర్శనానికి వచ్చాడు. అతను మహాస్వామి వారిని ఒక సాధారణ మతవాదిగా, జ్ఞానశూన్యుడుగా తలచాడు. ఇతనికి స్వామివారిపై అస్సలు గౌరవం లేదు. అంతే కాకుండా అహంకారంతో ప్రవాసీయుడిననే పొగరుతో ‘ఆయనకు ఏమి తెలుసు?’, ‘ఆయనకు ఆంగ్లము ఏం వచ్చు?’ అని శ్రీమఠంలో నుంచొని అంటున్నాడు.

ఆ రోజు మఠంలో భక్తుల రద్దీ ఎక్కవగా ఉండటం వల్ల వీరు స్వామి వారికి చాలా దూరంగా నిలుచుని ఉన్నారు. వీరు వరుసలో నిలబడి ఉండటం స్వామివారు గమనించి వారి కృపాకటాక్ష వీక్షణములను వీరిపై ప్రసరించటం, వీళ్ళని మహాస్వామి పిలవటం, వారు సకుటుంబ సమేతంగా స్వామివారి దగ్గరికి వెళ్ళటం క్షణాల్లో జరిగిపోయింది. ఈ కుటుంబంతో పాటు అతని స్నేహితుడు కూడా మహాస్వామి ముందుకు వచ్చి నిలబడ్డాడు.

వారి యోగక్షేమాలు, కుటుంబం గురించి మహాస్వామి వారు అడిగి తెలుసుకొన్నారు. వారితోపాటు వచ్చిన ఆ ప్రవాసీయుడిని కూడా వివరములు అడిగి తెలుసుకున్నారు. స్వామివారు అతనితో, “నీవు భారతదేశంలోనే పుట్టి పెరిగావు నీకు తమిళం వచ్చు; నీ భార్య కూడా ఇక్కడే పుట్టినది కాబట్టి ఆమె మాతృభాష కూడా తమిళమే అయి ఉంటుంది. కనుక మీరు ఇద్దరూ మాట్లాడితే తమిళంలోనే మాట్లాడుకుంటారు కదా?” అని అడిగారు. దానికి అతను, “మేము ఎప్పుడూ ఆంగ్లములోనే మాట్లాడుకుంటాము. తమిళంలో ఎప్పుడూ మాట్లాడము, కాబట్టి మా పిల్లలు కూడా ఆంగ్లములోనే మాట్లాడుకుంటారు” అని అన్నాడు.

అందుకు మహాస్వామి వారు “ఓహో అలాగా! మనం మాట్లాడే ముందు ఆలోచన మన మెదడులో మొదలై అది వాక్కు రూపంగా నోటి నుండి బయటకు వస్తుంది కదా! మరి ఈ ప్రక్రియ అంతా ఆంగ్లములోనే జరుగుతుందా? తమిళంలోనా?” అని అడిగారు. అతను దానికి సమాధానంగా “అది కూడా అంగ్లంలోనే” అన్నాడు.

కొద్దిసేపటి తరువాత ఒక ముసలావిడ మహాస్వామి వారి దర్శనానికి వచ్చింది. అప్పుడు మహాస్వామి వారు అతనికి ఆమెను చూపిస్తూ, “ఈమె చాలా బీదరాలు. కానీ ఒకప్పుడు బాగా సంపన్నమైన కుటుంబము. అశాశ్వతమైన ఈ సంపద అంతా పోయినా, మఠంపై, పూర్వ ఆచార్యులపై, నాపై ఆమె భక్తి ఇసుమంతైనా తగ్గలేదు. నాకు ఇప్పుడు చెప్పు ‘ఎంత కష్టం వచ్చినా ఈమె మొక్కవోని భక్తిని, విశ్వాసాన్నికూడా తగ్గించలేని’ ఈ స్థితిని ఆంగ్లంలో ఏ పదంతో సూచిస్తారు?” అని అడిగారు.

అతను కొంత గందరగోళంలో పడి అలా ఆలోచిస్తూనే ఉండిపోయాడు. అలా ఆలోచించి, ఆలోచించి చివరికి తనకు తెలియదు అన్నాడు. స్వామి వారు మందహాసము చేసి “కావలసినంత సమయము తీసుకొని బదులివ్వమన్నారు”. చాలాసేపు అలోచించిన తరువాత కూడా అతను ఏమి చెప్పలేకపోతే మహాస్వామి వారు “నేను ఒక పదం చెప్తాను అది సరియో కాదో సరిచూసుకొనుము అని అది ‘ఎక్విపోయిస్డ్ (EQUIPOISED)’ అని అన్నారు. అతను కన్నుల నీరు కారుస్తూ తన అహంకారాన్ని పారద్రోలినందుకు మహాస్వామికి సాష్టాంగం చేసి వారి పాదాలపై పడి క్షమాపణలు చెప్పి, స్వామివారి ఆశీస్సులు అందుకున్నాడు.

-o0o- సశేషం -o0o-

Posted in December 2021, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!