గడ్డిమొలిచిన ఒడ్డేమాకు పాన్పయ్యా
మా చెయ్యో మడతలు తిరిగే దిండయ్యా
నీవొంటి ఆభరణాలే చీకట్లో మమ్ముతాకెళ్ళు అతిథులయ్యా
నీ ఆటకు నీవె ససాటి భళా సదాశివా...!
జీవితమొక చెరువయ్యా
నేను అందులో చేపనయ్యా
గాలమేస్తవో...గాలితీస్తవో.. నీ ఇష్టమయ్యా
నీఆటకు నీవె సాటి భళా సదాశివా...!
కంచిన నేలవయ్యా
త్రయంబకాన నీరువయ్యా
అరుణాచలాన నిప్పువయ్యా
కాళహస్తిన నింగిచూలివయ్యా
చిదంబరాన నింగివయ్యా
నా గుండెలోనే పంచభూతనాధుడివయ్యా
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
నింగిచూలి:- గాలి
మట్టిగడ్డలు నెర్రలుబారుతున్నవయ్యా
ఆ నెర్రలో అప్పుల కుప్పలు పెరుగుతున్నవయ్యా
ఆ కుప్పలకు తాళ్ళుపండి వేలాడుతున్నవయ్యా
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
అహపు కొమ్ములొస్తే
కాలు దువ్వే ఎద్దుని
ధైర్యపు గిట్టలరిగితే
తలదించే ఎద్దుని
దువ్వినా...దించినా...దయతో దయచూపడం నీ దయాహృదయం కదయ్యా
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
నేను పుట్టుకలో గడ్డిగింజను
పెరుగుటలో వేపగింజను
ఏగింజైతే ఏమిటి
నీ కపాలమున గంజిపోసి కాస్తివయ్యా
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
మా కళ్ళల్లో నదులు పారుతాయి
ఎండలో మా ఒళ్ళంత వానలు కురుస్తాయి
అయినా మా బ్రతుకులు ఏపుగా పండిన కరువులయ్యా
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
నందిని కాడెద్దుగా మార్చి
వాసుకిని తాడుగా పేర్చి
కైలాసమును పొలముగ మలచి
మేడి పట్టి కాడిదున్ని
హాలాహలము శ్రీవత్సముగా గుండెల్లో ఓర్చి
అమృత పంటతీసి లోకులకిస్తివా...!
ఆనాటి క్షీరసాగరమథనానికి
నేటి భూసాగరమథనానికి...
నీ బుద్ధి మారలేదుకదయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
నే పేదోడినన్నది ఒట్టి అబద్ధమయ్యా
నీలా తలకట్టలే
ఒంటికి బట్టను చుట్టలే
నా మాట నమ్మి వరములిస్తివి కదయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
వూరికే ఉబికే మా కంటి నదులకు
పుష్కరాలు రాలేదయ్యా
నిత్యం కురిసే మా ఒంటివానకు పంటలు పండలేదయ్యా
నువ్వైనా దయతో మా కడుపులో ఎలుకలకు మోక్షమివ్వవయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!